కంటతడి | YSR congress candidate Sobha Nagireddy killed in road accident | Sakshi
Sakshi News home page

కంటతడి

Published Fri, Apr 25 2014 2:53 AM | Last Updated on Mon, Oct 22 2018 5:46 PM

YSR congress candidate Sobha Nagireddy killed in road accident

సాక్షి, కడప : భూమా శోభా నాగిరెడ్డి మరణాన్ని జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాతో ఆమెకు ఉన్న అనుబంధం తలచుకుని తల్లడిల్లిపోతున్నారు.  కన్నీటిపర్యంతమవుతున్నారు. బాధాతప్త హృదయాలతో ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శోక సద్రంలో మునిగి పోయారు. వైఎస్సార్‌సీపీలో  చురుకైన నేతగా జిల్లా వాసులలో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు.  శోభానాగిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న  ఆళ్లగడ్డ జిల్లాకు పొరుగునియోజకవర్గమే.   
 
 జిల్లాలోని ప్రజలతో వారి  కుటుంబానికి ప్రత్యే క అనుబంధం ఉంది. ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజక వర్గాల ప్రజలతో ఆమెకు ప్రత్యక్ష సంబంధాలు, బంధుత్వాలున్నాయి.  ఏదైనా అవసరం వస్తే కొన్ని సందర్భాలలో ఆమెను కలిసి పనులు చేయించుకున్న సందర్భాలున్నాయి. జిల్లాకు తరచూ రావడంతో పాటు తమకు తెలిసిన వారికి ఏదైనా ఆపద వస్తే తక్షణమే స్పదించి బాధితులకు అండగా నిలవడం ఆమె ప్రత్యేకతగా జిల్లావాసులు పేర్కొంటున్నారు. ఏదైనా శుభకార్యాలకు తరచూ జిల్లాకు రావడంతో ఆమెకు జిల్లా వ్యాప్తంగా విస్తృత సంబంధాలున్నాయి.
 
 మైదుకూరు ఇన్‌ఛార్జిగా...
 కడప లోక్‌సభకు 2011 మేలో జరిగిన ఉప ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా శోభానాగిరెడ్డి పనిచేశారు. అప్పట్లో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని ధీటుగా ఎదుర్కొన్నారు. నాది మీ పక్క నియోజకవర్గమే.. ఏ సంఘటన జరిగినా అండగా ఉంటామని భరోసా ఇచ్చి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు. డీఎల్ రవీంద్రారెడ్డి కంచుకోట ఖాజీపేటలో సైతం పాగా వేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ మెజార్టీ తెచ్చేందుకు కృషి చేశారు. అప్పట్లో అన్ని మండలాల్లోని గ్రామీణప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఉప ఎన్నికల్లో 71 వేలకు పైగా మెజార్టీ సాధనలో ఆమె కీలక భూమిక పోషించారు.
 
 దీంతోపాటు బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల నియోజకవర్గాల్లో సైతం విసృ్తతంగా పర్యటించారు. పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు ప్రచారంలో చేదోడు వాదోడుగా ఉన్నారు.  పార్టీ తరుపున ఏ కార్యక్రమం జరిగినా, దీక్ష చేపట్టినా, పోరాటం చేసినా విజయమ్మ వెంటే శోభా నాగిరెడ్డి ఉన్నారు. వైఎస్ జగన్ అరెస్టు అయిన సమయంలో ఆమె వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. అవిశ్వాసానికి మద్దతుగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఇడుపులపాయలోని వైఎస్ సమాధి చెంతకు వచ్చినపుడు, పార్టీ ప్లీనరీ సమావేశం, షర్మిల పాదయాత్ర, వైఎస్ విజయమ్మ పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో ఆమె పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఈనెల 17వ తేదీన నామినేషన్ వేసే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. వైఎస్ తనయ, జగన్‌సోదరి షర్మిల రోడ్‌షోలో చివరిసారి పాల్గొని ఇంటికి వె ళుతూ ప్రమాదానికి గురయ్యారు. శోభానాగిరెడ్డి పార్థివదేహాన్ని చూసి వైఎస్ విజయమ్మ చలించిపోయారు.
 
 కొద్దిసేపు కంటతడి పెట్టారంటే ఆమెతో విజయమ్మకు ఉన్న అనుబంధం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ప్రచారాన్ని నిలిపివేసి హుటాహుటిన హైదరాబాదుకు చేరుకుని నివాళులర్పించారు. షర్మిలతోపాటు వైఎస్ భారతి తదితరులు తరలివెళ్లారు. రెండు రోజులపాటు పార్టీ సంతాప దినాలుగా ప్రకటించి అధికార ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలను రద్దు చేశారు.
 
 శోభా నాగిరెడ్డి మృతి తీరనిలోటు
 కమలాపురం, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీ  సీనియర్ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి తీరనిలోటు అని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఆమె మృతిపట్ల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వల్లూరు మండలంలో చేస్తున్న  ప్రచారాన్ని వారు అర్ధాంతరంగా ముగించుకుని  శోభానాగిరెడ్డి అంత్యక్రియలకు తరలి వెళ్లారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement