కలగన్నానే నే మనసిస్తాననీ...
పాట నాతో మాట్లాడుతుంది
నా తండ్రి అనంత శ్రీరామ్... మహాకవి సినారెలా తొలి సినిమాలోనే ఆ సినిమా పాటలన్నీ రాశాడు తెలుసా. 21 సంవత్సరాలకే మొదటి సినిమాలో మొత్తం పాటలు రాశాడు... అంటూ మాట కలిపింది నాతో ఓ పాట. ‘‘నువ్వు ఏ పాటవు తల్లీ - దుమ్ము దులిపిన దిల్ రాజా ‘బొమ్మరిల్లు’ సినిమాలో ‘అపుడో ఇపుడో’ పాటను’ అంటూ పరిచయం చేసుకుంది.
‘నాకు చాలా ప్రియమైన పాటవు సుమా. చెప్పమ్మా’ అన్నాను.
చిత్రం బొమ్మరిల్లు - దర్శకుడు భాస్కర్. సంగీత దర్శకుడు - దేవిశ్రీ
సన్నివేశం సర్వసాధారణంగా కథానాయిక గురించి నాయకుడు తలచుకునేదే. అన్ని చిత్రాల్లో ఉంటుంది. ఏ సినిమాకు ఆ పాట కొత్తగా అందించడమే రచయితకు పరీక్ష.
‘కలగన్నాను నీ గురించి మనసిచ్చాను నిను వరించి’
ఇలాంటి భావాన్ని సరికొత్తగా దర్శకుడు, సంగీత దర్శకుడు ప్రేక్షకుల మనసు ఊహల్లో తేలిపోయేలా మాటాడుకున్నట్టు రాయండి డాడీ’’ అన్నాను.
చిన్నప్పటి నుండి తండ్రితో భజన గీతాలు అలవోకగా పాడుకుని - స్కూల్లో, కాలేజీలో అవసరార్థం ఆశువుగా రాయగలిగిన మా డాడీ అనంత్ శ్రీరామ్ అందుకున్నాడు ఇలా...
‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలీ... అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ... కలవో అలవో వలవో
(కలలా వచ్చి - అలలా తాకి - వలగా పట్టేసి)
నా ఊహల హాసినీ... మదిలో కథలా మెదిలే నా కలల సుహాసినీ’
‘పల్లవి చివరి వాక్యంలో ఒక కన్ఫర్మేషన్ ఇవ్వండి డాడీ’ అనగానే నవ్వుకుంటూ...
‘‘ఎవరేమనుకున్నా నా మనసందే
నువ్వే నేనని - ’ పల్లవి ముగించాడు.
ఇక చరణం... ప్రపంచంలో అన్నిటికన్న ఇష్టమైన శబ్దం...
కోకిల రాగమో - చిలక పలుకో కాదట... ‘మన పేరు మాత్రమేనని ఒక సర్వే. అందుకే ‘తీపికన్నా ఎంతో తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే’ పై భావాన్ని అనుసరిస్తూ.
హాయికన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే... నువ్వు వెళ్లే దారని అంటానే’ అని రాసి... మళ్లీ చరణంలో చివరి వాక్యాలు కొసమెరుపు కోసం ఆలోచించి ప్రేమని - ప్రేయసిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాలని... ‘నీలాల ఆకాశం నా నీలం ఏదంటే... నీ వాలు కళ్లలో ఉందని అంటానే’ అనటంతో తొలిచరణం ముగిసింది.
ఆకాశం - కురులో కనుపాపలో నీలిమ - ఈ పోలికలు కావ్యాలు చదువుకున్న శ్రీరామ్‌కు కరతలామలకాలే కదా. రెండో చరణం హీరోవైపుగా రాశాడు. అది కూడా చాలా కొత్తగా.
ఎవరైనా మనల్ని అభిమానించినప్పుడు, ప్రశంసాత్మకంగా చూసినప్పుడు, ‘భలే మంచిపని చేశానే’ అంటూ మనల్ని మనం మెచ్చుకుంటాం. ఇది సాధారణంగా మన అందరికీ అనుభవమే. అలాగే... మనం బాగా ఇష్టపడేవారు దూరమైపోతే మనల్ని మనం పోగొట్టుకున్నట్టు అనిపించడమూ అంతే. సరిగ్గా ఈ పై భావాలను గుర్తు చేయగానే నా తండ్రి అద్భుతంగా సర్వసాధారణ యువ హృదయ భావాలను చరణించాడు.
‘‘నన్ను నేనే చాలా తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే.. నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటె నువ్వు నాతో మాటాడావంటే... నాతోనే నేనుంటా - నీతోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అంటూ ముగించాడు. ‘ఓకే బై తేజా’ అంది అనంతుని అనంతమైన గీతం.