=కేయూలో పెర్ఫార్మెన్‌స ఆర్ట్స్ విభాగం ఏర్పాటుకు యోచన
=చిల్డ్రన్స్ ఫెస్టివల్ నిర్వహణకు కృషి
=కేజీ నుంచి పీజీ వరకు క్యాంపస్‌లో ఉండాలి
=యువజనోత్సవాల ముగింపుసభలో
=కేయూ వీసీ ప్రొఫెసర్ వెంకటరత్నం
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీలో ఐదు రోజులుగా జరుగుతున్న కళారత్న-2013, 29వ సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ యువజనోత్సవ పోటీలల్లో భాగస్వాములైన విద్యార్థులు స్వీట్ మెమొరీస్‌తో వెళ్లాలని కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అన్నారు. యువజనోత్సవాల్లో భాగంగా నాలుగు రోజులపాటు పోటీలు జరగ్గా ఐదోరోజు శుక్రవారం క్యాంపస్‌లోని నూతన ఆడిటోరియంలో ముగింపు సభ, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ వెంకటరత్నం మాట్లాడుతూ కాకతీయుల కళావారసత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నాటి పేరిణి నృత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. కేయూ ఆవిర్భవించి 37ఏళ్లు గడుస్తున్నా మ్యూజిక్, డ్యాన్స్‌కు సంబంధించిన కోర్సులు లేకపోవడంతో ఆ రంగాల్లో విద్యార్థులు వెనకబడుతున్నారన్నారు. త్వరలో క్యాంపస్‌లో పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలనే యోచన ఉందన్నారు. వీసీగా తాను ఈ రెండేళ్లలో పలుకొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు చెప్పారు.
పీజీ మహిళా కళాశాల, మహిళా ఇంజినీరింగ్ కళాశాల, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి ప్రాంతాల్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే చిల్డ్రన్స్ ఫెస్టివల్స్ నిర్వహిం చాలనే యోచన ఉందన్నారు. క్యాంపస్‌లో కేజీ నుంచి పీజీ వరకు కోర్సులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 25, 26,27 తేదీల్లో న్యాక్ బృందం యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో పర్యటించనుందని, మళ్లీ న్యాక్ ఏ-గ్రేడ్ తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. యువజనోత్సవాలను విజ యవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అకడమిక్ పరంగా కెరీర్‌ను అభివృద్ధి పరుచుకుంటూనే స్పోర్ట్స్, కల్చరల్, మ్యూజిక్, డ్యాన్స్ రంగాల్లోనూ ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. యువజనోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన యూనివర్సిటీ అధికారులును అభినందించారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్( ఏఐయూ) అబ్జర్వర్ పారి పరమేశ్వరన్ మాట్లాడుతూ యువతకు సాధ్యం కానిది ఏమీలేదని, యువత పోరాటాల్లో భాగస్వాములై ‘తెలంగాణ’ ను కూడా సాధించుకున్నారన్నారు.
డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు మాట్లాడుతూ ప్రపంచంలో ఏదేశం లో లేనివిధంగా భారతదేశంలో యువశక్తి ఉందని,దేశ భవిష్యత్తు వారిపైనే ఆధారపడి ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. సాయిలు మాట్లాడుతూ 21 రాష్ట్రాల నుంచి 800 మందికిపైగా విద్యార్థులు 25 ఈవెంట్లలో భాగస్వాములయ్యారన్నారు. వీరికి ఇబ్బందులు కలగకుండా 18కమిటీలతో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సభలో కేయూ యువజనోత్సవాల కల్చరల్ కోఆర్డినేటర్ జి.దామోదర్, క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి, ప్రొఫెసర్లు కె. దామోదర్‌రావు, గోపీనాథ్‌కృష్ణ, గిరీశం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధికారాణి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ కిషన్ కొద్దిసేపు మాత్రమే ఉండి వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.
ఉర్రూతలూగించిన నృత్య ప్రదర్శన
ముగింపు సభ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన గ్రూప్‌సాంగ్స్, గిరిజన, జానపద నృత్యాలతో ఆడిటోరియం దద్దరిల్లింది. కేరింతలు, చప్పట్లతో విద్యార్థులు ఉత్సాహంగా చిందేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, కల్చరల్ కోఆర్డినేటర్ ఉమేష్ ఓ హిందీ పాట పాడి విద్యార్థులను ఉర్రూతలూగించారు.
కేయూకు బహుమతులు
యువజనోత్సవాలలో హోస్ట్ యూనివర్సిటీగా ఉన్న కేయూ విద్యార్థులు వివిధ ఈవెంట్‌లలో భాగస్వామలు కాగా మూడింటిలో మాత్రమే బహుమతులు సాధిం చారు. క్లాసికల్ డ్యాన్స్‌లో ద్వితీయ బహుమతి, మిమిక్రీ, ఫోక్ ఆర్కెస్ట్రాలో తృతీయ బహుమతి అందుకున్నారు. రాష్ట్రసంత్ తుకదోజీ మహారాజ నాగపూర్ యూనివర్సిటీ, మహారాష్ట్ర అండ్ ఇందిరా కళాసంగ్ విశ్వవిద్యాలయం ఖారీఘర్(చత్తీస్‌గఢ్) ఎక్కువ బహుమతులు సాధించి ఓవరాల్ చాంపియన్లుగా నిలిచాయి. రన్నరప్‌గా మహారాష్ట్రలోని సంత్‌గాడ్జి బాబా అమరావతి యూనివర్సిటీ విద్యార్థులు నిలిచారు. కేయూ వీసీ వెంకటరత్నం, తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు విజేతలకు బహుమతులు అందజేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలోని కురుక్షేత్రలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో విజేతలు పాల్గొంటారు.
తీపి జ్ఞాపకాలతో వెళ్లండి
Published Sat, Nov 23 2013 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement