childrens festival
-
ఒజ్జ గణపతికి వందనాలు
‘‘ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య! ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు.’’ అంటూ పిల్లలు సంబరంగా జరుపుకునే పండగ వినాయక చవితి. యావద్భారత దేశం వేడుకగా జరుపుకునే పండగ ఇది. కలియుగంలో అతి త్వరగా అనుగ్రహించే దైవం వినాయకుడు. ఋగ్వేద కాలం నుండి కీర్తించబడి పూజించబడుతున్న దేవత ఒక్క గణపతి మాత్రమే. దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు ఐన గణపతిని అన్ని సందర్భాలలోను పూజించటమే కాదు దేవతలందరూ త్రిమూర్తులతో సహా పూజించినట్టు ఆధారాలున్నాయి. గణపతి కున్న నామాలలో బాగా ప్రసిద్ధమైనవి వినాయకుడు, గజాననుడు. గణనాథుడికి ఉన్న పన్నెండు నామాలలో ప్రతి దాని వెనక ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా వినాయకోత్పత్తి, వినాయకుడు గజాననుడు కావటానికి గల కారణాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంతే కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు కనపడుతుంది. సృష్టికార్యం ప్రారంభించే ముందు బ్రహ్మ ప్రార్థించిన గణపతి ఓంకార స్వరూపుడు. కృతయుగంలో కశ్యపునికి అదితికి జన్మించి ‘మహోత్కటుడు‘ అనే పేరుతో దేవాంతక నరాంతక రాక్షసులను సంహరించి లోకకల్యాణం గావించాడు. త్రేతాయుగంలో, మయూరేశుడుగా అవతరించి త్రిమూర్తులకు వారు కోల్పోయిన స్థానాలను తిరిగి ఇప్పించాడు. అప్పుడే బ్రహ్మ తన కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలను వినాయకుడికిచ్చి, వివాహం చేస్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనం నెమలి. ద్వాపరయుగంలో గజాననుడుగా అవతరించి, సింధూరుడనే రాక్షసుని సంహరించాడు. మనం వినాయకవ్రత కల్పంలో చదివే కథ ఈ గజాననునిదే. కలియుగంలో ధూమ్రకేతువుగా అవతరించి, అశ్వారూఢుడై ప్రతిప్రాణిలో పెచ్చుపెరిగిన రాక్షసప్రవృత్తిని నశింప చేస్తూ ఉన్నాడట. వివిధ పురాణాలలో గణపతి వినాయకుడి ఆవిర్భావం, రూపు రేఖలు విభిన్నంగా ఉన్న కారణంగా శిల్పులు వాటికి గణపతి తత్త్వాన్ని, తమ సృజనాత్మకతను జోడించి రకరకాల గణపతులను మన ముందు ఉంచుతున్నారు. మిగిలిన లక్షణాలను ఏరకంగా చూపించినా అన్నింటిలోనూ సామాన్యంగా ఉండేవి – గజ ముఖం, కురచ మెడ, పెద్దబొజ్జ, నాగయజ్ఞోపవీతం, చేతిలో మోదకం, మూషిక వాహనం మొదలైనవి. గజముఖంలో తొండం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు భాగాలు. ప్రపంచ సాహిత్యంలో మొదటిది అయిన ఋగ్వేదంలో గణపతిగానే పేర్కొనటం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో ‘‘కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా’’ అని లలితాదేవి కల్పించినది గణేశ్వరుణ్ణే అని తెలుస్తోంది. తరువాత విఘ్నాలకి అధిపతి అయి విఘ్నేశ్వర నామాన్ని పొందటం జరిగింది. గణాలకు అధిపతి కనుక గణపతి, గణాధిపతి అనే నామాలు కలిగాయి. ఏవైనా గణములు అంటే గుంపులు, సముదాయాలు ఉంటే వాటి మీద అధికారం కలిగి, అవన్నీ ఏకోన్ముఖంగా పని చేసేట్టు చేయించ కలిగిన ప్రజ్ఞయే గణపతి. ఏకాత్మతా భావన కలిగించ గలవాడు గణపతి. ఆ ప్రజ్ఞ లేనట్టయితే సృష్టిలోని అన్ని భాగాలు దేనికవే ఉండేవి. కనుకనే సృష్టి చేసే సమయంలో బ్రహ్మ గణపతిని ప్రార్థించాడట! దేవతారూపాలన్నీ ఆయా తత్త్వాలకి ప్రతీకలు. ముఖ్యంగా ప్రత్యేక రూపాలున్న మూర్తులు. గణపతి అనగానే గుర్తు వచ్చేది పెద్ద పొట్ట. దాని నిండా ఉన్నవి విద్యలు. ‘‘కోరిన విద్యలకెల్ల నొజ్జయయి యుండెడి ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్’’ అంటాము కదా! వొజ్జ అంటే గురువు అని అర్థం. అందుకే గణపతి పూజలో పిల్లల చేత పుస్తకాలు పెట్టించుతాము. పనిలో పనిగా గుంజీలు తీయిస్తాము. గుంజీలు తీయటం వల్ల కుదురు వస్తుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. పెద్ద చెవులు బాగా వినమని చెపుతున్నాయి. చిన్న కళ్ళు సూక్ష్మ మైన అంశాలని ఎంత నిశితంగా ఏకాగ్రతతో చూడాలో తెలియ చేస్తాయి. తొండం ఎప్పుడు నోటిని మూసుకుని ఉండాలని తెలియ చేస్తుంది. చంద్రుణ్ణి చూసిన దోషం తొలగటానికి శమంతకోపాఖ్యానం చదవుకోవాలనటం కూడా విశేషమే. ఆ కథని అర్థం చేసుకుంటే సమాజం ఎంత బాగుంటుందో కదా! ఏదైనా ఒక వరం ఒకరికి ఇస్తే దాన్ని వారు మాత్రమే ఉపయోగించాలి. ఇతరులకి అది ఉపయోగ పడక పోగా ప్రాణాంతకం కూడా కావచ్చును అని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వృత్తాంతమ్ తెలుపుతుంది. ప్రభుత్వం వద్ద కాక వ్యక్తుల దగ్గర ధనం పోగు అయితే ప్రాణాలకే మోసం జరుగుతుందని సత్రాజిత్తు మరణం తెలుపుతుంది. ఎంతటి అవతార పురుషుడికి అయినా దోషఫలం అనుభవించక తప్పదు అని కృష్ణుడికి నీలాపనిందలు రావటం తెలియ చేస్తుంది. సర్వమానవుల మూలాధారంలో కుండలినీ శక్తిగా ఉన్న జగన్మాతకి గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. అదే పార్వతీ దేవి గుమ్మంలో కాపలా పెట్టింది అని కథలో చదువుకుంటాం. విఘ్నాధిపతి కనుక మనం చేసే పనుల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడమని అన్ని కార్యాలకి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించటం సంప్రదాయంగా మారింది. గణపతి పూజ మనకి ఏంచెపుతోంది? 1. మాతా పితృభక్తి అది ఉంటే లోకాలనన్ని చుట్టి రావచ్చు. విజయం సాధించవచ్చు. 2. భౌతిక బలం కన్న బుద్ధి బలం మిన్న తమ్ముడు నెమలి వాహనం మీద ఎగురుతూ వెళ్ళాడు. తాను ఎలుకనెక్కి వెళ్ళి గెలవటం ఎంత కష్టం? కనుక బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. 3. ఆకుపచ్చని ఆహారం తింటే తెలివితేటలు పెరుగుతాయి. ఆకుపచ్చరంగులో ఉన్న ఆహారం తింటే తెలివి తేటలు పెరుగుతాయి, చూపు మెరుగుగా ఉంటుంది. అందుకే గరిక తనకి పరమప్రీతి అని చెప్పాడు. బుద్ధి కావాలంటే ఆరాధించవలసింది గణపతినే. గణపతి నక్షత్రమైన హస్తకి అధిపతి బుధుడు. బుద్ధి కారకుడు బుధుడే కదా! 4. ఏక వింశతి 21 రకాల పత్రితో పూజ చేయటం ఒక్క గణపతి పూజలో మాత్రమే కనిపిస్తుంది. పిల్లలకి పత్రి సేకరణ పేరుతో చెట్లని, పర్యావరణాన్ని పరిచయం చేయటం జరుగుతుంది. అవన్నీ ఆ సమయంలో వచ్చే తరుణ వ్యాధులకి ఔషధాలు. ప్రత్యేకంగా గరిక పూజ ద్వారా గరికకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నాడు. గరిక పవిత్రమైనదే కాదు, భూమి ఆకృతిని పరిరక్షిస్తుంది. 5. రెండుసార్లు ఆవిరిమీద ఉడకబెట్టిన ఆహారం వానాకాలంలో మంచిది. బలం కలిగిస్తుంది. నూనెలో వేయించిన ఆహారం వానలు పడుతున్నప్పుడు అరగటం కూడా కష్టం. 6. మనలో సామర్థ్యం ఉండాలే కాని పరికరాలు ప్రధానం కాదు అని ఎలుక వంటి అతి చిన్న వాహనం ఎక్కి లోకాల నన్నిటిని జయించి చూపించాడు. డా. ఎన్.అనంతలక్ష్మి -
ఆ దీపావళి రోజులు
దీపావళి పిల్లల పండుగ. కాకరపువ్వొత్తులు కలర్ పెన్సిళ్లు, చిచ్చుబుడ్లు పాము బిళ్లలు, తుపాకీ రీళ్లు... ఇప్పటి సంగతి ఏమోకాని కొన్ని తరాల బాల్యం దీపావళితో గడిచింది. ఒక్క బొమ్మ తుపాకీ కోసం అలకలు.. హర్తాళ్లు.. దొంగ– పోలీస్ ఆటలు.. ఆ రోజులే వేరు. ఒక వారం ముందు నుంచే వీధిలో ఠపా, ఠుపీ సౌండ్లు మొదలవుతాయి. ఆ వీధి చివరి ఇంట్లో పిల్లాడు శెట్టిగారి అంగట్లో దొరికే పది పైసల తుపాకీ బిళ్లలు కొని, ఆ బిళ్లల డబ్బీ జాగ్రత్తగా దాచుకుని, అందులో ఒకో బిళ్లను గచ్చు నేల మీద పెట్టి, గుండ్రాయితో ఠాప్మని పేల్చుతుంటాడు. డబ్బీ అయిపోతే మళ్లీ ఇంకో డబ్బీకి అమ్మ పదిపైసలు గ్యారంటీగా ఇస్తుంది. ఆ పది పైసలూ లేనివాడు ఎలాగో చేసి చిన్న ఇనుపగుంట, గూటం సంపాదిస్తాడు. ఎక్కడ దొరుకుతుందో దొరుకుతుంది గంధకం పొడి. ఆ పొడి సీసాను దగ్గర పెట్టుకుని, కొంచెం గంధకం పొడి ఇనుప గుంటలో పెట్టి, గూటం బిగించి, ఆ గూటానికి ఉండే పాలజాటీని పట్టుకుని గట్టిగా గోడకు కొడితే ఠాప్ అని సౌండ్ వస్తుంది. ఇక గంధకం పొడి అయిపోయేంత కాలం వాడి దీపావళికి దిగుల్లేదు. పోయిన దీపావళికి కొన్న గన్ను కనిపించదు. లేదా పాడై ఉంటుంది. కొత్త గన్ కొన్న పిలకాయలు వాటిని పట్టుకుని దొంగ పోలీస్ ఆట ఆడుతుంటారు. మనకూ కావాలనిపిస్తుంది. బజారుకు వెళ్లి టపాకాయల అంగడిలో అడిగితే రూపాయిన్నరది ఒకటి, మూడు రూపాయలది, ఐదు రూపాయలది చూపిస్తాడు. నల్లటి రంగు వేసిన రేకు తుపాకీలు, స్టీలు తుపాకీలు... కొనాలంటే డబ్బులెక్కడివి. వచ్చిన అమ్మను అడిగితే వీపు మీద ఒక టపాకాయల పేలుతుంది. నాన్నను అడిగితే ‘కొందాం లేరా.. దీపావళి చాలా రోజులు ఉందిగా’ అంటాడు. ఈలోపు అన్నయ్య వాళ్లను వీళ్లను అడిగి, బంధువుల దగ్గర చిల్లర సంపాదించి ఒకటి సొంతానికి కొనుక్కుంటాడు. వాడు వాడిది మనకు చచ్చినా ఇవ్వడు. ఇంకేంటి? అలక... నిరాహార దీక్ష... హర్తాళ్.. రాస్తారోకో... చివరకు నిరసన దీక్షకు ఇంట్లో ఉన్న నానమ్మ ముక్కు చీది ‘పిల్లాడు ఏమడిగాడని’ అని ఏడుపు. ఆఖరకు తుపాకీ శాంక్షన్ అవుతుంది. ఇంకేంటి. నానమ్మ తన ముక్కుపొడుం డబ్బులు త్యాగం చేసి రీల్స్ ప్యాకెట్ కొనిస్తుంది. ఒక ప్యాకెట్లో పది రీల్స్ డబ్బీలు ఉంటాయి. ఒక్కో డబ్బీలో ఒక్కో రీలు. తుపాకీ విప్పి రీలు చుట్టి మళ్లీ కచ్చితంగా బిగించడం ఒక ఆర్టు. ఆ పని చేశాక ట్రిగర్ నొక్కిన ప్రతిసారీ రీల్ రన్ అవుతూ ఠాప్ ఠాప్ సౌండ్ వస్తుంటే సూపర్‌స్టార్ కృష్ణ కూడా నిలువలేడు ఆ స్టయిల్‌కి. డబ్బులు పెద్దగా ఉండని రోజులు అవి. పిల్లలు తమ కోర్కెలను కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టే రోజులు. ఒక తండ్రి ఒక కొడుక్కి నేల టపాకాయల సంచి కొనిస్తాడు. పది రూపాయలకు చాలా నేల టపాకాయలు ఉంటాయి దానిలో చిన్నవి. ఆ పిల్లవాడికి బుద్ధి పుట్టినప్పుడల్లా ఒక నేల టపాకాయ తీసి నేలన గట్టిగా బాదితే ఢమ్మని సౌండు. మరో బీద తండ్రి తన కొడుక్కి తాటాకు టపాకాయలు కొనిస్తాడు. తాటాకులో మందు కూర్చి వొత్తి బయటకు వచ్చేలా ఉండే ఆ చీప్ టపాకాయలు సౌండ్‌లో మేటి. క్యాండిల్ వెలిగించి ఒక్కో తాటాకు టపాకాయ అంటించి విసురుతూ ఉంటే ఠపాఠపా అంటాయి. పీర్ ప్రెజర్ ఉండేది ఆ రోజుల్లో. మీ నాన్న ఎంతకు కొని తెచ్చాడు అనంటే మీ నాన్న ఎంతకు కొని తెచ్చాడు అని. పిల్లలు తమ దగ్గర ఉన్న అన్ని డబ్బాల కాకర పువ్వొత్తులను లెక్క వేసి పక్క కుర్రాడితో పోల్చుకునేవారు. చిచ్చుబుడ్లు ఫ్యాషన్‌వి కొనేవాళ్లు డబ్బున్నవాళ్లు. మట్టి చిచ్చుబుడ్లు కొనేవాళ్లు మధ్యతరగతి వారు. ఆ మట్టి చిచ్చుబుడ్లు మూడ్ బాగుంటే బుజ్‌మని వెలిగేవి. లేకుంటే తుస్‌మనేవి. విష్ణుచక్రం, భూచక్రం అందరూ కొనలేరు. లక్ష్మీ ఔట్లు క్వాలిటీ ఔట్లు. ఆరు ఔట్లు ఒక ప్యాకెట్. కొంటే చెవులు చిల్లులు పడేలా పేలడం గ్యారంటీ. పురికొస బాంబులు కూడా మానం గల్లవి. తుస్‌మనడం వాటి చరిత్రలో లేవు. ఇక పిల్లిపిసర సరం ప్రమాద రహితమైనది. 500 వాలా, 1000 వాలా కొనేది శ్రీమంతులు. వాళ్లు అందరూ టపాకాయలు కాల్చేక ఏ అర్ధరాత్రో 1000 వాలా వెలిగించి పది నిమిషాలు ఢమఢమలాడించి తమ దర్జా చూపించుకుంటారు. పిల్లలు దీపావళికి కొత్తబట్టలు అడగరు. కాని టపాకాయలు మాత్రం తప్పక అడుగుతారు. పాముబిళ్లలు, వెన్నముద్దలు, మెగ్నీషియం రిబ్బన్లు, కలర్ అగ్గిపెట్టెలు... ఇవి ఉంటే పెన్నిధి ఉన్నట్టే. ఇంతా చేసి దీపావళి ముందు రోజు నుంచి ముసురు పట్టుకుంటే వాళ్లు బెంగ పడతారు. చీటికి మాటికి ఆకాశం వైపు చూస్తుంటారు. అయ్యో.. వీటిని కాల్చడం ఎలా అనుకుంటారు. దీపావళి రోజు వాన రావడం ఆనవాయితీ. పిల్లలతో ఆడుకోవడానికే వచ్చి కాసేపు అల్లరి చేసి వెళ్లేది అది. దీపావళికి చుట్టుపక్కల పిల్లలను గమనించుకోవడం పెద్దలు తప్పక చేసేవారు. కొన్ని టపాకాయల్ని కొనుక్కోలేని పిల్లలకు ఇచ్చేవారు. తమ పిల్లల చేత ఇప్పించేవారు. తమ ఇంటి ముంగిట్లో టపాకాయలు కాలుస్తున్నప్పుడు పక్కింటి పిల్లలు తెల్లముఖం వేసుకు చూస్తుంటే పిలిచి వారి చేత కూడా కాల్పించేవారు. ప్రేమ, స్నేహం ఉన్నది కాస్త పంచితే పెరుగుతుంది. దీపం అంటే తాను వెలిగేది మాత్రమే కాదు.. వెలుతురు పంచేది. ఒక దీపం నుంచి వేయి దీపాలు వెలుగుతాయి. ఈ దీపావళిని ప్రేమను పెంచుతూ జరుపుకోండి. చిన్నప్పటి రోజులను పిల్లలకు చెప్పండి. పిల్లలకు సురక్షితమైన దీపావళి సరంజామా ఇచ్చి దగ్గరుండి వారి చేత కాల్పించండి. హ్యాపీ దీపావళి. -
పిల్లల పండుగ..కనులకు వేడుక
నటన, కథారచన, చిత్రలేఖనం, శాస్త్ర ప్రదర్శనలు వివిధాంశాల్లో ప్రతిభ చాటిన పాఠశాల చిన్నారులు ముగిసిన ‘క్రియ’ ఫౌండేష¯ŒS రాష్ట్రస్థాయి వేడుక నీటిలోని తామర నుంచి నింగిలోని తారక వరకూ.. అన్నీ చిన్నారులకు ఆసక్తిజనకాలే. వారి ముఖాలను పరిశీలనగా చూస్తే.. ప్రపంచంలోని ప్రతి దాన్నీ శోధిస్తున్న, మథిస్తున్న వారి బాలమేధస్సుకు ప్రతిబింబాల్లా కనిపిస్తాయి. అలాంటి వందల మంది బాలల సృజనాత్మకతకు, కళాత్మకతకు వేదికైంది.. కాకినాడలో క్రియ ఫౌండేష¯ŒS ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి బాలల పండుగ. శాస్త్ర విజ్ఞానం నుంచి శతకపద్యధారణం వరకు; యోగాసనాల నుంచి నట, నాట్య విన్యాసాల వరకూ పలు అంశాల్లో చిన్నారులు కనబరిచిన ప్రతిభాపాటవాలు ముచ్చటగొలిపాయి. అబ్బురపరిచాయి. కాకినాడ కల్చరల్ : జేఎ¯ŒSటీయూకే ప్రాంగణంలో క్రియ ఫౌండేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్ధాయి అంతర పాఠశాలల పిల్లల పండుగ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సుమారు 600 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని వివిధ రంగాల్లో ప్రతిభను కనబరిచారు. సెలవు దినం కావడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిభాపాటవాలను చాటి ఆకట్టుకొన్నారు. చివరి రోజున సాంస్కృతిక కార్యక్రమాలు సబ్ జూనియర్స్ విభాగంలో అధికంగా జరగడంతో ఎక్కడ చూసినా చిన్నారులు విలక్షణమైన వేషధారణలతో కనిపించి ముచ్చట గొలిపారు. చిట్టి చేతులతో సైన్సు ప్రయోగాలు చేసి శభాష్ అనిపించుకున్నారు. సౌరశక్తి వినియోగం, బంగాళాదుంపలతో సెల్ చార్జింగ్, రైల్వే క్రాసింగ్లలో ఆటోమేటిక్ గేట్లు, అద్దాల పొయ్యితో వేడి శాతం పెంచడం తదితర ప్రయోగాలను ప్రదర్శించారు. పద్యధారణలో పోతన మహాకవి మహాభాగవతం పద్యాలను, వేమన పద్యాలను, శతక పద్యాలను లయబద్ధంగా ఆలపించి వీనుల విందు చేశారు. చక్రాసనం, అర్ధమత్సే్యంద్రాసనం, ఏకపాద రాజ కపోతాసనం, ధనురాసనం, మయూరాసనం, పూర్ణ భుజంగాసనం, నటరాజాసనాలతో ఆశ్చర్యపరిచారు. ‘చిన్నికృష్ణుడమ్మ..., ఘల్లుఘల్లు జోడేళ్ల..., కొండమనదిరో కోనమనదిరో...’ వంటి శాస్త్రీయ, జానపద, గిరిజన నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకొన్నారు. చిత్రలేఖనం పోటీల్లో ‘దీపావళి, మై ఫ్యామిలీ, మై డ్రీమ్ విలేజ్, సహాయం, స్త్రీ, పురుషుల సమానత్వం, కన్నుతో ప్రపంచాన్ని చూడడం’ వంటి అంశాలను కళ్ళకు కట్టించే బొమ్మలను సృజించారు. కథా రచన విభాగంలో గ్రామీణ నాగకరిత ఉట్టిపడే కథలను, ఆలోచింప చేసే కథలను రాశారు. దుర్యోధనుడు, అల్లూరి సీతారామరాజుడిగా బాలల ఏకపాత్రాభినయంతో స్ఫూర్తిని కలిగించే లఘు చిత్రాలను, లఘు నాటికలను ప్రదర్శించారు. చిన్నచిన్న నీతి కథలను బాలలు చక్కని హావభావాలతో చెప్పి మెప్పించారు. మట్టిబొమ్మల తయారీ, దస్తూరీ తదితర అంశాల్లోనూ చిన్నారులు ప్రతిభ కనబరిచారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, లోక్‌సత్తా పార్టీ నాయకులు వైడీ రామారావు, దంటు సూర్యారావు తదితర ప్రముఖులు ప్రదర్శనలను సందర్శించారు. మన సంస్కృతిని పిల్లలకు నేర్పాలి ఎంతో గొప్పదైన భారతదేశ సంస్కృతిని పిల్ల లకు నేర్పాలని ఆధ్యాత్మికవేత్త ఉమర్ ఆలీషా అన్నారు. పిల్లల పండుగ ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ క్రియ ఫౌండేష¯ŒS చిత్తశుద్ధితో చేస్తున్న సేవలు ఆదర్శనీయమన్నారు. మరోఅతి«థిగా ప్రముఖ న్యాయవాది మాదిరెడ్డి సుబ్బారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడి బాలల మానసిక వికాసాన్ని దెబ్బ తీస్తోందన్నారు. విశిష్ట అతిథిగా సినీనటుడు నాగినీడు మాట్లాడుతూ బండెడు పుస్తకాలు మోసే విధానం పోయి ప్రాక్టికల్ విద్యావిధానం వచ్చినప్పుడే బాలల వికాసం జరుగుతుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలతోనైనా మేధావుల వలసలు తగ్గి, వారి విజ్ఞానం మన దేశానికే పరిమితమైతే ముందుకు దూసుకుపోతామన్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పిల్లలను పెంచరాదని సూచించారు. చివరగా ‘తాను కఠిన విల¯ŒSను కాదు– మర్యాద విల¯ŒSనని’ చెప్పి పిల్లలను ఉత్సాహపరిచారు. పిల్లల పండుగలో లఘునాటికలు, నృత్యం, యోగాసనాలు, విచిత్రవేషధారణ తదితర 16 అంశాల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, ఇద్దరికి ప్రత్యేక బహుమతులను అందజేశారు. క్రియ ఫౌండేష¯ŒS కార్యదర్శి ఎస్ఎస్ఆర్ జగన్నాథరావు, సభ్యులు రామకృష్ణరాజు, జగన్నాథరావు, సూర్యప్రకాష్, రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సినిమా చూపించరా?
సాక్షి, సిటీబ్యూరో: బాలల పండుగ కదా... మనకెందుకులే అనుకున్నారో... అంతగా ప్రాధాన్యం అవసరం లేదనుకున్నారో... మన అధికారులు దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వారి నిర్వాకం కారణంగా 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి ప్రచారం కరువైంది. ఈ నెల 14 నుంచి 20 వరకు నగరంలో బాలల చలన చిత్రోత్సవాలు జరుగనున్నాయి. దీనికి కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఈ చలన చిత్రత్సోవాల సాంస్కృతిక విభాగం చైర్మన్ మామిడి హరికృష్ణ విదేశీ పర్యటనకు వెళ్లారు. మిగిలిన వారు దీన్ని పట్టించుకోవడం మానేశారు. ఎక్కడా ప్రచారానికి సంబంధించిన కటౌట్లు గానీ...ఇతర ఏర్పాట్లు గానీ కనిపించడం లేదు. ఒకటి రెండు చోట్ల బెలూన్లను ఏర్పాటు చేసి... చేతులు దులుపుకున్నారు. మాదాపూర్ ప్రాంతంలోనూ ఎక్కడా ప్రచార సందడి లేదు. 13 మల్టీప్లెక్స్ లలో సినిమాలు ప్రదర్శిస్తారని గతంలో ప్రకటించారు. కానీ ఇంత వరకు వాటికి సంబంధించిన షెడ్యూల్‌నూ విడుదల చేయలేదు. ఈ నెల 15 నుంచి 19 వరకు రవీంద్రభారతిలో సాయంత్రం పూట సాంస్కృతిక ప్రదర్శనలు జరుగనున్నాయి. ఏ రోజు ఏ ప్రదర్శన ఉంటుందనేవిషయమూ తెలియడం లేదు. ఈ ఉత్సవాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన దర్శకులు హాజరుకానున్నారు. వారు ఎవరెవరనే విషయమూ తెలియడం లేదు. ప్రధాన వేదిక ఉన్న ఐమాక్స్ థియేటర్లో ఏఏ సినిమాలు ప్రదర్శిస్తారో షెడ్యూల్ ఇంత వరకు ప్రకటించలేదు. ప్రభుత్వం ఈ ఉత్సవాలపై పెద్దగా శ్రద్ధ కనబరచడం లేదని బాలల హక్కుల సంఘ నేతలు వాపోతున్నారు. సమాచారం కోసం బేగంపేట్ పర్యాటక భవన్‌లోని చిల్డ్రన్స్ ఫెస్టివల్ నిర్వాహకుడు కిషన్ రావు కార్యాలయానికి వెళితే... ‘సార్ బిజీ’ అంటూ అక్కడిఅధికారులు వెనక్కు పంపుతున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి సంబంధించిన రోజు వారీ షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. -
తీపి జ్ఞాపకాలతో వెళ్లండి
=కేయూలో పెర్ఫార్మెన్స ఆర్ట్స్ విభాగం ఏర్పాటుకు యోచన =చిల్డ్రన్స్ ఫెస్టివల్ నిర్వహణకు కృషి =కేజీ నుంచి పీజీ వరకు క్యాంపస్‌లో ఉండాలి =యువజనోత్సవాల ముగింపుసభలో =కేయూ వీసీ ప్రొఫెసర్ వెంకటరత్నం కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీలో ఐదు రోజులుగా జరుగుతున్న కళారత్న-2013, 29వ సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ యువజనోత్సవ పోటీలల్లో భాగస్వాములైన విద్యార్థులు స్వీట్ మెమొరీస్‌తో వెళ్లాలని కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అన్నారు. యువజనోత్సవాల్లో భాగంగా నాలుగు రోజులపాటు పోటీలు జరగ్గా ఐదోరోజు శుక్రవారం క్యాంపస్‌లోని నూతన ఆడిటోరియంలో ముగింపు సభ, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ వెంకటరత్నం మాట్లాడుతూ కాకతీయుల కళావారసత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నాటి పేరిణి నృత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. కేయూ ఆవిర్భవించి 37ఏళ్లు గడుస్తున్నా మ్యూజిక్, డ్యాన్స్‌కు సంబంధించిన కోర్సులు లేకపోవడంతో ఆ రంగాల్లో విద్యార్థులు వెనకబడుతున్నారన్నారు. త్వరలో క్యాంపస్‌లో పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలనే యోచన ఉందన్నారు. వీసీగా తాను ఈ రెండేళ్లలో పలుకొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. పీజీ మహిళా కళాశాల, మహిళా ఇంజినీరింగ్ కళాశాల, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి ప్రాంతాల్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే చిల్డ్రన్స్ ఫెస్టివల్స్ నిర్వహిం చాలనే యోచన ఉందన్నారు. క్యాంపస్‌లో కేజీ నుంచి పీజీ వరకు కోర్సులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 25, 26,27 తేదీల్లో న్యాక్ బృందం యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో పర్యటించనుందని, మళ్లీ న్యాక్ ఏ-గ్రేడ్ తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. యువజనోత్సవాలను విజ యవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అకడమిక్ పరంగా కెరీర్‌ను అభివృద్ధి పరుచుకుంటూనే స్పోర్ట్స్, కల్చరల్, మ్యూజిక్, డ్యాన్స్ రంగాల్లోనూ ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. యువజనోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన యూనివర్సిటీ అధికారులును అభినందించారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్( ఏఐయూ) అబ్జర్వర్ పారి పరమేశ్వరన్ మాట్లాడుతూ యువతకు సాధ్యం కానిది ఏమీలేదని, యువత పోరాటాల్లో భాగస్వాములై ‘తెలంగాణ’ ను కూడా సాధించుకున్నారన్నారు. డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు మాట్లాడుతూ ప్రపంచంలో ఏదేశం లో లేనివిధంగా భారతదేశంలో యువశక్తి ఉందని,దేశ భవిష్యత్తు వారిపైనే ఆధారపడి ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. సాయిలు మాట్లాడుతూ 21 రాష్ట్రాల నుంచి 800 మందికిపైగా విద్యార్థులు 25 ఈవెంట్లలో భాగస్వాములయ్యారన్నారు. వీరికి ఇబ్బందులు కలగకుండా 18కమిటీలతో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సభలో కేయూ యువజనోత్సవాల కల్చరల్ కోఆర్డినేటర్ జి.దామోదర్, క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి, ప్రొఫెసర్లు కె. దామోదర్‌రావు, గోపీనాథ్కృష్ణ, గిరీశం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధికారాణి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ కిషన్ కొద్దిసేపు మాత్రమే ఉండి వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఉర్రూతలూగించిన నృత్య ప్రదర్శన ముగింపు సభ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన గ్రూప్సాంగ్స్, గిరిజన, జానపద నృత్యాలతో ఆడిటోరియం దద్దరిల్లింది. కేరింతలు, చప్పట్లతో విద్యార్థులు ఉత్సాహంగా చిందేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, కల్చరల్ కోఆర్డినేటర్ ఉమేష్ ఓ హిందీ పాట పాడి విద్యార్థులను ఉర్రూతలూగించారు. కేయూకు బహుమతులు యువజనోత్సవాలలో హోస్ట్ యూనివర్సిటీగా ఉన్న కేయూ విద్యార్థులు వివిధ ఈవెంట్లలో భాగస్వామలు కాగా మూడింటిలో మాత్రమే బహుమతులు సాధిం చారు. క్లాసికల్ డ్యాన్స్‌లో ద్వితీయ బహుమతి, మిమిక్రీ, ఫోక్ ఆర్కెస్ట్రాలో తృతీయ బహుమతి అందుకున్నారు. రాష్ట్రసంత్ తుకదోజీ మహారాజ నాగపూర్ యూనివర్సిటీ, మహారాష్ట్ర అండ్ ఇందిరా కళాసంగ్ విశ్వవిద్యాలయం ఖారీఘర్(చత్తీస్‌గఢ్) ఎక్కువ బహుమతులు సాధించి ఓవరాల్ చాంపియన్లుగా నిలిచాయి. రన్నరప్‌గా మహారాష్ట్రలోని సంత్గాడ్జి బాబా అమరావతి యూనివర్సిటీ విద్యార్థులు నిలిచారు. కేయూ వీసీ వెంకటరత్నం, తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు విజేతలకు బహుమతులు అందజేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలోని కురుక్షేత్రలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో విజేతలు పాల్గొంటారు. -
హర్షిత రెడ్డికి ‘జాతీయ బాలిక’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్. హర్షిత రెడ్డికి జాతీయ బాలిక అవార్డు లభించింది. గణిత రంగంలో సాధించిన అసాధారణ విజయానికిగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం ‘వాత్సల్య మేళా’ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 22 మంది బాలబాలికలను ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కృష్ణాతీరథ్ సత్కరించి పురస్కారాలను అందచేశారు. అవార్డు కింద హర్షిత రెడ్డికి రజత పతకం, రూ.10వేలు, ప్రశంసాపత్రాన్ని అందచేశారు. చెస్‌లో అసమాన ప్రతిభ కనబర్చిన ఢిల్లీకి చెం దిన హర్షల్ షాహీకి స్వర్ణపతకం, రూ.20 వేల నగదు అందచేశారు.