Dr. Suddala Ashok Teja
-
కలగన్నానే నే మనసిస్తాననీ...
పాట నాతో మాట్లాడుతుంది నా తండ్రి అనంత శ్రీరామ్... మహాకవి సినారెలా తొలి సినిమాలోనే ఆ సినిమా పాటలన్నీ రాశాడు తెలుసా. 21 సంవత్సరాలకే మొదటి సినిమాలో మొత్తం పాటలు రాశాడు... అంటూ మాట కలిపింది నాతో ఓ పాట. ‘‘నువ్వు ఏ పాటవు తల్లీ - దుమ్ము దులిపిన దిల్ రాజా ‘బొమ్మరిల్లు’ సినిమాలో ‘అపుడో ఇపుడో’ పాటను’ అంటూ పరిచయం చేసుకుంది. ‘నాకు చాలా ప్రియమైన పాటవు సుమా. చెప్పమ్మా’ అన్నాను. చిత్రం బొమ్మరిల్లు - దర్శకుడు భాస్కర్. సంగీత దర్శకుడు - దేవిశ్రీ సన్నివేశం సర్వసాధారణంగా కథానాయిక గురించి నాయకుడు తలచుకునేదే. అన్ని చిత్రాల్లో ఉంటుంది. ఏ సినిమాకు ఆ పాట కొత్తగా అందించడమే రచయితకు పరీక్ష. ‘కలగన్నాను నీ గురించి మనసిచ్చాను నిను వరించి’ ఇలాంటి భావాన్ని సరికొత్తగా దర్శకుడు, సంగీత దర్శకుడు ప్రేక్షకుల మనసు ఊహల్లో తేలిపోయేలా మాటాడుకున్నట్టు రాయండి డాడీ’’ అన్నాను. చిన్నప్పటి నుండి తండ్రితో భజన గీతాలు అలవోకగా పాడుకుని - స్కూల్లో, కాలేజీలో అవసరార్థం ఆశువుగా రాయగలిగిన మా డాడీ అనంత్ శ్రీరామ్ అందుకున్నాడు ఇలా... ‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ... అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ... కలవో అలవో వలవో (కలలా వచ్చి - అలలా తాకి - వలగా పట్టేసి) నా ఊహల హాసినీ... మదిలో కథలా మెదిలే నా కలల సుహాసినీ’ ‘పల్లవి చివరి వాక్యంలో ఒక కన్ఫర్మేషన్ ఇవ్వండి డాడీ’ అనగానే నవ్వుకుంటూ... ‘‘ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని - ’ పల్లవి ముగించాడు. ఇక చరణం... ప్రపంచంలో అన్నిటికన్న ఇష్టమైన శబ్దం... కోకిల రాగమో - చిలక పలుకో కాదట... ‘మన పేరు మాత్రమేనని ఒక సర్వే. అందుకే ‘తీపికన్నా ఎంతో తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే’ పై భావాన్ని అనుసరిస్తూ. హాయికన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే... నువ్వు వెళ్లే దారని అంటానే’ అని రాసి... మళ్లీ చరణంలో చివరి వాక్యాలు కొసమెరుపు కోసం ఆలోచించి ప్రేమని - ప్రేయసిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాలని... ‘నీలాల ఆకాశం నా నీలం ఏదంటే... నీ వాలు కళ్లలో ఉందని అంటానే’ అనటంతో తొలిచరణం ముగిసింది. ఆకాశం - కురులో కనుపాపలో నీలిమ - ఈ పోలికలు కావ్యాలు చదువుకున్న శ్రీరామ్‌కు కరతలామలకాలే కదా. రెండో చరణం హీరోవైపుగా రాశాడు. అది కూడా చాలా కొత్తగా. ఎవరైనా మనల్ని అభిమానించినప్పుడు, ప్రశంసాత్మకంగా చూసినప్పుడు, ‘భలే మంచిపని చేశానే’ అంటూ మనల్ని మనం మెచ్చుకుంటాం. ఇది సాధారణంగా మన అందరికీ అనుభవమే. అలాగే... మనం బాగా ఇష్టపడేవారు దూరమైపోతే మనల్ని మనం పోగొట్టుకున్నట్టు అనిపించడమూ అంతే. సరిగ్గా ఈ పై భావాలను గుర్తు చేయగానే నా తండ్రి అద్భుతంగా సర్వసాధారణ యువ హృదయ భావాలను చరణించాడు. ‘‘నన్ను నేనే చాలా తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే.. నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటె నువ్వు నాతో మాటాడావంటే... నాతోనే నేనుంటా - నీతోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అంటూ ముగించాడు. ‘ఓకే బై తేజా’ అంది అనంతుని అనంతమైన గీతం. -
నీ పయనమెచటికే ఓ చిలుకా!
పాట నాతో మాట్లాడుతుంది తండ్రి లబ్ద ప్రతిష్టుడైనప్పుడు పైగా అద్భుతంగా తన రంగంలో జాజ్వల్యమానంగా వెలిగిపోతున్నప్పుడు అదే రంగంలో కొడుకు ఉంటే అనేక చిక్కులు. ప్రతిదానికి తండ్రితో పోలిక. లోకులతో పాటు తను కూడా పోల్చుకుని ఇబ్బంది పడే క్షణాలు ఎన్నో. ‘బాగా చేస్తే ఆ తండ్రి కొడుకు కదా అద్భుతంగా ఉండక చస్తుందా’ అంటారు. బాలేకపోతే ‘పండితపుత్రుడు. చెట్టు పేరు చెప్పి కాయలు ఎంతకాలం అమ్ముకుంటాడు’ అనే మాట పడాలి. ‘‘ఇలాంటి బాధలు అలాంటి పుత్రులకు తెలిసినంత ఇతరులకు అర్థంకావు. ఒక్కోసారి కొడుకు చేసింది తండ్రికే నచ్చదు. నా తండ్రి జూనియర్ సముద్రాల రాసి అనేక మహావ్యక్తులతో ‘ఆహా’ అనిపించుకున్న ‘అందమె ఆనందం’ పాట మా తాత సీనియర్ సముద్రాలకు తొలిచూపులో నచ్చలేదు. అంతెందుకు నువ్వు సినిమాల్లోకి రాకముందు, వచ్చింతర్వాత నీ పాటలను మీ నాన్న ప్రజాకవి సుద్దాల హనుమంతు పాటలతో పోల్చి నిన్ను మెచ్చుకున్నవారు, తిట్టుకున్నవారు, తిడుతూ పత్రికల్లో రాసి - సభల్లో చెప్పి నిన్ను బాధకు గురిచేసినవారు ఎందరో అకళంక పురుషీవరులు నీకూ తెలుసు కదా!’’ అంది జూనియర్ సముద్రాల పాట. ‘నీవు ‘అందమె ఆనందం’ పాటవా’ అన్నాను. ‘‘అనుకున్నాను, నీవూ అలాగే అంటావని. కానీ కాదు.’’ అంది కొంటెగా. ‘‘మరి ఎవరమ్మా’’ అన్నాను. ‘కులదైవం’ చిత్రంలో ‘పయనించిన చిలుకను’ అంది. సంగీతం మాస్టర్ వేణు అనే హింట్ కూడా ఇచ్చింది. ‘అబ్బో... చాలా గొప్ప పాటవు. పొడవైన పాటవు సుమీ’ అన్నాను. నిడివెక్కువ గీతాలు రాసి అద్భుత కీర్తినందుకున్నారు. మా నాన్నారు ‘పాండురంగ మహాత్మ్యం’లో ‘హే కృష్ణా’ పాట కూడా పొడవు తీరులోనే కాదు. పేరు ప్రతిష్టల్లో కూడా అంది. ‘పయనించే ఓ చిలుకా... గొప్ప సింబాలిక్ సాంగ్. అన్నీ పోగొట్టుకుని పుట్టిన ఊరు విడిచి వెళ్లే ఒక కుటుంబ యజమానిని విషాదం మిగిలిన ఒక యువతిని ఉద్దేశించి చెప్పిన పాట. అలాంటి ఎందరికో ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చిన పాట. ఇక్కడ జూనియర్ సముద్రాల ఊరువిడిచిన గుమ్మడిని తొలిరెండు చరణాల్లో విషాదం పాలైన గిరిజను చిలుకతో పోలుస్తూ తుది రెండు చరణాల్లో చూపుతూ ఇద్దరికి సరిపోయే ఒకే పల్లవి కూర్చి అపూర్వంగా రచించిన పాట. పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు ఇంతే పల్లవి. ‘నీకీ ఊరుతో రుణం తీరిందీ ‘వెళ్లిపో’ అనే భావాన్ని చిలుకను మానవీకరిస్తూ గుమ్మడి పరంగా ‘తీరెను రోజులు నీకీ కొమ్మకు పోమ్మా ఈ చోటు వదలి ఎవరికి వారే ఏదోనాటికి ఎరుగము ఎటకో ఈ బదిలీ’’ అంటూ - మనిషి జన్మ మూడు దినాల ముచ్చటైన మజిలీ నిజాయితీగా ధర్మపథాన చనుమా ధైర్యమె నీ తోడు. ఓదార్చుతూనే ‘నిజాయితీ’ ధర్మపథం ధైర్యం ఒకే వాక్యంలో నిలిపిన గొప్ప సినీకవి. ఇంక రెండో చరణంలో ‘నీవెంతో కష్టపడి చేసుకున్నది మొత్తం పోయింది. నీ రెక్కలు చల్లగుంటే మళ్లీ పూర్వవైభవం వస్తుంది’ అన్న విషయాన్ని చిలుకీకరించుతాడు - మనిషిని పక్షిగా మలుస్తూ పుల్లాపుడక ఏరుకొని కట్టుకున్న గూడు పోయింది. ఫర్వాలేదు వానకు తడిసిన రెక్కలు ఎండకు ఆరి సేదదీరుతాయి. చేసిన కష్టం వృథా అయిందని వేదన వద్దు. సిరి-సంపద మనం కనుమూశాక మన వెంట రాదు - త్యాగం కూడా మనిషికి చేదోడే - పద - అంటాడు జూనియర్ సముద్రాల. తండ్రి రచనంత తాత్విక గంభీరంగా సులభ సుందరంగా. గిరిజను ఉద్దేశిస్తూ మూడో చరణంలో గీతోపదేశం చేశాడు జూ॥సముద్రాల. గత వైభవం ఇప్పుడు లేదు. మారిన పరిస్థితులకనుగుణంగా నీవు మారాలి. కన్నీరై కరుగుటే నీ తలరాత నీపై జాలి చూపేవారు లేరు. ఈ చరణం - చివరి చరణం కూడా గిరిజ పాత్రను ఉద్దేశించి సాగుతుంది చిత్రంలో చిలుకను మళ్లీ మానవీకరిస్తున్నాడీ చరణంలో ‘మరవాలి నీ కులుకులనడాలే మదిలో నయగారాలె’ తీరని వేదన తీయని ముసుగే శిరసున సింగారాలే ఓర్వలేని ఈ జగతికి నీపై లేవే కనికారాలే కరిగి కరిగి కన్నీరై కడతీరుటె నీ తలవ్రాలే చేరాతను - చేవ్రాలు అన్నట్టు తలరాతను - తలవ్రాలే అన్నాడు. ఇక నాలుగో చరణం - ఒక చిన్న ఓదార్పుతో - పాట ముగించాలనుకున్నాడు. గోడుమని విలపించుతారు నీ గుణం తెలిసినవారు జోడుగ నీతో ఆడిపాడిన స్నేహితులు - కన్నీళ్లతో నిన్ను దీవించుతారు. విడిచిన చోటుకు తిరిగి చేరుకోవడం ఈ లోకంలో తెలిసినవాడెవడు అన్న భావంతో రేపు ఏం జరుగుతుందో తెలిసిందెవరు అనే వేదాంతపరంగా ముగిస్తాడు. సినిమా ఈ పాటతోనే ప్రారంభమవుతుంది. ఒకవైపు గుమ్మడి కుటుంబ నేపథ్యం మరోవైపు ‘గిరిజ’ విషాద జీవిత నేపథ్యం తన భుజాలపై వేసుకొని పది సన్నివేశాలలో చెప్పాల్సింది ఒక పాటలో చెప్పాడు నా తండ్రి జూ॥సముద్రాల అంటూ ‘చిలక’లా వచ్చి హంసలా ఎగిరిపోయింది తండ్రి జూనియర్ సముద్రాలను వెదుక్కుంటూ... - డా.సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
లాలీ! ఓ లాలీ!!
పాట నాతో మాట్లాడుతుంది మోహన్‌బాబుగారి ఆఫీస్ నుండి ఫోన్ - ‘‘ఏయ్ సుద్దాలా! ఫ్రీ యేనా?’’ ‘ఇపుడా - రేపు ఎల్లుండి గురించా’ మనసులో, ‘‘చెప్పండి సర్’’ అన్నాను. ‘‘ఎల్లుండి నుండి వారం రోజులు తిరుమలపై సినిమా పాటల సిట్టింగ్... నీకోకే... కదా’’ ‘‘ఓకే సర్’’ - ఫోన్ కట్... చిత్రం ఝుమ్మంది నాదం. కీరవాణి - రాఘవేంద్రరావుల ‘రసమ్మేళనం’ తిరుమలపై సందర్భం చెప్పారు రాఘవేంద్రులు. ‘విదేశాల నుండి వచ్చిన కథానాయిక జోలపాటలపై రీసెర్చ్ చేస్తూంది. గైడ్ హీరో మనోజ్. ‘జోలపాట’ కావాలి. పసిబిడ్డల నిదురపుచ్చుతూ - పడుచు హృదయాలను నిద్రలేపేదిగా ‘పిల్ల తెమ్మెరలా - పిండివెన్నెలలా సుకుమార సుందరంగా ఉండాలి. మధ్యలో తెలంగాణ - సాగరతీర గ్రామాల జానపద మిళితంగా ఉండాలన్నారు. దర్శకేంద్ర పసిబాలుడు - రసహేలుడు - సినీరస విశ్వవిద్యాలయ చాన్స్‌లర్. స్థలం తిరుమల కొండ - మనసు మా అమ్మ పాడిన జోలపాటల జ్ఞాపకాలకు వెళ్లింది. ‘‘పడుచు హృదయాలను రస హృదయాలను నిద్రలేపేలా’’ దర్శకుని మాట... పల్లవిలా గుర్తుకొస్తుంది. తెల్లకాగితంపై పెన్ను సిద్ధంగా ఉంది. నేను అనే నా కవితాత్మ మనోజ్ కళ్లతో తాప్సిని చూస్తోంది. నా పాట... నాతో... ‘ఊయల - గాలి... పూలతూగుటూయల - పూల గాలుల కోయిల’ - ఇలా వెళ్లు తండ్రీ! అంది. నాలోని కవి పెదవుల కొసలపై ఆత్మవిశ్వాసపు చిరునవ్వుతో కాగితంపై పల్లవిని ఇలా అలంకరించాడు. ‘‘లాలి పాడుతున్నది ఈ గాలి - ఈ గాలి రాగాలలో నువ్వూయల ఊగాలి’’... ఇంతే రాసి దర్శకునికిచ్చా. ఆయన పెదవులపై వెలసిన వెన్నెల కన్నులలో వెలుగై తళుక్కుమంది. ఆ కాగితం మోహన్బాబుకందించారు. రసికతా కవితా భోజరాజులా ‘శెభాష్’ అన్నారు. కాగితం కీరవాణి ఆర్మోణియం పైకి వెళ్లింది. ‘చాలా బాగుంది అశోక్ తేజగారూ’ అని కాగితాన్ని చూస్తూ వేళ్లతో సంగీత మంత్ర నగరి తలుపులు తెరిచారు ఆర్మోణియంపై. మొదటి స్పర్శతోనే - పల్లవికి బాణీ... వచ్చేసింది. అక్కడున్న అందరి కరతాళ ధ్వనులే తాళాలుగా, లయ తప్పిన హృదయాలే లయలుగా పల్లవి పూర్తయింది. వెంటనే ఒక జానపద గుబాళింపు ఇవ్వాలి అనకాపల్లిలో నా మిత్రుడు సీతారాముడు ఎప్పుడో చెప్పిన జాలరీ గుండెల జాజిమల్లెల జానపద రాగాల మాల నా మేధస్సుకు ప్రాంప్టింగ్ ఇచ్చింది. కాగితంపై రాసిచ్చాను. ‘ఏలో యాల... ఏలో యాల హైలెస్సో ఐలపట్టి హైలెస్సా... బల్లా కట్టు హైలెస్సా అద్దిర బాబు హైలెస్సా... అక్కడ పట్టు హైలెస్సా సన్నజాజి హైలెస్సా... చీరాకట్టి హైలెస్సా సిన్నాదొచ్చి హైలెస్సా... కన్నుకొట్టె హైలెస్సా... జాలరీ జానపదుల బాణీ నేను, కీరవాణి పాడుకుంటూ ‘అలాగే దించాం’. ఆ రాత్రి ‘పసిపాపల ఎదుగుదల’ను అందంగా అందించమంటూ గాలి - పూల తీవ - వేళ్లు - బోసినవ్వు అంటూ నిద్రరాని నా కనురెప్పలపై ఊది చెప్పింది. గాలి కొసల లాలి - ఆ పూల తీవెకు వేలి కొసల లాలి - ఈ బోసి నవ్వుకు బుడిబుడి నడకలకు - భూమాత లాలి ముద్దు ముద్దు పలుకులకు - చిలకమ్మ లాలి ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మ లాలి ఇంతవరకు రాసి, పిల్లల గంతులను చాలా అందంగా చందమామ చందంగా చెప్పాలని నా పాట నన్ను ఊరించింది. ‘చెంగు చెంగు గంతులకు చందమామలో దాగివున్న కుందేలమ్మ లాలి’ అని రాశా. ఇంక చరణంలో కీరవాణి - దర్శకుడు - మోహన్‌బాబుల హృదయాలను ముద్దుపెట్టేంత అందంగా చెప్పాలనే తపనలో ఉండగా, ‘ఈ లాలి’ ఎలాంటిదో చెప్పు అంది నా పాట నాతో. ‘నా లాలి నీకు పూలపల్లకీ... అలసిన కళ్లకి...సొలసిన కాళ్లకి’ అని రాశాక, ‘శెభాష్ తేజా’ అంది. ఆపైన తెలంగాణ జానపదం మా అమ్మ పాడే ‘ఒక పూలగుళుచ్ఛం’ లాంటి పద సంపెంగ గుత్తి గుర్తుకువచ్చింది. ‘‘ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ’’... ఇది కూడా తెలంగాణ జానపదులు ఎలా పాడతారో అలాగే పెట్టాం. ఇక రెండో చరణం... వెన్నముద్ద లాలి - చిన్నారి మేనికి గోరుముద్ద లాలి - బంగారు బొమ్మకి ఓనమాలు పలికితే - పలకమ్మ లాలి అని రాయగానే, ‘శెభాష్ తండ్రీ! పలకమ్మ లాలి బాగుంది. ‘పలుకులమ్మ లాలి’ పెట్టవా అంది. నా పాట బాలశిక్ష చదివితే పలుకులమ్మ లాలి - దినదినము ఎదుగుతుంటే - దినకరుని లాలి... అనగానే మోహన్‌బాబు ‘సూపర్’ అన్నారు. ‘పదుగురొచ్చి నిను మెచ్చితే కన్నులారా చూసే తల్లికడుపు తీపి లాలి’ అని రాశాను. ‘పుత్రోత్సాహంబు’ అన్న సుమతి పద్యం గుర్తుంచుకుని - పాట పూర్తయింది. ‘పడుకో తేజా’ అంటూ లాలి పాడి వెళ్లిపోయింది నా లాలిపాట. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
పులితోలు వలువాయె...
పాట నాతో మాట్లాడుతుంది నా ఎదురుగా ఓ సౌందర్యవతి. ‘అలంకారాల ఘలంఘలలతో విశేష విశేషణాలతో అలరిస్తున్న శ్రీనాథుని పద్య సుందరి లాగున్నావు ఎవరివమ్మా తల్లీ’’ అన్నాను. చేవ కలిగిన చేమకూర వేంకటకవి యంతటి ‘సినీ చేమకూర వేటూరి సుందరరామమూర్తి నా తండ్రి. నేను ‘భక్త కన్నప్ప’లో ‘కిరాతార్జునీయ గేయ’ కన్యకను.’ భక్త కన్నప్ప... సంగీతం - సత్యం, దర్శకులు - బాపు. చెప్పేదేముంది. రచన ముళ్లపూడి రమణ. బాపు-రమణలు వేటూరిగారికి కిరాతార్జునీయం ఘట్టం చెప్పగానే వేటూరి ‘అసాధారణ ధారణాధురీణుడు కదా’ వెంటనే శ్రీనాథుని హరవిలాసంలోని ఏడవ ఆశ్వాసంలో కిరాతార్జునీయం అటు నుంచి ఇటు - ఇటు నుండి అటు ఒక్కసారి సాక్షాత్కరించింది. ఇంక ఏ ఆధారం లేకుండా గాలి నుండి గాంధర్వ గీతాలను సృజించగలిగే వేటూరిలోని కవి పెదవులపై సాధికారికత చిరునవ్వు మెరిసింది. గీతానికి తెర లేపుతూ - తకిట తకతక తకిట చరిత పదయుగళ - మొదలైంది. పాట. మూలంలోని పద్యంలో ఏది ముట్టుకోవాలో దేన్ని వదులుకోవాలో వేటూరి కనుచూపు కొసలకు పెనుపాళి కొసలకు తెలిసిన విద్వత్తో శంకరుడు ఎరుకలవానిగా మారుతున్నాడు. వేటూరి పెనుచూపు శంకరుని తలను ఒక్కసారే నిశితంగా గుర్తు తెచ్చుకుంది. ‘తలపై నెలవంక’ను శ్రీనాథుని ‘వికట పాటల జటా మకుటికాభారంబు కరుకైన జుంజురునెరులు కాగ’ జుట్టు గురించి ఎందుకులే వదిలేశాడు ‘జారు సుధాధామ శకలావతంసంబు పెడకొప్పు పైనుండు పీకె కాగ’ - శ్రీనాథుడు నెలవంకను చుట్టపీకెలా మారిందన్నది వేటూరికి నచ్చలే. సినిమా కన్ను - సినిమా పెన్ను - అందం - ఆనందం పరమావధి అనుకుంటుంది. ‘నెలవంక తలపాగ నెమలి ఈకెగ మారె’ వేటూరి సీతకు రమణ - బాపులిద్దరు శెభాషనుకున్నారు. శ్రీనాథుడు వదిలిన ‘గంగ’ను వేటూరి అందుకున్నాడు పాటలో తన ముద్ర వేయాలని ‘తలపైన గంగమ్మ తలపులోనికి జారె ‘ఘనలలాటంబున గను పట్టు కనుచిచ్చు గైరిక ద్రవతిలకంబుగాగ’... ఇది తప్పనిసరి అనుకుని ‘నిప్పులు మిసే కన్ను నిదరోయి బొట్టాయె’ శ్రీనాథుడు వదిలిన బూదిని - పులితోలును ‘బూదిపూతకు మారు పులితోలు వలువాయె’ అంటూ ఎరుకలవానికి ఆహార్యం ధరింపజేశాడు. శ్రీనాథుడు పాములను పూసల సరులుగా మార్చిన పాదాలను వలదని శ్రీనాథుడు రాసిన శంకరుండు కిరాత వేషంబు దాల్చి యగజ చెంచెతయై తోడనరుగుదేరును వాక్యాలను. ‘ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా... తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా’ మార్చాడు. శ్రీనాథుని ‘బాణినోంకార దివ్యచాపము ధరించి వచ్చె వివ్వచ్చు వరతపోవనము కడకు’లో ‘త్రిశూలం’ లేదని గ్రహించి ‘ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము’ అంటూ త్రిశూలాన్ని శ్రీనాథుని ఓంకార ధనువుగా కూర్చాడు వేటూరి - కవి కన్ను జల్లెడైన వడపోతలో త్రిశూలం దొరికింది వేటూరికి. శ్రీనాథుని మూలంలోని ‘తాటియంత విల్లు ధరియించినాడవు - తాడి ఎత్తు గాండీవముతో ముత్తాడి ఎత్తుగా’ ఆనాటి కవులకు ఎత్తు అయితే తాటిచెట్టు లేదా హిమాలయం. అలా కిరాతార్జునీయ ఘట్టాన్ని సినీగీతాల చరిత్రలో హిమాలయం ఎత్తులో నిలిపిన వేటూరికి కొందరు నిర్మాతల - దర్శకుల - కథానాయకుల సంగీత దర్శకుల కొల‘తల’ మేరకు - కురచగా అపసవ్య సాచిగా పదాలతో ‘నాటు కొట్టడమూ’ తెల్సు. ఏమైనా సినీ కవులకు ఏం తెలుసు? శ్రీనాథ పద్యం అని వెటకారించే మలపరాయుల కనుల నలక మకిలి - కెలికి తీసేలా. వెలికి తీసేలా రచించిన ఈ గీతం మీ సినీగీత రచయితలందరికీ గర్వంగా హత్తుకోదగిన సగర్వంగా తలనెత్తుకోదగిన సినీమణి మకుట గీతం అంటూ వేటూరి పాట వేవేల గీతమ్మల ముద్దూ నా రాముడే - ముద్దు సుందర రాముడేనంటూ కొమ్మ కొమ్మకో సన్నాయిగా మారిపోయింది. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
నా ప్రేమ పేరు నీలాకాశం...
పాట నాతో మాట్లాడుతుంది ‘‘దాదాపు ఎనిమిది దశాబ్దాల నుండి సినిమాపాట మనస్సులను రంజింపజేస్తూనే ఉంది. విసుగు, విరామం లేకుండా రసధారావ్రతం చేసున్నదేదైనా ఉందంటే అది సినీగీతం మాత్రమే. మొన్న కృష్ణశాస్త్రి... పింగళి... సినారె... సిరివెన్నెల... రామజోగయ్యశాస్త్రి... ఇలా... ఇలా...’’ ‘‘సినీగీతం వైపు న్యాయవాద బాధ్యత స్వీకరించినట్టు ఏకధాటిగా ఏకరువుపెడుతున్నావు ఎవరమ్మా’’ అన్నాను. నా తండ్రి రామజోగయ్యశాస్త్రి - ‘నేను ‘నేనంటే నాకు చాలానే ఇష్టం’ పాటను... చిత్రం ఊసరవెల్లి, సంగీతం దేవిశ్రీప్రసాద్’- అంది ఆ పాట నాతో. చిత్రంలో (జూనియర్ అనకూడదు) యన్.టి.ఆర్. కథానాయికపై తన ఇష్టం ఎంతో, ఎలాంటిదో చెప్పే సందర్భం... వందల సినిమాల్లో వందలసార్లు రాసి - రాస్తూ - రాయబోయే తప్పనిసరి పాటలలో ఒకటి. సినీ రచయితల తిప్పలు ఏంటంటే, అదే అదే పదే పదే చెప్పాలి. కొత్తగా అనుభూతుల పూగుత్తిగా చెబుతూనే ఉండాలి. విషయం అదే - నువ్వు - నేను. నీ కళ్లు - నా గుండె - నీ బుగ్గలు - నా ముద్దులు. నీ మీద నాకు ప్రేమ... విషయం అదే. ఇలాంటి సందర్భాల్లో జయించుకొస్తున్న తరతరాల సినీ గీత రచయితలకు సలాం పెదనాన్నా’ అంది. ‘‘సరే, ఏం జరిగింది బేటా’’ అన్నాను. పాట రాయడానికి తలపంకిస్తూ పెదవులతో రాని పదాలను రుచి చూస్తున్నాడు నా తండ్రి. అప్పుడు నేను... ‘‘నాన్నా! ఈ ప్రపంచంలో మనిషికి ఏదంటే ఇష్టం’’ అన్నాను. చల్లగా నవ్వుతూ పెద్ద కళ్లతో చూస్తూ... కొందరికి పూలు - కొందరికి సరస్సులు’’ అన్నాడు. ‘‘ఊహు! అన్నిటికన్నా...’’ ‘‘కొందరికి అమ్మ. ఇంకొందరికి నేస్తం’’ ‘‘ఊహూ’’ అప్పుడన్నాడు మా నాన్న రామజోగయ్య, ‘‘మనిషికి నిజానికి తనంటేనే తనకు ఎక్కువ ఇష్టం’’. ‘‘సూపర్బ్... ఇలా పాట మొదలెట్టు తండ్రీ!’’ అన్నాను. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బాణీ స్మరిస్తూ దూసుకెళ్లింది నా తండ్రి కలం... ‘‘నేనంటే నాకూ చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం ఏ చోటనైనా ఉన్నా నీకోసం నా ప్రేమ పేరు నీలాకాశం’’ వరకు రాశాడు. కలం కాసేపు ఆగింది. నా ప్రేమే నీలాకాశమైనప్పుడు ఆకాశంలో ఉండేదేదీ ఆమెను బాధించనీయొద్దు అనుకుని... ‘‘చెక్కిళ్లు ఎరుపయ్యే సూరీడి చూపైనా నా చేయి దాటందే నిను తాకదే చెలి’’ శెభాష్ తండ్రీ!... కంటిన్యూ కంటిన్యూ... అంటూ ప్రోత్సహించాను నేను. వెంటనే చెక్కిళ్లకు ప్రాసగా ‘‘ఎక్కిళ్లు రప్పించే ఏ చిన్న కలతైనా నా కన్ను తప్పించి నిను చేరదే చెలీ’’ అద్భుతమైన పల్లవి ఆవిష్కరించింది. ఇంక తొలి చరణం.. ఆకాశం నుంచి పెనుచూపు ఆరంభమైంది కనుక, పల్లవి పంచభూతాల్లో నింగి - నిప్పు (సూరీడు) వచ్చింది మిగిలినవి గాలి - నేలా - అలా వెళ్లకూడదు మరోసారి సూచించా. థాట్ వస్తే బాణీకి అక్షరాల దుస్తులు వేయడం అరక్షణం మాత్రమే కదా! - నా తండ్రి రామజోగయ్యకు. ‘‘వీచే గాలి, నేనూ పోటీపడుతుంటాం. పీల్చే శ్వాసై నిను చేరేలా’’ తను గాలితో పాటు ఆమె ఊపిరి కోశాల్లో దూరి నులివెచ్చగా బజ్జున్నట్టు లేదూ. ఆ ఊహ తరువాత వాక్యం ‘‘నేలా నేను రోజూ సర్దుకుపోతుంటాం రాణీ పాదాలు తలమోసేలా’’ ఆమె పాదాల కింద - తాను - తన నుదురు తల - ఓహో - ‘నను భవదీయదాసుకి’ పద్యం పారిజాతాపహరణం స్ఫురించలేదూ!. కృష్ణుడు సత్య పాదాల సున్నితత్వం తెలపడం, తన తల జుట్టు ముళ్లు తాకి నీ పాదాలు కందిపోతాయి - అన్న కృష్ణామృతం గుర్తుకొస్తుంది కదా! వెంటనే... పూలన్ని నీసొంతం - ముళ్లన్ని నాకోసం ఎండల్ని దిగమింగే నీడనైవున్నా అలా అలా తొలి చరణం పూర్తిచేశాడు. ఇక రెండో చరణం ఎలా మొదలెట్టనూ... అనుకుంటున్నాడు నా తండ్రి. డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
మౌనమే మంత్రమౌతున్న వేళ... ఓ వేణుమాధవా!!
పాట నాతో మాట్లాడుతుంది... తన పెన్నులో సిరా వెన్నెల - నా తండ్రి సిరివెన్నెల. మాట తీరు వెన్నెల - మనసు తీరు వెన్నెల. మనిషి తీరు సిరివెన్నెల సీతారామరాత్రి సారీ... సీతారామశాస్త్రి. ఎంత బాగా చెప్పావు... పాటా! నీ మాటల ముత్యాల పోహళింపులో శాస్త్రిగారి కూతురువనిపించావు... ఇంతకూ నీవు... ‘‘నేను... నేను... ‘నేనున్నాను’ చిత్రంలో గాలి గాంధర్వపు గీతాన్ని... గుర్తించలేదా కవీ..’’ ఓ... నాకిష్టమైన పాటవి. ఎన్నో ప్రదేశాల్లో ఇప్పుడు వస్తున్న పాటల్లో ఆనాటి ఆపాత మాధుర్యమూ లేదు. అత్యంత సాహితీ సౌగంధమూ లేదన్న ఎందరు సాహితీ ప్రియులకో ‘నీ పేరు చెప్పి ఒప్పించేవాణ్ని. నేటి సినీసాహితీ స్రష్టంలో వాసి వసి వాడలేదని నిరూపించేవాణ్ని. సరే... ఇక చెప్పు. ‘నేనున్నాను’ సినిమా - కీరవాణి సంగీతం, పాడింది చిత్ర. సన్నివేశం - తన బతుకును చిగురింపజేస్తున్న కథానాయకుడు నాగార్జునకు ఆత్మనివేదన చేసుకునే సందర్భంలో పాట రాయాలి. ‘కథానాయికని వెదురుగా పోల్చుతూ - హీరో వేణుధరుడైన మాధవునితో ఉపమిసూత శూన్యంగా ఉన్న వెదురుగొట్టంలో మోహనుడి ఊపిరి ఎలా గాంధర్వమైందో... రాయరాదా తండ్రీ’ అన్నాను... అంది. వెన్నెల సిరాక్షరాలుగా మారుతూ... ‘వేణుమాధవా!’ అని పలికింది ‘సాకీ’గా. క్రియారూపంలో పల్లవిని పల్లవింపజేయడం సిరివెన్నెల పెన్నుకవ్వంలో భావాల మీగడ పెరుగును చిలికిన వెన్న తీయడమంత సులువు. వాతావరణంలో ఉన్న వాయువు గోపాలుని ఊపిరిగా మారి, పెదవులతో వేణువునూదగానే ఉల్లము ఝల్లుమనిపించే గాంధర్వంగా మోగడాన్ని తలచుకో- అన్నాను. అంతే! నా తండ్రి సిరివెన్నెల అందుకున్నాడు. సుకుమార సుందరంగా రసబంధురంగా- ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నది- ఆపైన ఆలస్యం లేకుండా రెండో వాక్యం... ‘ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో’ అంటూ దూసుకొచ్చింది. ఆ శ్వాసలో నేను కూడా విలీనమై ఆ పెదవులపై నేను కూడా మంత్రమై నీలోకి చేరని మాధవా’ అని పల్లవి పూర్తించాడు. నా తండ్రి సీతా గీతా రామశాస్త్రి ఇంక తొలి చరణం - మురళిని అనిర్వచనీయంగా - కవితా నిర్వచనీయంగా చరణీకరించడం - ఏ రుషులకు - తాపసులకు - మధుర భక్తులకు అందని మాధవుని పెదవులపై పవ్వళించే యోగం - రసాత్మక భోగం వెదురు మురళిదంటు అందుకోసం - ఎన్ని గాయాలు తొలచుకుంటేనో ఈ అద్వైత యాగ ఫలసిద్ది అంటూ మునులకు తెలియని జపములు జరిపినదా వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున - నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణా నిన్ను చేరింది (ఓం నమో నారాయణాయ) అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధీ - వెదురు తాను పొందింది వేణుమాధవా నీ సన్నిధీ - ముగించాడు. ఆ పైన రెండో చరణంలో ఏం చెప్పాలి? మురళి శరీరపరంగా తొలి చరణ సరళి ముగిసింది. ఇక ఆ ముదిత శరీరపరంగా చెప్పు తండ్రీ! అన్నాను. నిదుర రాని నడిరాతిరి సిరివెన్నెల కనుపాపల కదలికలో నేను తప్ప ప్రపంచమంతా గాఢనిద్రలో కదా అనే భావం తొణికిసలాడి మరో రూపంలో కాగితంపై ప్రసరించింది. వెన్నెల రేఖలా వెలుగుల వాకలా ‘చల్లని నీ చిరునవ్వులు కనపడక - కనుపాపకీ నలువైపుల నడిరాతిరి ఎదురవదా - అల్లన నీ అడుగుల సడి వినపడక - హృదయానికీ అలజడితో అణువణువూ తడబడదా- ఈ పాదం నడిపేది నువ్వె - నా నాదం పలికించేది నువ్వె - సినిమాలో నాయికకు పుట్టుకతో వచ్చిన గాన కళను ప్రోత్సహించినవాడు నాయకుడు. కనుక - చివరి నాలుగు వాక్యాలను నువ్వే నడుపు పాదమిది - నువ్వే మీటు నాదమిది నివాళిగా నా మది - నివేదించు నిమిషమిది వేణుమాధవా నీ సన్నిధీ... అని సంపూర్ణించాడు సిరివెన్నెల. ఇందులో కథానాయకుని పేరు వేణు అని కవికి తెలుసు. పాట రాసినట్టుగా మాట్లాడటం - మాట్లాడినట్టు పాట రాయడం మీ కవులకు, సినీకవులకు సినారె నుండి సిరివెన్నెల దాక చెల్లిందే. కానీ క్రియాపదాలతో పల్లవించడం - అందమైన అర్థాలను ఊరిస్తూ - అందమైన చెవికీ - మనసుకు - సంగీతానికి ఉచ్చరించటానికి ప్రియంగా ఒదిగే పదాలను అల్లుకుంటూ కాగితంపై చూస్తే అలవోకగా మాటాడుకునే సాదా సీదా మాటలతో ‘పాట బొమ్మ అమ్మాయిల్ని వెన్నెల్లో ఆడించడం’ నా తండ్రి సిరివెన్నెలకు విరించి పెన్నుతో పెట్టిన విద్య. అంటూ... నా విధాత - క‘విధాత’ నా పిత సీతారామశాస్త్రి పాటలూరే రాతిరి రత్న పేటికలోనే నా బస - అంటూ తన శ్వాసలో చేరితే నేను గాంధర్వమయ్యానులే అని పాడుకుంటూ వెళ్లింది. డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
ఆకాశం అమ్మాయైతే...
పాట నాతో మాట్లాడుతుంది హలో పెదనాన్నా! నేను చంద్రబోస్ కూతురును మాటాడుతున్నాను. ఓ అమృతవర్షిణీ... బావున్నావా బంగారుతల్లి - నేను అమృతవర్షిణిని కాదు. ఆ... అమృతవర్షిణి కాకుండా.. చంద్రబోస్‌కు... తమ్మీ బోసూ మాకూ సుచిత్రమ్మకు... తెలియకుండా నీకు. ఇంకో ‘నాలోని అపోహలను ఖండిస్తూ చంద్రముఖి సినిమాలో మనసులోని విషయాలు రజినీకాంత్‌కు తెలిసిపోయినట్టు... కొంచెం కోపంగా ‘పెదనాన్నా... నేను ‘గబ్బర్‌సింగ్’లో ‘ఏం చక్కని బంగారం’ పాటని. ‘అమ్మయ్య... నా హార్ట్‌బీట్ పెంచావు కదే. ఓకే ఓకే చెప్పు నీ జన్మ రహస్యం. ‘గబ్బర్ సింగ్’ సినిమాకు ‘యువ రసజ్ఞతా హృదయాల రేబవలు దోచుకునే దొంగ’ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీకి రెండు మూడు పల్లవులు ఇచ్చినా ఎవరికీ - దర్శకుడు గబ్బర్ సింగ్‌తో సంచలన దర్శక హరీంద్ర గర్జన చేసిన హరీష్ శంకర్‌కీ - ‘దేవి’కి నచ్చట్లేదు. నా తండ్రి చంద్రబోస్‌కి తింటున్నా, నిదురిస్తున్నా, నడుస్తున్నా, డ్రైవ్ చేస్తున్నా దేవి బాణీయే శ్వాసక్రియగా మారింది. ఒకరోజు కార్లో వస్తూ రాయదుర్గం పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు ఆగాడు. ఆకాశం మేఘావృతమై మేఘసందేశం రచనకు ముందు కాళిదాసును కవ్వించినట్టు కవ్విస్తోంది. పెట్రోల్ బంక్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ అందరూ ఉద్యోగినులు - అటు కవ్విస్తున్న ఆకాశాన్ని, ఇటు దేవతల దోసిళ్లలో అమృతం పోస్తున్న విష్ణుమోహినిలా పెట్రోల్ పోసే అమ్మాయిలు. సరిగ్గా అప్పుడే నేను ఎదురై ‘ఆకాశం - అమ్మాయిలు’ ఇలా వెళ్లు డాడీ అన్నాను. ఇంకేం క్షణమాలస్యం కాకుండా పెదవుల్లో అలవోకగా వచ్చింది. ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ తర్వాత ‘సేమ్ లెంత్’... ఆనందం అల్లరిచేస్తే నాలా ఉంటుందే... అంతే... శభాష్... ఆకాశమా... శహభాష్ అమ్మాయిలు అనుకుంటూ డ్రైవింగ్ చేస్తూనే దర్శక - సంగీత దర్శకులకు వినిపించారు. అటువైపు నుండి ‘సూపర్బ్ గోహెడ్’ అన్నారంతా. ఇంతలో సన్నని వాన మొదలైంది. ‘డాడీ తర్వాత వాక్యం కోసం మొదలైంది వాన’ అన్నాను. సామాన్యుడా చంద్రబోస్. వానల్లె నువ్వు జారగా... నేలల్లే నేను మారగా... వాగల్లె నువ్వు నేను చేరగా... అది వరదై పొంగి సాగరమవుతుందే హోలా... హోలా... నీ కళ్లల్లోన చిక్కానే పిల్లా... హోలా... హోలా... హోలా... హోలా... ఇక చాలా చాలా జరిగే నీవల్ల... పల్లవి పూర్తయింది. ఇక చరణం: - తన్నాసీ... సన్నాసీ... అన్నట్టుగా... మూడక్షరాల పదంలో చివరక్షరం ‘సీ’ పెట్టాలని ట్యూన్ డ్రైవ్ చేస్తోంది. ప్రాసల మంత్రనగరి ప్రభుత్వాధీశుడు చంద్రబోసుడు - అల్లేసీ... గిల్లెసి... సుగుణాల రాక్షసి ప్రియభయంకర పద ప్రయోగాల్లో గుండెను రసకైంకర్యం చేసే శక్తి ఉందని తెలిసిన పద హృదయ మర్మయోగి - దర్శకేంద్ర రస విశ్వవిద్యాలయా గీతాశాఖ ఉన్నతోద్యోగి చంద్రబోస్‌కు తెలియదా. సుగుణాల రాక్షసి - దయలేని ఊర్వశి రాక్షసికి సుగుణముండదు. ఊర్వశికి నిర్దయ ఉండదు ... అద్భుతం చంద్రబోస్... ఇంకో చరణంలో ‘మసి చేసినావే రుషిలాంటి నా రుచి (రుచి అంటే టేస్ట్ - రుచి అంటే కాంతి) ’ రెంటినీ అన్వయిస్తూ రచించిన చంద్రబోస్... ఏ కావ్యాలు ఔపోసన పట్టిన ఏ కవుల కన్నా తక్కువ కాదు. రెండు చరణాలు అద్భుతంగా రాశాక సాకి రాయాలి. కవ్వింపుగా, గిల్లింపుగా రాయాలనుకుని ఏం చక్కని బంగారం - ఎనిమిది దిక్కుల సింధూరం. మనసున రేపెను కంగారం - మెత్తని బంగారమెంత సున్నితమో ‘కంగారం’ యువ హృదయం తాలూకా తొట్రుపాటును ‘కంగారం’ అనడం ఎంత హాయిగా ఉందో. వన్నెల వయ్యారం తీయని ప్రేమకు ‘తయ్యారం’. వావ్... ప్రయోగ శరణం వ్యాకరణం కదూ... చంద్రబోస్ నీ చిలిపి పాటలతో రసజ్ఞులైన శ్రోతలకే కాదు. కవినైన నాకే థ్రిల్లింగ్‌గా, గిల్లింగ్గా ఉంది అనుకుంటుండగా... ‘వస్తా పెదనాన్నా’ అంటూ మణికొండవైపు మాయమైంది చంద్రబోస్ పాట. డా.సుద్దాల అశోక్ తేజ , పాటల రచయిత -
కొసరాజుతో రోజులు మారాయి...
నా పాట నాతో మాట్లాడుతుంది... ఏ పాటైనా రాయగలిగిన - రాస్తున్న నిన్ను ‘విప్లవకవి’ అన్నట్టే- అటు ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ఇటు ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ రాసినా నా తండ్రిని సినీజానపద కవి సార్వభౌముడనే అంటారు తేజా.. అంటూ మొదలెట్టింది కొసరాజు పాట. మహాకవిగా గుర్తింపు వచ్చాక సినీకవి అయినాడు కొసరాజు. 1931లోనే జమీందారులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం మొదలై, దానికి నాయకత్వం వహిస్తున్న కొసరాజు మునిస్వామి నాయుడి ప్రోత్సాహంతో ‘కడగండ్లు’ రైతు గేయాలు రాశారు. పింగళి లాగే 1930 దశకంలో సినీరంగంలో అడుగుపెట్టి వెనక్కివెళ్ళి, మళ్ళీ 1950 దశకంలో వచ్చి విజృంభించిన కొసరాజు అస్మదీయ జనకులు. మాటల రచయిత డి.వి.నరసరాజు పట్టుదలతో, మహా దర్శకుడు కె.వి.రెడ్డి ‘పెద్దమనుషులు’ చిత్రానికి 1952లో మూడు పాటలు రాయడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో కొసరాజు కలంబలం తెలిసింది. అయితే, ‘రోజులు మారాయి’ సినిమాలో ఏడు పాటలు రాయడంతో కొసరాజు రోజులు మారిపోయాయి’ అంది కొసరాజు పాట. 600 చిత్రాల్లో 870 పాటలు రాశారు కొసరాజు. 1986 అక్టోబర్ 27న సురేష్ ప్రొడక్షన్స్ ‘గురుబ్రహ్మ’కు బుర్రకథ రాసిన రాత్రే కన్నుమూశారు. ‘మూగమనసులు’లో ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మ’ పాటలో ఒక దగ్గర ‘అది పెళ్లామంటే చెల్లదులే పళ్లు పదారు రాలునులే’ అని రాశాడు. పళ్లు 32 కదా 16 అని ఎందుకు రాశాడు! ‘పళ్లు’ ‘పదారు’ యతి కోసమని కొందరు చర్చించారట. యతి కోసమో, ప్రాస కోసమో కాదు ‘పదహారు’ సంఖ్య నూతన యవ్వనాన్ని సూచించే వయస్సుకు సంబంధించింది. పదహారేళ్ల మీద ఎన్నో పాటలు వచ్చాయి. ‘పదారు పళ్లురాలునులే’ అంటే నీ పడుచు పొగరు దించేస్తా అన్నది లోతైన అర్థం. సాహిత్యాన్ని, సమాజాన్ని, జీవితాలను కాచి వడబోసిన కవిఋషి తాత్త్వికుడు కొసరాజు. పద్యాలు, చారిత్రక కావ్యాలు, ద్విపద కావ్యాలు, బుర్రకథలు, లఘు కావ్యాలు, వ్యంగ్యం, తాత్వికత కలగలసిన సినీగీతాలు, ‘రైతుజన విధేయ రాఘవయ్య’ అంటూ ఆటవెలదులను రచించిన నా తండ్రిని కేవలం ‘జానపద సినీకవి’ అంటే నాకు చిర్రెత్తిపోదూ అంది కొసరాజు పాట. నేను ఆ పాటను సేదదీర్చి, ‘తల్లీ, నీవే సినీగీతానివి’ అంటే నేను 1957లో తోడికోడళ్లు చిత్రంలోని ‘ఆడుతుపాడుతు పనిచేస్తుంటే’ పాటను అంది గారాబంగా - గర్వంగా. తోడికోడళ్లు చిత్రం సంగీతం మాస్టర్ వేణు మహానటీనటులు అక్కినేని - సావిత్రి సందర్భం నీళ్లు పొలానికి చేతులతో ఎత్తిపోయడం. దోసిళ్లతో కాదు దొన్నెతో- దాన్ని గూడేయటం అంటారు. దాని కోసం ఏయన్నార్, సావిత్రి కొంత శిక్షణ కూడా తీసుకున్నారు. అత్యంత సహజంగా తెరకెక్కించారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు. గూడేస్తున్న సందర్భంలో పాట కావాలి. అందరి చూపు కొసరాజుపైనే - శ్రమ సౌందర్యాన్ని లలిత శృంగారంలో రంగరించి రాయగల విలువ తెలిసిన నెలరాజు, కవితల రాజు కదా కొసరాజు. ఇంక మొదలైంది. అలవోకగా, అవలీలగా కవిరాజు చేతిలో... ‘ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నట్లు రాయగూడదు నాన్నా’ అన్నాను నేను. శభాష్ అంటూ అలాగే మొదలెట్టాడు. పాడేది భార్యాభర్తలు.. భర్త సాన్నిధ్యంలో ఉంటే కైలాసాన్నైనా మోయగలిగే బలవంతురాలవుతుంది సుకుమారమైన భార్య కూడా. అలాగే భార్య పక్కనే ఉంటే ఎంత పనైనా ఎడం చేత్తో అలుపుసొలుపు లేకుండా చేయగలడు భర్త. ఇంకేముంది పల్లవి పూర్తయింది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపే మున్నది/ ఇద్దరమొకటై చేయికలిపితే ఎదురేమున్నది. మనకు కొదవేమున్నది. ఇంక చరణం - ‘గూడేస్తున్న చెలి ఒంపులు ఒయ్యారం ఊగుతూ.... విసురుతూవుంటే ఆమె గాజుల శబ్ద సంగీతం అలవాటైన భర్త గుండెఝల్లుమనిపించదూ’ అలా వెళ్లూ అన్నాను క్షణంలో చరణం పూర్తి చేశాడు. ఇంక ఏదో కొత్తగా చెప్పాలి ఈ శ్రమసౌందర్యాన్ని అపురూపంగా అపూర్వంగా చెప్పాలి. ఒకసారి కుంకుమశోభతో మెరిసే సావిత్రి నుదురు నెలవంకనూహించుకో అన్నాను. వెంటనే నా తండ్రి కొసరాజుకు చెమటతో తడిసి చెదిరే కంకుమ రేఖ జారి పెదలవులపై మెరిసినట్టనిపించి ‘‘చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తువుంటే తీయని తలపులు నాలో ఏవో తికమక చేస్తువున్నవి’’ అని పూర్తి చేశాడు. ఈ చరణమే ఒక శ్రమ సౌందర్యానందలహరిలా లేదూ అంది పాట- జోహర్ తాతా! కొసరాజా అన్నాను. అలా నన్ను అందంగా తీర్చిదిద్ది ఆదుర్తి, మాస్టర్ వేణు ద్వారా మీకొదలి తాను వెళ్ళిపోయాడంటూ ‘రసవన్నగం’లా నా రస హృదయంలో ఘనీభవించింది. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత