రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇకమీదట యధావిధిగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని పేర్కొంది.
ఎన్నికల సంఘం ప్రకటన
నేటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు యథాతథం
మున్నార్ నుంచి తిరిగివచ్చిన ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇకమీదట యధావిధిగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఎన్నికల నియమావళి అమలులో ఉంది. ఈ నెల 17న ఒకే దశలో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. అయితే ఓట్ల లెక్కింపు జరిగే మే 16 వరకు నియమావళి అమలులోనే ఉంటుంది.
దీని వల్ల ప్రభుత్వ కార్యక్రమాలకు అవరోధం ఏర్పడుతోందని, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన కమిషన్, అధికారులతో మంత్రులు సమీక్షలు, సమావేశాలు జరుపుకోవచ్చని, జిల్లా పర్యటనలూ చేపట్టవచ్చని సూచిస్తూ నియమావళిని పాక్షికంగా సడలించింది. తాగు నీటి ఎద్దడి తదితర అత్యవసర సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించింది.
అయితే సిబ్బంది బదిలీలు లాంటి వ్యవహారాలకు సంబంధించి ముందుగా ఎన్నికల కమిషన్ అనుమతిని తీసుకోవాలని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులతో మంత్రులు సమావేశాలు నిర్వహించకూడదని షరతు విధించింది. ఎన్నికలు ముగిసి, ఈవీఎంలు స్ట్రాంగ్ రూములలో భద్రంగా ఉన్న నేపథ్యంలో నియమావళి కొనసాగింపు హేతుబద్ధంగా లేదని భావించిన ఎన్నికల కమిషన్, గురువారం నుంచి పూర్తిగా సడలించింది. దరిమిలా శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు యధావిధిగా సాగనున్నాయి. విశ్రాంతి కోసం కేరళలోని మున్నార్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిరిగి వచ్చేశారు.