సైకిల్ ఢమాల్ | cycle dhamal... | Sakshi
Sakshi News home page

సైకిల్ ఢమాల్

Published Thu, May 15 2014 3:53 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

cycle dhamal...

సాక్షి  ప్రతినిధి, నెల్లూరు : జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధాటికి సైకిల్ తునా తునకలైంది. అటు జెడ్‌పీటీసీలు, ఇటు మండల  పరిషత్‌లలో కూడా టీడీపీ ఫ్యాన్ దరిదాపుల్లోకి కూడా రాలేక పోయింది. జిల్లాలోని 46 జెడ్‌పీటీసీ స్థానాలకు గాను 31 స్థానాలు సాధించి భారీ ఆధిక్యంతో జెడ్పీని  వైఎస్సార్‌సీపీ గెలిచింది. టీడీపీ 15 స్థానాలకు పరిమితమైంది. 17 జెడ్‌పీటీసీ స్థానాల్లో  పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేక చతికిలపడింది. 30 మండలాల్లో వైఎస్సార్‌సీపీ పూర్తి ఆధిక్యత సాధించగా, టీడీపీ 14 మండలాలు గెలిచింది. రెండు చోట్ల ఇతరుల మద్దతు కీలకమయ్యే పరిస్థితి ఏర్పడింది.
 
 పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన వెంటనే జిల్లా పరిషత్‌లో పాగా వేయడానికి వైఎస్సార్‌సీపీ, టీడీపీ పోటీ పడ్డాయి. వైఎస్సార్‌సీపీ ఆ పార్టీ సీఈసీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని, టీడీపీ వేనాటి రామచంద్రారెడ్డిని చైర్మన్ అభ్యర్థులుగా ఎంపిక చేశాయి. బొమ్మిరెడ్డి ఆత్మకూరు నుంచి, వేనాటి సూళ్లూరుపేట నుంచి పోటీ చేసి ఇద్దరు విజయం సాధించారు. ఈ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మండల పరిషత్‌ల మీద కూడా గురిపెట్టింది. ఎంపీటీసీ స్థానాల్లో కూడా భారీ మొత్తంలో వెదజల్లింది.
 
 మద్యం ఇతర ప్రలోభాలతో ఓటర్లను వశపరచుకునేందుకు ఎక్కడా వెనుకాడలేదు. పోలింగ్ ముగిసిన రోజు నుంచి టీడీపీ జెడ్‌పీతో పాటు కనీసం 30 మండల పరిషత్‌లో గెలుస్తామని ధీమాగా చెబుతూ వచ్చింది.  వైఎస్సార్‌సీపీ కూడా పోలింగ్  సరళిని బట్టి జెడ్‌పీ తమదేనని నమ్ముతూ వచ్చింది. మంగళవారం రెండు  పార్టీల అభ్యర్థులు విజయం మీద ఆశతో ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వెలువడిన ఎంపీటీసీ ఫలితాలు చూసిన తెలుగు తమ్ముళ్లు తెల్లముఖం వేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి జెడ్‌పీటీసీ ఫలితాల వెల్లడితో ఈ ఆందోళన మరింత పెరిగి జెడ్‌పీ చేజారిపోయినట్లేనని వారు నిర్ధారించుకున్నారు. రాత్రి 10 గంటలకే ఫలితాల సరళి స్పష్టం కావడంతో టీడీపీ నేతలు కౌంటింగ్ కేంద్రాల నుంచి తిరుగుముఖం పట్టారు. ఫలితాల ప్రకటన వెలువడే కొద్దీ వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం అంతకంతకూ పెరిగింది. రాత్రి 12 గంటల సమయానికి జెడ్‌పీ చైర్మన్ గెలిచేందుకు అవసరమైన 24 జెడ్‌పీటీసీల మేజిక్ ఫిగర్‌కు చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
 
 జిల్లాలో తెలుగుతమ్ముళ్లను ఈ ఫలితాలు తీవ్ర నైరాశ్యంలో పడేశాయి. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 54 డివిజన్లకు గాను 32 గెలిచి  నెల్లూరు కార్పొరేషన్‌ను భారీ మెజారిటీతో దక్కించుకుంది. కావలిలో టీడీపీని పక్కకు నెట్టేసి చైర్మన్ పదవి సాధించుకుంది. ఆత్మకూరులో టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటైనా ఆ రెండు పార్టీల కంటే రెండు వార్డులు ఎక్కువ గెలిచి చైర్మన్ పదవి సాధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంది. గూడూరు గెలుస్తామనుకున్న టీడీపీ ఆశల మీద నీళ్లు చల్లిన వైఎస్సార్‌సీపీ అక్కడ టీడీపీతో సమానంగా 16 వార్డులు గెలిచింది. ఇకపోతే సూళ్లూరుపేట మున్సిపాలిటీలో నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న టీడీపీకి ఇక్కడ కూడా నిరుత్సాహమే ఎదురైంది. ఈ మున్సిపాలిటీలో టీడీపీ 9 వార్డులు గెలవగా, వైఎస్సార్‌సీపీ 10 గెలిచింది.
 
 ఇక పోతే వెంకటగిరి, నాయుడుపేట మున్సిపాలిటీల్లో మాత్రం టీడీపీ భారీ ఆధిక్యత ప్రదర్శించి రెండు మున్సిపాలిటీలను దక్కించుకోవడం ఆ పార్టీకి ఉపశమనం కలిగించింది. అయితే జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ సాధించిన విజయం వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొత్తం మీద జిల్లాలో మున్సిపల్, పరిషత్ ఫలితాలు తమకు ఆందోళన కలిగించాయని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
 
 వైఎస్సార్‌సీపీ గెలిచిన
 జెడ్‌పీ స్థానాలు ఇవీ..
  1. ఆత్మకూరు 2. చిల్లకూరు 3 బాలాయపల్లి 4. సంగం 5. మనుబోలు 6. డీవీసత్రం 7.సీతారాంపురం 8.మర్రిపాడు 9. వాకాడు 10.పెళ్లకూరు 11.ఏఎస్ పేట 12.చిట్టమూరు 13.ఉదయగిరి 14.వెంకటాచలం 15.కోట 16.చేజర్ల 17. టీపీగూడూరు 18.అనంత సాగరం 19.కావలి రూరల్ 20. ముత్తుకూరు 21.వింజమూరు 22.బుచ్చిరెడ్డిపాలెం 23.గూడూరు రూరల్ 24.సైదాపురం 25.బోగోలు 26. కలువాయి 27. జలదంకి 28. రాపూరు 29. అల్లూరు 30.ఇందుకూరుపేట 31.పొదలకూరు.
 
 టీడీపీ గెలిచిన జెడ్‌పీటీసీలు
 1. వరికుంటపాడు 2.వెంకటగిరి 3.సూళ్లూరుపేట 4.దుత్తలూరు 5. డక్కిలి 6. నెల్లూరు రూరల్ 7. నాయుడుపేట 8.ఓజిలి 9. తడ 10. విడవలూరు 11.దగదర్తి 12.కొడవలూరు 13. కోవూరు 14. కలిగిరి 15. కొండాపురం
 
 వైఎస్సార్‌సీపీ గెలిచిన మండలాలు
 1.నెల్లూరు రూరల్ 2.ఆత్మకూరు 3.సంగం 4. బాలాయపల్లి 5. మర్రిపాడు 6. వాకాడు 7. వింజమూరు 8. సీతారాంపురం 9. ఉదయగిరి 10. అల్లూరు 11.కొడవలూరు 12.ముత్తుకూరు 13. వెంకటాచలం 14. టీపీగూడూరు 15. మనుబోలు 16.పెళ్లకూరు 17. కలువాయి 18. కోట 19. గూడూరు రూరల్ 20.డీవీసత్రం 21.సూళ్లూరుపేట 22.జలదంకి 23.తడ 24.అనంతసాగరం 25. సైదాపురం 26. బోగోలు 27. రాపూరు 28. చేజర్ల 29. చిల్లకూరు 30.పొదలకూరు
 
 టీడీపీ గెలిచిన మండలాలు
 1. వరికుంటపాడు  2.డక్కిలి  3.నాయుడుపేట  4.చిట్టమూరు 5. కొండాపురం 6. విడవలూరు 7.కోవూరు 8. దుత్తలూరు 9. కలిగిరి 10.ఓజిలి 11.ఏఎస్‌పేట 12. కావలి రూరల్ 13.దగదర్తి 14.ఇందుకూరుపేట
 
 ఇతరులే కీలకం
 బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని  22 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 11 గెలిచింది. టీడీపీ 8,  సీపీఎం 2, బీజేపీ 1 స్థానం గెలిచాయి. ఇక్కడ సీపీఎం లేదా బీజేపీ సభ్యుల్లో ఒకరు వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చినా ఈ మండలం కూడా ఆ పార్టీ ఖాతాలో పడుతుంది.చిల్లకూరు మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 6, టీడీపీ 5,  కాంగ్రెస్ 2. స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ఇక్కడ కూడా స్వతంత్రుల మద్దతు కీలకం కానుంది.
 
 ఎంపీటీసీలు ఇలా
 జిల్లాలోని  583 ఎంపీటీసీ స్థానాల్లో 14 ఏకగ్రీవమయ్యాయి. 569 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో బ్యాలెట్ బాక్సుల్లో చెదలు పట్టడంతో కొండాపురం మండలంలోని ఎంపీటీసీ పరిధిలో రీపోలింగ్ జరగనుంది. మిగిలిన 560 ఎంపీటీసీ స్థానాల్లో  వైఎస్సార్‌సీపీ 305  గెలుచుకుంది. టీడీపీ 222, కాంగ్రెస్ 16, సీపీఎం 5, సీపీఐ 1, బీజేపీ 3, స్వతంత్రులు 15 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement