బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి
- శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
- వైభవంగా ధ్వజావరోహణ
శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామి సన్నిధిలో ఈ నెల 17న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఇందులో భాగంగా 9రోజులపాటు స్వామిఅమ్మవార్లకు నిత్యహోమబలిహరణలు, జపానుష్టానములు, స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు నిర్వహించారు. ప్రతి రోజూ శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి, హంస, మయూర, రావణ, పుష్పపల్లకీ, గజ, నంది వాహనాలపై ఆవహింపజేసి గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 4లక్షల మందికిపైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అంచన. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆదివారం జరిగిన యాగపూర్ణాహుతి సందర్భంగా అష్ట దిక్కుల్లో బలిహరణలను సమర్పించారు.
ఈఓ నారాయణభరత్‌గుప్త దంపతులు, అర్చకులు, వేదపండితులు సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు తదితర పూర్ణాహుతి ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించారు. అనంతరం వసంతోత్సవంలో భాగంగా అర్చకులు వసంతాన్ని (పసుపు, సున్నంతో కలిసిన మంత్రపూరితజలం) పూర్ణాహుతిలో పాల్గొన్న వారందరిపై చల్లారు. ఆ తరువాత చండీశ్వరుడిని ఆలయప్రదక్షణ చేయించి మల్లికాగుండం వద్దకు తీసుకువచ్చి త్రిశూల స్నానం చేయించారు.
ఉత్సవాల ముగింపు సూచనగా ధ్వజావరోహణ..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17న ప్రారంభంగా కాగా ఉత్సవాల ఆరంభ సూచనగా అదేరోజు రాత్రి 8.30 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమ పూజలను నిర్వహించి ధ్వజపటాన్ని ధ్వజస్తంభం నుంచి శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య కిందకు దింపారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, ఏఈఓ కృష్ణారెడ్డి, శ్రీశైలప్రభ సహాయ సంపాదకులు వెంకటబ్రహ్మాచార్య, ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్, అర్చకులు, వేదపండితులు, వివిధ విభాగాల సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.