భారత్ అబ్బాయి.. బెల్జియం అమ్మాయి.. ఓ చిక్కు
నమక్కల్: ఇద్దరిది వేర్వేరు దేశాలు..అయితేనేం ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యులను కూడా ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ మన నిబంధనలు వారి వివాహాన్ని ఆమోదించక పోవడంతో ప్రస్తుతం వారిద్దరు ఆందోళనలో ఉన్నారు.
తమిళనాడులోని నమక్కల్ దగ్గర్లోని కొళ్లి హిల్స్కు చెందిన గిరిజన యువకుడు సురేష్ కుమార్ (28) షిప్ లో చెఫ్గా పని చేస్తున్నాడు. తన కన్నా వయసులో రెండేళ్లు పెద్దదైన బెల్జియం యువతి సారాని....అతడు మొదటిసారి షిప్లో చూశాడు. తొలి చూపులోనే వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. కుటుంబసభ్యులను కూడా వారి వివాహానికి ఒప్పుకునేలా చేశారు.
కొళ్లి హిల్స్ లోని వినాయకుడి ఆలయంలో సోమవారం సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహమైంది. అయితే వీరిద్దరూ కలిసి ఉండేందుకు మాత్రం ప్రభుత్వ నిబంధనలు ఆటంకంగా మారాయి. సారా విదేశీయురాలు కావడంతో పెళ్లి రిజిస్ట్రేషన్కు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. సారా విదేశీ యువతి కావడం వల్ల ధ్రువపత్రం ఇవ్వడం కుదరదని అభ్యంతరం తెలిపారు.
' పెళ్లి రిజిస్ట్రేషన్ అయ్యి...మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తేనే సారాకు లాంగ్ టర్మ్ వీసా వస్తుంది. అప్పుడే తను నాతో కలిసి ఇక్కడే జీవితాన్ని ప్రారంభించే అవకాశం లభిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆమె వీసా గడువు ముగుస్తుంది. కాబట్టి సారా బెల్జియం తిరిగా వెళ్లాల్సి ఉంటుంది' అని సురేష్ వాపోయాడు. సారాకి భారతీయ సంస్కృతి అన్నా, ఇక్కడి విలువలన్నా చాలా ఇష్టమని అతడు తెలిపాడు.