జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మాటకు కట్టుబడే మనిషి కావడంతో జనంలో చెరగని ముద్రను సొంతం చేసుకున్నారు. సమస్యలపై పోరాడే తత్వం కావడంతో అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా మహానేత అడుగుజాడల్లో.. రాజన్న రాజ్యం స్థాపన దిశగా సాగుతున్న ప్రయాణంలో అన్ని వర్గాల ప్రజలు కలసి నడుస్తున్నారు. అక్రమ కేసులకు వెరవని నైజం.. కుమ్మక్కు రాజకీయాలకు ఎదురొడ్డి నిలవడం.. ఢిల్లీ పెద్దలనే ఢీకొట్టే ధైర్యం కలిగి ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని యువత స్ఫూర్తిగా తీసుకుంటోంది.
ఆయన అడుగుల్లో అడుగులేస్తూ.. నవ సమాజ నిర్మాణానికి బాసటగా నిలుస్తోంది. రైతు దీక్ష.. ఫీజు పోరు.. జల దీక్ష.. లక్ష్య దీక్ష.. సమైక్యాంధ్ర పరిరక్షణకు ఆమరణ నిరాహార దీక్ష.. ఇలా జనం బాధలే ఎజెండాగా సాగిస్తున్న పోరుబాట అందరినీ ఆకట్టుకుంటోంది. మూడు నెలల పాటు సాగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో అలుపెరగని పోరు సాగించగా.. కాంగ్రెస్, టీడీపీ నేతలు కలసిరాకపోవడంతో రాష్ట్రం రెండు ముక్కలైంది. అధికారంలో ఉండగా రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలిన.. విభజనకు కారణమైన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల వేళ సింగపూర్ చేస్తానంటూ ప్రజల ముందుకు రావడం హాస్యాస్పదం. ఇక జనం గుండెల్లోంచి పుట్టిన వైఎస్‌ఆర్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ హవా కొనసాగింది.
తాజా సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే జోరు పునరావృతమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు ఎంపీలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరడం ఖాయమని సర్వేలు కూడా తేల్చి చెప్పేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఓటమి భయంతో మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం రెండు పార్టీలకు బుద్ధి చెప్పేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ విశ్వహిందూ పరిషత్ ముఖ్య నేత ప్రవీణ్ తొగాడియాతో సత్సంబంధాలు నెరుపుతుండటం పట్ల కర్నూలు నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లు గుర్రుమంటున్నారు. మతతత్వ పార్టీలతో జతకట్టే నేతలను ఎంతమాత్రం గెలిపించబోమని ఈ వర్గం భీష్మించింది.
అదేవిధంగా నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున బరిలో నిలిచిన శిల్పా సోదరులు, నందికొట్కూరు అభ్యర్థి లబ్బి వెంకటస్వామి రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని కాదని పచ్చ కండువా కప్పుకోవడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. తొమ్మిదేళ్ల బాబు పాలనలో తీవ్ర కరువు కాటకాలు వెన్నాడటం తెలిసిందే. కరెంటు కష్టాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యవసాయం మానుకోవడమే ఉత్తమమనే పరిస్థితికి ఆయన ప్రభుత్వం కారణమైంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆయనకు ఓటేయడమంటే కరువును ఆహ్వానించినట్లేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. తన హయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయిన ఆయన.. ఇప్పుడు ఎన్ని చెప్పినా నమ్మేదెలాగంటూ అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.
ఓటర్లకు తమ్ముళ్ల గాలం
టీడీపీ నేతలు ఓటర్లను కొనే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలులో ఆ పార్టీ నేత రూ.1000 నుంచి రూ.2 వేలు.. పొదుపులక్ష్మి గ్రూపుల్లోని మహిళలకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేయడం ప్రజాస్యామ్యాన్ని అపహాస్యం చేయడమేననే చర్చ జరుగుతోంది. నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె, నందికొట్కూరు, పత్తికొండ, డోన్, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరులోనూ ఇదే తరహా ప్రలోభాలకు పాల్పడటం ఓటర్ల మనోభావాలను దెబ్బతీస్తోంది. అధికారంలో ఉండగా అభివృద్ధిని విస్మరించి.. అధికార దాహంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ఓటర్లను డబ్బును కొనాలనే వీరి తలంపును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. డబ్బుతో అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకునే నేతలకు ఓటుతోనే బుద్ధి చెబుతామని ప్రజలు ప్రతినబూనుతుండటం విశేషం.
‘గాలి’ వీస్తోంది!
Published Wed, May 7 2014 2:46 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement