ఏమి తొందరొచ్చింది శోభమ్మా... వెళ్లిపోయావు?! | shobha nagi reddy and bhooma reddy sweet memories | Sakshi
Sakshi News home page

ఏమి తొందరొచ్చింది శోభమ్మా... వెళ్లిపోయావు?!

Published Sat, Apr 26 2014 10:50 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

shobha nagi reddy and bhooma reddy sweet memories

మరచిపోలేనంతగా మరదలిని ప్రేమించిన బావ అతను...
 బావను అపురూపంగా ఆరాధించిన మరదలు ఆమె...
 ఇంటికి చిన్నవాళ్లైనా, బాధ్యతల బరువుతో పిన్నవయసులోనే పెద్దరికాన్ని భుజాన వేసుకున్న భార్యాభర్తలు వారు...
 రాజకీయాల్లోనూ ఒకే మాటగా ఎదిగి, పార్టీలకతీతంగా ప్రజల్లో సంపాదించుకున్న ప్రేమమూర్తులు వారు...
 శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులను రెండేళ్ల క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘కలకాలం హాయిగా కలిసున్నార’న్న కమ్మని కథకు కళ్లెదుటి సాక్ష్యం వారే అనిపించారు.
 కానీ, ... కాలానికి కన్ను కుట్టింది.
 ‘ఏ జన్మ లోనూ విడిపోము... మనము’ అని పెళ్లినాట ప్రమాణం చేసుకున్న...  భూమా జంటను విధి విడదీసింది.
 నిన్నటి దాకా జనమే జగమై ఆప్యాయంగా పలకరించిన... ఆ చీరకట్టు చిరునవ్వు మోము ‘శోభమ్మ’ ఇవాళ కనిపించని తీరాలకు తరలిపోయింది.  
 నమ్మశక్యం కాని ఈ నిజాన్ని  సహిస్తూ, భరిస్తూ...
 అందరి వారైన ఆ దంపతులు ఏడాది క్రితం పంచుకున్న తమ అనురాగ  క్షణాలను మరోసారి ప్రచురిస్తున్నాం.
 వారి అనుబంధానికి ఈ కథనాన్ని అంకితమిస్తున్నాం.

 
‘ఏవేవో పనుల కోసం వి.ఐ.పి లెటర్ ఇవ్వమని విజిటర్స్ వస్తూ ఉంటారు. వారు తెలివిగా మాకు తెలియకుండా ఇద్దరి దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటారు. ఆ లెటర్లు ఆఫీసర్ల దగ్గరకు వెళ్లాక, వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వచ్చి ‘ఎవరిది ఓకే చేయమంటారు’ అని ఫోన్ చేస్తే ‘ఆవిడిచ్చిన లెటర్‌కే ఓకే’ చేయండని చెబుతాను’ అని భూమా నాగిరెడ్డి అంటే- ‘ఆయన ఇచ్చిన లెటర్‌కే ఓకే చే యండని నేను చెబుతాను’ అన్నారు శోభా నాగిరెడ్డి. హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో రెండేళ్ళ క్రితం కలిసినప్పుడు ఈ దంపతులు చెప్పిన ఈ ఒక్క మాట చాలు - వారి దాంపత్యజీవితం ఎంత బలమైనదో చెప్పడానికి.
 
నాగిరెడ్డి జన్మస్థలం కొత్తపల్లె, శోభారాణి పుట్టిన ఊరు ఆళ్లగడ్డ. నాగిరెడ్డి మేనత్తే శోభారెడ్డి తల్లి. ఆ విధంగా వీరి బంధానికి బంధుత్వం బలం చేకూర్చింది. నాగిరెడ్డి మాట్లాడుతూ ‘‘చెన్నైలో హోమియోపతి చదివాను. తమ్ముడి కొడుకునని నన్ను మా మేనత్త అచ్చం తల్లిలా ఆప్యాయంగా చూసేవారు. పాఠశాల స్థాయి నుంచీ సెలవులొస్తే చాలు వీరింటికే వెళ్లేవాడిని. అలా చిన్నప్పటి నుంచీ ఒకే ఇంట్లో ఉన్నట్టు పెరిగాం’’ అన్నారు. శోభ అందుకుంటూ, ‘‘మా పెద్దవాళ్లకు కూడా మా పెళ్లి చేయాలనే ఆలోచ న ఉండేది’’ అని నవ్వుతూ వివరించారు.
 
ఫ్యాక్షన్ వెర్సెస్ ప్రేమ

సినిమాల్లో చూపినట్టు ప్రేమికులకు తమ ప్రేమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఓ పెద్ద పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. వీరి ప్రేమకూ ఓ పెద్ద పరీక్ష ఎదురైంది. అది ఫ్యాక్షన్. ‘‘మా రెండు కుటుంబాల బంధం బలపడటానికి నన్ను తన కోడలిని చేసుకోవాలని మామకు ఉండేది. అయితే ఫ్యాక్షన్ కారణంగానే మామ చనిపోవడంతో ఫ్యాక్షన్ అంటే ఏ మాత్రం నచ్చని మా నాన్న నన్ను వీరింటికి కోడలిగా పంపడానికి ఇష్టపడలేదు’’ అని ఆ రోజుల్ని శోభ గుర్తుచేసుకున్నారు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తుం డడంతో భయం పట్టుకున్న ఈ ప్రేమికులు 1986 మే 25న ఇంట్లో వాళ్లకు చెప్పకుండా కొంతమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చారు. ‘‘మా నాన్నగారు ఏమీ అనలేదు కానీ ఏడాది పాటు మాట్లాడలేదు’’ అన్నారు శోభ. శ్రీమతి మాటలకు బ్రేక్ వేస్తూ ‘‘ఇప్పుడు మాత్రం మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు’’ - నవ్వుతూ అన్నారు నాగిరెడ్డి.
 
చిన్నతనంలోనే పెద్ద బాధ్యత
 
ఫ్యాక్షన్ గొడవల్లో అన్నలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తర్వాత కుటుంబాన్నీ, వర్గాన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీద పడటం ఉక్కిరిబిక్కిరి చేసిందని ఉద్వేగంతో చెప్పారు నాగిరెడ్డి. ‘‘నేను, శోభ - ఇద్దరం కుటుంబానికి చిన్నవాళ్లమే. కానీ అనుకోకుండా పెద్దవాళ్లమై బాధ్యతలను మోయాల్సి వచ్చింది. కుటుంబంలో పూటకు యాభైకి తక్కువ కాకుండా కంచాలు లేచేవి. మా అన్నపిల్లలు మరీ పసివాళ్లు. వారినీ శోభే సాకింది. కార్యకర్తలు మా కోసం ప్రాణాలు అడ్డుపెట్టేవారు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా నేను వెనుకాడేవాణ్ణి కాదు. ఇంటి నుంచి బయటకు వెళ్లానంటే మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఈ రోజుకు సేఫ్ అనుకునేవాళ్లం. అలాంటి విపత్కర స్థితిలోనూ శోభ బ్యాలెన్స్‌డ్‌గా ప్రవర్తించేది. బయట చికాకులెన్నో ఇంటికీ తేక తప్పేది కాదు నాకు. అన్నీ తట్టుకుంటూనే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకునేది. శోభను అర్ధాంగిగా చేసుకోవడం వల్లే, బాధ్యతలన్నీ సవ్యంగా పూర్తి చేయగలిగా’’ అంటూ శ్రీమతి తనకు దన్నుగా నిలిచిన తీరును వివరించారు నాగిరెడ్డి. ‘‘ముందు నుంచీ కుటుంబ పరిస్థితులు తెలియడం ఒక కారణమైతే, ఈయన నాకు అన్నింట్లో స్వేచ్ఛ, సపోర్ట్ ఇవ్వ డంతో ఇవన్నీ సాధ్యమయ్యాయి’’ అని శోభ చెప్పారు.
 
రాజకీయాల్లో సగభాగం
 
ఉమ్మడి కుటుంబ బాధ్యతను మోస్తూ రాజకీయాల్లోకి వచ్చిన శోభ, ‘‘రాజకీయాల్లోకి రావడం మొదట నాకు ఇష్టం లేదు. పిల్లలు, వారి చదువులు, పెళ్లిళ్లు... (ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. నాగిరెడ్డి అన్నల పిల్లలూ వీరితోనే కలిసి పెరిగారు) ఇలా బాధ్యతలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు రాజకీయాలు అంటే మాటలా? నేను రాలేనని చెప్పాను’’ అని అప్పటి సంగతులు వివరించారు. దానికి, నాగిరెడ్డి అందుకొని, ‘‘నేను ఎం.పీగా ఎన్నికైన తర్వాత ఎం.ఎల్.ఎ సీటు ఖాళీ అయింది. ‘ఆ స్థానంలో ఎవరిని పెట్టినా, డమ్మీగా నిలబెట్టారని ప్రజలనుకుంటారు. పార్టీ కోసం ఈ నిర్ణయం తప్పదు‘ అనడంతో కాదనలేక శోభ ఒప్పుకుంది. అప్పటికీ చాలామంది ఆమె డమ్మీ క్యాండిడేట్ అని అనుకున్నారు. కానీ బెస్ట్ క్యాండిడేట్ అని తర్వాత అందరికీ అర్థమయ్యేలా చేసింది’’ అన్నారు. ‘‘రాజకీయాల్లో తను ఫెయిర్’’ అని శ్రీమతికి కితాబిచ్చారు నాగిరెడ్డి.
 
ఆ మాటలకు శోభారెడ్డి స్పందిస్తూ - ‘‘రాజకీయాల్లోకి రావడానికి ముందు  ప్రజలతో మాట్లాడాలన్నా, మీటింగ్‌లన్నా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈయన బలవంతం మీద అవన్నీ నేర్చుకోగలిగా. ఇప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా ఒక్కదాన్నే వెళ్లగలుగుతున్నా. నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం పోరాడగలుగుతున్నా. ఏది జరిగినా నా వెనక ఈయన ఉన్నారు అనే ధైర్యమే నాకు భరోసా!’’ అన్నారు. ‘‘ఆయన కన్నా మంచి పేరు తెచ్చుకోవాలి’’ అనుకున్న శోభ తన ‘‘నియోజకవర్గం కోసం మొండిగా చేసే పనులు’’ నాగిరెడ్డికీ నచ్చాయి.
 
‘‘వచ్చిన ప్రతీ సినిమా చూస్తాం. వీలు దొరికితే విహారయాత్రలకు వెళ్లేవాళ్లం’’ అన్న ఈ దంపతులు - కుటుంబం, రాజకీయం... ఇలా ఎన్ని బాధ్యతలున్నా తమ ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో వ్యక్తిగతంగా మిస్ అయ్యామని ఎప్పుడూ అనిపించలేదన్నారు. కానీ, ఇవాళ శోభమ్మ లేని లోటు నాగిరెడ్డికీ, ఆయన కుటుంబానికీ ఉంటుంది. ‘‘రాజకీయాల్లో శోభ బిజీ అవడంతో ఆమె చేతి వంటను మిస్ అవుతున్నా’’ అన్న నాగిరెడ్డికి ఇవాళ ఆమె ప్రేమస్మృతులే కడుపు నింపాలి. జనానికి మంచి చేయాలని తపించిన శోభ లేకపోవడం  ఆమె అభిమానించే - ఆమెను అభిమానించే సామాన్య ప్రజలందరికీ  లోటే! కన్నవారికీ, కట్టుకున్నవాడికీ, కోట్లాది ప్రజలకూ తీరని దుఃఖం మిగిల్చి...
 
ఏమి తొందరొచ్చిందమ్మా వెళ్లిపోయావు శోభమ్మా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement