ఘాట్ల సమీపంలో లిక్కర్ బంద్
ఘాట్ల సమీపంలో లిక్కర్ బంద్
Published Wed, Aug 3 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
సాక్షి, విజయవాడ :
కృష్ణా పుష్కరాల సమయంలో మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. పుష్కర ఘాట్లకు 500 మీటర్ల దూరంలోని మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించింది. మద్యం విక్రయాలను కూడా కొంతమేర తగ్గించి పుష్కర భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మద్యం షాపుల జాబితాలు సిద్ధం..
జిల్లాలోని 71 పుష్కర ఘాట్లకు 500 మీటర్లు, అంతకన్నా తక్కువ దూరంలో ఉన్న వైన్ షాపుల జాబితా సిద్ధం చేశారు. విజయవాడ బస్టాండ్ ఎదుట నిర్మించిన పద్మావతి ఘాట్ సమీపంలో మూడు బార్లు, రెండు వైన్ షాపులు ఉన్నాయి. వీటిని పుష్కరాలు జరిగే 12 రోజులపాటు మూసివేస్తారు. పున్నమీఘాట్‌కు దూరంగా భవానీపురంలో ఉన్న కొన్ని వైన్‌షాపులపై ఆంక్షలు విధిస్తారు. జిల్లాలోని ఉయ్యూరు మండలం బుద్దిరాజుపాలెంలో ఘాట్‌కు సమీపంలో ఉన్న ఒక షాపుతోపాటు అవనిగడ్డలో రెండు షాపులను మూసివేస్తారు.
రివర్ బెల్ట్‌లో కూంబింగ్
గత కృష్ణా పుష్కరాలు(2004) సమయంలో మద్యానికి సంబంధించిన కేసులు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న సారా బట్టీల నిర్వాహకులు, పాత నేరస్థులను గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల నుంచి అన్నిచోట్ల బెల్ట్ షాపులు, సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేస్తారు. ఈ ప్రక్రియను మరో రెండు రోజుల్లో ప్రారంభిస్తారు. జగ్గయ్యపేట ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా నుంచి సారా ఎక్కువగా దిగుమతి అయ్యే అవకాశం ఉంది. విస్సన్నపేట మండలంలోని కొన్ని తండాల్లో సారా తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లా సరిహద్దులోని ఎక్సైజ్ చెక్‌పోస్ట్‌ల్లో తనిఖీలు ముమ్మరం చేసి 12రోజులపాటు గస్తీ పెంచనున్నారు. సీఐలు, ఇతర అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి రివర్ బెల్ట్‌లో కూంబింగ్ నిర్వహిస్తారు. మద్యం ఉధృతి తగ్గించటానికి ప్రత్యేకంగా మొబైల్ టీములు పని చేయనున్నాయి. ఈ మేరకు అన్ని విధాలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని ఎక్సైజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ బి.అరుణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా తమ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement