ధర్మగుండంలో అడుగంటిన నీళ్లు.. స్నానాల కోసం తిప్పలు పడుతున్న భక్తులు
వేములవాడ: ఎములాడ రాజన్నను దర్శించుకునే ముందుకు భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం, సుందరీకరణలో భాగంగా గుడిచెరువును మట్టితో నింపి చదును చేయడంతో పక్కనే ఉన్న రాజన్న ధర్మగుండంలో నీళ్లు అడుగంటాయి. ఉన్నకొద్దిపాటి కలుషిత నీటిలో కొందరు స్నానానాలు కానిచ్చేస్తుండగా, చాలామంది వెనుదిరుగుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ఆలయ అధికారులు చేష్టలుడిగి చూడడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది.
శివునికే నీటి కటకట..
గంగను ఒదిగిన గంగాధరుడు శివుడు.. అలాంటి శివయ్యకే నీటికటకట ఎదురైంది. తమ ఇలవేల్పు ఎములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకుని కోర్కెలు తీర్చుకోవాలని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ధర్మగుం డంలో స్నానాలు చేయడం గగనంగా మారింది. అడుగంటిపోయిన నీటితో అవస్థలు పడుతున్నారు. లోతైన ధర్మగుండంలోకి మెట్లపైనుంచి దిగి ఉన్నకొద్దిపాటి మురుగునీటిలోనే స్నానా లు చేసి పైకి రావడం చుక్కలను చూపిస్తోంది.
గుండం స్నానాలు శ్రేష్ఠం..
ధర్మగుండంలో స్నానాలు చేయడాన్ని భక్తులు శ్రేష్ఠంగా భావిస్తారు. చలిని సైతం లెక్కచేయ తొలుత పుష్కరిణిలో స్నానాలు చేస్తారు. ఆ త ర్వాతే క్యూలైన్లలోకి వెళ్లి కోడెమొక్కు, ఇతర మొ క్కులు చెల్లించుకుంటారు. ధర్మగుండంలో ఇ ప్పుడు నీళ్లులేక స్నానాలు ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ధర్మగుండంలోకి దిగి మెట్ల ద్వారా పైకి ఎక్కేందుకు అవస్థలు పడుతున్నారు. కొందరు ధర్మగుండంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ కింద స్నానాలు చేస్తున్నారు.
ముందుచూపు లేదు..
రాజన్నను దర్శించుకునేందుకు రెండు నెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కానీ, ధర్మగుండంలోని నీటికొరతను అధిగమించాలనే ఆలోచన రాజన్న ఆలయ అధికారులకు రాలేదు. ఓవైపు ఎల్‌ఎండీ, మధ్యలో మిడ్‌మానేరులో నీరున్నా ఇక్కడకు తరలించేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయడంలేదు. అధికారుల ముందుచూపు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి.
తానం ఎట్ల జేసుడు?
రాజన్నకు మొక్కు చెల్లించుకునేందుకు వచ్చినం. గుండంలో నీళ్లులేవు. తానం ఎట్ల జేసుడో అర్థమైతలేదు. ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా గుండంల నీళ్లు ఉంచకపోతే ఎట్లా..? అధికారులు గింత నిర్లక్ష్యం జేయొద్దు.
– రాజేశ్వరి, భక్తురాలు, వరంగల్
నీళ్లు నింపుతాం
మహాశివరాత్రి జాతర వరకు ధర్మగుండంలో నీళ్లు నింపుతాం. ఇందుకోసం ఎల్‌ఎండీ పైప్‌లైన్ వినియోగిస్తాం. మరికొన్ని బోర్లు కూడా ఏర్పాటు చేస్తాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాం.
– దూస రాజేశ్వర్,రాజన్న ఆలయ ఈవో
Comments
Please login to add a commentAdd a comment