ఎందుకు ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి?
ప్రేమలో పడనివాళ్లు... వానలో తడవని వాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు, వర్ణంతో సంబంధంలేదు. ఇక్కడ మనసే ప్రధానం. అయితే అన్ని ప్రేమలూ ఒకలా ఉండవు. అసలు ప్రేమ అనేది సముద్రమంత సబ్జెక్ట్. ఎలా ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే ‘ప్రేమించాలి’ సినిమా చూస్తే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అంటున్నారు నిర్మాత సురేష్ కొండేటి. ఆయన నిర్మించిన పదో అనువాద చిత్రమిది. ఇటీవలే ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఓ పాట పాడించారు. ‘లాలిజో... అమ్మ ఒడి లేదు అని ఏడవకు...’ అనే ఆ పాటను భాస్కరభట్ల రచించారు.
ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ -‘‘నా అభిమాన గాయకుడు బాలుగారితో పాట పాడించాలన్న నా కల ఇన్నేళ్లకు నెరవేరింది. ఆయన పాడటంతో ఈ సినిమాకే ఒక పరిపూర్ణత వచ్చింది. ఈ పాట లిరిక్స్ చదివి బాలుగారు నన్నూ భాస్కరభట్లనూ అభినందించారు. ‘నీ సినిమాలు చాలా బాగుంటాయి సురేష్’ అని బాలూగారు అన్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. దాదాపు 1300 పాటలు రాసిన భాస్కరభట్ల కెరీర్‌లో టాప్ టెన్‌లో నిలిచే పాట ఇది. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులను కూడా తప్పక ఆకట్టుకుంటుందని నా నమ్మకం. యువతరంలో మార్పును తెచ్చే సినిమా ఇది. హీరో సంతోష్ తొలి సినిమా అయినా చాలా బాగా చేశాడు. హీరోయిన్ మనీషా యాదవ్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది’’ అన్నారు.