దేవత నువ్వంటూ... భక్తుడు అయ్యాడే!
‘‘అమ్మాయి నడిచే దారి తెలుసు..
ఆ అమ్మాయి మనసులోకి వెళ్లే దారి తెలీదు!
తన కోసం యుద్ధం చేయడం తెలుసు..
తనతో కలసి ఏడడుగులు వేసే మార్గం తెలీదు!
మౌనంగా ప్రేమించే యువకుల మనసిది’’ అంటున్నారు పాటల రచయిత వి.వి.రామాంజనేయులు. ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి కథానాయకుడిగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. సమైక్యంగా నవ్వుకుందాం... అనేది ఉపశీర్షిక. పూర్ణ కథానాయికగా నటిస్తున్నారు. రవిచంద్ర స్వరకర్త ఈ సినిమాలోని ‘ఓ రంగుల చిలకా..’ పాటతత్వం గురించి, ఆ పాట రచయిత వి.వి.రామాంజనేయులు మాటల్లోనే..
పల్లవి: ఓ రంగుల చిలకా.. చూడే నీ యెనకా
అలుపంటూ లేనీ ఈ పిల్లాడి నడకా
ఓ బంగరు తళుకా.. చుట్టూ ఏం కనకా
ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా
ప్రేమలో పడితే.. రంగులన్నీ అమ్మాయిలోనే కనిపిస్తాయి. అమ్మాయి ఎటు వెళితే, అలుపనేది లేకుండా అబ్బాయి కూడా అటు వెళతాడు. అమ్మాయి పట్టించుకోకుండా వెళ్తుంది. సాధారణంగా అడుగులు వేస్తుంటే చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు వినకుండా ఎక్కడికి వెళ్తున్నావని రాశాను. పాపం.. ఆ అమ్మాయికి మాత్రం ఏం తెలుసు? ఒకడు మౌనంగా ప్రేమిస్తున్నాడని!
కోరస్: ఓసారిటు చూడే.. పాపం పసివాడే
నీ చూపుల కోసం వేచి ఉన్నాడే
అన్నీ వదిలేసి.. నిన్నే వలచాడే
నీ తలపుల్లోనే నిదురే మరిచాడే
నాకు తెలిసినంత వరకూ.. ఓ అమాయకత్వంతో కూడిన అబ్బాయిలే ప్రేమలో పడతారు. (నవ్వుతూ..) అమాయకులే ప్రేమిస్తుంటారు. ప్రేమికుడిని పసివాడితో పోల్చడానికి కారణమదే. మా సినిమాలో హీరో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో చాలామంది అబ్బాయిలు ఏం మాట్లాడకుండా అమ్మాయిల వెనకాలే దూరంగా తిరుగుతుంటారు. పోనీ, అమ్మాయిలు వీళ్లను చూస్తారా? అంటే, ప్చ్... ఏం పట్టించుకోకుండా వెళ్తుంటారు. మనోళ్లు మాత్రం ఒక్కసారి అమ్మాయి వెనక్కి తిరిగి చూడకపోతుందా? అని ఎదురు చూపుల్లో తమ సమయాన్నంతా గడిపేస్తుంటారు. ప్రపంచంతో ఆ ప్రేమికుడికి సంబంధం లేదు. అమ్మాయే వాడి ప్రపంచం. ప్రేయసి గురించి ఆలోచిస్తూ, ఆమె కలల్లో గడిపేస్తూ నిద్ర కూడా మరిచిపోతుంటాడు.
చరణం: నిన్నందరికంటే మిన్నగ చూస్తాడే
నిన్నెవరేమన్నా యుద్ధం చేస్తాడే
నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం
వేవేలడుగులైనా నడిచే ఘనుడే
ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత.. ప్రేమించిన అమ్మాయిని గొప్పగా చూడడం మొదలు పెడతాడు. అతడి స్నేహితులకు, మిగతావాళ్లకు విచిత్రంగా అనిపించే అంశం ఏంటంటే.. వీడు అమ్మాయితో ఒక్క మాట కూడా మాట్లాడడు. కానీ, ఎవరైనా ఆ అమ్మాయిపై కామెంట్ చేసినా.. ఇంకేమైనా చేసినా.. గొడవకు దిగుతాడు. ఎంత భయస్తుడైనా ఆ సమయంలో యుద్ధానికి సిద్ధమవుతాడు. కొన్ని ప్రేమకథలు ఏడడుగులు (పెళ్లి వరకూ వెళ్లకుండా) వేయకుండా ఆగుతాయి. కానీ, ఎప్పటికైనా ఆ అమ్మాయితో ఏడడుగులు వేస్తాననే ఆశతో వేల మైళ్లు నడుస్తూనే ఉంటాడు.
కోరస్: ఓసారిటు చూడే.. పాపం పసివాడే
నువు నడిచే దారిని వదలని ప్రేమికుడే
గుండె తలపుల్నే.. తెరిచి ఉంచాడే
దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే
మనకు ప్రపంచంలో ఏ దారైనా తెలియకపోవచ్చు. ఏ దారి ఎక్కడికి వెళుతుందో? తెలుసుకోవడం కష్టమే. కానీ, ప్రేమించిన అమ్మాయి దారి తెలుసుకోవడం చాలా సులువు. కాలేజీకి వెళ్తుందా? ఆఫీసుకు వెళ్తుందా? అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆమె చిరునామా ఏంటి? ప్రతిరోజూ ఏ దారిలో వెళ్తుంది? అనే విషయాలను చాలా సులభంగా తెలుసుకుంటాడు. ప్రపంచంలో ఏ ప్రేమికుడైనా గాళ్ ఫ్రెండ్ వెళ్లే దారిని మాత్రం మరువడు. అమ్మాయి వచ్చినా.. రాకపోయినా.. ఆ టైమ్‌కి దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవత అనుగ్రహం కోసం ఎదురుచూసే భక్తుడిలా.. ఎప్పుడు ఆ అమ్మాయి ప్రేమిస్తుందా? అని గుండె గది తలుపులు తెరిచి ఎదురు చూస్తుంటాడు.
ఈ రోజుల్లో కూడా ఇటువంటి వన్ సైడ్ లవర్స్ మనకు కనిపిస్తారు. కొందరు ఆ స్టేజి నుంచి వచ్చిన వాళ్లయితే.. మరికొందరు ఆ స్టేజిలోనే ఉన్నారు. తర్వాతి తరంలో ఆ స్టేజికి వచ్చేవాళ్లు తప్పకుండా ఉంటారు. సాధారణంగా యవ్వనంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒక అమ్మాయి వెనక తిరుగుతారు. ప్రపంచంలో అందరూ తప్పకుండా తిరుగుంటారు. మోడర్న్ యుగంలో ఓ అమ్మాయిని చూడగానే వెళ్లి, ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని ధైర్యంగా చెప్పే అబ్బాయిలకు కూడా ఏదో ఒక సమయంలో ఈ తరహా సందర్భం ఎదురయే ఉంటుంది. అటువంటి వాళ్లందరూ... ఈ పాట చూడగానే ‘నా కోసమే ఈ పాటను రాశారా?!’ అని భావించాలి. ఎక్కడ ఈ పాట వినపడినా తమకు తాము గుర్తు రావాలనే ఉద్దేశంతో రాసిన పాట ఇది.
వి.వి.రామాంజనేయులు గీత రచయిత
ఇంటర్వ్యూ: సత్య పులగం