‘ఐటమ్ సాంగ్‌లో ఫిలాసఫీ ఏంటి’ అన్నారు!! | "Philosophy is the item song, 'said !! | Sakshi
Sakshi News home page

‘ఐటమ్ సాంగ్‌లో ఫిలాసఫీ ఏంటి’ అన్నారు!!

Published Sun, Apr 17 2016 5:25 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

‘ఐటమ్ సాంగ్‌లో  ఫిలాసఫీ ఏంటి’ అన్నారు!! - Sakshi

‘ఐటమ్ సాంగ్‌లో ఫిలాసఫీ ఏంటి’ అన్నారు!!

ఓరోజు పూరీ జగన్నాథ్ నన్నో పాట రాయమని అన్నారు... ‘నేనింతే’ సినిమా కోసం. ఐటెమ్ సాంగ్.

పాటతత్వం   
ఓరోజు పూరీ జగన్నాథ్ నన్నో పాట రాయమని అన్నారు... ‘నేనింతే’ సినిమా కోసం. ఐటెమ్ సాంగ్. అంతకుముందు ‘పోకిరి’లో ‘ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే’ రాశాను. అయితే ఈసారి పాట అలా ఉండకూడదని, ఫిలసాఫికల్‌గా ఉండాలని అన్నారాయన. ఐటెమ్ సాంగ్ అంటే తన అందాల గురించే పాడాలా, మంచి ఫిలాసఫీ చెప్పకూడదా అన్నది ఆయన ఆలోచన. చాలా గొప్ప ఆలోచన. ఆయన ఆలోచనకు రూపమివ్వడానికి నేను సిద్ధపడ్డాను. అప్పుడు నా మనసులో మెదిలిన మొదటి ఫిలాసఫీ... కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు ఈ జీవితం. దాన్ని ఆధారంగా చేసుకుని నా కలం కదిలింది. ‘పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల’ అన్న పాట పుట్టుకొచ్చింది.
 
ఫిలాసఫీ అనగానే పెద్ద పెద్ద పదాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మంచి విషయమైనా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ముఖ్యంగా ఇది సినిమా పాట కాబట్టి నేల టికెట్ తీసుకున్న మాస్ ప్రేక్షకుడి మనసులోకి పాట చొచ్చుకుపోగలగాలి. అందుకే ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగానే పదాలు వేసుకుంటూ పోయాను.
 
‘పుడుతూనే ఉయ్యాల... నువ్ పోతే మొయ్యాల... ఈలోపే ఏదో చెయ్యాల/ఏలాల ఏలాల... దునియానే ఏలాల... చకచకచక చెడుగుడు ఆడాల’
 జీవితం చాలా చిన్నది. పుట్టుక, చావు మన చేతుల్లో లేవు. మధ్యలో ఉండే జీవితం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి సాధించాలి.
 
‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడొద్దే/ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే’
 చాలామంది అవకాశాలు రాలేదని బాధ పడిపోతూ ఉంటారు. అది నిజం కాదు. అవకాశాలు వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు గుర్తించం. కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తుంటాం.
 ‘చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే/నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా/నీకై మిగిలివుంది ఇక ఈరోజు/ టర్నే లేని దారులూ ట్విస్టే లేని గాథలూ రిస్కే లేని లైఫులూ బోరు బోరే’
 
జీవితమన్నాక సంతోషంతో పాటు బాధ, కష్టాలు కూడా ఉంటాయి. వాటిని పాజిటివ్‌గా తీసుకుని ముందుకెళ్లిపోవాలి తప్ప తిట్టుకుంటూ కూర్చుంటే ముందుకుపోలేం.
 ‘నువ్వెంతో ఎత్తుకు ఎదిగినా బోల్డంత సంపాదించినా ఒరే నాన్నా పొంగిపోకురా/ గెలుపెవ్వడి సొత్తు కాదురా అది నీతో మొదలవ లేదురా/అది ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సురా’
 ఓడిపోతే కుంగిపోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నీదే తొలి పరాజయం కాదు. అలాగే గెలిస్తే పొంగిపోకూడదు. ఎందుకంటే నీదే తొలి విజయం కాదు. గెలుపోటములన్నవి అనుకోకుండా వస్తాయి. అయితే గెలవొచ్చు. లేదంటే ఓడొచ్చు. దేనినైనా ఒకేలా స్వీకరించాలి.
 
‘నిలుచుంటే బస్ స్టేషన్లో బస్ వస్తాది ఎక్కొచ్చే/పడిపోతే ఫ్రస్టేషన్లో ఏముంటాది ఎక్కేకే/ఇన్నేళ్లూ చేసిన పొరపాట్లూ సక్సెస్‌తో సర్దేయొచ్చులే/పడినా తిరిగి లేవడం బాల్యం మొదటి లక్షణం/దాన్నే మరచిపోవడం వింతేగా’
 బస్టాండులో నిలబడితే బస్ వస్తుంది. ఎక్కుతాం. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే ఫ్లయిట్ వస్తుంది. ఎక్కుతాం. అలాగే జీవితంలో పైకి వెళ్లాలంటే ఏదో ఒక మార్గం ఎంచుకోవాలిగా! పడిపోయి అక్కడే ఉండిపోతే ఎక్కడికి వెళ్ల గలం? బాల్యంలో తప్పటడుగులు వేస్తూ పడి పోతాం.

కానీ లేచి మళ్లీ అడుగులేస్తాం. నడక నేర్చుకుంటాం. కానీ పెద్దయ్యాక పడిపోతే మాత్రం ఎందుకు లేవం? పడినచోటే ఎందుకు ఉండిపోతాం? పొరపాట్లు చేయడం సహజం. కానీ విజయం సాధించిన తర్వాత అవి మరుగున పడిపోతాయి. ఏమీ చేయకుండా ఖాళీగా తిరిగి, అల్లర్లు చేసి, గొడవల్లో ఇరుక్కుని చెడ్డపేరు తెచ్చుకుంటాడో వ్యక్తి. అతడు ఉన్న ట్టుండి మారిపోయి, ఏ విదేశాలకో వెళ్లి సెటిలై పోయాడనుకోండి, తన తల్లిదండ్రులను ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడనుకోండి... అతడి పాత జీవితం ఎవరికైనా గుర్తుకొస్తుందా!
 
‘నిన్ను భయపెట్టే పనులేమిటో అవి చేసేయ్ రోజుకొక్కటీ/ఇక ఆపై జడుపే రాదురా’
 మనకు ఏదంటే భయమో దాన్ని చూసి పారిపోతుంటాం. అలా కాకుండా వాటిని చేయడానికి ప్రయత్నిస్తే ఆ భయం పోతుంది.
 ఇలా స్ఫూర్తినిచ్చే ఎన్నో మాటలు ఇందులో రాశాను. నిజానికి నేను పాటించే సూత్రాలే అవన్నీ. అందుకే ఆ మాటల్లోని నిజాయితీ పాటను నిలబెట్టింది. నేను ఎన్నోసార్లు పడిపోయాను. లేచాను. గెలిచాను. స్క్రీన్‌మీద నా పేరు చూసుకోవాలని వచ్చాను. నా పేరు తెర మీద చూసుకున్నాక వెళ్లిపోవచ్చు. కానీ వెళ్లలేదు.

మొదటి ఏడు సినిమాలూ పరాజయాన్ని చవిచూసినా కుంగిపోలేదు. ఓ సమయంలో వెళ్లిపోదాం అనిపించినా మంచి పేరుతో వెళ్లిపోదాం అనుకున్నాను. పేరు వచ్చాక, దాన్ని నిలబెట్టుకోకుండా వదిలేయ కూడదు అనుకున్నాను. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఓడిపోవడం తప్పు కాదు. కానీ గెలవడానికి ప్రయత్నించకపోవడం తప్పు. ప్రయత్నం చేసి ఓడిపోయినా ఫర్వాలేదు కానీ ప్రయత్నమే చేయకుండా వెనకడుగు వేయడం చాలా తప్పు. ఈ వాస్తవాన్నే చెప్పింది నా పాట.
 
ఐటమ్ సాంగ్‌లో ఫిలాసఫీ ఏంటి, ముమైత్‌ఖాన్ ఫిలాసఫీ చెప్తే ఎవరు వింటారు అన్నవాళ్లు ఉన్నారు. వాళ్లు అలా అంటారని ముందే ఊహించినా కావాలనే ఆ ప్రయోగం చేశారు పూరి. అలాంటి గట్స్ ఉన్న డెరైక్టర్ నాలాంటి రచయితకి తోడుగా ఉన్నంతకాలం ఇలాంటి మంచి పాటలు పుడుతూనే ఉంటాయి.
- భాస్కరభట్ల, గీత రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement