లిసా మిశ్రా.. గాయనిగా, గేయరచయితగా సంగీత, సాహిత్యాభిమానులకు ఏనాడో పరిచయం. తాజాగా నటనారంగంలోకి అడుగుపెట్టి తన అభినయ కళనూ ప్రదర్శించింది. ఆ ఫ్యాన్ బేస్‌నూ సంపాదించుకుంది.
👉లిసా పుట్టింది ఒడిశాలోని బరంపురంలో. పెరిగింది అమెరికాలోని షికాగోలో. నాలుగో ఏట నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. పదిహేనో ఏట నుంచి గిటార్‌లో శిక్షణ పొందటం మొదలుపెట్టింది. అకడమిక్స్ విషయానికి వస్తే ఇల్లినాయీ వెజ్‌లీయన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ రిలిజియన్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.
👉పదమూడేళ్ల వయసులో లిసా.. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి, తన పాటల వీడియోలను అందులో పోస్ట్ చేయసాగింది. అయితే ఆమె అలా వీడియోలు అప్‌లోడ్ చేయడం వాళ్లమ్మకు నచ్చలేదు. ఎందుకు అందరి కళ్లల్లో పడటం అంటూ అభ్యంతరం చెప్పింది. దాంతో కేవలం ఆడియో రికార్డింగ్స్‌ని మాత్రమే పోస్ట్ చేయసాగింది. ఆమె స్వరమాధుర్యానికి ఫిదా అయిపోయారు శ్రోతలు. ఆ ఆడియో పోస్ట్‌లకు వచ్చిన రెస్పాన్స్ చూసి లిసా వాళ్లమ్మ, కూతురి పాటల వీడియోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
👉యూట్యూబ్‌లోని ఆమె పాటల వీడియోలకు అమెరికన్ పాప్ మ్యూజిక్ కూడా స్పందించింది. 2016, గ్రామీ అవార్డ్ గెలుచుకున్న ‘కలరింగ్ బుక్’ ఆల్బమ్‌లో పాడే అవకాశాన్నిచ్చింది. 2017లో ఎమ్మీ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘బ్రౌన్ గర్ల్స్’ వెబ్ సిరీస్‌లోనూ థీమ్ సాంగ్ పాడింది.
👉పాశ్చాత్య ప్రపంచంలో లిసా అంత కీర్తి సాధించినా.. ఆమె మీద భారత్ దృష్టి పడింది మాత్రం ఆమె ‘వీరే ది వెడ్డింగ్’లోని ‘తారీఫా’ పాటను పాడి, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాకే! ఇన్‌స్టాలో ఆ వీడియో చూసిన సోనమ్ కపూర్, రియా కపూర్‌లు ఆమెను బాలీవుడ్‌కి పిలిచి, ‘తారీఫా’ రిప్రైజ్ వర్షన్‌ను పాడించారు. దాంతో ఇక్కడా ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
👉‘జడ్జ్‌మెంటల్ హై క్యా’, ‘స్కై ఈజ్ పింక్’, ‘గుడ్ న్యూస్’, ‘జుగ్‌జుగ్ జియో’, ‘లైగర్’, ‘దోనో’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలన్నీ హిట్టే! సినిమాల్లో పాడే చాన్స్ రాగానే తనకు ఇష్టమైన పాప్ మ్యూజిక్ వరల్డ్‌కి గుడ్ బై చెప్పలేదు. అక్కడా వినిపించడానికి ప్లాన్ చేసుకుంటోంది. గాయనిగానే కాదు పాటలను రాస్తూ తన రచనా పాటవాన్నీ చూపిస్తోంది.
👉క్షణం తీరిక లేని ఆమె షెడ్యూల్‌లో తన కోసం కాల్షీట్ సర్దే వీలుంటుందేమో చూడమని ఓటీటీ రిక్వెస్ట్ చేసింది.. ‘కాల్ మి బే’ వెబ్ సిరీస్ ఆఫర్‌తో! ఎంతో ఉత్సాహంగా ‘యెస్’ చెప్పింది లిసా. ప్రాధాన్యమున్న పాత్రలో నటించి వీక్షకులు, విమర్శల ప్రశంసలు అందుకుంటోంది. ఆ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమ్ అవుతోంది.
సింగర్, సాంగ్ రైటర్ అయిన నాకు యాక్టింగ్ అనేది సవాలే! చాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి యాక్టర్‌గానూ ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి రోల్స్ వస్తే నటననూ కంటిన్యూ చేస్తాను.
– లిసా మిశ్రా.
Comments
Please login to add a commentAdd a comment