మనోగళం: అందుకే పీఎం అవ్వాలనుకున్నా!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది?
నచ్చేది ఏకాగ్రత. నచ్చనిది దేనిపైనా ఆసక్తి లేకుండా ఉండటం.
మీలో మీకు నచ్చేది/నచ్చనిది?
నచ్చేది తపన. నచ్చనిది కాస్త సమయ పాలన లోపించడం.
మీరు తరచుగా వాడే మాట?
‘అలాగే’ అని ఎక్కువగా అంటుంటా.
మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు?
లోతైన భావం, అనుభూతితో సరళమైన భాషలో పాటలు రాసే విషయంలో ఆత్రేయ నుంచి స్ఫూర్తి పొందాను. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేయడం, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా బెదరక నవ్వుతూ ఉండటం వంటి విషయాల్లో రాఘవేంద్రరావుగారు నాకు స్ఫూర్తి.
ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా?
రకరకాల కారణాల వల్ల కొన్ని మంచి సినిమాలకు రాయలేకపోయాను. అవి గుర్తొచ్చినప్పుడల్లా కాస్త బాధనిపిస్తూ ఉంటుంది.
అత్యంత సంతోషపడిన సందర్భం?
ఓ కార్యక్రమంలో బాలూగారు... ‘దేశమంటే మతం కాదోయ్’ అంటూ నేను రాసిన పాటను, అది రాసిన నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అది నాకు అత్యంత సంతోషకరమైన సందర్భం.
మీ హృదయం గాయపడిన సందర్భం?
మనం గౌరవించి, అభిమానించి, ఆరాధించే వ్యక్తులు మన గురించి తప్పుగా మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. అలా నా హృదయం గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఆకలి విలువ తెలిసిన క్షణం?
చదువుకునే రోజుల్లో కడుపునిండా ఇడ్లీలు తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు అనుకునేవాణ్ని... దేశానికి ప్రధానమంత్రిని కావాలని. ఎందుకో తెలుసా? రోజుకు యాభై ఇడ్లీలు కడుపునిండా తినొచ్చని!
ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి?
ఉంది. ‘తడాఖా’ సినిమాకి పాటలు రాయమని మిత్రుడు కిషోర్ (ఆ చిత్ర దర్శకుడు) అడిగారు. కానీ ఏవో కారణాల వల్ల రాయలేకపోయాను. ఆయనకు క్షమాపణ చెప్పాలి.
మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం?
నేను పాటలు ఇష్టంగా వింటానని, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తానని చాలామందికి తెలుసు. కానీ ఎవరికీ తెలియనిదేమిటంటే... నేను రోజూ ధ్యానం చేస్తాను.
మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం ఏమిటి?
పరీక్షలు దగ్గరపడతాయి. కానీ ఇంకా చదవాల్సిన సిలబస్ చాలా ఉంటుంది. ఇదంతా ఎప్పుడు చదువుతాను, పరీక్షలు ఎలా రాసి పాసవుతాను అని చాలా టెన్షన్ పడుతుంటాను. ఈ కల ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది నన్ను. నేను మంచి స్టూడెంట్‌నే. ఇంజినీరింగ్‌లో కూడా యూనివర్సిటీ లెవెల్లో మూడో ర్యాంకు వచ్చింది. అయినా పరీక్షలంటే అంత భయమెందుకో అర్థం కాదు.
ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు?
హాలిస్టర్ కంపెనీ టీషర్టులకి.
మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి?
ఎటువంటి కల్మషము, కుటిలత్వమూ లేని సంస్కారాన్ని కలిగివుండాలి. హృదయ సంస్కారమే కాదు... జీవన సంస్కారం, భాషా సంస్కారం కూడా ఉండాలి.
ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది?
అవినీతిని ఎండగడుతూ ఓ పాట రాయాలి. అందులో ఫలానావాడు దేశాన్ని దోచుకున్నాడు, ఫలానా వాడు అత్యాచారం చేశాడు, ఫలానావాడు హత్య చేశాడు అంటూ పేర్లతో సహా రాయాలి.
దేవుడు ప్రత్యక్షమైతే ఏం అడుగుతారు?
కాళ్లకు లేపనం పూసుకుని గాలిలో ఎగురుతున్నట్టుగా కలలు వస్తుంటాయి నాకు. నిజంగానే అలా ఎగురుతూ... ఈ బస్సులు, రైళ్లు, విమానాల వెంట పడకుండా... కోరుకున్న చోటికి వెళ్లిపోగల వరమివ్వమని అడుగుతాను.
మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు?
నా భార్యాబిడ్డలతో సంతోషంగా గడుపుతాను.
మరణానికి భయపడతారా?
లేదు. మరణమంటే మరో జన్మకు శ్రీకారం అని ఓ పాటలో రాశాను కదా! నేను కూడా అదే నమ్ముతాను.
అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు?
మంచి రచయితగా!
మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు?
మళ్లీ కవిగానే పుట్టాలి. ఏ రంగంలోనూ ఎవరికీ లేని స్వేచ్ఛ కవికి మాత్రమే ఉంటుంది!
- సమీర నేలపూడి