ghat
-
Maha Kumbh-2025: ఒక్కో ఘాట్‌కు ఒక్కో ప్రత్యేకత.. విశేష ఫలితం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా మొదయ్యింది. లక్షలాది మంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఉదయం 7.30 గంటల సమయానికల్లా 35 లక్షల మంది సంగమ తీరంలో స్నానాలు చేశారు. మహా కుంభమేళాలో రాజ స్నానం నిర్వహించే రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, అదృశ్య సరస్వతి మూడు నదుల సంగమం ఉంది. సంగమ పవిత్ర ఘాట్లకు ఉన్న మతపరమైన, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను చారిత్రక గ్రంథాలలో వర్ణించారు. కుంభమేళాకు వెళ్లేవారు ఈ ఘాట్ల గురించి తెలుసుకోవడం ఉత్తమం.సంగమ ఘాట్ప్రయాగ్రాజ్లోని సంగమ ఘాట్ ఇక్కడి ప్రధాన ఘాట్లలో ఒకటి. మహా కుంభమేళా సమయంలో ఈ ఘాట్ కీలకంగా మారుతుంది. ఈ ఘాట్ వద్ద మూడు నదుల సంగమం జరుగుతుంది. మహా కుంభ్ సమయంలో ఈ ఘాట్‌లో స్నానం చేసిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు.కేదార్ ఘాట్కేదార్ ఘాట్ శివుని ఆరాధనకు ప్రత్యేకించిన ప్రదేశం. ఇక్కడకు వచ్చే భక్తులు పవిత్ర స్నానం చేసిన తరువాత మహాశివుడిని పూజిస్తారు.హండీ ఫోడ్ ఘాట్హండీ ఫోడ్ ఘాట్ ప్రయాగ్‌రాజ్‌లోని పురాతన ఘాట్లలో ఒకటి. ఈ ఘాట్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పరంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఘాట్‌కు వచ్చే భక్తులు ప్రశాంతమైన అలలతో కూడిన అందమైన నదీ దృశ్యాన్ని చూడవచ్చు.దశాశ్వమేధ ఘాట్దశాశ్వమేధ ఘాట్ ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర ఘాట్లలో ఒకటి. ఈ ఘాట్ గురించిన ప్రస్తావన పౌరాణిక గాథలలో కూడా కనిపిస్తుంది. పురాణాలపరంగా ఈ ఘాట్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఘాట్ వద్ద బ్రహ్మ దేవుడు స్వయంగా 10 అశ్వమేధ యాగాలు చేశాడని చెబుతారు. మహా కుంభమేళా సమయంలో ఈ ఘాట్ దగ్గర గంగా హారతితో పాటు పూజలు నిర్వహిస్తారు.ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: అండర్ వాటర్ డ్రోన్లు.. ఏఐ కెమెరాలు.. ఫ్లోటింగ్ పోలీస్ పోస్టులతో నిఘా -
ఆసియాలో అతిపెద్ద ఛత్ ఘాట్ ఇదే..
పూర్వాంచల్: ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్లతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో ఛత్ పండుగ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోగల పూర్వాంచల్‌లో ఉన్న ఛత్ ఘాట్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. అర్పా నది ఒడ్డున నిర్మించిన ఈ ఛత్ ఘాట్ ఆసియాలోనే అతిపెద్ద ఛత్ ఘాట్‌గా పేరొందింది. ఈ ఘాట్ మొత్తం పొడవు సుమారు ఒక కిలోమీటర్లు ఉంటుంది. ఛత్ పూజలు నిర్వహించేందుకు ఈ ఘాట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.ఈ ఏడాది 50 వేల మందికి పైగా ఛత్వర్తీలు ఈ ఛత్ ఘాట్‌లో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం ఉంది. వీరితో పాటు లక్షల సంఖ్యలో వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి తరలిరానున్నారు. ఛత్ పండుగ సందర్భంగా అర్పా నది ఒడ్డును అందంగా అలంకరించారు. భద్రత దృష్ట్యా పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఈ ఘాట్‌ను జిల్లా యంత్రాంగం, భోజ్‌పురి సొసైటీ కొన్నేళ్ల క్రితమే నిర్మించింది. ప్రతి ఏటా ఛత్ పూజ సందర్భంగా ఇక్కడకు వేలాది మంది భక్తులు తరలివచ్చి, సూర్య భగవానుని ఆరాధిస్తారు. గత 24 సంవత్సరాలుగా భోజ్‌పురి కమ్యూనిటీ ప్రజలు ఈ ఘాట్‌ను ప్రార్థనా స్థలంగా ఉపయోగిస్తున్నారు. ఛత్ పూజలు జరిగే సమయంలో భక్తులు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పిస్తారు. భక్తులు నదిలో నిలబడి పూజలు చేస్తారు. ఇక్కడ జరిగే ఛత్ పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.ఇది కూడా చదవండి: పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు -
యమునా హారతికి పోటెత్తిన జనం
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే గంగా హారతి మాదిరిగా ఢిల్లీలోని వాసుదేవ్ ఘాట్‌పై యుమునా హారతి ప్రారంభమయ్యింది. ఢిల్లీ ప్రజలకు యమునా నదిపై ఉన్న ఆరాధనా భావాన్ని ఇది మరింత పెంపొందించనుంది. మార్చి 20న సాయంత్రం వేళ వాసుదేవ్ ఘాట్‌పై తొలిసారిగా యమునా హారతి కార్యక్రమం జరిగింది. దీనిని తిలకించేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ప్రస్తుతానికి యమునా నది ఒడ్డున వారానికి రెండు రోజులు అంటే మంగళవారం, ఆదివారం సాయంత్రం వేళల్లో హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. తరువాత క్రమంగా మిగిలిన రోజుల్లోనూ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యమునా నది ఒడ్డున నిర్మించిన వాసుదేవ్ ఘాట్ ఇప్పుడు కాశీలోని ఘాట్లను తలపిస్తోంది. ప్రజలు కూడా ఈ ఘాట్‌ను వీక్షించేందుకు తరలివస్తున్నారు. యమునా నది ఒడ్డున సంప్రదాయబద్ధంగా నిర్వహించిన తొలి హారతి కారక్రమం విజయవంతంగా జరిగింది. మరోవైపు ఈ వాసుదేవ్ ఘాట్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి యమునా హారతి వీక్షించేందుకు వచ్చే భక్తుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. -
Namo Ghat: కాశీ తమిళ సంగమం ప్రారంభం
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని నమో ఘాట్‌లో కాశీ తమిళ సంగమం రెండో ఎడిషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ నెల 31వ తేదీ వరకూ జరిగే ఈ వేడుకలో తమిళనాడు, పుదుచ్చేరి నుంచి 1,400 మంది ప్రతినిధులు పాల్గొంటారు. గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మది, సింధూ, కావేరి పేరిట పలు బృందాలుగా కాశీకి తరలిరానున్నారు. వారణాసితోపాటు ప్రయాగ్‌రాజ్, అయోధ్యను వారు సందర్శిస్తారు. తమిళనాడు, కాశీ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక సంగమాన్ని మరింత బలోపేతం చేయడమే కాశీ తమిళ సంగమం ప్రధాన లక్ష్యం. పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖలు అందులో పాలుపంచుకుంటున్నాయి. వారణాసి–కన్యాకుమారి మధ్య నడిచే కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఆయన సోమవారం వారణాసిలో రూ.19,155 కోట్లకు పైగా విలువైన 37 అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో రోడ్లు, వంతెనలు, ఆరోగ్యం, విద్య, పోలీసు సంక్షేమం, స్మార్ట్ సిటీ, పట్టణాభివృద్ధి, రైల్వే, ఎయిర్‌పోర్టు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. అంబులెన్స్‌కు దారిచ్చిన మోదీ కాన్వాయ్ వారణాసిలో ఆదివారం ప్రధాని మోదీ వాహనశ్రేణి ఓ అంబులెన్స్‌కు దారి ఇచి్చంది. నాదేసర్ ప్రాంతంలోని కట్టింగ్ మెమోరియల్ స్కూల్ వైపు మోదీ కాన్వాయ్ దూసుకెళ్తుండగా దాని వెనుకే హరన్ మోగిస్తూ అంబులెన్స్ వచి్చంది. దారి కోసం ఎదురు చూస్తోంది. అది గమనించిన మోదీ కాన్వాయ్‌లోని వాహనాలు వేగం తగ్గించుకొని కాస్త పక్కకు వెళ్లాయి. వాటిని దాటుకొని అంబులెన్స్ ముందుకెళ్లిపోయింది. -
‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం(ఈరోజు) భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం దేశప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా భారత్ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో భారత జట్టు అభిమానులు ముక్తేశ్వర్ ధామ్‌లోని గంగా ఘాట్ వద్ద భారీగా పూజలు నిర్వహించి ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’ అని వేడుకున్నారు. గంగామాత ఆశీర్వాదాలు భారత టీమ్‌కు ఉంటాయని వారు అంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ ఒకే స్వరంతో ‘ఆల్ ది బెస్ట్ ఇండియా’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి సారధ్యం వహించిన జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు చందేశ్వర్ ప్రసాద్ సిన్హా అలియాస్ బోడి సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దేశం విజయం సాధించేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, మన టీమ్ విజయం కోసం ప్రార్థనలు చేశామన్నారు. క్రికెట్ అభిమాని రంజిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ఈసారి ప్రపంచకప్ క్రికెట్లో భారత జట్టు తప్పకుండా మన జెండాను ఎగురవేస్తుందని’ అన్నారు. ప్రపంచకప్ 2023లో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఇరు జట్లకు ఆదివారం చివరి మ్యాచ్ జరగనుంది. ఇది కూడా చదవండి: మ్యాచ్ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో.. -
ఎల్బీ నగర్ లో ‘ముక్తిఘాట్’.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు
-
నల్లగా మారిన గంగా జలాలు.. దర్యాప్తుకు ఆదేశం
లక్నో: పవిత్ర గంగానది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి వద్ద నదీ జలాలు నల్లగా మారిపోయాయి. మురుగునీరు నదిలోకి చేరడం, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల జలాలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.గత కొద్ది రోజుల నుంచి నదీ జలాలు నల్లగా కనిపిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. కాశీలోని మణికర్ణిక ఘాట్, గంగా మహాల్ ఘాట్, మీర్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్లలో నదీ జలాలు.. స్నానానికి అనుకూలంగా లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వాటర్ కార్పొరేషన్ స్పందించింది. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. మురుగు నీటి పంపులు దెబ్బ తిని...విశ్వనాథ్ ధామ్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరిగిన సమయంలో.. మురుగునీటి పంపులు దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా మురుగునీరు గంగానదిలో కలిసిపోతున్నాయని చెప్పారు. పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవుతోందని పేర్కొన్నారు. చదవండి: కేజ్రీవాల్‌ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ.. మురికిగా గంగ నీరు అయితే, కాలుష్య నియంత్రణ విభాగ అధికారి ఎస్కే రాజన్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. మురుగునీటి పంపునకు, నది కాలుష్యానికి సంబంధం లేదని చెప్పారు. సాంకేతిక కమిటీ నీటి నమూనాలు సేకరించి పరిశీలన చేపట్టిందని వెల్లడించారు. 'ఏవైనా సాంకేతిక కారణాల వల్ల నీరు నల్లగా మారిపోయి ఉండొచ్చు. పరిశీలన జరిపిన తర్వాత ఏం జరిగిందనేది తెలుస్తుంది' అని అన్నారు.గంగా నదిలో నీరు నల్లగా మారిపోవడం వల్ల అక్కడికి వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. నదీస్నానాలు చేయడానికి నీరు అనుకూలంగా లేవని స్థానిక పూజారి చెప్పారు. చదవండి: ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం.. జింబాబ్వే మహిళ వద్ద రూ. 60 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ -
వావిలాల.. ఘాట్ వెలవెల
‘ఆంధ్రాగాంధీ’గా పిలవబడే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాల కృష్ణయ్యను పాలకులు విస్మరించారు. ఆయన పరమపదించి 15 ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన దాఖలాలు లేవు. ఉమ్మడి మద్రాసులో నాలుగుసార్లు సత్తెనపల్లి నుంచి శాసనసభలో ప్రాముఖ్యత వహించారు.1974–77 కాలంలో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. పద్మభూషణ్, కళాప్రపూర్ణ పదవులు అలంకరించినప్పటికీ ఆయన పట్ల నేటికి పాలకులకు కనీసం గౌరవం ఇవ్వకపోవటం పట్ల మేధావులు, అభిమానులు,ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లి/ముప్పాళ్ల :నిరంకుశ పాలనపై తిరుగుబాటుదేశ స్వాతంత్య్రం కోసం తెల్లదొరల అన్యాయాలు, అకృత్యాలపై పోరాడిన వారిలో స్వాతంత్య్ర సమరయోధులు, సత్తెనపల్లి మాజీ శాసన సభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య ప్రముఖులు. చూడటానికి చేతికి సంచి తగిలించుకొని సాదా సీదాగా కనిపించే ఆయన సాయుధ పోరాటంలో భాగంగా విప్లవ బాట పట్టారు. 1906 సెప్టెంబరు 17న సత్తెనపల్లిలో ఆయన జన్మించారు. ఉన్నత విద్య అభ్యసించనప్పటికీ జాతిని చైతన్య పరిచేందుకు ప్రత్యేక కథనాలతో ప్రజల్లో దేశ భక్తిని నూరిపోశారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలుకొని మహాత్మ గాంధీ పిలుపునిచ్చిన అన్ని ఉద్యమాల్లో పాల్గొనటమేకాక ఉద్యమాలను ముందుకు నడిపారు. పల్నాడు అపరగాంధీగా పేరుగడించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ప్రజాసేవకు అంకితం... స్వాతంత్య్రం వచ్చాక ప్రజాసేవకు వావిలాల గోపాలకృష్ణయ్య మరింత చేరువయ్యారు. 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం ఏర్పడడంతో ఇక్కడ పోటీచేసి తొలి శాసనసభ్యుడుగా ప్రజలకు సేవలు అందించారు. 1952, 1955, 1962, 1972 ఎనికల్లో వరుసగా నాలుగు పర్యాయాలు శాసన సభ్యుడిగా విజయం సాధించి 19 ఏళ్లపాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు. ఆయన చేపట్టిన కృషి ఫలితం వల్లే శాతవాహన నూలు మిల్లు, ఫణిదం చేనేత సహకార సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటయ్యాయి. మద్యపాన నిషేధ ఉద్యమ సంస్థ బాధ్యుడిగా, గ్రంథాలయ ఉద్యమ రథసారధిగా, దళిత, గిరిజనోద్ధరణ ఉద్యమ నాయకుడిగా ఆయన ముందున్నారు. పద్మ భూషణ్‌తో పాటు ఎన్నో పురస్కారాలు, సత్కారాలను అందుకున్నారు. ప్రజల కోసం, ప్రజలతో జీవించి 2003 ఏప్రిల్ 29న అనారోగ్యంతో వావిలాల గోపాలకృష్ణయ్య మృతి చెందారు. ఆయన శత జయంతిని పురస్కరించుకొని 2006 సెప్టెంబర్ 14న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్తెనపల్లి తాలుకా సెంటర్లో వావిలాల గోపాలకృష్ణయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. గాంధీ చౌక్ నుంచి అచ్చంపేటకు వెళ్లే రోడ్డులో కాలనీకి వావిలాల వారి వీధిగా పేరు పెట్టారు. వెలవెలబోతున్న ఘాట్.. 2003లో ఆయన అంత్యక్రియలకు హాజరైన అప్పటి,ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు ఎకరాల్లో వావిలాలఘాట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నేటికీ అమలుకు నోచుకోలేదు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఎన్నికైన ప్రస్తుత స్పీకర్ డా.కోడెలశివప్రసాదరావు రెండేళ్ల క్రితం వావిలాల స్మృతివనానికి రూ.కోటిన్నర నిధులు మంజూరు చేస్తూ వేసిన శిలాఫలకం అలంకారంగానే మారింది. కేవలం ప్రహరీతోనే సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం వావిలాల ఘాట్ పై ఉన్న టైల్స్ కూడా ఊడిపోయాయి. అక్కడ మద్యం సీసాలు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వావిలాల జయంతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నేతృత్వంలో శనివారం ఘాట్‌ను పరిశీలించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. సోమవారం ఉదయం 9 గంటలకు వావిలాల ఘాట్‌లో జయంతి వేడుకలు నిర్వహించేలా ఘాట్‌లో పనులు చేస్తున్నారు. జయంతి వేడుకలకు వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కోనరఘుపతి, లావురత్తయ్య,ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. మద్యపాన వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ని మద్యపాన వ్యతిరేక దినంగా ప్రకటించాలి. 2015 లో ప్రభుత్వం వావిలాల జయంతి,వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి అర్జీ అందించినా స్పందన లేదు. మండలి బుద్ధప్రసాద్ చొరవతో గతేడాది తూతుమంత్రంగానే నిర్వహించారే తప్ప ప్రభుత్వం అధికారికంగా చేపట్టింది లేదు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కూడా నేటికీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమీ లేవు. ప్రభుత్వం పరంగా నిర్వహించటానికి అడ్డంకులు ఉంటే కుటుంబ సభ్యులమే ఆ బాధ్యతను నిర్వహించుకుంటాం.–భువనగిరి వెంకటరమణ(మేనల్లుడు),షోడేకర్ మన్నవ(మనుమడు ) -
శివయ్యా.. ఏదీ గంగమ్మ..!
వేములవాడ: ఎములాడ రాజన్నను దర్శించుకునే ముందుకు భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం, సుందరీకరణలో భాగంగా గుడిచెరువును మట్టితో నింపి చదును చేయడంతో పక్కనే ఉన్న రాజన్న ధర్మగుండంలో నీళ్లు అడుగంటాయి. ఉన్నకొద్దిపాటి కలుషిత నీటిలో కొందరు స్నానానాలు కానిచ్చేస్తుండగా, చాలామంది వెనుదిరుగుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ఆలయ అధికారులు చేష్టలుడిగి చూడడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. శివునికే నీటి కటకట.. గంగను ఒదిగిన గంగాధరుడు శివుడు.. అలాంటి శివయ్యకే నీటికటకట ఎదురైంది. తమ ఇలవేల్పు ఎములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకుని కోర్కెలు తీర్చుకోవాలని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ధర్మగుం డంలో స్నానాలు చేయడం గగనంగా మారింది. అడుగంటిపోయిన నీటితో అవస్థలు పడుతున్నారు. లోతైన ధర్మగుండంలోకి మెట్లపైనుంచి దిగి ఉన్నకొద్దిపాటి మురుగునీటిలోనే స్నానా లు చేసి పైకి రావడం చుక్కలను చూపిస్తోంది. గుండం స్నానాలు శ్రేష్ఠం.. ధర్మగుండంలో స్నానాలు చేయడాన్ని భక్తులు శ్రేష్ఠంగా భావిస్తారు. చలిని సైతం లెక్కచేయ తొలుత పుష్కరిణిలో స్నానాలు చేస్తారు. ఆ త ర్వాతే క్యూలైన్లలోకి వెళ్లి కోడెమొక్కు, ఇతర మొ క్కులు చెల్లించుకుంటారు. ధర్మగుండంలో ఇ ప్పుడు నీళ్లులేక స్నానాలు ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ధర్మగుండంలోకి దిగి మెట్ల ద్వారా పైకి ఎక్కేందుకు అవస్థలు పడుతున్నారు. కొందరు ధర్మగుండంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ కింద స్నానాలు చేస్తున్నారు. ముందుచూపు లేదు.. రాజన్నను దర్శించుకునేందుకు రెండు నెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కానీ, ధర్మగుండంలోని నీటికొరతను అధిగమించాలనే ఆలోచన రాజన్న ఆలయ అధికారులకు రాలేదు. ఓవైపు ఎల్ఎండీ, మధ్యలో మిడ్‌మానేరులో నీరున్నా ఇక్కడకు తరలించేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయడంలేదు. అధికారుల ముందుచూపు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి. తానం ఎట్ల జేసుడు? రాజన్నకు మొక్కు చెల్లించుకునేందుకు వచ్చినం. గుండంలో నీళ్లులేవు. తానం ఎట్ల జేసుడో అర్థమైతలేదు. ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా గుండంల నీళ్లు ఉంచకపోతే ఎట్లా..? అధికారులు గింత నిర్లక్ష్యం జేయొద్దు. – రాజేశ్వరి, భక్తురాలు, వరంగల్ నీళ్లు నింపుతాం మహాశివరాత్రి జాతర వరకు ధర్మగుండంలో నీళ్లు నింపుతాం. ఇందుకోసం ఎల్ఎండీ పైప్‌లైన్ వినియోగిస్తాం. మరికొన్ని బోర్లు కూడా ఏర్పాటు చేస్తాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాం. – దూస రాజేశ్వర్,రాజన్న ఆలయ ఈవో -
ఘాట్ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి
- ఐదుకు చేరిన మృతుల సంఖ్య - మృతుల్లో చిన్నారి, వృద్ధురాలు పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చింతల మలుపు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. మృతుల్లో పెద్దదోర్నాల వైద్యశాలలో చికిత్స పొందుతున్న నీలమ్మ (50), కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిన్నారి స్వరూప (6) ఉన్నారు. మండల పరిధిలో శ్రీశైలం ఘాట్ రోడ్లో చింతల సమీపంలో జరిగిన ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని దొంగర్‌గావ్‌కు చెందిన విజయ్‌కుమార్ (40), రాజేశ్వరి శ్రీదేవి (45), నాగం (45)లు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. నలుగురి మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. కర్ణాటక నుంచి పెద్దదోర్నాలకు చేరుకున్న బంధువులకు మృతదేహాలు అప్పగించారు. కర్నూలులో మృతి చెందిన చిన్నారి స్వరూప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అక్కడికి వెళ్లిన బంధువులకు అప్పగించారు. పెద్దదోర్నాల నుంచి నాలుగు మృతదేహాలతో ప్రత్యేక వాహనంలో కర్నూలు బయల్దేరిన బంధువులు అక్కడ స్వరూప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఐదు మృతదేహాలనూ స్వగ్రామానికి తరలించారు. -
రూ.10కోట్లతో పీవీ రావు ఘాట్ నిర్మాణం
ముమ్మిడివరం: మాలమహనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పీవీ రావు ఘాట్ నిర్మాణం కోసం రూ.10 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అనాతవరంలో స్వర్గీయ పీవీరావు ఘాట్ స్థలం ఆవరణలో హైదరాబాద్ డీఎస్పీ మోకా సత్తిబాబు అధ్యక్షతన గురువారంలజరిగిన సమావేశంలో ఘాట్ నిర్మాణం, తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్య అతిథి, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఘాట్ నిర్మాణానికి పార్లమెంటు నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులనుంచి రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. అమలాపురం సమీపంలో నిర్మించే రైల్వేస్టేష¯Œ కు పీవీరావు పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెడితే బిల్లుకు వ్యతిరేకంగా 154 మంది సభ్యులు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నరన్నారు. ఘాట్ నిర్మాణానికి మరో ముఖ్య అతిథి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుఎస్డీఎఫ్ నిధులు రూ.25 లక్షలు, అమలాపురం ఎమ్మెల్యే ఎ. అనందరావు రూ.25లక్షలు, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూ. లక్ష విరాళంగా ప్రకటించారు. పోతుల నాగరాజు, పెయ్యల పరశురాముడు, వడ్డి నాగేశ్వరరావు, ఎంవీకే భీమారావు, గంగుమళ్ళ అన్నపూర్ణ, దంగేటి వరలక్ష్మి, పోతుల సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి పరవళ్లు
ఏటూరునాగారం :ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మండలంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సోమవారం పుష్కరఘాట్‌కు తాకుతూ వరదనీరు ప్రవహించింది. నెలరోజులుగా అంతంతమాత్రంగానే ఉన్న గోదావరి ఇప్పుడు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లా పూసుర, వరంగల్ జిల్లా ముల్లకట్ట రేవులను ఆనుకొని గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జాతీయ రహదారిపై పర్యాటకులు ఆహ్లాదంగా గడిపారు. రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం 3.30 అడుగులకు చేరింది. -
పుష్కరాలకు భారీ బందోబస్తు
17,500 మంది పోలీసులు 19 జోన్లు, 74 సెక్టార్లుగా విభజన ఏ ఫ్లస్ ఘాట్‌ల్లో ఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణ సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాలకు విజయవాడ కమిషనరేట్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర బలగాలను నగరంలో బందోబస్తు కోసం తరలించారు. పుష్కర విధులకు ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు 10 మందిని, 14 మంది ఎస్పీ స్థాయి అధికారులను, 19 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు. విజయవాడలోని కీలక ఘాట్లు అన్ని ఐజీల పర్యవేక్షణలోనే ఉన్నాయి. పవిత్ర సంగమం ఘాట్‌లో ఐజీ కె.సత్యనారాయణ, ఎస్పీ స్థాయి అధికారులు ముగ్గురు బందోబస్తు పర్యవేక్షించనున్నారు. మూడు షిప్టులు కలిపి ఇక్కడ 1500 మందిని పోలీసులను ఏర్పాటు చేశారు. కీలక ఘాట్ కావటంతో మూడు డ్రోన్లు, 29 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలోని పున్నమి, భవానీ, దుర్గా ఘాట్లను ఐజీసూర్యప్రకాష్ పర్యవేక్షించనున్నారు. మూడు షిప్టులు కలిపి 1700 మంది పోలీసులు బందోబస్తులో ఉండగా 30 సీసీ కెమెరాలు, నాలుగు డ్రోనుల ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 1.1 కిలోమీటర్ విస్తీర్ణం ఉన్న పద్మావతి ఘాట్‌ను ఐజీ బత్తిన శ్రీనివాస్ పర్యవేక్షిస్తారు. ఎస్పీ స్థాయి అధికారి, ఇద్దరు ఏఎస్పీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారు. మూడు షిప్టుల్లో కలిపి 800 మంది పోలీసులు విధుల్లో న్నారు. ఇక్కడ కూడా 30 సీసీ కెÐమెరాలు 2 డ్రోన్లు వినియోగిస్తున్నారు. పోలీసులతో పాటు స్వచ్ఛందంగా పని చేసేందుకు సుమారు 4 వేల మంది పుష్కర సేవక్‌లను సేవలకు వినియోగిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా ఐడీ కార్డులు క్యాప్, జాకెట్ ఇచ్చి డ్రస్కోడ్ ఏర్పాటు చేశారు. పుష్కరాలకు తొలి రోజున 14 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా. రద్దీని నియంత్రించటానికి అన్ని చర్యలు తీసుకున్నారు. 19 జోన్లు... 74 సెక్టార్లు.. కమిషనరేట్ పరిధిలో మొత్తం 43 ఘాట్లు ఉన్నాయి. వీటిలో 22 ఏ ఫ్లస్ ఘాట్లు ఉన్నాయి. అలాగే ఏ ఘాట్లు–3, సీ ఘాట్లు–17 ఉన్నాయి. విజయవాడ నగరాన్ని 19 జోన్లుగా విభజించారు. వీటిలో 74 సెక్టార్లుగా విభజించి 17,500 మంది పోలీసులు బందోబస్తు విధుల్లోకి వచ్చారు. వీరిలో 260 మంది ఇన్స్పెక్టర్లు, 850 మంది ఎస్ఐలు, 2,700 మంది ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 7,500 మంది కానిస్టేబుల్స్, 650 మహిళా కానిస్టేబుల్స్, 4,000 హోంగార్డులు, 57 సాయుధ బలగాలు విధుల్లో ఉంటారు. -
ఘాట్ల వద్దే రైల్వే టికెట్లు
విజయవాడ : పుష్కరస్నానం ఆచరించిన అనంతరం యాత్రికులకు ఘాట్ల వద్దనే సాధారణ రైల్వే టిక్కెట్లు జారీ చేయనున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. క్రిస్ అప్రూవ్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో ఘాట్ల వద్దే రైల్వే టికెట్ల జారీకిS 40 యూనిట్లతో విజన్‌టెక్ సంస్థ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. తన ఛాంబరులో బుధవారం కంపెనీ అధికారులతో టికెట్ల జారీపై కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘాట్లవద్దే టికెట్లు ఈయడం ద్వారా యాత్రికులు అనుకన్న సమయంలో తిరుగు ప్రయాణాన్ని చేయగలుగుతారన్నారు. సంబంధిత టికెట్లు జారీ చేసే బృందం వివిధ రూట్లలో అందుబాటులో ఉన్న రైళ్ళ వివరాలను అందించాలన్నారు. ఈసందర్భంగా విజన్‌టెక్ ప్రోగ్రామ్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ రైల్వే శాఖ అధికారికంగా జారీ చేసే రైల్వే టికెట్‌పై ప్రయాణ ప్రాంతం వివరాలను ముద్రించి అందించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్చందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా టెకెట్ల జారీకి ముందుకు వచ్చామన్నారు. -
బాధ్యులెవరో తేల్చండి
– కొండచరియల ప్రమాదంపై ఈవోకు ఎస్పీ లేఖ సాక్షి ప్రతినిధి, కర్నూలు: పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి పడిన ఘటనపై బాధ్యులు ఎవరో తేలనున్నారా? వారిపై చర్యలు తీసుకోనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే మిగులుతోంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనపై బాధ్యులెవరో తేల్చి ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్వయంగా ఎస్పీ ఆకె రవికష్ణ..శ్రీశైలం ఈవో భరత్‌గుప్తకు లేఖ రాసినట్టు తెలిసింది. వాస్తవానికి ఘాట్‌కు రోడ్డు మార్గం వేసే సమయంలోనే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని స్వయంగా ఎస్పీ రవికృష్ణ...మే నెలలోనే లేఖ రాశారు. అయితే.. సంబంధిత అధికారులు దీనిపై కనీస చర్యలు తీసుకోలేదు. పది రోజుల క్రితం రాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ విజయవాడ నుంచి నేరుగా శ్రీశైలం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇదే నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు చెప్పినప్పటికీ పట్టించుకోని నేపథ్యంలో ఘటన జరిగేందుకు బాధ్యులు ఎవరనే విషయంలో విచారణ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ..ఈవోకు లేఖ రాసినట్టు తెలిసింది. ఈ పరిస్థితులల్లో విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో ఎవరిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారనే విషయంలో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. సంబంధిత కాంట్రాక్టు సంస్థతో పాటు నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తప్పవని తెలుస్తోంది. అగ్గిరాజేసిన వ్యవహారం... వాస్తవానికి కొండచరియలు విరిగిపడిన వ్యవహారం.. జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య అగ్గిరాజేసింది. తాను సూచనలు చేసినప్పటికీ ముందస్తుగా మేల్కోలేదని ఎస్పీ వాపోయారు. ఇదే విషయంపై పుష్కరాల సమీక్ష సమావేశాల్లో ఐదారుసార్లు లేవనెత్తినప్పటికీ పట్టించుకోలేదని ఎస్పీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన ఉన్నతాధికారుల దష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లోనే డీఐజీ కూడా ఎస్పీ సూచన పాటించి ఉంటే ఈ ఘటన జరిగిఉండేది కాదని పేర్కొన్నారు. అయితే, దీనిపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారనే విధంగా మరో ఉన్నతాధికారి బాహాటంగానే అధికారుల సమావేశంలో విరుచుపడినంత పనిచేశారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఘటనపై విచారణ చేసి బాధ్యులని తేలిన వారిపై ఎస్పీ లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతోందననే చర్చ సాగుతోంది. -
ఘాట్ల సమీపంలో లిక్కర్ బంద్
సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాల సమయంలో మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. పుష్కర ఘాట్లకు 500 మీటర్ల దూరంలోని మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించింది. మద్యం విక్రయాలను కూడా కొంతమేర తగ్గించి పుష్కర భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మద్యం షాపుల జాబితాలు సిద్ధం.. జిల్లాలోని 71 పుష్కర ఘాట్లకు 500 మీటర్లు, అంతకన్నా తక్కువ దూరంలో ఉన్న వైన్ షాపుల జాబితా సిద్ధం చేశారు. విజయవాడ బస్టాండ్ ఎదుట నిర్మించిన పద్మావతి ఘాట్ సమీపంలో మూడు బార్లు, రెండు వైన్ షాపులు ఉన్నాయి. వీటిని పుష్కరాలు జరిగే 12 రోజులపాటు మూసివేస్తారు. పున్నమీఘాట్కు దూరంగా భవానీపురంలో ఉన్న కొన్ని వైన్‌షాపులపై ఆంక్షలు విధిస్తారు. జిల్లాలోని ఉయ్యూరు మండలం బుద్దిరాజుపాలెంలో ఘాట్‌కు సమీపంలో ఉన్న ఒక షాపుతోపాటు అవనిగడ్డలో రెండు షాపులను మూసివేస్తారు. రివర్ బెల్ట్‌లో కూంబింగ్ గత కృష్ణా పుష్కరాలు(2004) సమయంలో మద్యానికి సంబంధించిన కేసులు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న సారా బట్టీల నిర్వాహకులు, పాత నేరస్థులను గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల నుంచి అన్నిచోట్ల బెల్ట్ షాపులు, సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేస్తారు. ఈ ప్రక్రియను మరో రెండు రోజుల్లో ప్రారంభిస్తారు. జగ్గయ్యపేట ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా నుంచి సారా ఎక్కువగా దిగుమతి అయ్యే అవకాశం ఉంది. విస్సన్నపేట మండలంలోని కొన్ని తండాల్లో సారా తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లా సరిహద్దులోని ఎక్సైజ్ చెక్‌పోస్ట్‌ల్లో తనిఖీలు ముమ్మరం చేసి 12రోజులపాటు గస్తీ పెంచనున్నారు. సీఐలు, ఇతర అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి రివర్ బెల్ట్‌లో కూంబింగ్ నిర్వహిస్తారు. మద్యం ఉధృతి తగ్గించటానికి ప్రత్యేకంగా మొబైల్ టీములు పని చేయనున్నాయి. ఈ మేరకు అన్ని విధాలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని ఎక్సైజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ బి.అరుణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా తమ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. -
పూర్తికావస్తున్న ఊట్లపల్లి ఘాట్
పెద్దవూర : ఊట్లపల్లి పుష్కర ఘాట్ పనులు పూర్తికావస్తున్నట్లుగా ఘాట్ ఇన్చార్జి అధికారి, డిండి ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన ఘాట్‌ను సందర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పనులు పూర్తవుతాయని అన్నారు. ఈ నెల 5వ తేదీ లోపు పనులు మొత్తం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట దేవరకొండ బస్ డిపో మేనేజర్ రమేశ్, మేరెడ్డి జైపాల్‌రెడ్డి ఉన్నారు. -
వీఐపీ ఘాట్లలో అన్ని ఏర్పాట్లు
(మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల కోసం జిల్లాలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద నిర్మిస్తున్న వీఐపీ, వీవీఐపీల ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి, వీఐపీ ఘాట్ ప్రత్యేక అధికారి అమృతారెడ్డి తెలిపారు. మట్టపల్లి క్షేత్రం వద్ద వీఐపీలకు కేటాయించిన ప్రహ్లాద ఘాట్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఘాట్ వద్ద ఉన్న కొన్ని పాత గోడలను పూర్తిగా తొలగిస్తామని, నూతనంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నది వద్ద ప్రమాదకరమైన ప్రదేశాలకు ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఐబీ ఏఈలు పిచ్చయ్య, భిక్షం, వీఆర్వో వెంకటరామారావు తదితరులు ఉన్నారు. -
పుష్కరం తరుముకొస్తోంది.. పనులు పూర్తయ్యేదెప్పుడో?
ప్రధాన ఘాట్లన్నీ ఇంకా పనుల దశలోనే.. పుష్కరాలకు నెలరోజులే సమయం టైమ్ దగ్గర పడటంతో హడావుడి మేళం నాణ్యతకు తిలోదకాలు పుష్కరాల నాటికి పూర్తయ్యేది డౌటే..! చైనా డిజైన్లు అన్నారు.. అంతర్జాతీయ ఘాట్లు.. రివర్ ఫ్రంట్లు.. రోడ్లకు ఇరువైపులా గ్రీనరీ అని మభ్యపెట్టారు. 2.5 కిలోమీటర్ల పొడవునా ఒకటే ఘాట్ అంటూ హడావుడి చేశారు. కృష్ణా, గోదావరి పవిత్ర సంగమ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ కోతలు కోశారు. ప్రభుత్వం చెప్పిన ఆ మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. అభివృద్ధి మాట అటుంచితే పుష్కరాల నాటికి కనీసం ఘాట్లయినా ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నెల రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానుండగా, ఇంకా కనీసం 25శాతం పనులు కూడా పూర్తికాలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కీలకమైన ఘాట్ల వద్ద పరిస్థితిని ‘సాక్షి’ పరిశీలించగా, అసంపూర్తి పనులు, బురదతో నిండిన రేవులే కనిపించాయి. - సాక్షి, విజయవాడ ఆలస్యంగా పనులు.. భక్తులకు వెతలు అమరావతి : రాజధాని అమరావతిలోనూ పుష్కర స్నానఘట్టాల పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వర్షాల వల్ల ఈ ఆలస్యం రెట్టింపు అవుతోంది. ధ్యానబుద్ధ విగ్రహం నుంచి అమరేశ్వర స్నానఘాట్‌ను కలుపుకొని సుమారు 1.3 కిలోమీటర్ల మేర ఘాట్‌ను రూ.16కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు కాంక్రీట్ పనులు 30శాతం పూర్తయ్యాయి. అమరేశ్వర ఘాట్‌లో గ్రానైట్ పనులు పూర్తయినా.. ఆంజనేయస్వామి ఘాట్‌లో కాలేదు. పుష్కరాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పనులు హడావుడిగా చేస్తున్నారు. దీనివల్ల నాణ్యత తగ్గుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరేశ్వరస్వామి గుడికి ఉత్తరం వైపు పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అలాగే, అమరేశ్వరస్వామి దేవస్థానం మొదటి ప్రాకారంలో నేలను చదును చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఆలయాలకు రంగులు వేసే పని 60 శాతం పూర్తయింది. రెండు, మూడో ప్రాకారంలో గ్రానైట్ వేయడం పూర్తవుతోంది. క్యూలైన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 30 రోజులు గడువు..30 శాతం పనులు పూర్తి తాడేపల్లి (తాడేపల్లి రూరల్) : సీతానగరంలో కృష్ణానది ఒడ్డున ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి సుమారు అర కిలోమీటరు పొడవున నిర్మిస్తున్న పుష్కర ఘాట్ పనులు 30 శాతం కూడా పూర్తికాలేదు. గతంలో ఐదు ఘాట్లు ఉండగా అన్నింటినీ కలుపుతూ ఒకే ఘాట్‌గా నిర్మిస్తున్నారు. ఈ ఘాట్‌లో ఇంకా కాంక్రీట్ పనులు కూడా పూర్తికాలేదు. పనులు పూర్తయిన తర్వాతే మెట్ల నిర్మాణం చేపట్టి టైల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అరకిలోమీటరు పొడవున నిర్మిస్తున్న ఈ ఘాట్లను సగం వరకూ కూడా కాంక్రీట్ పనులు పూర్తికాలేదు. పాత ఘాట్లకు మాత్రం శుక్రవారం నుంచి టైల్స్ అంటించే కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. ఘాట్లకు వాటరింగ్ కూడా చేయట్లేదు. బ్యారేజీ నుంచి పుష్కర ఘాట్ల వరకూ కృష్ణానది ఒడ్డున ఉన్న రిటైనింగ్ వాల్ కూలిపోతున్నా పట్టించుకోకుండా సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. పుష్కర నగర్లు ఏర్పాటుచేసే విషయాల్లో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కింగ్, భక్తులు వేచి ఉండేందుకు తాత్కాలిక వసతికి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటికి పూర్తయ్యేనో..? రేపల్లె : స్థానిక పెనుమూడి పుష్కర ఘాట్‌ను 500 మీటర్లకుపైగా దూరంతో నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.5.19 కోట్లు ఖర్చుచేసి ఈనెల 15వ తేదీ నాటికి పూర్తిచేసేలా పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభమై 40 రోజులవుతున్నా 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్ర సంగమం.. అగమ్యగోచరం కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఇబ్రహీంపట్నం నుంచి తుమ్మలపాలెం వరకూ 2.1 కిలోమీటర్ల మేర పుష్కర ఘాట్‌ను నిర్మించాలని మొదట్లో నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ మట్టి పనులు మాత్రమే జరుగుతున్నాయి. నదిలో రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. కాంక్రీట్ ఫ్లోరింగ్, ఘాట్ పైన మెట్లు నిర్మించాల్సి ఉంది. తొలుత నిర్ణయించినట్లు 2.1 కిలోమీటర్ల నిర్మాణం సాధ్యంకాదని భావించిన అధికారులు 1.2 కిలోమీటరుకు కుదించారు. గోదావరి జలాలు వస్తున్న వైపు 275 మీటర్లు ఘాట్‌ను నూతనంగా నిర్మించాలని నిర్ణయించి ఇటీవలే పనులు ప్రారంభించారు. గోదావరి నీరు వచ్చే కాల్వపై ఫుట్‌బ్రిడ్జిలు నిర్మించాలని, ఘాట్‌కు గ్రానైట్ రాళ్లు వేయాలని అధికారులు భావించారు. ప్రస్తుతం సమయాభావం వల్ల ఫుట్బ్రిడ్జిలకు స్వస్తి పలికారు. గ్రానైట్ రాళ్లకు బదులుగా సాధారణ టైల్స్ వేస్తున్నారు. హారతి వేదిక ఏమైనట్టు? కృష్ణా-గోదావరి సంగమం వద్ద కృష్ణమ్మ హారతులు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నది మధ్యలో శాశ్వత నిర్మాణం ఏర్పాటుచేసి అక్కడ హారతులు నిర్వహిస్తామని కూడా చెప్పింది. ఇప్పటివరకు అక్కడ ఏవిధమైన ఏర్పాట్లు జరుగుతున్న దాఖలాలు లేవు. ఇబ్రహీంపట్నం నుంచి ఫెర్రి ఘాట్ వరకూ వెళ్లే మార్గం పనులు చేస్తున్నారు. ఇక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేస్తామనే విశ్రాంతి ప్రదేశంలోనూ పనులు ఏమాత్రం జరగడం లేదు. ప్రతిపాదనలు పక్కకు.. ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి భవానీపురంలోని భవానీఘాట్ వరకూ 2.3 కిలోమీటర్లు ఒకటే ఘాట్ నిర్మించాలని తొలుత భావించారు. అయితే, మధ్యలో హెడ్‌వాటర్ వర్క్స్ వెల్స్ ఉండటంతో పున్నమి ఘాట్ నుంచి భవానీ ఘాట్ వరకూ 1.5 కిలోమీటర్ల మేర ఒకటే ఘాట్ నిర్మించాలని నిర్ణయించారు. భవానీ ఘాట్ వద్ద 700 మీటర్ల ఘాట్‌ను నిర్మించాలని తొలుత నిర్ణయించినా పుష్కరాల నాటికి 300 నుంచి 350 మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణం పూర్తికాకపోవచ్చని భావిస్తున్నారు. గతంలో వందమీటర్ల ఘాట్ ఉండేది. దీన్ని తొలగించి ఏకఘాట్ చేయాలని నిర్ణయించి తిరిగి నిర్మించడం ప్రారంభించారు. మిగిలిన ఘాట్లతో పోలిస్తే ఇక్కడ పనిలో కాస్త పురోగతి కనిపిస్తోంది. మట్టి పనులు పూర్తయ్యాయి. కాంక్రీట్ వర్క్ ప్రారంభించారు. పున్నమి ఘాట్ 800 మీటర్లకు గానూ 300 మీటర్లకు మించి పూర్తికాకపోవచ్చని ఇంజినీర్లు భావిస్తున్నారు. నదిలో కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఇంకా మెట్ల నిర్మాణం జరగాల్సి ఉంది. పున్నమి ఘాట్‌కు వెళ్లే మార్గంలో ఇళ్లు తొలగించారు కానీ రోడ్ల నిర్మాణం ప్రారంభించకపోవడంతో పుష్కరాల నాటికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. నత్తనడకన దుర్గాఘాట్ పనులు ప్రకాశం బ్యారేజీ నుంచి దుర్గాఘాట్ చివరి వరకూ 0.8 కిలోమీటరు మేర ఒకే ఘాట్‌ను నిర్మిస్తున్నారు. దీన్ని తొలుత చైనా బృందం సహాయంతో నిర్మించాలని భావించారు. అయితే వారివద్ద యంత్రపరికరాలు లేకపోవడంతో సోమా కంపెనీకి అప్పగించారు. గతంలో ఉన్న వీఐపీ ఘాట్‌ను, దుర్గాఘాట్‌ను పూర్తిగా తొలగించి అక్కడ నిర్మాణం పనులు చేపట్టారు. ఘాట్‌ను నదిలోకి విస్తరిస్తున్నారు. నదిలో రిటైనింగ్‌వాల్, ఫ్లోరింగ్ ఒకవైపు జరుగుతుంటే ఘాట్ పై భాగంలో మట్టిపనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 25 శాతం మించి పనులు జరగలేదు. ఈ ఘాట్‌పైనే వత్తిడి ఉంటుందని భావిస్తున్న అధికారులు దీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సా..గుతూ.. ప్రకాశం బ్యారేజీ దిగువన అప్రాన్ నుంచి కృష్ణవేణి, పద్మావతి, సీతమ్మవారి పాదాలు తదితర ఘాట్లన్నీ కలిపి ఒకే ఘాట్ కింద సుమారు 2.3 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. నదిలో నీరు లేకపోవడం, గతంలో ఇక్కడ ఘాట్లు ఉండటం వల్ల కొంతమేర పనులు వేగంగా జరుగుతున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో ఇక్కడ పుష్కర కాల్వలు తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు నదిలో పుష్కర కాల్వ తవ్వకం పనులతో పాటు మట్టిపని, కాంక్రీట్ వర్క్ జరుగుతోంది. ఘాట్‌లో నుంచి రోడ్డు మీదకు వచ్చే మార్గాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఆలస్యానికి కారణాలు ఇవే.. ఘాట్ల నిర్మాణం పనులు గత ఏడాది ఆగస్టులో గోదావరి పుష్కరాలు అవ్వగానే ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిజైన్ల ఖరారు, కాంట్రాక్టర్లకు నామినేషన్‌పై అప్పగింత, ఇంజినర్ల కేటాయింపులో జాప్యం కారణంగా గత మే 15 వరకు పనులకు శ్రీకారం చుట్టలేదు. దీంతో ఇప్పుడు పగలు రాత్రి హడావుడిగా చేయాల్సి వస్తోంది.వాస్తవంగా ఎండాకాలంలో జరగాల్సిన పనులు వర్షాకాలం ప్రారంభమయ్యాక చేస్తుండటంతో ముందుకు సాగని పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ ఎగువన నదిలో నీరు ఉంది. మట్టిపనులు చేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. నీటి ప్రవాహానికి అడ్డుకట్టవేసిన తరువాత పనులు చేయాల్సి వస్తోంది.ఘాట్లకోసం గోతులు తవ్వుతుంటే నీరు వస్తూనే ఉండటం కూడా ఆలస్యానికి మరో కారణం. ఒకవైపు ప్లైఓవర్, మరోవైపు పుష్కరఘాట్ల నిర్మాణ పనులు జరగడం వల్ల పనులు అనుకున్నంత వేగంగా జరగట్లేదు. అనేక ప్రాంతాల్లో పేదలు నివసిస్తున్న ఇళ్లను ఖాళీ చేయించాలి. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం, కోర్టు నుంచి స్టే తీసుకురావడంతో అధికారులు పనులు వేగంగాచేయలేకపోతున్నారు. పవిత్ర సంగమం వద్ద జంగిల్ క్లియరెన్స్ ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. మే 15వ తేదీ వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం, ఉన్న సమాయాని కంటే ఎక్కువ పనిని అప్పగించడంతో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు. కాంట్రాక్టర్లకు సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పెద్దమొత్తంలో సిబ్బందిని నియమించి పనులు చేయించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఒకవైపు పుష్కర పనులు నత్తనడకన సాగుతుంటే పుష్కరాల విధుల్లో ఉన్న ఇంజినీర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్ఈ నుంచి జేఈల వరకూ బదిలీ చేయడం, బదిలీ అయిన వారికి కొత్తచోట చార్జింగ్ తీసుకుని, తిరిగి ఇక్కడకు వచ్చి విధులు నిర్వహించమని చెప్పడం కూడా ఒక కారణమే. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు, అధికారులు తనిఖీలు చేస్తూ హడావుడి చేయడమే తప్ప వాస్తవంగా పుష్కరాలు ఎంతమేరకు చేయాలనే అంశంపై కాంట్రాక్టర్లకు స్పష్టత ఇవ్వడం లేదు. పుష్కరాల తరువాత కూడా పనులు చేయాల్సి ఉండటంతో అయినంత వరకే చేద్దామనే ఆలోచనలో కాంట్రాక్టర్లు ఉన్నట్టు సమాచారం. -
ఇన్నోవా-లారీ ఢీ: ముగ్గురి మృతి
-
ఈ బాబా వాచీ ఖరీదు రూ.27 లక్షలట!
హరిద్వార్: సాధారణంగా బాబా, సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి అనుకుంటాం. కానీ ఇటీవల హరిద్వార్‌లో అర్ధ కుంభమేళాకు హాజరైన ఓ బాబాను చూస్తే ఈ అభిప్రాయం తప్పేమోనన్న అనుమానం కలుగుతుంది. ఒంటి నిండా బంగారంతో మెరిసిపోతూ సదరు సన్యాసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఏకంగా మూడున్నర కిలోల బంగారాన్ని ధరించి గంగానదిలో స్నానమాచరించి వస్తున్న బాబాను చూసి అక్కడున్నవారంతా నోళ్లు వెళ్లబెట్టారు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు, కమండలం తదితరాలతో సాదాసీదాగా ఉండాల్సిన సన్యాసి కాస్తా రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో మెరిసిపోయాడు. ఒకటా రెండా మెడ నిండా బంగారు గొలుసులు, లాకెట్లు.. అన్ని చేతివేళ్లకు బరువైన ఉంగరాలు. చేతికి పెద్ద వెడల్పాటి కడియం, డైమండ్ వాచ్. ఇలా సన్యాసులకు భిన్నమైన అవతారంతో తన శిష్యులు, అనుచరుల మందీ మార్బలంతో గంగా స్నానమాచరించడం ఆసక్తికరంగా మారింది. వజ్రాలు పొదిగిన ఆయన చేతి వాచీ సుమారు రూ. 27 లక్షల ఖరీదు చేస్తుందట. అయితే సన్యాసికి ఇంత బంగారం ఎందుకు అని ఎవరైనా అంటే ఈ బాబా అనుచరులు, శిష్యులకు కోపం వస్తుంది. బంగారం ఎంత స్వచ్ఛమో, ఎంత అమూల్యమో తమ గురువుకూడా అంతే విలువైనవాడంటూ వెనకేసుకొస్తున్నారు. మా గోల్డెన్ బాబా సేవలు అమూల్యమైనవంటూ మురిసిపోతున్నారు కాగా గోల్డెన్ బాబాగా చెప్పుకునే ఈయన గతంలో ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసేవాడట. ఈయన అసలు పేరు సుధీర్ కుమార్ మక్కడ్(53 ). అయితే అప్పుడు ఎన్నో పాపాలు, పొరబాట్లు చేశానంటున్నాడీ గోల్డెన్ బాబా. ఆ పాపాలను కడిగేసుకోవడానికి సన్యాసిగా మారిపోయానంటున్నాడు. వ్యాపారం చేసే క్రమంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సన్యాసం స్వీకరించానని చెబుతున్నాడు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కష్టపడుతున్న పేద తలిదండ్రులకు, ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు సహాయం చేస్తుంటానని చెబుతున్నాడు. -
వ్యర్థాలతో గోదావరి కలుషితం
ఏటూరునాగారం/ములుగు: భక్తు లు గోదారమ్మకు దీప ఆరాదన కో సం తీసుకొస్తున్న అరటి తొక్కలు పూజల అనంతరం నదిలోనే వదులుతున్నారు. అలా చేయొద్దని అధికారులు చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఫలితంగా గోదావరి నీరు కలుషితమవుతున్నారుు. ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు రామన్నగూడెం ఘాట్‌లో చిందు, యక్షగాణ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నారుు. జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో గత11 రోజుల నుంచి ఘాట్ వద్ద ప్రతిరోజూ రాత్రి కళాకారులతో భాగవతం, రామాయణం, మహాభారతం నాటకాల ద్వారా భక్తులకు వివరిస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, పుష్కరాల్లో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జానపద పాట ల ద్వారా వివరిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు వివిధ వేశ భాషలతో ప్రదర్శించడం మాకు ఎంతోసంతోషంగా ఉందని దేవ రుప్పుల మండలం అప్పరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య తెలిపారు. -
కొవ్వూరు గౌతమిఘాట్‌లో తుపాకీ కలకలం
-
పీవీ ఘాట్ ప్రతిపాదన పరిశీలనలో ఉంది
ఎంపీ మేకపాటి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు మెమోరియల్ ఘాట్ నిర్మించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి ఎస్‌హెచ్ బాబుల్‌సుప్రియో తెలిపారు. న్యూఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ బంగళాలను స్మారక ప్రదేశాలుగా మార్చకూడదన్న నిబంధన కారణంగా మాజీ ప్రధాని చరణ్‌సింగ్ ఉన్న నివాసాన్ని స్మారక ప్రదేశంగా మార్చాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్టు పేర్కొన్నారు. -
శోభమ్మ చివరి కోరికను నెరవేరుద్దాం
జగన్ సీఎం అయితేనే శోభమ్మ ఆత్మకు శాంతి - ఆళ్లగడ్డలో సంతాప సభ - ఉద్వేగంతో ప్రసంగించిన భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ న్యూస్‌లైన్: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి శోభమ్మ చివరి కోరికను నెరవేరుద్దామని నంద్యాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ పట్టణంలోని శోభమ్మ ఘాట్‌లో సోమవారం శోభానాగిరెడ్డి సంతాపసభ వేలాది మంది కార్యకర్తల మధ్య జరిగింది. శోభా నాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి గంట ముందు ప్రకటించడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఆమె చిత్రపటానికి నివాళ్లు అర్పించి ఆత్మశాంతి కోసం అందరూ ఒక్క నిమిషం మౌనం పాటించారు. అనంతరం సభలో భూమా ఉద్వేగంతో మాట్లాడారు. ‘శోభానాగిరెడ్డికి ఓటు వేస్తే చెల్లదని రెండు రోజుల క్రితం తెలిసినప్పుడు నాతో పాటు అభిమానులు ఆందోళన చెందారు. ఆళ్లగడ్డను టీడీపీ ఖాతాలోకి పోనియమని వైస్ జగన్మోహన్రెడ్డికి చెప్పాను. అవసరమైతే ఇండిపెండెంట్‌కు మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామనే ధీమా ఉండేది. శోభానాగిరెడ్డి మొండి మనిషి, చనిపోయిన తరువాత కూడా బరిలో నిలిచి తనకు పడే ఓట్లు చెల్లించుకునేలా చేసుకుంది. ఆమెకు ఓటు వేస్తే చెల్లదని చెప్పినపుడు బాధపడిన కార్యకర్తలు ఈసీ ప్రకటనతో ప్రస్తుతం ఆనందపడుతున్నారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని అరుదైన గుర్తింపును శోభానాగిరెడ్డికి దక్కబోతుంది. చనిపోయిన తరువాత లక్ష ఓట్ల మెజార్టీతో వచ్చేలా గిన్నిస్ రికార్డు సాధిం చడానికి కార్యకర్తలు కృషి చేయాలి. చిన్న వయస్సులో తండ్రిని పొగొట్టుకున్నాను. పెరుగుతున్న వయస్సులో ముగ్గురు అన్నలు దూరమైనారు.. కోలుకుంటున్న సమయంలో శోభమ్మను కోల్పోయాను. శోభానాగిరెడ్డి మరణంతో బరువెక్కిన మనస్సును వేలాది కుటుంబాల కోసం నిబ్బరం చేసుకుంటున్నాను. ధైర్యంగా ప్రజల కోసం కుటుంబం మొత్తం వస్తున్నాం.అందరం కలుద్దాం... జగనన్నను సీఎం చేసి.. శోభమ్మ చివరి కోరికను నెరువెరుద్దాం’ అంటూ ప్రసంగించారు. ఘాట్‌ను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతా: శోభానాగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని శోభమ్మ ఘాట్‌గా భూమా నాగిరెడ్డి నామకరణం చేశారు. అక్కడ ఆమె జ్ఞాపకాలను భద్రపరిచి ఇల్లు కూడా నిర్మించుకుంటానని తెలిపారు. శోభమ్మ ఘాట్‌ను ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాన్నారు. సమావేశంలో మిల్క్ డైయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, నాయకులు అన్సర్, రఘనాథరెడ్డి, నిజాం, శ్రీకాంతరెడ్డి, రాముయాదవ్, బీవీ రామిరెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.