శోభమ్మ చివరి కోరికను నెరవేరుద్దాం
జగన్ సీఎం అయితేనే శోభమ్మ ఆత్మకు శాంతి
- ఆళ్లగడ్డలో సంతాప సభ
- ఉద్వేగంతో ప్రసంగించిన భూమా నాగిరెడ్డి
ఆళ్లగడ్డ న్యూస్‌లైన్: జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి శోభమ్మ చివరి కోరికను నెరవేరుద్దామని నంద్యాల నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శోభమ్మ ఘాట్‌లో సోమవారం శోభానాగిరెడ్డి సంతాపసభ వేలాది మంది కార్యకర్తల మధ్య జరిగింది. శోభా నాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి గంట ముందు ప్రకటించడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
ఆమె చిత్రపటానికి నివాళ్లు అర్పించి ఆత్మశాంతి కోసం అందరూ ఒక్క నిమిషం మౌనం పాటించారు. అనంతరం సభలో భూమా ఉద్వేగంతో మాట్లాడారు. ‘శోభానాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లదని రెండు రోజుల క్రితం తెలిసినప్పుడు నాతో పాటు అభిమానులు ఆందోళన చెందారు. ఆళ్లగడ్డను టీడీపీ ఖాతాలోకి పోనియమని వైస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పాను. అవసరమైతే ఇండిపెండెంట్‌కు మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామనే ధీమా ఉండేది.
శోభానాగిరెడ్డి మొండి మనిషి, చనిపోయిన తరువాత కూడా బరిలో నిలిచి తనకు పడే ఓట్లు చెల్లించుకునేలా చేసుకుంది. ఆమెకు ఓటు వేస్తే చెల్లదని చెప్పినపుడు బాధపడిన కార్యకర్తలు ఈసీ ప్రకటనతో ప్రస్తుతం ఆనందపడుతున్నారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని అరుదైన గుర్తింపును శోభానాగిరెడ్డికి దక్కబోతుంది. చనిపోయిన తరువాత లక్ష ఓట్ల మెజార్టీతో వచ్చేలా గిన్నిస్ రికార్డు సాధిం చడానికి కార్యకర్తలు కృషి చేయాలి. చిన్న వయస్సులో తండ్రిని పొగొట్టుకున్నాను.
పెరుగుతున్న వయస్సులో ముగ్గురు అన్నలు దూరమైనారు.. కోలుకుంటున్న సమయంలో శోభమ్మను కోల్పోయాను. శోభానాగిరెడ్డి మరణంతో బరువెక్కిన మనస్సును వేలాది కుటుంబాల కోసం నిబ్బరం చేసుకుంటున్నాను. ధైర్యంగా ప్రజల కోసం కుటుంబం మొత్తం వస్తున్నాం.అందరం కలుద్దాం... జగనన్నను సీఎం చేసి.. శోభమ్మ చివరి కోరికను నెరువెరుద్దాం’ అంటూ ప్రసంగించారు.
ఘాట్‌ను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతా:
శోభానాగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని శోభమ్మ ఘాట్‌గా భూమా నాగిరెడ్డి నామకరణం చేశారు. అక్కడ ఆమె జ్ఞాపకాలను భద్రపరిచి ఇల్లు కూడా నిర్మించుకుంటానని తెలిపారు. శోభమ్మ ఘాట్‌ను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాన్నారు. సమావేశంలో మిల్క్ డైయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, నాయకులు అన్సర్, రఘనాథరెడ్డి, నిజాం, శ్రీకాంతరెడ్డి, రాముయాదవ్, బీవీ రామిరెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.