నీ మౌనమే మాటాడితే... | Your silence speech ... | Sakshi
Sakshi News home page

నీ మౌనమే మాటాడితే...

Published Sat, Dec 24 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM

నీ మౌనమే మాటాడితే...

నీ మౌనమే మాటాడితే...

పాటతత్వం

జో అచ్యుతానంద చిత్రంలోని ఈ పాట ఇద్దరు అన్నదమ్ములు విడిపోయిన సందర్భంలో వస్తుంది. ఈ పాట నా కెరీర్‌లోనే నాకు నచ్చిన పాట. నాలాంటి ‘మాస్‌’ బ్రాండ్‌ ఉన్నవారికి చాలా అరుదుగా ఇటువంటి మంచి పాటలు రాసే అవకాశాలు వస్తాయి. నాకు ఈ పాట చాలా ఇష్టం. ఈ పాట రాసే అవకాశం రావడం నా అదృష్టం. దర్శకులు అవసరాల శ్రీనివాస్‌గారు నా కవిత్వం విని, నచ్చిందన్నారు. సిచ్యుయేషన్‌కి తగ్గట్లుగా ఈ పాట పెద్ద రచయితలతో రాయిద్దామనుకుని కూడా నా కవిత్వం విన్నాక నా మీద నమ్మకంతో ఈ పాట శ్రీనివాస్, కల్యాణిమాలిక్‌ నాతో రాయించారు. వాళ్లకు నా మీద ఉన్న నమ్మకమే నా చేత ఈ పాట రాయించింది. పాట అందంగా వచ్చేలా కొంచెం కష్టపడమన్నారు. సరే అన్నాను. ఆ పాట అబ్‌స్ట్రాక్ట్‌గా రావాలి. జనరలైజ్‌ చేయాలి. ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు అన్నయ్యకి ఎంతో బాధగా ఉంటుంది. కాని వ్యక్తపరచలేడు. తమ్ముడిది అదే భావన. అప్పుడు వచ్చిన సాంగ్‌. ఈ పాట ఎవరికైనా అన్వయించుకోవచ్చు. స్నేహితులు, తల్లికొడుకులు, భార్యాభర్తలు...  ఇలా ఎవరికైనా అన్వయం కుదరాలి అన్నారు. ఈ పాటను చాలెంజ్‌గా తీసుకున్నాను. పాటలో  లోతైన భావం ఉండాలి, కాని అందరూ పాడుకోవాలి. ఇదీ నా ఆలోచన.

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటున
తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున
కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

పల్లవితో పాట ప్రారంభమవుతుంది. లాలనగా, దీవెనగా ఉంటే సడి చేయాలి కదా, కాని సడి చేయడం లేదు. మనసులో ఉన్న ప్రేమ వంటివి వ్యక్తపరచకపోవడం తప్పు కదా!? అనే భావనతో పాట ప్రారంభించాను. బాల్యంలో అన్నదమ్ములు.... గోళీలు, కర్రబిళ్ల... ఒకటేమిటి... వారు ఆడని ఆట ఉండదు. అందుకే ‘కలబోసుకున్న ఊసులు’ అంటూ కొనసాగించాను. బాల్యంలో ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉంటాం. ‘పెనవేసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో’ బాల్యంలో పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటు పోయాయో అనుకుంటారు. ఒక వయసు వచ్చాక అందరూ వారి వారి జీవితాలకు పునశ్చరణ చేసుకోవాలని చెబుతాయి ఈ వాక్యాలు. చిన్నప్పుడు ఎంతో చనువుగా ఉండే అన్నదమ్ములు, పెద్దయ్యాక విడిపోతున్నారు. ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. చిన్నప్పటి అనుబంధాలు ఎక్కడికి వెళ్లిపోతున్నాయో అర్థం కావట్లేదు. ఈ బాధను ఈ వాక్యంలో చెప్పాను.

ఇంతకాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ కాలమేమీ దోచుకోదు ఇమ్మనీపెదవంచు మీద నవ్వునీ పూయించుకోడం నీ పని
నీ మౌనమే మాటాడితే దరిచేరుకోదా ఆమనిచాలామంది సర్వసాధారణంగా ఉపయోగించే మాట... ‘కాలక్రమంలో విడిపోయారు’అనేది. కాలం ఎవరినీ విడదీయదు. ఎవరి హాయినీ దోచుకోదు. మనలో విడిపోవాలనే భావన ఉంటేనే విడిపోతాం. అంతేకాని నేరం కాలం మీద మోపకూడదు. ఎంతోకాలంగా దాచుకున్న అనురాగాన్ని, ఆప్యాయతను ఎప్పుడో ఒకప్పుడు ప్రదర్శిస్తుండాలి. మనసు పొరల్లోంచి వాటిని బయటకు తీసుకురావాలి. పెదవుల మీద చిరునవ్వును పూయించడానికి ఎవ్వరూ రావక్కర్లేదు. ఎవరికి వారే ఆ చిరునవ్వుల పూలను పూయించాలి. ఇద్దరు మనుషుల మధ్య ఉండే మౌనాన్ని ఎవరో ఒకరు ఛేదించిననాడు ఆమని తప్పక దరిచేరుతుంది.  

అందనంత దూరమేలే నింగికి నేలకి వానజల్లే రాయబారం వాటికిమనసుంటె మార్గం ఉండదా ప్రతి మనిషి నీకే  చెందడాఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపద అనాదిగా నింగికి నేలకు మధ్య అందనంత దూరం ఉంటూనే ఉంది. కాని ఆ దూరాన్ని ఒక్క వానజల్లు దూరం చేసేస్తోంది. ఇద్దరినీ తాను ఆనందంగా కలుపుతుంటుంది వానచినుకు. తన వారిని దగ్గర చేసుకోవాలనే మనసు ఉండాలే కాని మార్గం దొరక్కపోదు. మనసుతో పలకరిస్తే ప్రతి మనిషి మనకే చెందుతాడు. ప్రతిమనిషి తన వెంట మోసుకెళ్లే సంపదలు బంధం, ఆనందం మాత్రమే. చిల్లిగవ్వ కూడా తన వెంటరాదు. ఏ మనిషీ తన వెంట రాడు. కాని బంధాలు, ఆనందాలు మాత్రం వెంట వస్తాయి. అవి పంచే మనుషులను వదులుకోకూడదనే భావాన్ని ఇక్కడ చెప్పాను.

ఈ పాట నా జీవితంలో గుర్తుండిపోయే పాట. ఈ పాట రాశాక నాకు ఎంతోమంది ఫోన్‌ చేసి, నన్ను ప్రశంసలతో ముంచెత్తారు. మంచి పాట రాస్తే ఇంతమంది ప్రేమను పొందవచ్చా అనిపించింది నాకు. ‘మంచిపాటలు రాసుకోవడానికి వెతుక్కుందాం’  అనే మార్పు తీసుకువచ్చింది. ఒక తాత్విక దృష్టిని తీసుకొచ్చింది. గొడవపడి వెళ్లిపోయిన వాళ్లు ఈ పాట విని మళ్లీ మాట్లాడుకున్నట్లు చెబుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది.  – సంభాషణ: డా. వైజయంతి

భాస్కరభట్ల
గీత రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement