ఎదురీత ముందు విధిరాత ఎంత! | How long before edurita vidhirata! | Sakshi
Sakshi News home page

ఎదురీత ముందు విధిరాత ఎంత!

Published Sun, Apr 10 2016 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

ఎదురీత ముందు విధిరాత ఎంత!

ఎదురీత ముందు విధిరాత ఎంత!

కొన్నాళ్ల క్రితం ఓ మ్యూజిక్ డెరైక్టర్ నాకు ఫోన్ చేశారు. తన కూతుళ్లిద్దరూ నోట్ బుక్‌లో ఏదో రాసుకుంటుంటే ఏమిటని అడిగారట ఆయన. వాళ్లు సినిమా పాట రాసుకుంటున్నామని చెప్పా రట. ఆడపిల్లలు, నోట్‌బుక్‌లో సినిమా పాట రాసుకోవడమేంటి, ఏదైనా రొమాంటిక్ సాంగ్ గానీ రాసుకోవడం లేదు కదా అని కంగారుపడి ఆయన చెక్ చేశారట. అది అలాంటి పాట కాదు. ‘నింగి నేల నాదే’ సినిమాలోని ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’ అనే పాట. పిల్లలకి స్కూల్లో ఆ సినిమా చూపించారట.

చాలా గొప్ప పాట, అందరూ తప్పకుండా నేర్చుకుని పాడాలి అని టీచర్ చెప్పిందట. ‘పాఠాలతో పాటు మీ పాటను కూడా నేర్పుతున్నారు స్కూల్లో’ అని ఆయన అంటే సంతోషం వేసింది. ఏ రంగంలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఏదో ఒకదాని నుంచి స్ఫూర్తి పొందిన వాడే అయ్యుంటాడు. మహ్మాతాగాంధీ కూడా స్ఫూర్తి కోసం భగవద్గీత చదివేవారు. స్ఫూర్తి అనేది అంత అవసరం. నేను నా కెరీర్‌లో స్ఫూర్తిని కలిగించే పాటలు చాలా రాశాను... మౌనంగానే ఎదగమని, చీకటితో వెలుగే చెప్పెను, కొడితే కొట్టాలిలా, నవ్వేవాళ్లు నవ్వనీ... ఇలా! అయితే ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’ పాట చాలా ప్రత్యేకం.  

ఎందుకంటే ఇది వికలాంగులకు స్ఫూర్తినివ్వడం కోసం రాసింది. అన్ని అవయవాలూ సక్రమంగా పని చేస్తున్నవారికే స్ఫూర్తి అవసర మైనప్పుడు... శరీరంలో కొన్ని అవయవాలు లేక, తమ పనులు తాము చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి స్ఫూర్తి ఎంత అవసరం! అందరితో సమానం కావడానికి ఎలాంటి ప్రేరణ అవ సరం! అలా ఆలోచిస్తూనే పెన్ను పట్టాను. ఈ పాటకు జన్మనిచ్చాను.
 
ఆరాటం ముందు ఆటంకం ఎంత/ సంకల్పం ముందు వైకల్యం ఎంత?/దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత??/ఎదురీత ముందు విధిరాత ఎంత? నమ్మకమూ పట్టుదల/నా రెండు రెక్కలుగా/ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశన్నంతా సాధించాలి అన్న పట్టుదల ఉంటే వైకల్యం అడ్డు కాదు. ఆ నిజం తెలుసుకుంటే విధిరాతను మార్చొచ్చు. దురదృష్టాన్ని పారద్రోలవచ్చు.
 
చేజారెను చేతులు/చెదిరేను గీతలు/ బెదిరించిన బాధలే వివరించెను బోధలు హీరోయిన్ ప్రమాదవశాత్తూ చేతులు కోల్పోతుంది. తన పనులు కూడా తాను చేసుకోలేని స్థితికొస్తుంది. ఆ బాధ మొదటి రెండు లైన్లలోనూ ఉంటే, క్రమంగా తనలో పెరిగిన పట్టుదలను మూడో లైన్ చెబుతోంది. పాదాలను పిడికిలిగా/నా గుండెను గుప్పిటగా/మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా... పట్టుదలతో తానేం చేయబోతోందో చెబుతోందా అమ్మాయి.

చేతులు లేని స్థితిలో అలానే ఉండిపోతే తను అందరిలాంటి అమ్మాయిల్లాగే మిగిలిపోయేది. కానీ తను తన పనులు తానే చేసుకోవడం నేర్చుకుంది. కాళ్లతో వండుతుంది. తింటుంది. కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంది. చివరికి స్విమ్మింగ్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తుంది.  
 పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం/ అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం/ చిరునవ్వే స్తుంటే సెలవంది శోకం/సహనంతో ఉంటే దొరికింది సైన్యం/చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం అంటూ తన విజయాన్ని ప్రపంచానికి సగర్వంగా చూపిస్తుంది తను.
 
నిజానికిదో చైనీస్ మూవీ. డబ్ చేశారు. విదేశీ సినిమాల్లో పాటలుండవు. కానీ తెలుగులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వచ్చే ఒకచోట పాట పెట్టా లనుకున్నారు. ఆ సిట్యుయేషన్‌కి పాట కంటే ముందు ఒక మాట వచ్చింది నా మనసులోకి. ఆ అమ్మాయి ఓ యాపిల్‌ను కాళ్లతో తీసుకుని, నోటి దగ్గర పెట్టుకుని తింటుంది. అది తన ఆత్మవిశ్వాసం, ధైర్యం, స్థిరచిత్తానికి నిదర్శనం. అందుకే ఓ మాట రాశాను... ‘నాకెన్ని కష్టాలు సమస్యలు ఇబ్బందులు వచ్చినా కన్నీరు పెట్టను, పెట్టకూడదు కూడా. ఎందుకంటే తుడుచుకోవడానికి నాకు చేతులు లేవు కాబట్టి!’ ఆ తర్వాత ఈ పాట ప్రారంభమవుతుంది.
 
ఇలాంటి పాటలు రాయాలంటే పాత్ర తాలూకు మనస్తత్వాన్ని, మానసిక స్థితిని తప్ప కుండా అనుభవించాలి. ఆ స్థానంలోకి వెళ్లి ఆ పాత్ర తాలూకు బాధను, సంఘర్షణను అనుభ వించగలిగితేనే ఈ విధంగా రాయగలం. లేక పోతే పాదాలను పిడికిలిగా పట్టుకుంటాను అన్న మాట ఎలా వస్తుంది! గుండెను గుప్పిటగా మలవడం అన్న వాక్యం ఎలా తడుతుంది!  నిర్మాత సుధారాణిగారికి ఈ పాట వినిపించ గానే ఆవిడ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నేను కూడా దీన్ని నా జీవితంలో నేను రాసిన ఓ గొప్ప పాటగా భావిస్తాను.

అయితే ఇది పాడే సందర్భం మాత్రం రాకూడదని కోరుకుంటాను. ఎందుకంటే వైకల్యం ఎవరికీ ఉండకూడదు. కానీ దురదృష్టం... చాలామంది వికలాంగులు ఉన్నారు. వాళ్లకి స్ఫూర్తి కలిగించే అవకాశం ఎప్పుడు వచ్చినా నేను ఈ పాటే పాడు తుంటాను. వాళ్ల కోసం ఈ పాట రాయగలిగి నందుకు సంతోషపడుతుంటాను!             
 - చంద్రబోస్,గీత రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement