సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ హైస్పీడులో ఉంది. జిల్లాలో ఆపార్టీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేయనున్నారు. పది అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో జమ కానున్నాయి. ప్రజాకోర్టులో ఓటమి తప్పదని గ్రహించిన తెలుగుదేశం పార్టీ నేతలు ముందస్తు వ్యూహంలో భాగంగా ధ్వంస రచనకు పాల్పడ్డారు. అయినా ప్రజాతీర్పు ఆయా నేతలకు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం.
వైఎస్సార్ జిల్లాలో ప్రజానీకం వైఎస్ కుటుంబం వెంటేనని మరోమారు రుజువు చేశారు. ఎన్నికలు ఏవైనా ఫలితం ఏకపక్షమేనని ప్రజానీకం ఇప్పటికే పలుమార్లు తెలియజేశారు. అవే ఫలితాలు మరోమారు స్పష్టం కానున్నాయి. తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోవాల్సిన పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ అభ్యర్థులు ముందస్తు వ్యూహంలో భాగంగా పోలింగ్ సందర్భంగా ధ్వంస రచనకు పాల్పడ్డారని పలువురు భావిస్తున్నారు. అందులో భాగంగానే మైదుకూరు, జమ్మలమడుగులో పలు ఘటనలు ఉత్పన్నం అయ్యాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్ ముగిసేంతవరకూ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులతో హల్‌చల్ చేశారు. నియంత్రించాల్సిన యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించింది.
గన్‌మెన్‌లతో సీఎం రమేష్ హల్‌చల్....
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గన్‌మెన్‌లను వెంటేసుకుని పోట్లదుర్తి పోలింగ్‌బూత్‌ల వద్ద హల్‌చల్ చేశారు. ఓటేసి వెళ్లిపోవాల్సిన ఆయన బూత్‌ల వద్దే నిల్చొని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, మద్దతుదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు.గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సోదరుడు జయరామిరెడ్డి గ్రామానికి చేరుకున్నారు. దీంతో ఒక్కమారుగా ఉద్రిక్తత నెలకొంది. కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా పోట్లదుర్తి చేరుకుని ఓటింగ్ సరళిని పరిశీలించారు.
కవ్వింపు చర్యలు...ఆపై విచ్చలవిడి వీరంగం...
మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఉదయాన్నే వ్యూహాత్మకంగా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. టీడీపీకి మద్దతుదారులే లేని చాపాడు మండలం నక్కలదిన్నె పల్లెలకు పోలింగ్ ప్రారంభం కాగానే అనుచరులతో వెళ్లారు. టీడీపీకి ఏజెంటు లేకపోవడంతో ఒక్కసారిగా సుధాకర్ యాదవ్ బూతు పురాణాలు అందుకున్నట్లు సమాచారం. దాంతో ఒక్కమారుగా గ్రామస్తులు రెచ్చిపోయారు. సుధాకర్‌యాదవ్ వాహనంపై రాళ్లు రువ్వారు. అనంతరం గ్రామగ్రామాన టీడీపీ మద్దతుదారులను పురమాయించి వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు. అంతటితో ఆగని సుధాకర్‌యాదవ్ నంద్యాలంపేటలో వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను బూత్‌లనుంచి లాగేశారు. అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై రాళ్లవర్షం కురిపించారు. ఆ విషయాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల కెమెరాలను సైతం ధ్వంసం చేశారు.
నియోజకవర్గ కేంద్రమైన మైదుకూరు, తర్వాత దువ్వూరు, విశ్వనాథపురం, పలుగురాళ్లపల్లె, నాగసానిపల్లె, మల్లేపల్లె ఇలా వరుసగా పోలింగ్ బూత్‌లలోకి వెళ్లడం ఏజెంట్లును లాగడం లాంటి చర్యలకు టీడీపీ అభ్యర్థి పుట్టా పాల్పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పుట్టా ఇలా వ్యవహరిస్తున్నా నిలువరించాల్సిన యంత్రాంగం నిమ్మకుండి పోయింది. అందుకు కారణం పోలీసుశాఖలో ఉన్న ఓ త్రిబుల్‌స్టార్ అధికారి ‘మీది తెనాలే...మాది తెనాలే’ అన్నట్లు వ్యవహరించడమేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఓటర్లకు సుమారు రూ.15కోట్లు పంపిణీ చేసిన సుధాకర్ యాదవ్ అంతకంటే స్పీడుగా కొందరు అధికారులకు నోట్ల కట్టలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆమేరకే పుట్టాకు సహకరించినట్లు సమాచారం.
ఏఎస్పీ యాక్షన్‌కు ప్రజానీకం రియాక్షన్....
ఎన్నికల నియమ నియామావళికి వ్యతిరేకంగా వ్యవహరించిన జమ్మలమడుగు ఏఎస్పీ వెంకటఅప్పలనాయుడు శైలిపై ప్రజలు తిరగబడ్డారు. నాలుగురోజులుగా ఏఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉత్పన్నం అవుతున్నాయి. జమ్మలమడుగు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్వగ్రామం దేవగుడి మూడు తరాలుగా ఒక్కమాటగా నిలుస్తోంది. దేవగుడి సోదరులకు అండగా పసిబిడ్డ నుంచి పండు ముదసలి వరకూ నిలుస్తున్నారు. పోలింగ్ ఏజెంట్లుగా ఇతర పార్టీకి ఎవరూ లేరు, అక్కడి పోలింగ్ బూత్‌లోకి ఏఎస్పీ వెంకట అప్పలనాయుడు వెళ్లారు.
అక్కడే ఉన్న ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ చొక్కాపట్టుకుని లాక్కొని బయటికి వచ్చాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంతటితో ఆగక సుధీర్‌పై చేయి చేసుకున్నట్లు సమాచారం. దాంతో ఒక్కమారుగా ప్రజానీకం పోలీసు వాహనాలపై దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకతను చవిచూసిన ఏఎస్పీ గాలిలోకి ఒకరౌండు కాల్పులు చేపట్టి అక్కడి నుంచి వెనుతిరిగారు. పోలింగ్ బయట బందోబస్తు నిర్వహించాల్సిన ఏఎస్పీ పోలింగ్ అధికారి నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా, ఏకంగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడమే చట్టవ్యతిరేక చర్యగా పలువురు పేర్కొంటున్నారు.
బాక్సుల్లో భవితవ్యం....
సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ముగిసింది. ఈవీఎం బాక్సుల్లో భవితవ్యం పదిలంగా ఉంది. ఎన్నికల సరళిని పరిశీలిస్తే జిల్లాలో ఫ్యాన్ హైస్పీడులో ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందుల ఓటర్లు ఒన్‌సైడ్ తీర్పుకు మొగ్గుచూపారని పరిశీలకులు పేర్కొంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చరిత్రలో నిలిచిపోయే మెజార్టీని అప్పగించనున్నట్లు సమాచారం. శాంతికాముకులకు పట్టం కట్టే కమలాపురం ప్రజలు అదేతీర్పును అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కడపలో సైతం ఏకపక్ష తీర్పు ఉత్పన్నం కానుందని విశ్లేషకుల అభిప్రాయం. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాలల్లో వైఎస్సార్‌సీపీ హవా స్పష్టంగా కన్పిస్తోంది. కడప పార్లమెంటు పరిధిలో పులివెందులను మినహాయిస్తే తక్కిన నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.
వైఎస్ కుటుంబం పట్ల ఉన్న అభిమానంతో అసెంబ్లీ అభ్యర్థులకంటే పార్లమెంటు అభ్యర్థికి ప్రతి నియోజకవర్గంలో అధికంగా మెజార్టీ దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాయచోటిలో టీడీపీ, జేఎస్పీ అభ్యర్థులు వైఎస్సార్‌సీపీని అందుకోనంత దూరంలో ఉన్నట్లు సమాచారం. రాజంపేటలో ధనం ఏరులై పారినా ప్రజామద్దతు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. రైల్వేకోడూరులో కాంగ్రెస్, టీడీపీ ఏకమై పోరాడినా వైఎస్సార్‌సీపీని నిలవరించడం కష్ట సాధ్యమని పలువురు పేర్కొంటున్నారు. రాజంపేట పార్లమెంటు అతిసునాయసంగా వైఎస్సార్‌సీపీ ఖాతాలో జమకానున్నట్లు సమాచారం.
ఫ్యాన్ హవా
Published Thu, May 8 2014 2:40 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement