one death
-
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
పార్వతీపురంటౌన్/సీతానగరం/ వీరఘట్టం : లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామంలోని మందిరం వీధికి చెందిన వేల బాషా(24)తోపాటు మరో ఆరుగురు ఆదివారం రాత్రి సాలూరులోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం తిరుగుప్రయాణంలో వీరఘట్టం వస్తుండగా.. సీతానగరం మండలం మరిపివలస వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రితో పాటు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాషా మృతిచెందాడు. మూడడ్ల చిన్నంనాయుడు, మామిడి రామ్మూర్తి, రెడ్డి సాగర్, ఎం. రేగినాయుడు, యాళ్ల చంటి, కొయ్యాన అంజలి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వగ్రామంలో విషాదఛాయలు మృతుడు బాషా స్వగ్రామమైన వీరఘట్టం మందిరంవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవార్త తెలిసిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
శ్రీశైలంలో భవానీల బస్సు బోల్తా
పెనుగొండ : శ్రీశైలంలో శుక్రవారం ఉదయం భవానీల బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక దుర్మరణం పాలైంది. 15 మంది గాయపడ్డారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లా వాసులే. వివరాల్లోకి వెళితే.. పెనుగొండ, మార్టేరులకు చెందిన 80 మంది భవానీలు గురువారం పుణ్యక్షేత్రాల దర్శనం నిమిత్తం అమలాపురం, భీమవరాలకు చెందిన ప్రైవేటు బస్సుల్లో వెళ్లారు. తొలుత కొటప్పకొండలో దర్శనం చేసుకుని, శుక్రవారం తెల్లవారుజామున డోర్నాలకు చేరుకున్నారు. అక్కడ పూజలు ముగించుకొని శ్రీశైలం వెళ్లారు. ఉదయం 8.30గంటలకు అమలాపురానికి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు తిరగబడిపోవడంతో అందులో ఉన్న ఆచంట మండలం కొడమంచిలికి చెందిన బాలిక గుత్తుల రేవతి(11) అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. కసిరెడ్డి గణేష్, కొప్పిశెట్టి రాంపండు, కొప్పిశెట్టి సత్యవతి, గుగ్గిలపు దుర్గాప్రసాద్, వేండ్ర దుర్గాప్రసాద్, వాడమదల కోటమ్మ, కొక్కిర రాకేష్, అడబాల దుర్గ, జుత్తిగ నాగలక్ష్మి, జుత్తిగ వెంకటలక్ష్మి, పిల్లి వీర్రాజు, పిల్లి అపర్ణ, సీహెచ్ మల్లేష్, రాంపూడి సత్యనారాయణ, జె.దుర్గారావు గాయపడ్డారు. వీరిలో పెనుమంట్ర మండలం వనంపల్లికి చెందిన కొప్పిశెట్టి సత్యవతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చొరవతో విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి అంబులెన్‌లో తరలించారు. ప్రత్యేక బస్సులో భవానీల తరలింపు భవానీల బస్సు ప్రమాదానికి గురైందన్న సమాచారంతో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వెంటనే స్పందించారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కర్నూలు జిల్లా ఎస్పీ, శ్రీశైలం డీఎస్పీ, తహసీల్దార్లతో పోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని, రేవతికి వెంటనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో పంపాలని కోరారు. దీంతో శ్రీశైలం దేవస్థానం ఏఈఓ శ్రీనివాసరెడ్డి స్పందించి తీవ్రంగా గాయపడిన సత్యవతిని విజయవాడ తరలించడానికి ప్రత్యేక అంబులెన్ను, భవానీల తిరుగు ప్రయాణానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. పెద్దమ్మతోపాటు మాల వేసుకుని.. గుత్తుల రేవతి పెనుగొండలో అమ్మమ్మ జుత్తిగ లక్షీ్మదేవి ఇంట్లో ఉంటోంది. స్థానిక వివేక బాలభారతి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. పెద్దమ్మ జుత్తిగ నాగలక్ష్మి భవానీమాల వేసుకోవడంతో, ఆమెతోపాటు రేవతి కూడా మాలధారణ చేసింది. రేవతి తండ్రి వీరవెంకట సత్యనారాయణ జీవనోపాధి నిమిత్తం గల్ప్‌లో ఉంటున్నాడు. తల్లి సత్యవతి కొడమంచిలిలో ఉంటోంది. రేవతి మృతితో బంధువులు, వివేక బాలభారతి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విషాదంలో మునిగిపోయారు. వనంపల్లిలో విషాదఛాయలు వనంపల్లి, (పెనుమంట్ర) : బస్సు బోల్తా ఘటనతో పెనుమంట్ర మండలం వనంపల్లి ఉలిక్కిపడింది. బోల్తా పడిన బస్సులో గ్రామానికి చెందిన కొప్పిశెట్టి రాంపండు, సత్యవతి దంపతులతోపాటు వారి మనుమరాలు ఊర్మిళ, కడలి నాగ శ్రీను, కలిశేటి ఏసు, కర్రి ప్రసాదరెడ్డి ఉన్నారు. ప్రమాదంలో సత్యవతికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. వెలగలేరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కూడా బస్సులో ఉన్నారని తెలుస్తోంది. -
ఘోర రోడ్డు ప్రమాదం
► రాజాం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ► ఆటోను ఢీకొట్టిన కారు ► ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం ► 14 మందికి తీవ్ర గాయాలు రాజాం: రాజాం నగరపంచాయతీ పరిధి గాయత్రి కాలనీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక కారు, ఒక ఆటో నుజ్జునుజ్జవ్వగా, నడుస్తూ వెళుతున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆటోలో ప్రయాణిస్తున్న కొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రాజాం పోలీసులతో పాటు మృతుని బంధువులు అందించిన వివరాలు ప్రకారం... రాజాం నుంచి విజయనగరం వైపు వెళుతున్న కారు, విజయనగరం వైపు నుంచి రాజాం వైపు వస్తున్న ఆటోను రాజాం గాయత్రి కాలనీ సమీపంలో ఢీకొట్టింది. ఆటో అక్కడికక్కడే ఫల్టీలు కొట్టి నుజ్జవ్వగా, రోడ్డు పక్కగా నడుస్తున్న వ్యక్తిమీదకి కారు దూసుకువెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయాలపాలయ్యారు. సంతకవిటి మండలం మద్దూరుపేట గ్రామానికి చెందిన కీర్తి రాంబాబు అనే వ్యక్తి ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో తన కారును డ్రైవ్ చేసుకుంటూ విజయనగరం వెళుతున్నాడు. ఈయన విజయవాడలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాజాం వద్ద చీపురుపల్లి రోడ్డులోకి రాగానే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఆటోలో ప్రయాణిస్తున్న రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన ప్రయాణికులు మజ్జి నాగమణి, యందమూరి నాగరాజు, కల్లారి స్వాతి, మద్దిల పార్వతి, డబ్బాడ శ్రీలక్ష్మి, సీతాలు, మజ్జి సూర్యకాంతం, బొత్స పద్మ, మద్దిల పార్వతి, కాశిన పైడితల్లి, ఆనెం ఈశ్వరమ్మ, కాల్ల సంతోషి, గార్లె రూప, కిలారి చింతల్లి తదితరులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నాగరాజు కాలికి తీవ్ర గాయమరుు్యంది. డబ్బాడ శ్రీలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఈమెను విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. వీరంతా విజయనగరం సమీపంలోని చాకలిపేట వద్ద ఉన్న రామనారాయణం గుడికి వెళ్లివస్తున్నారు. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకున్న వీరు ఈ ప్రమాదంలో గాయాలపాలయ్యారు. వీరి ఇళ్లకు 600 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. కాగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కారేనని క్షతగాత్రులు ఆరోపిస్తున్నారు. కారును స్పీడుగా డ్రైవ్ చేయడంతో పాటు డ్రైవర్ రాంబాబు మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. ఆయనకు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన కుటుంబీకులు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రాజాం సీఐ శంకరరావుతో పాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించడంతో పాటు మృతుని కుటుంబీకులు వద్ద వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పాపం కొద్దీ దూరంలో దిగినందుకు.. ఆటోను ఢీకొట్టిన కారు ముందుభాగం నుజ్జుకావడంతో పాటు స్టీరింగ్ పట్టేయడం వల్ల కారు అక్కడినుంచి రోడ్డుకు ఓ పక్కగా ఒరిగిపోరుు కొద్దీ దూరంలో నడుచుకుంటూ వెళుతున్న గాయత్రి కాలనీకి చెందిన గుణభట్ల వెంకటరమణ(48)ను ఢీకొట్టింది. ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయనది సంతకవిటి మండలం మందరాడ గ్రామం. రెండేళ్ల క్రితమే రాజాం వచ్చి గాయత్రి కాలనీలో నివాసముంటున్నాడు. విశాఖపట్నంలోని ఎల్ఐసీ అధికారులు ఆదివారం ఏర్పాటుచేసిన పిక్నిక్కు వెళ్లిన ఈయన తిరుగుప్రయాణంలో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. బస్సులో ప్రయాణిస్తుండగా నిద్రించిన ఆయన గాయత్రి కాలనీ దాటిన తర్వాత మేల్కొని బస్సును ఆపమన్నాడు. అప్పటికే బస్సు కాలనీ స్టాప్ దాటి రెండు వందల అడుగుల ముందుకు వచ్చింది. అక్కడ దిగి కాలనీవైపు నడుచుకుంటూ రోడ్డు పక్కగా వస్తున్నాడు. మరో రెండు నిమిషాల్లో కాలనీ వస్తుందనుకోగానే ఈ ప్రమాదానికి గురై తనువుచాలించాడు. ఈయన మృతితో ఆయన భార్య పద్మావతి భోరున విలపిస్తుంది. ఈయనకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఇద్దరికి వివాహాలు జరిగారుు. చిన్నమ్మారుు శ్రావణి, భార్యతో గాయత్రి కాలనీలో నివాసముంటున్నాడు. ఈయన మృతితో కుటుంబం రోడ్డున పడింది. -
ఆటో డ్రైవర్ల అతివేగానికి ఒకరు మరణం
- నందికొట్కూరు వద్ద ఢీకొన్న మూడు ఆటోలు - ఓ మహిళ మృతి - 18 మందికి గాయాలు - ఒకరి పరిస్థితి విషమం జూపాడుబంగ్లా: ఆటో డ్రైవర్ల అతివేగానికి పొట్ట కూటి కోసం కూలీకి వెళ్తున్న మహిళ బలైంది. రహదారి సరిగా లేదని తెలిసినా పోటాపోటీగా నడుపుతూ ప్రమాదానికి కారకులయ్యారు. నందికొట్కూరు సమీపంలో రబ్బాని వేర్‌హౌస్ వద్ద శుక్రవారం ఉదయం మొదట రెండు ఆటోలు ఢీకొని ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తుండగా, నిమిషం తేడాలోనే మరో ఆటో వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. నాగటూరు గ్రామంలో శుక్రవారం ఉదయం 18 మంది వ్యవసాయ కూలీలు ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ నరేంద్ర తంగెడంచ గ్రామానికి బయలుదేరాడు. అదే రహదారిలో జూపాడుబంగ్లాలో ఆరుగురు ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవర్ వలి నందికొట్కూరుకు బయలుదేరాడు. ఇద్దరు ఒకే వైపు అతివేగంగా వస్తూ అధిగమించే ప్రయత్నంలో నందికొట్కూరు సమీపంలో రబ్బాని వేర్‌హౌస్ వద్ద రెండు ఆటోలు ఢీకొన్నాయి. రహదారిపై బోల్తా పడిన ఆటోలో నుంచి గాయపడిన కూలీలు తేరుకుంటుండగా నందికొట్కూరు నుంచి ఆత్మకూరుకు బీరువాలు తీసుకెళ్తున్న ట్రాలీ ఆటో వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగటూరుకు చెందిన అక్కమ్మ (50) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అదే గ్రామానికి పెద్దక్క పరిస్థితి విషమంగా ఉంది. వీరితోపాటు నరేష్, సుశీలమ్మ, సువర్ణ, ఆటో డ్రైవరు నరేంద్రతోపాటు తాటిపాడు గ్రామానికి చెందిన వెంకటయ్య, తిరుపతయ్య, నీలిషికారి లక్ష్మీదేవి, రాజు, మాలిక్బాషాతో పాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన మూడు ఆటో డ్రైవర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జూపాడుబంగ్లా ఎస్ఐ అశోక్ తెలిపారు. మూడు ఆటోలను సీజ్‌చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. క్షతగాత్రులను స్వయంగా తరలించిన సీఐ: సంఘటన స్థలంలో తీవ్రరక్తస్రావంతో విలవిలలాడతున్న బాధితులను చూసిన వారందరూ అయ్యోపాపం అంటున్న వారే తప్పా ఆసుçపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి హుటాహుటిన ద్విచక్రవాహనంపై సంఘటన ప్రాంతానికి చేరుకొని రక్తమోడుతున్న క్షతగాత్రులను స్వయంగా ఎత్తుకొని ఓ ప్రైవేటు వాహనంలో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి దగ్గరుండి బాధితులకు చికిత్సలు చేయించారు. -
లారీ – బస్సు ఢీ
పుల్లంపేట: మండలంలోని కడప–చెన్నై జాతీయరహదారిలో గురువారం ఉద యం 9గంటలకు జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కోడూరు నుంచి రాజంపేటకు వెళ్లే ఏపీ28–జెడ్–1441నెంబరుగల ఆర్టీసీ బస్సు రెడ్డిపల్లి సమీపానికి రాగానే కడప నుంచి చెన్నైకు వెళుతున్న యూపీ–3191 నెంబరుగల లారీ బస్సును ఢీకొంది. దీంతో ఒక వృద్ధుడు మృతిచెందాడు. పలువురికి గాయాలయ్యాయి. మృతుడు పులిగంగయ్య (73), దాసరపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరారైన లారీ డ్రైవర్‌ను పట్టుకుని కేసు నమోదుచేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
చెట్టును ఢీకొన్న బస్సు
♦ ఒకరి మృతి 17 మందికి తీవ్రగాయాలు ♦ ఐదుగురి పరిస్థితి విషమం ♦ డ్రైవర్ నిర్లక్ష్యంతో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు ♦ క్షతగాత్రుల రోదనలతో దద్ధరిల్లిన ఘటనా స్థలం ♦ 17 మందికి గాయాలు ఐదుగురి పరిస్థితి విషమం ♦ గాంధీ ఆస్పత్రికి తరలింపు...ఒకరి మృతి మెదక్/కొల్చారం: మరో 20 నిమిషాల్లో గమ్యానికి చేరువలో ఉండగా ఓ ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు రక్తంతో తడిసిపోయింది. ఈ ప్రమాదంలో తల్లి కూతుర్ని, తండ్రి కొడుకులను చూడలేని పరిస్థితి నెలకొంది. ప్రాణాలతో బయట పడతామా? లేదా? అంటూ ప్రయాణికులు చేసిన హాహాకారాలు, ఆర్తనాదాలతో ప్రమాద స్థలి దద్ధరిల్లింది. అతివేగంతో చెట్టును బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ కాలు పూర్తిగా తెగిపోయి తీవ్ర రక్తస్రావమై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాత పడింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మెదక్-జోగిపేట ప్రధాన రహదారి కొల్చారం మండలం పొతన్‌శెట్టిపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు కొల్చారం ఎస్ఐ విద్యాసాగర్‌రెడ్డి, ప్రయాణికుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు (నం.ఏపీ 28జెడ్ 409) సంగారెడ్డి నుంచి మెదక్‌కు సుమా రు 45 మంది ప్రయాణికులతో బయల్దేరింది. మెదక్ పట్టణానికి 13కిలో మీటర్ల దూరంలో ఉండగా పొతన్‌శెట్టిపల్లి గ్రామ శివారులో బస్సును అతివేగంగా నడిపించిన డ్రైవర్ చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న మెదక్ మండలం పేరూర్ గ్రామానికి చెందిన భూలక్ష్మి కా లు బస్సులోనే తెగిపడింది. మరో ఐదుగురు రమావత్ కిషన్, సాలి, విఠల్, అజ్మిర, పద్మజల తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. మరో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరిని 108లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి అనంతరం గాంధీకి తరలించారు. ప్రమాదంలో కాలు తెగిపోయిన భూలక్ష్మి(50) గాంధీ ఆస్పత్రికి చేరుకునేసరికే మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివకుమార్, కండక్టర్ నాగరాణిలతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న దుర్గేష్, బేగం, టేక్మాల్ రాజ్, రా మకిష్టయ్య, నవనీత, నిర్మల, మహేష్, యాదమ్మ, మధు, షీలాలతోపాటు మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బిల్లు వచ్చిందని ఊరెళుతూ మృత్యువాత మెదక్ మండలం పేరూర్ గ్రామానికి చెందిన మంగళి భూలక్ష్మి తన భర్త, పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం పటాన్‌చెరుకు వెళ్లింది. గ్రామంలో వారు ఇటీవల నిర్మించుకున్న మరుగుదొడ్డి బిల్లు వచ్చిందని తెలుసుకున్న భూలక్ష్మి శుక్రవారం ప్రమాదానికి గురైన బస్సులో తన స్వగ్రామానికి వెళ్తోంది. మరో 10 నిమిషాల్లో తన స్టేజీ వస్తుందనగా పొతంశెట్టిపల్లి గ్రామశివారులో బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఆమె కాలు తెగిపోయింది. ప్రథమ చికిత్స చేసిన మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచింది. మృతురాలు భూలక్ష్మికి భర్త విఠల్‌తోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదం తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని బాధిత కుటుంబీకులు బోరున విలపించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం శుక్రవారం పొతంశెట్టిపల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొన్న ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ శివకుమార్‌దే నిర్లక్ష ్యమని ప్రయాణికులు తెలిపారు. కేవలం నిద్ర మత్తులో బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు చెబుతున్నారు. కాగా ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కొల్చారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హుటాహుటిన క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కొల్చారం ఎస్ఐ విద్యాసాగర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.