పుష్కరాలకు భారీ బందోబస్తు
17,500 మంది పోలీసులు
19 జోన్లు, 74 సెక్టార్లుగా విభజన
ఏ ఫ్లస్ ఘాట్‌ల్లో ఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణ
సాక్షి, విజయవాడ :
కృష్ణా పుష్కరాలకు విజయవాడ కమిషనరేట్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర బలగాలను నగరంలో బందోబస్తు కోసం తరలించారు. పుష్కర విధులకు ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు 10 మందిని, 14 మంది ఎస్పీ స్థాయి అధికారులను, 19 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు.
విజయవాడలోని కీలక ఘాట్లు అన్ని ఐజీల పర్యవేక్షణలోనే ఉన్నాయి. పవిత్ర సంగమం ఘాట్‌లో ఐజీ కె.సత్యనారాయణ, ఎస్పీ స్థాయి అధికారులు ముగ్గురు బందోబస్తు పర్యవేక్షించనున్నారు. మూడు షిప్టులు కలిపి ఇక్కడ 1500 మందిని పోలీసులను ఏర్పాటు చేశారు. కీలక ఘాట్ కావటంతో మూడు డ్రోన్లు, 29 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలోని పున్నమి, భవానీ, దుర్గా ఘాట్‌లను ఐజీసూర్యప్రకాష్ పర్యవేక్షించనున్నారు. మూడు షిప్టులు కలిపి 1700 మంది పోలీసులు బందోబస్తులో ఉండగా 30 సీసీ కెమెరాలు, నాలుగు డ్రోనుల ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 1.1 కిలోమీటర్ విస్తీర్ణం ఉన్న పద్మావతి ఘాట్‌ను ఐజీ బత్తిన శ్రీనివాస్ పర్యవేక్షిస్తారు. ఎస్పీ స్థాయి అధికారి, ఇద్దరు ఏఎస్పీ స్థాయి అధికారులు విధుల్లో ఉంటారు. మూడు షిప్టుల్లో కలిపి 800 మంది పోలీసులు విధుల్లో న్నారు. ఇక్కడ కూడా 30 సీసీ కెÐమెరాలు 2 డ్రోన్లు వినియోగిస్తున్నారు. పోలీసులతో పాటు స్వచ్ఛందంగా పని చేసేందుకు సుమారు 4 వేల మంది పుష్కర సేవక్‌లను సేవలకు వినియోగిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా ఐడీ కార్డులు క్యాప్, జాకెట్ ఇచ్చి డ్రస్‌కోడ్ ఏర్పాటు చేశారు. పుష్కరాలకు తొలి రోజున 14 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా. రద్దీని నియంత్రించటానికి అన్ని చర్యలు తీసుకున్నారు.
19 జోన్లు... 74 సెక్టార్లు..
కమిషనరేట్ పరిధిలో మొత్తం 43 ఘాట్లు ఉన్నాయి. వీటిలో 22 ఏ ఫ్లస్ ఘాట్లు ఉన్నాయి. అలాగే ఏ ఘాట్లు–3, సీ ఘాట్లు–17 ఉన్నాయి. విజయవాడ నగరాన్ని 19 జోన్లుగా విభజించారు. వీటిలో 74 సెక్టార్లుగా విభజించి 17,500 మంది పోలీసులు బందోబస్తు విధుల్లోకి వచ్చారు. వీరిలో 260 మంది ఇన్‌స్పెక్టర్లు, 850 మంది ఎస్‌ఐలు, 2,700 మంది ఎఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 7,500 మంది కానిస్టేబుల్స్, 650 మహిళా కానిస్టేబుల్స్, 4,000 హోంగార్డులు, 57 సాయుధ బలగాలు విధుల్లో ఉంటారు.