నీ పయనమెచటికే ఓ చిలుకా! | Kula Deivam film song story | Sakshi
Sakshi News home page

నీ పయనమెచటికే ఓ చిలుకా!

Published Sun, Jun 21 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

నీ పయనమెచటికే ఓ చిలుకా!

నీ పయనమెచటికే ఓ చిలుకా!

పాట నాతో మాట్లాడుతుంది
తండ్రి లబ్ద ప్రతిష్టుడైనప్పుడు పైగా అద్భుతంగా తన రంగంలో జాజ్వల్యమానంగా వెలిగిపోతున్నప్పుడు అదే రంగంలో కొడుకు ఉంటే అనేక చిక్కులు. ప్రతిదానికి తండ్రితో పోలిక. లోకులతో పాటు తను కూడా పోల్చుకుని ఇబ్బంది పడే క్షణాలు ఎన్నో. ‘బాగా చేస్తే ఆ తండ్రి కొడుకు కదా అద్భుతంగా ఉండక చస్తుందా’ అంటారు. బాలేకపోతే ‘పండితపుత్రుడు. చెట్టు పేరు చెప్పి కాయలు ఎంతకాలం అమ్ముకుంటాడు’ అనే మాట పడాలి.
 
‘‘ఇలాంటి బాధలు అలాంటి పుత్రులకు తెలిసినంత ఇతరులకు అర్థంకావు. ఒక్కోసారి కొడుకు చేసింది తండ్రికే నచ్చదు. నా తండ్రి జూనియర్ సముద్రాల రాసి అనేక మహావ్యక్తులతో ‘ఆహా’ అనిపించుకున్న ‘అందమె ఆనందం’ పాట మా తాత సీనియర్ సముద్రాలకు తొలిచూపులో నచ్చలేదు. అంతెందుకు నువ్వు సినిమాల్లోకి రాకముందు, వచ్చింతర్వాత నీ పాటలను మీ నాన్న ప్రజాకవి సుద్దాల హనుమంతు పాటలతో పోల్చి నిన్ను మెచ్చుకున్నవారు, తిట్టుకున్నవారు, తిడుతూ పత్రికల్లో రాసి - సభల్లో చెప్పి నిన్ను బాధకు గురిచేసినవారు ఎందరో అకళంక పురుషీవరులు నీకూ తెలుసు కదా!’’ అంది జూనియర్ సముద్రాల పాట.
 ‘నీవు ‘అందమె ఆనందం’ పాటవా’ అన్నాను. ‘‘అనుకున్నాను, నీవూ అలాగే అంటావని. కానీ కాదు.’’ అంది కొంటెగా.
 
‘‘మరి ఎవరమ్మా’’ అన్నాను.
 ‘కులదైవం’ చిత్రంలో ‘పయనించిన చిలుకను’ అంది. సంగీతం మాస్టర్ వేణు అనే హింట్ కూడా ఇచ్చింది.
 ‘అబ్బో... చాలా గొప్ప పాటవు. పొడవైన పాటవు సుమీ’ అన్నాను. నిడివెక్కువ గీతాలు రాసి అద్భుత కీర్తినందుకున్నారు. మా నాన్నారు ‘పాండురంగ మహాత్మ్యం’లో ‘హే కృష్ణా’ పాట కూడా పొడవు తీరులోనే కాదు. పేరు ప్రతిష్టల్లో కూడా అంది.
 ‘పయనించే ఓ చిలుకా... గొప్ప సింబాలిక్ సాంగ్.
 
అన్నీ పోగొట్టుకుని పుట్టిన ఊరు విడిచి వెళ్లే ఒక కుటుంబ యజమానిని విషాదం మిగిలిన ఒక యువతిని ఉద్దేశించి చెప్పిన పాట. అలాంటి ఎందరికో ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చిన పాట.
 ఇక్కడ జూనియర్ సముద్రాల ఊరువిడిచిన గుమ్మడిని తొలిరెండు చరణాల్లో విషాదం పాలైన గిరిజను చిలుకతో పోలుస్తూ తుది రెండు చరణాల్లో చూపుతూ ఇద్దరికి సరిపోయే ఒకే పల్లవి కూర్చి అపూర్వంగా రచించిన పాట.
 పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు ఇంతే పల్లవి.
 
‘నీకీ ఊరుతో రుణం తీరిందీ ‘వెళ్లిపో’ అనే భావాన్ని చిలుకను మానవీకరిస్తూ గుమ్మడి పరంగా ‘తీరెను రోజులు నీకీ కొమ్మకు పోమ్మా ఈ చోటు వదలి ఎవరికి వారే ఏదోనాటికి ఎరుగము ఎటకో ఈ బదిలీ’’ అంటూ - మనిషి జన్మ మూడు దినాల ముచ్చటైన మజిలీ నిజాయితీగా ధర్మపథాన చనుమా ధైర్యమె నీ తోడు. ఓదార్చుతూనే ‘నిజాయితీ’ ధర్మపథం ధైర్యం ఒకే వాక్యంలో నిలిపిన గొప్ప సినీకవి.
 
ఇంక రెండో చరణంలో ‘నీవెంతో కష్టపడి చేసుకున్నది మొత్తం పోయింది. నీ రెక్కలు చల్లగుంటే మళ్లీ పూర్వవైభవం వస్తుంది’ అన్న విషయాన్ని చిలుకీకరించుతాడు - మనిషిని పక్షిగా మలుస్తూ పుల్లాపుడక ఏరుకొని కట్టుకున్న గూడు పోయింది. ఫర్వాలేదు వానకు తడిసిన రెక్కలు ఎండకు ఆరి సేదదీరుతాయి. చేసిన కష్టం వృథా అయిందని వేదన వద్దు. సిరి-సంపద మనం కనుమూశాక మన వెంట రాదు - త్యాగం కూడా మనిషికి చేదోడే - పద - అంటాడు జూనియర్ సముద్రాల. తండ్రి రచనంత తాత్విక గంభీరంగా సులభ సుందరంగా.

గిరిజను ఉద్దేశిస్తూ మూడో చరణంలో గీతోపదేశం చేశాడు జూ॥సముద్రాల. గత వైభవం ఇప్పుడు లేదు. మారిన పరిస్థితులకనుగుణంగా నీవు మారాలి. కన్నీరై కరుగుటే నీ తలరాత నీపై జాలి చూపేవారు లేరు. ఈ చరణం - చివరి చరణం కూడా గిరిజ పాత్రను ఉద్దేశించి సాగుతుంది చిత్రంలో చిలుకను మళ్లీ మానవీకరిస్తున్నాడీ చరణంలో ‘మరవాలి నీ కులుకులనడాలే మదిలో నయగారాలె’ తీరని వేదన తీయని ముసుగే శిరసున సింగారాలే ఓర్వలేని ఈ జగతికి నీపై లేవే కనికారాలే కరిగి కరిగి కన్నీరై కడతీరుటె నీ తలవ్రాలే చేరాతను - చేవ్రాలు అన్నట్టు
 
తలరాతను - తలవ్రాలే అన్నాడు.
ఇక నాలుగో చరణం - ఒక చిన్న ఓదార్పుతో - పాట ముగించాలనుకున్నాడు.
గోడుమని విలపించుతారు నీ గుణం తెలిసినవారు జోడుగ నీతో ఆడిపాడిన స్నేహితులు - కన్నీళ్లతో నిన్ను దీవించుతారు. విడిచిన చోటుకు తిరిగి చేరుకోవడం ఈ లోకంలో తెలిసినవాడెవడు అన్న భావంతో రేపు ఏం జరుగుతుందో తెలిసిందెవరు అనే వేదాంతపరంగా ముగిస్తాడు. సినిమా ఈ పాటతోనే ప్రారంభమవుతుంది. ఒకవైపు గుమ్మడి కుటుంబ నేపథ్యం మరోవైపు ‘గిరిజ’ విషాద జీవిత నేపథ్యం తన భుజాలపై వేసుకొని పది సన్నివేశాలలో చెప్పాల్సింది ఒక పాటలో చెప్పాడు నా తండ్రి జూ॥సముద్రాల అంటూ ‘చిలక’లా వచ్చి హంసలా ఎగిరిపోయింది తండ్రి జూనియర్ సముద్రాలను వెదుక్కుంటూ...
 - డా.సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement