
వావిలాల ఘాట్‌లో జయంతి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు(ఇన్‌సెట్) వావిలాల గోపాల కృష్ణయ్య(ఫైల్)
‘ఆంధ్రాగాంధీ’గా పిలవబడే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాల కృష్ణయ్యను పాలకులు విస్మరించారు. ఆయన పరమపదించి 15 ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన దాఖలాలు లేవు. ఉమ్మడి మద్రాసులో నాలుగుసార్లు సత్తెనపల్లి నుంచి శాసనసభలో ప్రాముఖ్యత వహించారు.1974–77 కాలంలో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. పద్మభూషణ్, కళాప్రపూర్ణ పదవులు అలంకరించినప్పటికీ ఆయన పట్ల నేటికి పాలకులకు కనీసం గౌరవం ఇవ్వకపోవటం పట్ల మేధావులు, అభిమానులు,ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సత్తెనపల్లి/ముప్పాళ్ల :నిరంకుశ పాలనపై తిరుగుబాటుదేశ స్వాతంత్య్రం కోసం తెల్లదొరల అన్యాయాలు, అకృత్యాలపై పోరాడిన వారిలో స్వాతంత్య్ర సమరయోధులు, సత్తెనపల్లి మాజీ శాసన సభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య ప్రముఖులు. చూడటానికి చేతికి సంచి తగిలించుకొని సాదా సీదాగా కనిపించే ఆయన సాయుధ పోరాటంలో భాగంగా విప్లవ బాట పట్టారు. 1906 సెప్టెంబరు 17న సత్తెనపల్లిలో ఆయన జన్మించారు. ఉన్నత విద్య అభ్యసించనప్పటికీ జాతిని చైతన్య పరిచేందుకు ప్రత్యేక కథనాలతో ప్రజల్లో దేశ భక్తిని నూరిపోశారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలుకొని మహాత్మ గాంధీ పిలుపునిచ్చిన అన్ని ఉద్యమాల్లో పాల్గొనటమేకాక ఉద్యమాలను ముందుకు నడిపారు. పల్నాడు అపరగాంధీగా పేరుగడించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.
ప్రజాసేవకు అంకితం...
స్వాతంత్య్రం వచ్చాక ప్రజాసేవకు వావిలాల గోపాలకృష్ణయ్య మరింత చేరువయ్యారు. 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం ఏర్పడడంతో ఇక్కడ పోటీచేసి తొలి శాసనసభ్యుడుగా ప్రజలకు సేవలు అందించారు. 1952, 1955, 1962, 1972 ఎనికల్లో వరుసగా నాలుగు పర్యాయాలు శాసన సభ్యుడిగా విజయం సాధించి 19 ఏళ్లపాటు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు. ఆయన చేపట్టిన కృషి ఫలితం వల్లే శాతవాహన నూలు మిల్లు, ఫణిదం చేనేత సహకార సంఘం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటయ్యాయి. మద్యపాన నిషేధ ఉద్యమ సంస్థ బాధ్యుడిగా, గ్రంథాలయ ఉద్యమ రథసారధిగా, దళిత, గిరిజనోద్ధరణ ఉద్యమ నాయకుడిగా ఆయన ముందున్నారు. పద్మ భూషణ్‌తో పాటు ఎన్నో పురస్కారాలు, సత్కారాలను అందుకున్నారు. ప్రజల కోసం, ప్రజలతో జీవించి 2003 ఏప్రిల్ 29న అనారోగ్యంతో వావిలాల గోపాలకృష్ణయ్య మృతి చెందారు. ఆయన శత జయంతిని పురస్కరించుకొని 2006 సెప్టెంబర్ 14న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్తెనపల్లి తాలుకా సెంటర్‌లో వావిలాల గోపాలకృష్ణయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. గాంధీ చౌక్ నుంచి అచ్చంపేటకు వెళ్లే రోడ్డులో కాలనీకి వావిలాల వారి వీధిగా పేరు పెట్టారు.
వెలవెలబోతున్న ఘాట్..
2003లో ఆయన అంత్యక్రియలకు హాజరైన అప్పటి,ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు ఎకరాల్లో వావిలాలఘాట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నేటికీ అమలుకు నోచుకోలేదు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఎన్నికైన ప్రస్తుత స్పీకర్ డా.కోడెలశివప్రసాదరావు రెండేళ్ల క్రితం వావిలాల స్మృతివనానికి రూ.కోటిన్నర నిధులు మంజూరు చేస్తూ వేసిన శిలాఫలకం అలంకారంగానే మారింది. కేవలం ప్రహరీతోనే సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం వావిలాల ఘాట్ పై ఉన్న టైల్స్ కూడా ఊడిపోయాయి. అక్కడ మద్యం సీసాలు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.
నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వావిలాల జయంతి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నేతృత్వంలో శనివారం ఘాట్‌ను పరిశీలించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు. సోమవారం ఉదయం 9 గంటలకు వావిలాల ఘాట్‌లో జయంతి వేడుకలు నిర్వహించేలా ఘాట్‌లో పనులు చేస్తున్నారు. జయంతి వేడుకలకు వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కోనరఘుపతి, లావురత్తయ్య,ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు.
మద్యపాన వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ని మద్యపాన వ్యతిరేక దినంగా ప్రకటించాలి. 2015 లో ప్రభుత్వం వావిలాల జయంతి,వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి అర్జీ అందించినా స్పందన లేదు. మండలి బుద్ధప్రసాద్ చొరవతో గతేడాది తూతుమంత్రంగానే నిర్వహించారే తప్ప ప్రభుత్వం అధికారికంగా చేపట్టింది లేదు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కూడా నేటికీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమీ లేవు. ప్రభుత్వం పరంగా నిర్వహించటానికి అడ్డంకులు ఉంటే కుటుంబ సభ్యులమే ఆ బాధ్యతను నిర్వహించుకుంటాం.–భువనగిరి వెంకటరమణ(మేనల్లుడు),షోడేకర్ మన్నవ(మనుమడు )
Comments
Please login to add a commentAdd a comment