బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు
బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు
Published Mon, Feb 6 2017 9:25 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- శ్రీశైలంలో శివరాత్రికి భత్రతా చర్యలపై
ఎస్పీ సమీక్ష
- గుర్తింపు కార్డు ఉంటేనే
సత్రాలు, లాడ్జీలు, హోటళ్లలోకి ప్రవేశం
- అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు
ఏర్పాటుకు చర్యలు
- ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు
- కంట్రోల్‌రూంలు, పార్కింగ్ స్థలాలు,
బారికేడ్ల ఏర్పాటు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పకడ్బందీ బందోబస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసులకు సూచించారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో తీసుకోవాల్సిన భద్రతపరమైన చర్యలపై ఆయన పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా భద్రత చట్టం ప్రకారం భక్త సందోహం అధికంగా గుమిగూడే ప్రదేశాల్లో ఆలయ ఆధికారుల సమన్వయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు సమాచారం తెలిపేందుకు వీలైనంత ఎక్కువ సంఖ్యలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి అన్నింటిని ఒక్కదానితో అనుసంధానం చేసి అవసరమైన సమాచారాన్ని తెలపాలన్నారు.
తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత కంట్రోల్ రూమ్‌లపై ఉంటుందన్నారు. యాత్రికుల పార్కింగ్, క్యూలైన్లు, బారికేడ్ల ప్రవేశ, నిష్క్రమణ ప్రదేశాల్లో ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గుర్తింపు కార్డులు ఉంటేనే లాడ్జీలు, సత్రాల్లోకి భక్తులను అనుమతించాలని, నిత్యం కార్డెన్ సర్చ్, తనిఖీలు చేపట్టాలన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకొని పోలీసు శాఖకు మంచి పేరును తీసుకురావాలని పేర్కొన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రక్షణ పరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ ప్రజలను కోరారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీలు శివరామ్‌ప్రసాద్, ఐ.వెంకటేష్, ఓఎస్‌డీ రవిప్రకాష్, కమాండెంట్ చంద్రమౌళి, డీఎస్పీలు జే.బాబు ప్రసాదు, ఏజీ కృష్ణమూర్తి, వినోద్‌కుమార్,రామచంద్ర, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు పార్థసారథి, కృష్ణయ్య, ఆర్‌ఐలు రంగముని, జార్జ్ పాల్గొన్నారు.
Advertisement