నా ప్రేమ పేరు నీలాకాశం... | Oosaravelli Movie song | Sakshi
Sakshi News home page

నా ప్రేమ పేరు నీలాకాశం...

Published Sun, May 24 2015 1:33 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

నా ప్రేమ పేరు నీలాకాశం... - Sakshi

నా ప్రేమ పేరు నీలాకాశం...

పాట నాతో మాట్లాడుతుంది
‘‘దాదాపు ఎనిమిది దశాబ్దాల నుండి సినిమాపాట మనస్సులను రంజింపజేస్తూనే ఉంది.
 విసుగు, విరామం లేకుండా రసధారావ్రతం చేసున్నదేదైనా ఉందంటే అది సినీగీతం మాత్రమే. మొన్న కృష్ణశాస్త్రి... పింగళి... సినారె... సిరివెన్నెల... రామజోగయ్యశాస్త్రి... ఇలా... ఇలా...’’
 ‘‘సినీగీతం వైపు న్యాయవాద బాధ్యత స్వీకరించినట్టు ఏకధాటిగా ఏకరువుపెడుతున్నావు ఎవరమ్మా’’ అన్నాను. నా తండ్రి రామజోగయ్యశాస్త్రి - ‘నేను ‘నేనంటే నాకు చాలానే ఇష్టం’ పాటను... చిత్రం ఊసరవెల్లి, సంగీతం దేవిశ్రీప్రసాద్’- అంది ఆ పాట నాతో.
 
చిత్రంలో (జూనియర్ అనకూడదు) యన్.టి.ఆర్. కథానాయికపై తన ఇష్టం ఎంతో, ఎలాంటిదో చెప్పే సందర్భం... వందల సినిమాల్లో వందలసార్లు రాసి - రాస్తూ - రాయబోయే తప్పనిసరి పాటలలో ఒకటి. సినీ రచయితల తిప్పలు ఏంటంటే, అదే అదే పదే పదే చెప్పాలి. కొత్తగా అనుభూతుల పూగుత్తిగా చెబుతూనే ఉండాలి. విషయం అదే - నువ్వు - నేను. నీ కళ్లు - నా గుండె - నీ బుగ్గలు - నా ముద్దులు. నీ మీద నాకు ప్రేమ... విషయం అదే. ఇలాంటి సందర్భాల్లో జయించుకొస్తున్న తరతరాల సినీ గీత రచయితలకు సలాం పెదనాన్నా’ అంది.
 ‘‘సరే, ఏం జరిగింది బేటా’’ అన్నాను.
 
పాట రాయడానికి తలపంకిస్తూ పెదవులతో రాని పదాలను రుచి చూస్తున్నాడు నా తండ్రి. అప్పుడు నేను... ‘‘నాన్నా! ఈ ప్రపంచంలో మనిషికి ఏదంటే ఇష్టం’’ అన్నాను.
 చల్లగా నవ్వుతూ పెద్ద కళ్లతో చూస్తూ... కొందరికి పూలు - కొందరికి సరస్సులు’’ అన్నాడు.
 ‘‘ఊహు! అన్నిటికన్నా...’’
 ‘‘కొందరికి అమ్మ. ఇంకొందరికి నేస్తం’’
 ‘‘ఊహూ’’
అప్పుడన్నాడు మా నాన్న రామజోగయ్య, ‘‘మనిషికి నిజానికి తనంటేనే తనకు ఎక్కువ ఇష్టం’’.
 
‘‘సూపర్బ్... ఇలా పాట మొదలెట్టు తండ్రీ!’’ అన్నాను.
 దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బాణీ స్మరిస్తూ దూసుకెళ్లింది నా తండ్రి కలం...
 ‘‘నేనంటే నాకూ చాలానే ఇష్టం
 నువ్వంటే ఇంకా ఇష్టం
 ఏ చోటనైనా ఉన్నా నీకోసం
 నా ప్రేమ పేరు నీలాకాశం’’
 వరకు రాశాడు. కలం కాసేపు ఆగింది.
 
నా ప్రేమే నీలాకాశమైనప్పుడు ఆకాశంలో ఉండేదేదీ ఆమెను బాధించనీయొద్దు అనుకుని...
 ‘‘చెక్కిళ్లు ఎరుపయ్యే సూరీడి చూపైనా
 నా చేయి దాటందే నిను తాకదే చెలి’’
 శెభాష్ తండ్రీ!... కంటిన్యూ కంటిన్యూ... అంటూ ప్రోత్సహించాను నేను.
 వెంటనే చెక్కిళ్లకు ప్రాసగా
 ‘‘ఎక్కిళ్లు రప్పించే ఏ చిన్న కలతైనా
 నా కన్ను తప్పించి నిను చేరదే చెలీ’’
 అద్భుతమైన పల్లవి ఆవిష్కరించింది.
 
ఇంక తొలి చరణం..
 ఆకాశం నుంచి పెనుచూపు ఆరంభమైంది కనుక, పల్లవి పంచభూతాల్లో నింగి - నిప్పు (సూరీడు) వచ్చింది మిగిలినవి గాలి - నేలా - అలా వెళ్లకూడదు మరోసారి సూచించా. థాట్ వస్తే బాణీకి అక్షరాల దుస్తులు వేయడం అరక్షణం మాత్రమే కదా! - నా తండ్రి రామజోగయ్యకు.
 ‘‘వీచే గాలి, నేనూ పోటీపడుతుంటాం. పీల్చే శ్వాసై నిను చేరేలా’’
 తను గాలితో పాటు ఆమె ఊపిరి కోశాల్లో దూరి నులివెచ్చగా బజ్జున్నట్టు లేదూ. ఆ ఊహ తరువాత వాక్యం
 
‘‘నేలా నేను రోజూ సర్దుకుపోతుంటాం
 రాణీ పాదాలు తలమోసేలా’’
 ఆమె పాదాల కింద - తాను - తన నుదురు తల - ఓహో - ‘నను భవదీయదాసుకి’ పద్యం పారిజాతాపహరణం స్ఫురించలేదూ!. కృష్ణుడు సత్య పాదాల సున్నితత్వం తెలపడం, తన తల జుట్టు ముళ్లు తాకి నీ పాదాలు కందిపోతాయి - అన్న కృష్ణామృతం గుర్తుకొస్తుంది కదా!
 వెంటనే...
 
పూలన్ని నీసొంతం - ముళ్లన్ని నాకోసం
 ఎండల్ని దిగమింగే నీడనైవున్నా
 అలా అలా తొలి చరణం పూర్తిచేశాడు. ఇక రెండో చరణం ఎలా మొదలెట్టనూ... అనుకుంటున్నాడు నా తండ్రి.            
డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement