సాక్షి ప్రతినిధి, అనంతపురం : విశ్వసనీయతకు ఓటర్లు పట్టం కట్టినట్లు ఓటింగ్ సరళి స్పష్టం చేస్తోంది. రెండు లోక్‌సభ, 12 శాసనసభ స్థానాలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిక్యం చాటుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగినా.. అంతిమంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే ఓటర్లు దన్నుగా నిలిచినట్లు వెల్లడవుతోంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వృద్ధులు, మహిళలు, యువత, కార్మిక, కర్షకులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో 78 శాతం ఓట్లు పోలయ్యాయి.
‘పురం’లో శ్రీధర్‌రెడ్డిదే విజయం
హిందూపురం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి ఆధిక్యం చూపినట్లు ఓటింగ్ సరళి స్పష్టం చేస్తోందని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పపై ఉన్న వ్యతిరేకత పోలింగ్ సరళిలో స్పష్టమైందని, అధిక శాతం మంది ఓటర్లు దన్నుగా నిలిచిన నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టీకరిస్తున్నారు.
లోక్‌సభ స్థానం పరిధిలో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి బాలకృష్ణకు వచ్చే ఓట్లను నమ్ముకున్న నిమ్మల కిష్టప్ప.. బాలయ్య గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో విజయంపై ఆదిలోనే ఆశలు వదిలేసుకున్నారు. కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, మడకశిర, ధర్మవరం నియోజకవర్గాల్లో నిమ్మల కిష్టప్పపై శ్రీధర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత కనబరిచినట్లు తెలుస్తోంది. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలో మాత్రమే శ్రీధర్‌రెడ్డి, నిమ్మల క్రిష్టప్పల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగింది. అన్ని నియోజకవర్గాల్లోనూ శ్రీధర్‌రెడ్డికి అనుకూలంగా భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం.
ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి హవా..
ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ప్రలోభాలకు, బెదిరింపులకు ఓటర్లు లొంగలేదని బుధవారం నాటి పోలింగ్ సరళి చెబుతోంది. నిత్యం అందుబాటులో ఉంటూ జనంతో మమేకమయ్యే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డికి బాసటగా నిలిచారని స్పష్టమవుతోంది. వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు, బెళుగుప్ప మండలాల్లో విశ్వేశ్వరరెడ్డికి ఓటర్లు దన్నుగా నిలవడంతో స్పష్టమైన ఆధిక్యం చాటుకున్నట్లు తెలుస్తోంది. కూడేరులో ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగినా.. అంతిమంగా ఆ మండలంలోనూ విశ్వేశ్వరరెడ్డే మెజార్టీ సాధించనున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే వై.విశ్వేశ్వరరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఖాయమని వారు స్పష్టీకరిస్తున్నారు.
కళ్యాణదుర్గంలో తిప్పేస్వామి వైపే మొగ్గు
కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కురు వృద్ధుడు హనుమంతరాయ చౌదరి శాసనభలోకి అడుగుపెట్టాలన్న ఆశలను ఓటర్లు అడియాసలు చేసినట్లు పోలింగ్ సరళి స్పష్టీకరిస్తోంది. యువకుడు, విద్యావంతుడైన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బోయ తిప్పేస్వామికి ఓటర్లు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది. బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం రూరల్ మండలం.. కళ్యాణదుర్గం నగర పంచాయతీల్లో మెజార్టీ ఓటర్లు తిప్పేస్వామి వైపే మొగ్గు చూపినట్లు పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. ఒక్క కంబదూరు మండలంలో మాత్రమే హనుమంతరాయ చౌదరి ఉనికి చాటుకున్నట్లు తెలుస్తోంది.
రాయదుర్గంలో కాపు ‘హ్యాట్రిక్’ తథ్యం
రాయదుర్గం నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి గెలుపొందడం ద్వారా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని పోలింగ్ సరళి తేల్చి చెబుతోంది. మొత్తమ్మీద ఇక్కడ 85 శాతం ఓట్లు పోలయ్యాయి. లోక్‌సభపై ఆశలు వదిలేసుకున్న కాలవ శ్రీనివాసులు అసెంబ్లీలోనైనా అడుగుపెట్టాలన్న ఆశలను ఓటర్లు అడియాశలు చేసినట్లు తెలుస్తోంది. కాలవ శ్రీనివాసులుకు టీడీపీ శ్రేణులు సహాయ నిరాకరణ చేయడం.. సొంత సామాజికవర్గం నుంచి ఏమాత్రం ఆదరణ లభించకపోవడంతో పోలింగ్ ప్రారంభమైన రెండు మూడు గంటల్లోనే ఆయన విజయంపై ఆశలు వదిలేసుకున్నారని సమాచారం. రాయదుర్గం మునిసిపాల్టీతో పాటు అన్ని మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యత కనబరిచింది. 2012 ఉప ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ ఓట్ల ఆధిక్యంతో కాపు రామచంద్రారెడ్డి విజయం సాధించడం ఖాయమని పోలింగ్ సరళి తేల్చిచెప్పింది.
గుంతకల్లులో వైవీఆర్ జోరు
గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.వెంట్రామిరెడ్డి విజయం సాధించడం తథ్యమని పోలింగ్ సరళి స్పష్టీకరిస్తోంది. బీజేపీ అభ్యర్థి వెంకట్రామయ్యకు టీడీపీ శ్రేణులు దన్నుగా నిలవలేదు. టీడీపీ అభ్యర్థి జితేంద్రగౌడ్‌కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పొత్తు ధర్మాన్ని విస్మరించిన జితేంద్రగౌడ్‌పై ఓటర్లు తిరుగుబాటు చేసినట్లు పోలింగ్ సరళి తెలియజెప్పింది. గుంతకల్లు మునిసిపాలిటీతో పాటు గుత్తి, పామిడి నగర పాలక సంస్థలు, గుత్తి, పామిడి మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డికి స్పష్టమైన ఆధిక్యత కన్పించింది. గుంతకల్ రూరల్ మండలంలో మాత్రమే టీడీపీ కాస్త ఉనికిని చాటుకోగలిగింది. వీటిని పరిశీలిస్తే.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.వెంకట్రాంరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
శింగనమలలో జొన్నలగడ్డ హవా
శింగనమలలో విద్యావేత్త వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని పోలింగ్ సరళి తేల్చిచెబుతోంది. టీడీపీ అభ్యర్థి యామినీబాలను ఏ మండలంలోనూ ఓటర్లు ఆదరించలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి శైలజానాథ్‌కు డిపాజిట్ కూడా దక్కదని పోలింగ్ సరళిలో తేలింది. టీడీపీ బలంగా ఉండే బుక్కరాయసముద్రం మండలంలో వైఎస్సార్‌సీపీ హవా స్పష్టంగా కన్పించింది. యల్లనూరు, పుట్లూరు, నార్పల, గార్లదిన్నె, శింగనమలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ఆధిక్యం స్పష్టంగా కన్పించింది.
ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభంజనం
ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన అభివృద్ధి వైపు జనం మొగ్గిచూపినట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో లభించిన మెజార్టీ కన్నా ఎక్కువ ఓట్ల ఆధిక్యంతో ఈ ఎన్నికల్లో కేతిరెడ్డి విజయం సాధించడం ఖాయమని పోలింగ్ సరళి స్పష్టీకరించింది. టీడీపీ అభ్యర్థి వరదాపురం సూరి దౌర్జన్యాలను ఓటర్లు నిరసించినట్లు స్పష్టమవుతోంది. ధర్మవరం మున్సిపాల్టీ, ధర్మవరం రూరల్, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో వైఎస్సార్‌సీపీ హవా స్పష్టంగా కన్పించింది. ఒక్క బత్తలపల్లి మండలంలో మాత్రమే వరదాపురం సూరి కొంత ఉనికి చాటుకునేయత్నం చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం ఖాయమని చెప్పకతప్పదు.
పెనుకొండలో శంకరనారయణ జోరు
పెనుకొండలో తాజా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథికి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీసీసీ చీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డికి డిపాజిట్లు దక్కితే అదే గొప్ప. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం.శంకనారాయణతోనే పెనుకొండ అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన ఓటర్లు ఆయనకే బాసటగా నిలిచినట్లు పోలింగ్ సరళి స్పష్టీకరించింది. పెనుకొండ, గోరంట్ల మండలాల్లో శంకరనారాయణకు భారీ మెజార్టీ లభించడం ఖాయం. సోమందేపల్లి, రొద్దం, పరిగి మండలాల్లో వైఎస్సార్‌సీపీ-టీడీపీల మధ్య పోటీ నువ్వానేన్నా అన్నట్లుగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరా టీడీపీ ఓట్లను భారీ స్థాయిలో చీల్చారు. ఈ నేపథ్యంలో శంకరనారాయణ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మడకశిరలో డాక్టర్ విజయం ఖాయం
మడకశిరలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం.తిప్పేస్వామి, టీడీపీ అభ్యర్థి ఈరన్నల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి కె.సుధాకర్ డిపాజిట్లు తెచ్చుకునే స్థాయిలో మాత్రమే పోటీ ఇచ్చారు. వెనుకబడిన మడకశిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి బాసటగా ఓటర్లు నిలిచారు. ప్రచారం చివరి రోజున జననేత జగన్ మడకశిరలో పర్యటించడం బాగా లాభించింది.
గుడిబండ, రొళ్ల, అగళి, అమరాపురం మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిప్పేస్వామి స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. మడకశిర నగర పంచాయతీలో టీడీపీ అభ్యర్థి.. మడకశిర మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ చివరి గంటలో ఓటు వేసిన వారు తిప్పేస్వామివైపు మొగ్గు చూపినట్లు సమాచారం. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తిప్పేస్వామి విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పుట్టపర్తిలో సోమశేఖరరెడ్డిదే గెలుపు
పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి గిమ్మిక్కులను ఓటర్లు తిప్పికొట్టారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తోన్న విద్యావేత్త, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సోమశేఖరరెడ్డికి ఓటర్లు పట్టం కట్టినట్లు పోలింగ్ సరళి స్పష్టీకరించింది. ఓటమి భయంతో పల్లె రఘునాథరెడ్డి ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేసినా ఓటర్లు వాటికి తలొగ్గకుండా వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి నగర పంచాయతీతో పాటు అమడగూరు, ఓడీసీ, నల్లమాడ, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యత స్పష్టంగా కన్పించింది. ఒక్క పుట్టపర్తి రూరల్ మండలంలో మాత్రమే పల్లె రఘునాథరెడ్డి ఉనికి చాటుకున్నట్లు తెలుస్తోంది. వీటిని పరిశీలిస్తే.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సోమశేఖరరెడ్డి విజయం సాధించడం ఖాయమన్నది స్పష్టమవుతోంది.
కదిరిలో అత్తార్ హవా
దేశంలో అత్యంత నేరచరితులైన ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఏడీఆర్ సంస్థ పేర్కొన్న టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్‌కు కదిరి ఓటర్లు గుణపాఠం చెప్పినట్లు పోలింగ్ సరళి స్పష్టీకరిస్తోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అత్తార్‌చాంద్‌బాషాకు ఓటర్లు బాసటగా నిలిచినట్లు పోలింగ్ సాగిన తీరు తెలియజేస్తోంది. కదిరి మునిసిపాలిటీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సాగింది. తలుపుల, గాండ్లపెంట, ఎన్‌పీకుంట, కదిరి రూరల్ మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం స్పష్టంగా కన్పించింది. తనకల్లు, నల్లచెరువు మండలాల్లో మాత్రమే వైఎస్సార్‌సీపీ-టీడీపీ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు పోలింగ్ సరళి తేల్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అత్తార్ చాంద్‌బాషా గెలుపొందడం తధ్యమని తేలిపోయింది.
ఫ్యాన్ ప్రభంజనం
Published Thu, May 8 2014 3:05 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement