ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం(ఈరోజు) భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం దేశప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా భారత్ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో భారత జట్టు అభిమానులు ముక్తేశ్వర్ ధామ్‌లోని గంగా ఘాట్ వద్ద భారీగా పూజలు నిర్వహించి ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’ అని వేడుకున్నారు. గంగామాత ఆశీర్వాదాలు భారత టీమ్‌కు ఉంటాయని వారు అంటున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ ఒకే స్వరంతో ‘ఆల్ ది బెస్ట్ ఇండియా’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి సారధ్యం వహించిన జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు చందేశ్వర్ ప్రసాద్ సిన్హా అలియాస్ బోడి సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దేశం విజయం సాధించేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, మన టీమ్ విజయం కోసం ప్రార్థనలు చేశామన్నారు.
క్రికెట్ అభిమాని రంజిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ఈసారి ప్రపంచకప్ క్రికెట్‌లో భారత జట్టు తప్పకుండా మన జెండాను ఎగురవేస్తుందని’ అన్నారు. ప్రపంచకప్ 2023లో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ ఇరు జట్లకు ఆదివారం చివరి మ్యాచ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: మ్యాచ్ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో..
Comments
Please login to add a commentAdd a comment