సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో ప్రజలు చరిత్రలో సంచలనాత్మక తీర్పు ఇవ్వనున్నారని కోవూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు.
కోవూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో ప్రజలు చరిత్రలో సంచలనాత్మక తీర్పు ఇవ్వనున్నారని కోవూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 122 అసెంబ్లీ స్థానాలతో పాటు 18 పార్లమెంటు స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రస్తుతం తెలుగుజాతి ద్రోహులకు, ధర్మానికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు.
ఈ పోరాటంలో ప్రజలదీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే విజయం ఖాయమన్నారు. పచ్చని రాష్ట్రాన్ని విడదీసిన చొరబాటుదారులు, ద్రోహులైన సోనియాగాంధీ, టీడీపీ, బీజేపీకి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పబోతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీమాంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తారని సీమాంధ్ర రాజధానిని ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా ప్రజలను ఆదుకుంటారన్న నమ్మకం వారిలో ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సీమాంధ్ర రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజల హృదయాల్ని తాకిందన్నారు. తొలుత కోవూరు టీఎన్‌సీ, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, పీఆర్‌కాలనీ ప్రాథమికోన్నత పాఠశాల, గంగవరం, పాటూరు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు.
పరిశీలనంతరం ఆయన మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగాలంటే అందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే సమర్థవంతమైన నాయకుడు అన్నారు. ఆయన పాలనలోనే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారన్నారు. ప్రజలు కూడా రాక్షసపాలనలో ఎన్నో సమస్యలు అనుభవించారన్నారు. ఈ పాలనకు చరమగీతం పాడి స్వర్ణయుగంలో అడుగు పెట్టబోతున్నారన్నారు.
అందులో భాగంగానే బుధవారం జరిగిన ఓటింగ్ సరళిని ఆది నుంచి వేగంగా పుంజుకోవడం నిదర్శనమన్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీకి అండగా నిలబడి పురుషుల కంటే తాము దేనిలో తీసిపోబోమని ఉరకలు వేయడం శుభపరిణామన్నారు. కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయడం అమానుషమన్నారు.
పోలింగ్ సమయంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడిచేయడం సమంజసం కాదన్నారు. ప్రజలు ఎవరివైపు అయితే మొగ్గు చూపుతారో వారికే అధికారం దక్కుతుందన్నారు. అంతే తప్ప ప్రజలను మభ్యపెట్టి, బెదిరిస్తే ఓట్లు వేస్తారనుకోవడం అవివేకమన్నారు. ఏదీ ఏమైనా రాష్ట్రంలో మరి కొన్ని రోజుల్లో రాజన్న రాజ్యం రానున్నందన్నారు. ఆ రాజ్యానికి జగన్‌మోహన్‌రెడ్డి రారాజుగా వెలుగొంది ప్రజల కష్టసుఖాలు చూసుకుంటారన్నారు. ఈయన వెంట ప్రసన్నకుమార్‌రెడ్డి సతీమణి గీతమ్మ, తనయుడు రజత్‌కుమార్‌రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల పార్టీ కన్వీనర్ ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, శివుని నరసింహులురెడ్డి, శ్రీనివాసులు, రమేష్ ఉన్నారు.