athreya
-
మంచు కురిసే వేళలో.... వణికే పెదవులు పలికే పాటలు విన్నారా?
Best Telugu Romantic Songs: చలి మొదలైంది. మంచు రాలడం మొదలవుతుంది. వణికే పెదవుల మీద పాటలు కూడా వస్తుంటాయి. చలిగాలిని, మంచు కురిసే వేళని సినీ కవులు సుందరంగా తీర్చిదిద్దారు. నాయికా నాయికులను తమ పదాలతో దగ్గరకు చేర్చారు. నేడు ఆదివారం. ఈ చలికాలపు ఉదయం ఈ పాటలు నెగళ్లుగా మారతాయేమో చూడండి. వింటే భారతం వినాలి అంటారు కానీ అది మాత్రమే కాదు. సాలూరి వారి పాట కూడా వినాలి. ‘చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి’... బహుశా అది చలికాలపు చలి కావచ్చు. ఆపై బరువుగా యమున ప్రవహిస్తుండవచ్చు. ఆ సమయాన శ్యామసుందరుడు మురళి ఊదితే వేరే ఏ వ్యాపకమూ పెట్టుకోబుద్ధి కాని ఆ వేళ అది మధురము. మరెంత వెచ్చదనమూ. ‘చలిచలిగా గిలి పుడుతుంటే’ అన్నాడు ఆత్రేయ. అఫ్కోర్స్. వానకు తడిసిన బి.సరోజాదేవిని చూసిన నాగేశ్వరరావు చేతే అనుకోండి. కాని ఇప్పుడు చలికాలంలో వానలు పడుతున్నాయి. వరదలూ వస్తున్నాయి. చలిజల్లును ఎదుర్కొనడానికి ఒకరి పక్కన ఒకరు ఒదిగి కూచోక తప్పదు. ఈ ఆత్రేయే ‘సోగ్గాడు’లో ‘చలివేస్తుంది చంపేస్తుంది’ అని రాశాడు. కాని ఒక కవిగా స్పందించి ‘మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో’... అంటే ఎంత బాగుంది. నిజానికి మల్లెలది వేసవి కాలం. మంచుతో తడిసే మల్లెను చూడటం కవికి రసాస్వాదన. అబ్బాయికీ అమ్మాయికీ హొయలు. పొగమంచులో పాట తీయడం అప్పట్లో కొత్త. తమిళం వాళ్లు చూపించారు. ‘పరువమా... చిలిపి పరుగు తీయకు’... జాగింగ్ చేస్తున్న సుహాసిని, మోహన్‌ను తెలుగు తెర మీద కొత్తగా చూశారు. బాపు గారు అదే పొగమంచును ‘ఏమని నే చెలి పాడుదును’లో అద్బుతంగా చూపారు. జంధ్యాల ‘రాగలీల’లో ‘చలికాలం ఇంకా ఎన్నాళ్లో’ పాటను రెహెమాన్, సుమలత మీద గొప్ప మంచులో చిత్రీకరిస్తారు. ‘మూడుముళ్లు’లో ఆయనే తీసిన ‘లేత చలిగాలులూ దోచుకోరాదురా’ పాట మిట్టమధ్యాహ్నం విన్నా మంచు తాకేలా ఉంటుంది. ‘సొమ్మొకడిది సోకొకడిది’లో ‘చలితో నీవు చెలితో నేను చేసే అల్లరులూ’ అని రాశాడు వేటూరి. ‘మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్లిపోయే’ అని ‘నిరంతరమూ వసంతములే’ పాటలో ఆయన మాత్రమే అనగలడు. చలికి ఒణికే హీరోయిన్‌కు హీరో ఉదారంగా తన కోటు తీసివ్వడం కద్దు. ‘క్షణక్షణం’లో ఆ జాక్‌పాట్ వెంకటేశ్‌కు దక్కింది వెంకటేశ్. మరి అతడు జీన్స్ జాకెట్ ఇచ్చింది శ్రీదేవికి కదా. చలికి చాలామంది ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. కాని ‘జామురాతిరి’ పాటలో శ్రీదేవి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడాలి. సావిత్రి మహానటి. శ్రీదేవి.. మహూహూ.. నటి. చలిని కొత్త సినిమాలు కూడా వదలుకోలేదు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ‘చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది మనసు’ పెద్ద హిట్. ప్రభాస్‌కు, కాజల్‌కు అదొక సుకుమారమైన చలిగీతం. నానికి కూడా ఇలాంటి హిట్ ఉంది. సిరివెన్నెల రాశాడు– జెంటిల్మెన్ కోసం. ‘చలిగాలి చూద్దు తెగ తుంటరి... గిలిగింత పెడుతున్నది’ అని ఒక పంక్తి ఉంటే తర్వాతి పంక్తి ‘పొగమంచు చూద్దు మహ మంచిది.... తెరచాటు కడుతున్నది’ అని ఉంటుంది. ఆ ప్రేయసీ ప్రియుల ఏకాంతానికి పొగ మంచు తెరచాటు కడుతున్నదట. ఎంత బాగుంది. రుతువులు వచ్చేది మార్పు ఉండాలి జీవితంలో అని చెప్పడానికి. ప్రకృతే మారి మారి ఆనందిస్తుంటే మనిషే రోజువారి రొడ్డకొట్టుడులో పడి ఆస్వాదనకు దూరమవుతున్నాడు. చీకటితో లేవండి. చలిని ఎంజాయ్ చేయండి. మంచులో తడిసినపూలను చూడండి. నెగళ్ల సెగను అనుభవించండి. ఆ సమయంలో టీ తాగడం మర్చిపోవద్దు. -
నువ్వు రాయడం మొదలెట్టాక...
రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను యేడిపిస్తారని పేరుపడిన ఆత్రేయ కొంతకాలం తెలుగు సినీపరిశ్రమను శాసించారు. కానీ డెబ్భైల దశకంలో సినిమా పాటను వేగంగా, వైవిధ్యంగా రాయగల వేటూరి సుందర రామమూర్తి రంగప్రవేశం చెయ్యడంతో ఆత్రేయ కొంచెం వెనకబడ్డారు. అయితే వేటూరి మాత్రం ఆత్రేయను గురువుగా, గీతాచార్యునిగానే భావించేవారు. ఆత్రేయతో వుండే అనుబంధంతో వేటూరి ఆయనను కలిసినప్పుడల్లా పిచ్చాపాటీ మాట్లాడుకోవడం పరిపాటిగా వుండేది. అలా ఒక సందర్భంలో వయసులో తన కంటే పెద్దయిన ఆత్రేయ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ వుండడం గమనించిన వేటూరి – ‘గురువుగారూ, నా తల అప్పుడే తెల్లబడిపోతోంది. మీ తల యింత నల్లగా వుండటంలోని రహస్యమేమి’టని అడిగారట! ఆత్రేయ నవ్వుతూ తను వాడుతున్న ఆయుర్వేదానికి చెందిన తలనూనె పేరు చెప్పారట! ఆ చిట్కా తెలిసిన వేటూరి కూడా ఆ నూనె రాయడం ప్రారంభించి తన గ్లామర్‌ను పెంచుకున్నారట! కొంతకాలం తర్వాత జుట్టు నల్లదనాన్ని జాగ్రత్తగా కాపాడుకొంటున్న వేటూరి, ఆత్రేయను చూడ్డానికి వెళ్లేసరికి ఆశ్చర్యకరంగా ఆయనకు ఆత్రేయ తెల్లని జుట్టుతో కనిపించారట! వేటూరి విస్తుపోతూ – ‘ఈ మధ్య మీరు (ఆ తలనూనె) రాయడం మానేసినట్టున్నారే?’ అని అడిగారట! దానికి బదులుగా ఆత్రేయ ‘అవును – నువ్వు రాయడం మొదలుపెట్టిన తర్వాత నేను రాయడం మానేశాను’ అన్నారట రాయడానికి రెండో అర్థాన్ని స్ఫురింపజేస్తూ చమత్కారంగా! ‘నువ్వు చాలా స్పీడుగా యెడా పెడా రాసి పారేస్తున్నావట! ఏం తొందరొచ్చిందయ్యా?’ అనే ఆత్రేయ ఆశీఃపూర్వకమైన మందలింపునకు వేటూరి వినమ్రంగా – ‘గురువుగారూ, మీ అంత గొప్ప యెలాగూ రాయలేను, మీ కంటే తొందరగానైనా రాయకపోతే నా బ్రతుకుదెరువు యెలాగండీ?’ అని బదులివ్వడం పై సంఘటనకు పూర్వరంగం! పంపినవారు: డా. పైడిపాల -
సూర్య 24కు ప్రీక్వల్
సూర్య హీరోగా, విలన్‌గానే కాక నిర్మాతగానూ మారి తెరకెక్కించిన భారీ చిత్రం 24. కాలంలో ప్రయాణించటం అనే కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచిటాక్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్లో కూడా సత్తా చాటి భారీ వసూళ్లను రాబడుతోంది. సూర్య కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు ప్రీక్వల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రీక్వల్లో.., అసలు కాలంలో ప్రయాణించే వాచ్ తయారు చేయాలన్న ఆలోచన సైంటిస్ట్‌కు ఎందుకు వచ్చింది. ఆ వాచ్ గురించి ఆత్రేయ ఎలా తెలుసుకున్నాడు. దాన్ని సొంతం చేసుకోవాడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడో చూపించనున్నారట. ఇప్పటికే స్క్రీప్ట్ కూడా రెడీగా ఉన్న ఈ ప్రీక్వల్ను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేది మాత్రం వెల్లడించలేదు. విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తుండగా తరువాత మహేష్ బాబు హీరోగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి రెండు సినిమాల తరువాత 24 ప్రీక్వల్ సెట్స్ మీదకు వెళుతుందా..? లేక ముందే వెలుతుందా.? చూడాలి. -
సూర్య.. 24లో ఆ సీన్స్ కట్ చేశాడు
సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం 24. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 24 ,ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా కథనాల పరంగా డివైడ్ టాక్ ఉన్నా.. సూర్య నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే భారీ బడ్జెట్‌తో తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించిన సూర్య, ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమాను చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాలో సూర్య, సమంతల మధ్య వచ్చే లవ్ ట్రాక్ బోర్ కొట్టిస్తుందన్న టాక్ వినిపిస్తుండటంతో ఆ సీన్స్‌ను రీ ఎడిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్లోనూ కలిపి దాదాపు 9 నిమిషాలను తీసేయాలని నిర్ణయించారట. ఆదివారం నుంచే ఎడిట్ చేసిన వర్షన్ థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఆ సీన్స్ తీసేసిన తరువాత అయినా 24కు సూపర్ హిట్ టాక్ వస్తుందేమో చూడాలి. -
సూర్య స్టైల్లో '24'
సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలకు రెడీగా ఉండే స్టార్ హీరో సూర్య. మరోసారి అదే ఫార్ములాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన '24' సినిమాతో మరోసారి అభిమానులకు షాక్ ఇవ్వనున్నాడు. 5 వేరియేషన్స్‌లో త్రిపాత్రాభినయం చేస్తున్న సూర్య ఈ సినిమాతో మరోసారి భారీ హిట్ మీద కన్నేశాడు. మనం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్రమ్ కుమార్, ఈ సినిమాతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. శుక్రవారం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది. కవల సోదరులుగా నటిస్తున్న సూర్య ఒక పాత్రలో సైంటిస్ట్‌గా, మరో పాత్రలో విలన్ ఆత్రేయగా కనిపిస్తున్నాడు. సూర్య చేసిన రిస్కీ ఫైట్స్, సూర్య గెటప్స్‌తో పాటు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా టీజర్ రేంజ్‌ను పెంచింది. సినిమా కాన్సెప్ట్‌ను ఫస్ట్ టీజర్లోనే రిలీజ్ చేసిన దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. -
మనోగళం: అందుకే పీఎం అవ్వాలనుకున్నా!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది ఏకాగ్రత. నచ్చనిది దేనిపైనా ఆసక్తి లేకుండా ఉండటం. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది తపన. నచ్చనిది కాస్త సమయ పాలన లోపించడం. మీరు తరచుగా వాడే మాట? ‘అలాగే’ అని ఎక్కువగా అంటుంటా. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? లోతైన భావం, అనుభూతితో సరళమైన భాషలో పాటలు రాసే విషయంలో ఆత్రేయ నుంచి స్ఫూర్తి పొందాను. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేయడం, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా బెదరక నవ్వుతూ ఉండటం వంటి విషయాల్లో రాఘవేంద్రరావుగారు నాకు స్ఫూర్తి. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? రకరకాల కారణాల వల్ల కొన్ని మంచి సినిమాలకు రాయలేకపోయాను. అవి గుర్తొచ్చినప్పుడల్లా కాస్త బాధనిపిస్తూ ఉంటుంది. అత్యంత సంతోషపడిన సందర్భం? ఓ కార్యక్రమంలో బాలూగారు... ‘దేశమంటే మతం కాదోయ్’ అంటూ నేను రాసిన పాటను, అది రాసిన నన్ను ఎంతో మెచ్చుకున్నారు. అది నాకు అత్యంత సంతోషకరమైన సందర్భం. మీ హృదయం గాయపడిన సందర్భం? మనం గౌరవించి, అభిమానించి, ఆరాధించే వ్యక్తులు మన గురించి తప్పుగా మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. అలా నా హృదయం గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆకలి విలువ తెలిసిన క్షణం? చదువుకునే రోజుల్లో కడుపునిండా ఇడ్లీలు తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు అనుకునేవాణ్ని... దేశానికి ప్రధానమంత్రిని కావాలని. ఎందుకో తెలుసా? రోజుకు యాభై ఇడ్లీలు కడుపునిండా తినొచ్చని! ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? ఉంది. ‘తడాఖా’ సినిమాకి పాటలు రాయమని మిత్రుడు కిషోర్ (ఆ చిత్ర దర్శకుడు) అడిగారు. కానీ ఏవో కారణాల వల్ల రాయలేకపోయాను. ఆయనకు క్షమాపణ చెప్పాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నేను పాటలు ఇష్టంగా వింటానని, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తానని చాలామందికి తెలుసు. కానీ ఎవరికీ తెలియనిదేమిటంటే... నేను రోజూ ధ్యానం చేస్తాను. మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం ఏమిటి? పరీక్షలు దగ్గరపడతాయి. కానీ ఇంకా చదవాల్సిన సిలబస్ చాలా ఉంటుంది. ఇదంతా ఎప్పుడు చదువుతాను, పరీక్షలు ఎలా రాసి పాసవుతాను అని చాలా టెన్షన్ పడుతుంటాను. ఈ కల ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది నన్ను. నేను మంచి స్టూడెంట్‌నే. ఇంజినీరింగ్‌లో కూడా యూనివర్సిటీ లెవెల్లో మూడో ర్యాంకు వచ్చింది. అయినా పరీక్షలంటే అంత భయమెందుకో అర్థం కాదు. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? హాలిస్టర్ కంపెనీ టీషర్టులకి. మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? ఎటువంటి కల్మషము, కుటిలత్వమూ లేని సంస్కారాన్ని కలిగివుండాలి. హృదయ సంస్కారమే కాదు... జీవన సంస్కారం, భాషా సంస్కారం కూడా ఉండాలి. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? అవినీతిని ఎండగడుతూ ఓ పాట రాయాలి. అందులో ఫలానావాడు దేశాన్ని దోచుకున్నాడు, ఫలానా వాడు అత్యాచారం చేశాడు, ఫలానావాడు హత్య చేశాడు అంటూ పేర్లతో సహా రాయాలి. దేవుడు ప్రత్యక్షమైతే ఏం అడుగుతారు? కాళ్లకు లేపనం పూసుకుని గాలిలో ఎగురుతున్నట్టుగా కలలు వస్తుంటాయి నాకు. నిజంగానే అలా ఎగురుతూ... ఈ బస్సులు, రైళ్లు, విమానాల వెంట పడకుండా... కోరుకున్న చోటికి వెళ్లిపోగల వరమివ్వమని అడుగుతాను. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? నా భార్యాబిడ్డలతో సంతోషంగా గడుపుతాను. మరణానికి భయపడతారా? లేదు. మరణమంటే మరో జన్మకు శ్రీకారం అని ఓ పాటలో రాశాను కదా! నేను కూడా అదే నమ్ముతాను. అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? మంచి రచయితగా! మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మళ్లీ కవిగానే పుట్టాలి. ఏ రంగంలోనూ ఎవరికీ లేని స్వేచ్ఛ కవికి మాత్రమే ఉంటుంది! - సమీర నేలపూడి