ఘాట్ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతి
Published Thu, Mar 9 2017 10:54 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
- ఐదుకు చేరిన మృతుల సంఖ్య
- మృతుల్లో చిన్నారి, వృద్ధురాలు
పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చింతల మలుపు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. మృతుల్లో పెద్దదోర్నాల వైద్యశాలలో చికిత్స పొందుతున్న నీలమ్మ (50), కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిన్నారి స్వరూప (6) ఉన్నారు.
మండల పరిధిలో శ్రీశైలం ఘాట్ రోడ్‌లో చింతల సమీపంలో జరిగిన ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని దొంగర్‌గావ్‌కు చెందిన విజయ్‌కుమార్ (40), రాజేశ్వరి శ్రీదేవి (45), నాగం (45)లు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. నలుగురి మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. కర్ణాటక నుంచి పెద్దదోర్నాలకు చేరుకున్న బంధువులకు మృతదేహాలు అప్పగించారు. కర్నూలులో మృతి చెందిన చిన్నారి స్వరూప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అక్కడికి వెళ్లిన బంధువులకు అప్పగించారు. పెద్దదోర్నాల నుంచి నాలుగు మృతదేహాలతో ప్రత్యేక వాహనంలో కర్నూలు బయల్దేరిన బంధువులు అక్కడ స్వరూప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఐదు మృతదేహాలనూ స్వగ్రామానికి తరలించారు.
Advertisement
Advertisement