సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ
వెల్మజాల (గుండాల) : జన్మభూమి, కన్నతల్లి రుణం తీర్చుకునేందుకే అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు జాతీయ అవార్డు గ్రహీత, సుద్దాల ఫౌండేషన్ చైర్మన్ సుద్దాల అశోక్‌తేజ అన్నారు. గురువారం మండలంలోని వెల్మజాల గ్రామంలో గుర్రం జానకమ్మ, హన్మంతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మఒడి కార్యక్రమంలో మాతృమూర్తులను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రసవమనే ప్రళయం నుంచి అష్టకష్టాలుపడి మనకు అమ్మ జన్మనిస్తే ఆమెకు కూడు పెట్టని రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు జానకమ్మ, హన్మంతుల పేరిట ఫౌండేషన్ స్థాపించి చంద్రునికో నూలు పోగులాగ తన వంతు సహాయంగా మాతృమూర్తులకు అమ్మ ఒడి, రైతులకు అమ్మ మడి, చిన్నారులకు అమ్మ బడి కార్యక్రమాలు స్థాపించి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జన్మనిచ్చిన ఊరుకు, తల్లిదండ్రులకు తగిన గౌరవం కల్పించినప్పుడే సమాజంలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. సుద్దాల ఫౌండేషన్ ద్వారా శాశ్వతంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని, తనకు రాజకీయంపై ఎలాంటి ఆశలు లేవని, కేవలం సంఘ సేవకే పరిమితమవుతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 30 మంది మాతృమూర్తులను ఘనంగా సన్మానించారు. ఎంపీపీ సంగి వేణుగోపాల్ యాదవ్, వైస్ ఎంపీపీ కాలె మల్లేషం, స్థానిక సర్పంచ్ మేకల రమేష్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరి, సీపీఐ మండల కార్యదర్శి కుసుమని హరిశ్చంద్ర, ప్రజా కవులు రచ్చ భారతి, సునీతారెడ్డి, హరగోపాల్ పాల్గొన్నారు.
రుణం తీర్చుకునేందుకే అమ్మఒడి
Published Thu, Jun 4 2015 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement