ఈ బాబా వాచీ ఖరీదు రూ.27 లక్షలట!
హరిద్వార్: సాధారణంగా బాబా, సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి అనుకుంటాం. కానీ ఇటీవల హరిద్వార్‌లో అర్ధ కుంభమేళాకు హాజరైన ఓ బాబాను చూస్తే ఈ అభిప్రాయం తప్పేమోనన్న అనుమానం కలుగుతుంది. ఒంటి నిండా బంగారంతో మెరిసిపోతూ సదరు సన్యాసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఏకంగా మూడున్నర కిలోల బంగారాన్ని ధరించి గంగానదిలో స్నానమాచరించి వస్తున్న బాబాను చూసి అక్కడున్నవారంతా నోళ్లు వెళ్లబెట్టారు.
కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు, కమండలం తదితరాలతో సాదాసీదాగా ఉండాల్సిన సన్యాసి కాస్తా రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో మెరిసిపోయాడు. ఒకటా రెండా మెడ నిండా బంగారు గొలుసులు, లాకెట్లు.. అన్ని చేతివేళ్లకు బరువైన ఉంగరాలు. చేతికి పెద్ద వెడల్పాటి కడియం, డైమండ్ వాచ్. ఇలా సన్యాసులకు భిన్నమైన అవతారంతో తన శిష్యులు, అనుచరుల మందీ మార్బలంతో గంగా స్నానమాచరించడం ఆసక్తికరంగా మారింది. వజ్రాలు పొదిగిన ఆయన చేతి వాచీ సుమారు రూ. 27 లక్షల ఖరీదు చేస్తుందట.
అయితే సన్యాసికి ఇంత బంగారం ఎందుకు అని ఎవరైనా అంటే ఈ బాబా అనుచరులు, శిష్యులకు కోపం వస్తుంది. బంగారం ఎంత స్వచ్ఛమో, ఎంత అమూల్యమో తమ గురువుకూడా అంతే విలువైనవాడంటూ వెనకేసుకొస్తున్నారు. మా గోల్డెన్ బాబా సేవలు అమూల్యమైనవంటూ మురిసిపోతున్నారు
కాగా గోల్డెన్ బాబాగా చెప్పుకునే ఈయన గతంలో ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసేవాడట. ఈయన అసలు పేరు సుధీర్ కుమార్ మక్కడ్(53 ). అయితే అప్పుడు ఎన్నో పాపాలు, పొరబాట్లు చేశానంటున్నాడీ గోల్డెన్ బాబా. ఆ పాపాలను కడిగేసుకోవడానికి సన్యాసిగా మారిపోయానంటున్నాడు. వ్యాపారం చేసే క్రమంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సన్యాసం స్వీకరించానని చెబుతున్నాడు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కష్టపడుతున్న పేద తలిదండ్రులకు, ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు సహాయం చేస్తుంటానని చెబుతున్నాడు.