శ్రీశైలంలో భవానీల బస్సు బోల్తా
Published Sat, Dec 24 2016 1:49 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
పెనుగొండ : శ్రీశైలంలో శుక్రవారం ఉదయం భవానీల బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక దుర్మరణం పాలైంది. 15 మంది గాయపడ్డారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లా వాసులే. వివరాల్లోకి వెళితే.. పెనుగొండ, మార్టేరులకు చెందిన 80 మంది భవానీలు గురువారం పుణ్యక్షేత్రాల దర్శనం నిమిత్తం అమలాపురం, భీమవరాలకు చెందిన ప్రైవేటు బస్సుల్లో వెళ్లారు. తొలుత కొటప్పకొండలో దర్శనం చేసుకుని, శుక్రవారం తెల్లవారుజామున డోర్నాలకు చేరుకున్నారు. అక్కడ పూజలు ముగించుకొని శ్రీశైలం వెళ్లారు. ఉదయం 8.30గంటలకు అమలాపురానికి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు తిరగబడిపోవడంతో అందులో ఉన్న ఆచంట మండలం కొడమంచిలికి చెందిన బాలిక గుత్తుల రేవతి(11) అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. కసిరెడ్డి గణేష్, కొప్పిశెట్టి రాంపండు, కొప్పిశెట్టి సత్యవతి, గుగ్గిలపు దుర్గాప్రసాద్, వేండ్ర దుర్గాప్రసాద్, వాడమదల కోటమ్మ, కొక్కిర రాకేష్, అడబాల దుర్గ, జుత్తిగ నాగలక్ష్మి, జుత్తిగ వెంకటలక్ష్మి, పిల్లి వీర్రాజు, పిల్లి అపర్ణ, సీహెచ్ మల్లేష్, రాంపూడి సత్యనారాయణ, జె.దుర్గారావు గాయపడ్డారు. వీరిలో పెనుమంట్ర మండలం వనంపల్లికి చెందిన కొప్పిశెట్టి సత్యవతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చొరవతో విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి అంబులెన్‌లో తరలించారు.
ప్రత్యేక బస్సులో భవానీల తరలింపు
భవానీల బస్సు ప్రమాదానికి గురైందన్న సమాచారంతో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వెంటనే స్పందించారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కర్నూలు జిల్లా ఎస్పీ, శ్రీశైలం డీఎస్పీ, తహసీల్దార్లతో పోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని, రేవతికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో పంపాలని కోరారు. దీంతో శ్రీశైలం దేవస్థానం ఏఈఓ శ్రీనివాసరెడ్డి స్పందించి తీవ్రంగా గాయపడిన సత్యవతిని విజయవాడ తరలించడానికి ప్రత్యేక అంబులెన్‌ను, భవానీల తిరుగు ప్రయాణానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు.
పెద్దమ్మతోపాటు మాల వేసుకుని..
గుత్తుల రేవతి పెనుగొండలో అమ్మమ్మ జుత్తిగ లక్షీ్మదేవి ఇంట్లో ఉంటోంది. స్థానిక వివేక బాలభారతి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. పెద్దమ్మ జుత్తిగ నాగలక్ష్మి భవానీమాల వేసుకోవడంతో, ఆమెతోపాటు రేవతి కూడా మాలధారణ చేసింది. రేవతి తండ్రి వీరవెంకట సత్యనారాయణ జీవనోపాధి నిమిత్తం గల్ప్‌లో ఉంటున్నాడు. తల్లి సత్యవతి కొడమంచిలిలో ఉంటోంది. రేవతి మృతితో బంధువులు, వివేక బాలభారతి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విషాదంలో మునిగిపోయారు.
వనంపల్లిలో విషాదఛాయలు
వనంపల్లి, (పెనుమంట్ర) : బస్సు బోల్తా ఘటనతో పెనుమంట్ర మండలం వనంపల్లి ఉలిక్కిపడింది. బోల్తా పడిన బస్సులో గ్రామానికి చెందిన కొప్పిశెట్టి రాంపండు, సత్యవతి దంపతులతోపాటు వారి మనుమరాలు ఊర్మిళ, కడలి నాగ శ్రీను, కలిశేటి ఏసు, కర్రి ప్రసాదరెడ్డి ఉన్నారు. ప్రమాదంలో సత్యవతికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. వెలగలేరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కూడా బస్సులో ఉన్నారని తెలుస్తోంది.
Advertisement