సినిమా చూపించరా?
సాక్షి, సిటీబ్యూరో: బాలల పండుగ కదా... మనకెందుకులే అనుకున్నారో... అంతగా ప్రాధాన్యం అవసరం లేదనుకున్నారో... మన అధికారులు దీనిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వారి నిర్వాకం కారణంగా 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి ప్రచారం కరువైంది. ఈ నెల 14 నుంచి 20 వరకు నగరంలో బాలల చలన చిత్రోత్సవాలు జరుగనున్నాయి. దీనికి కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఈ చలన చిత్రత్సోవాల సాంస్కృతిక విభాగం చైర్మన్ మామిడి హరికృష్ణ విదేశీ పర్యటనకు వెళ్లారు.
మిగిలిన వారు దీన్ని పట్టించుకోవడం మానేశారు. ఎక్కడా ప్రచారానికి సంబంధించిన కటౌట్లు గానీ...ఇతర ఏర్పాట్లు గానీ కనిపించడం లేదు. ఒకటి రెండు చోట్ల బెలూన్‌లను ఏర్పాటు చేసి... చేతులు దులుపుకున్నారు. మాదాపూర్ ప్రాంతంలోనూ ఎక్కడా ప్రచార సందడి లేదు. 13 మల్టీప్లెక్స్ లలో సినిమాలు ప్రదర్శిస్తారని గతంలో ప్రకటించారు. కానీ ఇంత వరకు వాటికి సంబంధించిన షెడ్యూల్‌నూ విడుదల చేయలేదు. ఈ నెల 15 నుంచి 19 వరకు రవీంద్రభారతిలో సాయంత్రం పూట సాంస్కృతిక ప్రదర్శనలు జరుగనున్నాయి.
ఏ రోజు ఏ ప్రదర్శన ఉంటుందనేవిషయమూ తెలియడం లేదు. ఈ ఉత్సవాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన దర్శకులు హాజరుకానున్నారు. వారు ఎవరెవరనే విషయమూ తెలియడం లేదు. ప్రధాన వేదిక ఉన్న ఐమాక్స్ థియేటర్‌లో ఏఏ సినిమాలు ప్రదర్శిస్తారో షెడ్యూల్ ఇంత వరకు ప్రకటించలేదు. ప్రభుత్వం ఈ ఉత్సవాలపై పెద్దగా శ్రద్ధ కనబరచడం లేదని బాలల హక్కుల సంఘ నేతలు వాపోతున్నారు.
సమాచారం కోసం బేగంపేట్ పర్యాటక భవన్‌లోని చిల్డ్రన్స్ ఫెస్టివల్ నిర్వాహకుడు కిషన్ రావు కార్యాలయానికి వెళితే... ‘సార్ బిజీ’ అంటూ అక్కడిఅధికారులు వెనక్కు పంపుతున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి సంబంధించిన రోజు వారీ షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.