పుష్కరం తరుముకొస్తోంది.. పనులు పూర్తయ్యేదెప్పుడో? | Yet still in the works .. | Sakshi
Sakshi News home page

పుష్కరం తరుముకొస్తోంది.. పనులు పూర్తయ్యేదెప్పుడో?

Published Mon, Jul 11 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM

Yet still in the works ..

ప్రధాన ఘాట్లన్నీ ఇంకా పనుల దశలోనే..
పుష్కరాలకు నెలరోజులే సమయం
టైమ్ దగ్గర పడటంతో హడావుడి మేళం
నాణ్యతకు తిలోదకాలు
పుష్కరాల నాటికి పూర్తయ్యేది డౌటే..!

 

చైనా డిజైన్లు అన్నారు.. అంతర్జాతీయ ఘాట్లు.. రివర్ ఫ్రంట్లు.. రోడ్లకు ఇరువైపులా గ్రీనరీ అని మభ్యపెట్టారు. 2.5 కిలోమీటర్ల పొడవునా ఒకటే ఘాట్ అంటూ హడావుడి చేశారు. కృష్ణా, గోదావరి పవిత్ర సంగమ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ కోతలు కోశారు. ప్రభుత్వం చెప్పిన ఆ మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. అభివృద్ధి మాట అటుంచితే పుష్కరాల నాటికి కనీసం ఘాట్లయినా ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నెల రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానుండగా, ఇంకా కనీసం 25శాతం పనులు కూడా పూర్తికాలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కీలకమైన ఘాట్ల వద్ద పరిస్థితిని ‘సాక్షి’ పరిశీలించగా, అసంపూర్తి పనులు, బురదతో నిండిన రేవులే కనిపించాయి.     - సాక్షి, విజయవాడ

 

 

ఆలస్యంగా పనులు.. భక్తులకు వెతలు
అమరావతి : రాజధాని అమరావతిలోనూ పుష్కర స్నానఘట్టాల పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వర్షాల వల్ల ఈ ఆలస్యం రెట్టింపు అవుతోంది. ధ్యానబుద్ధ విగ్రహం నుంచి అమరేశ్వర స్నానఘాట్‌ను కలుపుకొని సుమారు 1.3 కిలోమీటర్ల మేర ఘాట్‌ను రూ.16కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు కాంక్రీట్ పనులు 30శాతం పూర్తయ్యాయి. అమరేశ్వర ఘాట్‌లో గ్రానైట్ పనులు పూర్తయినా.. ఆంజనేయస్వామి ఘాట్‌లో కాలేదు.  పుష్కరాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పనులు హడావుడిగా చేస్తున్నారు. దీనివల్ల నాణ్యత తగ్గుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరేశ్వరస్వామి గుడికి ఉత్తరం వైపు పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అలాగే, అమరేశ్వరస్వామి దేవస్థానం మొదటి ప్రాకారంలో నేలను చదును చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఆలయాలకు రంగులు వేసే పని 60 శాతం పూర్తయింది. రెండు, మూడో ప్రాకారంలో గ్రానైట్ వేయడం పూర్తవుతోంది. క్యూలైన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

 

30 రోజులు గడువు..30 శాతం పనులు పూర్తి
తాడేపల్లి (తాడేపల్లి రూరల్) : సీతానగరంలో కృష్ణానది ఒడ్డున ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి సుమారు అర కిలోమీటరు పొడవున నిర్మిస్తున్న పుష్కర ఘాట్ పనులు 30 శాతం కూడా పూర్తికాలేదు. గతంలో ఐదు ఘాట్లు ఉండగా అన్నింటినీ కలుపుతూ ఒకే ఘాట్‌గా నిర్మిస్తున్నారు. ఈ ఘాట్‌లో ఇంకా కాంక్రీట్ పనులు కూడా పూర్తికాలేదు. పనులు పూర్తయిన తర్వాతే మెట్ల నిర్మాణం చేపట్టి టైల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అరకిలోమీటరు పొడవున నిర్మిస్తున్న ఈ ఘాట్లను సగం వరకూ కూడా కాంక్రీట్ పనులు పూర్తికాలేదు. పాత ఘాట్లకు మాత్రం శుక్రవారం నుంచి టైల్స్ అంటించే కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. ఘాట్లకు వాటరింగ్ కూడా చేయట్లేదు. బ్యారేజీ నుంచి పుష్కర ఘాట్ల వరకూ కృష్ణానది ఒడ్డున ఉన్న రిటైనింగ్ వాల్ కూలిపోతున్నా పట్టించుకోకుండా సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. పుష్కర నగర్‌లు ఏర్పాటుచేసే విషయాల్లో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కింగ్, భక్తులు            వేచి ఉండేందుకు తాత్కాలిక వసతికి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

 

ఎప్పటికి పూర్తయ్యేనో..?
రేపల్లె : స్థానిక పెనుమూడి పుష్కర ఘాట్‌ను 500 మీటర్లకుపైగా దూరంతో నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.5.19 కోట్లు ఖర్చుచేసి ఈనెల 15వ తేదీ నాటికి పూర్తిచేసేలా పనులు           ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభమై 40 రోజులవుతున్నా 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు ఎలాగైనా పూర్తి  చేయాలనే లక్ష్యంతో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారన్న ఆరోపణలు          వెల్లువెత్తుతున్నాయి.

 

పవిత్ర సంగమం..  అగమ్యగోచరం
కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఇబ్రహీంపట్నం నుంచి తుమ్మలపాలెం వరకూ 2.1 కిలోమీటర్ల మేర పుష్కర ఘాట్‌ను నిర్మించాలని మొదట్లో నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ మట్టి పనులు మాత్రమే జరుగుతున్నాయి. నదిలో రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. కాంక్రీట్ ఫ్లోరింగ్, ఘాట్ పైన మెట్లు నిర్మించాల్సి ఉంది. తొలుత నిర్ణయించినట్లు 2.1 కిలోమీటర్ల నిర్మాణం సాధ్యంకాదని భావించిన అధికారులు 1.2 కిలోమీటరుకు కుదించారు. గోదావరి జలాలు వస్తున్న వైపు 275 మీటర్లు ఘాట్‌ను నూతనంగా నిర్మించాలని నిర్ణయించి ఇటీవలే పనులు ప్రారంభించారు. గోదావరి నీరు వచ్చే కాల్వపై ఫుట్‌బ్రిడ్జిలు నిర్మించాలని, ఘాట్‌కు గ్రానైట్ రాళ్లు వేయాలని అధికారులు భావించారు. ప్రస్తుతం సమయాభావం వల్ల ఫుట్‌బ్రిడ్జిలకు స్వస్తి పలికారు. గ్రానైట్ రాళ్లకు బదులుగా సాధారణ టైల్స్ వేస్తున్నారు.

 

హారతి వేదిక ఏమైనట్టు?
కృష్ణా-గోదావరి సంగమం వద్ద కృష్ణమ్మ హారతులు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నది మధ్యలో శాశ్వత నిర్మాణం ఏర్పాటుచేసి అక్కడ హారతులు నిర్వహిస్తామని కూడా చెప్పింది. ఇప్పటివరకు అక్కడ ఏవిధమైన ఏర్పాట్లు జరుగుతున్న దాఖలాలు లేవు. ఇబ్రహీంపట్నం నుంచి ఫెర్రి ఘాట్ వరకూ వెళ్లే మార్గం పనులు చేస్తున్నారు. ఇక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేస్తామనే విశ్రాంతి ప్రదేశంలోనూ పనులు ఏమాత్రం జరగడం లేదు.

 

ప్రతిపాదనలు పక్కకు..
ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి భవానీపురంలోని భవానీఘాట్ వరకూ 2.3 కిలోమీటర్లు ఒకటే ఘాట్ నిర్మించాలని తొలుత భావించారు. అయితే, మధ్యలో హెడ్‌వాటర్ వర్క్స్ వెల్స్ ఉండటంతో పున్నమి ఘాట్ నుంచి భవానీ ఘాట్ వరకూ 1.5 కిలోమీటర్ల మేర ఒకటే ఘాట్ నిర్మించాలని నిర్ణయించారు. భవానీ ఘాట్ వద్ద 700 మీటర్ల ఘాట్‌ను నిర్మించాలని తొలుత నిర్ణయించినా పుష్కరాల నాటికి 300 నుంచి 350 మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణం పూర్తికాకపోవచ్చని భావిస్తున్నారు. గతంలో వందమీటర్ల ఘాట్ ఉండేది. దీన్ని తొలగించి ఏకఘాట్ చేయాలని నిర్ణయించి తిరిగి నిర్మించడం ప్రారంభించారు. మిగిలిన ఘాట్లతో పోలిస్తే ఇక్కడ పనిలో కాస్త పురోగతి కనిపిస్తోంది. మట్టి పనులు పూర్తయ్యాయి. కాంక్రీట్ వర్క్ ప్రారంభించారు. పున్నమి ఘాట్ 800 మీటర్లకు గానూ 300 మీటర్లకు మించి పూర్తికాకపోవచ్చని ఇంజినీర్లు భావిస్తున్నారు. నదిలో కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఇంకా మెట్ల నిర్మాణం జరగాల్సి ఉంది. పున్నమి ఘాట్‌కు వెళ్లే మార్గంలో ఇళ్లు తొలగించారు కానీ రోడ్ల నిర్మాణం ప్రారంభించకపోవడంతో పుష్కరాల నాటికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

 

నత్తనడకన దుర్గాఘాట్ పనులు
ప్రకాశం బ్యారేజీ నుంచి దుర్గాఘాట్ చివరి వరకూ 0.8 కిలోమీటరు మేర ఒకే ఘాట్‌ను నిర్మిస్తున్నారు. దీన్ని తొలుత చైనా బృందం సహాయంతో నిర్మించాలని భావించారు. అయితే వారివద్ద యంత్రపరికరాలు లేకపోవడంతో సోమా కంపెనీకి అప్పగించారు. గతంలో ఉన్న వీఐపీ ఘాట్‌ను, దుర్గాఘాట్‌ను పూర్తిగా తొలగించి అక్కడ నిర్మాణం పనులు చేపట్టారు. ఘాట్‌ను నదిలోకి విస్తరిస్తున్నారు. నదిలో రిటైనింగ్‌వాల్, ఫ్లోరింగ్ ఒకవైపు జరుగుతుంటే ఘాట్ పై భాగంలో మట్టిపనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 25 శాతం మించి పనులు జరగలేదు. ఈ ఘాట్‌పైనే వత్తిడి ఉంటుందని భావిస్తున్న అధికారులు దీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

సా..గుతూ..
ప్రకాశం బ్యారేజీ దిగువన అప్రాన్ నుంచి కృష్ణవేణి, పద్మావతి, సీతమ్మవారి పాదాలు తదితర ఘాట్లన్నీ కలిపి ఒకే ఘాట్ కింద  సుమారు 2.3 కిలోమీటర్ల            పొడవున నిర్మిస్తున్నారు. నదిలో నీరు లేకపోవడం, గతంలో ఇక్కడ ఘాట్లు ఉండటం వల్ల కొంతమేర పనులు వేగంగా జరుగుతున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో ఇక్కడ పుష్కర కాల్వలు తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు నదిలో పుష్కర కాల్వ తవ్వకం పనులతో పాటు మట్టిపని, కాంక్రీట్ వర్క్ జరుగుతోంది. ఘాట్‌లో నుంచి రోడ్డు మీదకు వచ్చే మార్గాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.

 

ఆలస్యానికి కారణాలు ఇవే..
ఘాట్ల నిర్మాణం పనులు గత ఏడాది ఆగస్టులో గోదావరి పుష్కరాలు           అవ్వగానే ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిజైన్ల ఖరారు, కాంట్రాక్టర్లకు నామినేషన్‌పై అప్పగింత, ఇంజినర్ల కేటాయింపులో జాప్యం  కారణంగా గత మే 15 వరకు పనులకు శ్రీకారం చుట్టలేదు. దీంతో ఇప్పుడు పగలు రాత్రి హడావుడిగా చేయాల్సి వస్తోంది.వాస్తవంగా ఎండాకాలంలో జరగాల్సిన పనులు వర్షాకాలం ప్రారంభమయ్యాక చేస్తుండటంతో ముందుకు సాగని పరిస్థితి.


 ప్రకాశం బ్యారేజీ ఎగువన నదిలో నీరు ఉంది. మట్టిపనులు చేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. నీటి ప్రవాహానికి అడ్డుకట్టవేసిన తరువాత పనులు చేయాల్సి వస్తోంది.ఘాట్లకోసం గోతులు తవ్వుతుంటే నీరు వస్తూనే ఉండటం కూడా   ఆలస్యానికి మరో కారణం. ఒకవైపు ప్లైఓవర్, మరోవైపు పుష్కరఘాట్ల నిర్మాణ పనులు జరగడం వల్ల పనులు అనుకున్నంత వేగంగా        జరగట్లేదు.


అనేక ప్రాంతాల్లో పేదలు నివసిస్తున్న ఇళ్లను ఖాళీ చేయించాలి. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం, కోర్టు నుంచి స్టే తీసుకురావడంతో అధికారులు పనులు వేగంగాచేయలేకపోతున్నారు. పవిత్ర సంగమం వద్ద జంగిల్ క్లియరెన్స్ ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. మే 15వ తేదీ వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం, ఉన్న సమాయాని కంటే ఎక్కువ  పనిని అప్పగించడంతో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు.


కాంట్రాక్టర్లకు సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో  పెద్దమొత్తంలో సిబ్బందిని నియమించి పనులు చేయించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఒకవైపు పుష్కర పనులు నత్తనడకన సాగుతుంటే పుష్కరాల విధుల్లో ఉన్న ఇంజినీర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్‌ఈ నుంచి జేఈల వరకూ బదిలీ చేయడం, బదిలీ అయిన వారికి కొత్తచోట చార్జింగ్ తీసుకుని, తిరిగి ఇక్కడకు వచ్చి విధులు నిర్వహించమని చెప్పడం కూడా ఒక కారణమే.


ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు, అధికారులు తనిఖీలు చేస్తూ               హడావుడి చేయడమే తప్ప             వాస్తవంగా పుష్కరాలు ఎంతమేరకు చేయాలనే అంశంపై కాంట్రాక్టర్లకు స్పష్టత ఇవ్వడం లేదు. పుష్కరాల  తరువాత కూడా పనులు చేయాల్సి ఉండటంతో అయినంత వరకే    చేద్దామనే ఆలోచనలో కాంట్రాక్టర్లు ఉన్నట్టు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement