ఘోర రోడ్డు ప్రమాదం
► రాజాం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
► ఆటోను ఢీకొట్టిన కారు
► ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
► 14 మందికి తీవ్ర గాయాలు
రాజాం: రాజాం నగరపంచాయతీ పరిధి గాయత్రి కాలనీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక కారు, ఒక ఆటో నుజ్జునుజ్జవ్వగా, నడుస్తూ వెళుతున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆటోలో ప్రయాణిస్తున్న కొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రాజాం పోలీసులతో పాటు మృతుని బంధువులు అందించిన వివరాలు ప్రకారం... రాజాం నుంచి విజయనగరం వైపు వెళుతున్న కారు, విజయనగరం వైపు నుంచి రాజాం వైపు వస్తున్న ఆటోను రాజాం గాయత్రి కాలనీ సమీపంలో ఢీకొట్టింది. ఆటో అక్కడికక్కడే ఫల్టీలు కొట్టి నుజ్జవ్వగా, రోడ్డు పక్కగా నడుస్తున్న వ్యక్తిమీదకి కారు దూసుకువెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు గాయాలపాలయ్యారు.
సంతకవిటి మండలం మద్దూరుపేట గ్రామానికి చెందిన కీర్తి రాంబాబు అనే వ్యక్తి ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో తన కారును డ్రైవ్ చేసుకుంటూ విజయనగరం వెళుతున్నాడు. ఈయన విజయవాడలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాజాం వద్ద చీపురుపల్లి రోడ్డులోకి రాగానే అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఆటోలో ప్రయాణిస్తున్న రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన ప్రయాణికులు మజ్జి నాగమణి, యందమూరి నాగరాజు, కల్లారి స్వాతి, మద్దిల పార్వతి, డబ్బాడ శ్రీలక్ష్మి, సీతాలు, మజ్జి సూర్యకాంతం, బొత్స పద్మ, మద్దిల పార్వతి, కాశిన పైడితల్లి, ఆనెం ఈశ్వరమ్మ, కాల్ల సంతోషి, గార్లె రూప, కిలారి చింతల్లి తదితరులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు.
వీరిలో నాగరాజు కాలికి తీవ్ర గాయమరుు్యంది. డబ్బాడ శ్రీలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఈమెను విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. వీరంతా విజయనగరం సమీపంలోని చాకలిపేట వద్ద ఉన్న రామనారాయణం గుడికి వెళ్లివస్తున్నారు. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకున్న వీరు ఈ ప్రమాదంలో గాయాలపాలయ్యారు. వీరి ఇళ్లకు 600 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. కాగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కారేనని క్షతగాత్రులు ఆరోపిస్తున్నారు. కారును స్పీడుగా డ్రైవ్ చేయడంతో పాటు డ్రైవర్ రాంబాబు మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. ఆయనకు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు.
రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన కుటుంబీకులు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రాజాం సీఐ శంకరరావుతో పాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించడంతో పాటు మృతుని కుటుంబీకులు వద్ద వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాపం కొద్దీ దూరంలో దిగినందుకు..
ఆటోను ఢీకొట్టిన కారు ముందుభాగం నుజ్జుకావడంతో పాటు స్టీరింగ్ పట్టేయడం వల్ల కారు అక్కడినుంచి రోడ్డుకు ఓ పక్కగా ఒరిగిపోరుు కొద్దీ దూరంలో నడుచుకుంటూ వెళుతున్న గాయత్రి కాలనీకి చెందిన గుణభట్ల వెంకటరమణ(48)ను ఢీకొట్టింది. ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయనది సంతకవిటి మండలం మందరాడ గ్రామం. రెండేళ్ల క్రితమే రాజాం వచ్చి గాయత్రి కాలనీలో నివాసముంటున్నాడు. విశాఖపట్నంలోని ఎల్‌ఐసీ అధికారులు ఆదివారం ఏర్పాటుచేసిన పిక్నిక్‌కు వెళ్లిన ఈయన తిరుగుప్రయాణంలో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. బస్సులో ప్రయాణిస్తుండగా నిద్రించిన ఆయన గాయత్రి కాలనీ దాటిన తర్వాత మేల్కొని బస్సును ఆపమన్నాడు. అప్పటికే బస్సు కాలనీ స్టాప్ దాటి రెండు వందల అడుగుల ముందుకు వచ్చింది.
అక్కడ దిగి కాలనీవైపు నడుచుకుంటూ రోడ్డు పక్కగా వస్తున్నాడు. మరో రెండు నిమిషాల్లో కాలనీ వస్తుందనుకోగానే ఈ ప్రమాదానికి గురై తనువుచాలించాడు. ఈయన మృతితో ఆయన భార్య పద్మావతి భోరున విలపిస్తుంది. ఈయనకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఇద్దరికి వివాహాలు జరిగారుు. చిన్నమ్మారుు శ్రావణి, భార్యతో గాయత్రి కాలనీలో నివాసముంటున్నాడు. ఈయన మృతితో కుటుంబం రోడ్డున పడింది.