‘‘ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య!
ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు.’’
అంటూ పిల్లలు సంబరంగా జరుపుకునే పండగ వినాయక చవితి. యావద్భారత దేశం వేడుకగా జరుపుకునే పండగ ఇది. కలియుగంలో అతి త్వరగా అనుగ్రహించే దైవం వినాయకుడు.
ఋగ్వేద కాలం నుండి కీర్తించబడి పూజించబడుతున్న దేవత ఒక్క గణపతి మాత్రమే.
దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు ఐన గణపతిని అన్ని సందర్భాలలోను పూజించటమే కాదు దేవతలందరూ త్రిమూర్తులతో సహా పూజించినట్టు ఆధారాలున్నాయి. గణపతి కున్న నామాలలో బాగా ప్రసిద్ధమైనవి వినాయకుడు, గజాననుడు. గణనాథుడికి ఉన్న పన్నెండు నామాలలో ప్రతి దాని వెనక ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా వినాయకోత్పత్తి, వినాయకుడు గజాననుడు కావటానికి గల కారణాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంతే కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు కనపడుతుంది.
సృష్టికార్యం ప్రారంభించే ముందు బ్రహ్మ ప్రార్థించిన గణపతి ఓంకార స్వరూపుడు. కృతయుగంలో కశ్యపునికి అదితికి జన్మించి ‘మహోత్కటుడు‘ అనే పేరుతో దేవాంతక నరాంతక రాక్షసులను సంహరించి లోకకల్యాణం గావించాడు. త్రేతాయుగంలో, మయూరేశుడుగా అవతరించి త్రిమూర్తులకు వారు కోల్పోయిన స్థానాలను తిరిగి ఇప్పించాడు. అప్పుడే బ్రహ్మ తన కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలను వినాయకుడికిచ్చి, వివాహం చేస్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనం నెమలి. ద్వాపరయుగంలో గజాననుడుగా అవతరించి, సింధూరుడనే రాక్షసుని సంహరించాడు. మనం వినాయకవ్రత కల్పంలో చదివే కథ ఈ గజాననునిదే. కలియుగంలో ధూమ్రకేతువుగా అవతరించి, అశ్వారూఢుడై ప్రతిప్రాణిలో పెచ్చుపెరిగిన రాక్షసప్రవృత్తిని నశింప చేస్తూ ఉన్నాడట.
వివిధ పురాణాలలో గణపతి వినాయకుడి ఆవిర్భావం, రూపు రేఖలు విభిన్నంగా ఉన్న కారణంగా శిల్పులు వాటికి గణపతి తత్త్వాన్ని, తమ సృజనాత్మకతను జోడించి రకరకాల గణపతులను మన ముందు ఉంచుతున్నారు. మిగిలిన లక్షణాలను ఏరకంగా చూపించినా అన్నింటిలోనూ సామాన్యంగా ఉండేవి – గజ ముఖం, కురచ మెడ, పెద్దబొజ్జ, నాగయజ్ఞోపవీతం, చేతిలో మోదకం, మూషిక వాహనం మొదలైనవి. గజముఖంలో తొండం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు భాగాలు.
ప్రపంచ సాహిత్యంలో మొదటిది అయిన ఋగ్వేదంలో గణపతిగానే పేర్కొనటం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో ‘‘కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా’’ అని లలితాదేవి కల్పించినది గణేశ్వరుణ్ణే అని తెలుస్తోంది. తరువాత విఘ్నాలకి అధిపతి అయి విఘ్నేశ్వర నామాన్ని పొందటం జరిగింది. గణాలకు అధిపతి కనుక గణపతి, గణాధిపతి అనే నామాలు కలిగాయి. ఏవైనా గణములు అంటే గుంపులు, సముదాయాలు ఉంటే వాటి మీద అధికారం కలిగి, అవన్నీ ఏకోన్ముఖంగా పని చేసేట్టు చేయించ కలిగిన ప్రజ్ఞయే గణపతి. ఏకాత్మతా భావన కలిగించ గలవాడు గణపతి. ఆ ప్రజ్ఞ లేనట్టయితే సృష్టిలోని అన్ని భాగాలు దేనికవే ఉండేవి. కనుకనే సృష్టి చేసే సమయంలో బ్రహ్మ గణపతిని ప్రార్థించాడట!
దేవతారూపాలన్నీ ఆయా తత్త్వాలకి ప్రతీకలు. ముఖ్యంగా ప్రత్యేక రూపాలున్న మూర్తులు. గణపతి అనగానే గుర్తు వచ్చేది పెద్ద పొట్ట. దాని నిండా ఉన్నవి విద్యలు. ‘‘కోరిన విద్యలకెల్ల నొజ్జయయి యుండెడి ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్’’ అంటాము కదా! వొజ్జ అంటే గురువు అని అర్థం. అందుకే గణపతి పూజలో పిల్లల చేత పుస్తకాలు పెట్టించుతాము. పనిలో పనిగా గుంజీలు తీయిస్తాము. గుంజీలు తీయటం వల్ల కుదురు వస్తుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. పెద్ద చెవులు బాగా వినమని చెపుతున్నాయి. చిన్న కళ్ళు సూక్ష్మ మైన అంశాలని ఎంత నిశితంగా ఏకాగ్రతతో చూడాలో తెలియ చేస్తాయి. తొండం ఎప్పుడు నోటిని మూసుకుని ఉండాలని తెలియ చేస్తుంది.
చంద్రుణ్ణి చూసిన దోషం తొలగటానికి శమంతకోపాఖ్యానం చదవుకోవాలనటం కూడా విశేషమే. ఆ కథని అర్థం చేసుకుంటే సమాజం ఎంత బాగుంటుందో కదా! ఏదైనా ఒక వరం ఒకరికి ఇస్తే దాన్ని వారు మాత్రమే ఉపయోగించాలి. ఇతరులకి అది ఉపయోగ పడక పోగా ప్రాణాంతకం కూడా కావచ్చును అని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వృత్తాంతమ్ తెలుపుతుంది. ప్రభుత్వం వద్ద కాక వ్యక్తుల దగ్గర ధనం పోగు అయితే ప్రాణాలకే మోసం జరుగుతుందని సత్రాజిత్తు మరణం తెలుపుతుంది. ఎంతటి అవతార పురుషుడికి అయినా దోషఫలం అనుభవించక తప్పదు అని కృష్ణుడికి నీలాపనిందలు రావటం తెలియ చేస్తుంది. సర్వమానవుల మూలాధారంలో కుండలినీ శక్తిగా ఉన్న జగన్మాతకి గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. అదే పార్వతీ దేవి గుమ్మంలో కాపలా పెట్టింది అని కథలో చదువుకుంటాం. విఘ్నాధిపతి కనుక మనం చేసే పనుల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడమని అన్ని కార్యాలకి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించటం సంప్రదాయంగా మారింది.
గణపతి పూజ మనకి ఏంచెపుతోంది?
1. మాతా పితృభక్తి
అది ఉంటే లోకాలనన్ని చుట్టి రావచ్చు. విజయం సాధించవచ్చు.
2. భౌతిక బలం కన్న బుద్ధి బలం మిన్న
తమ్ముడు నెమలి వాహనం మీద ఎగురుతూ వెళ్ళాడు. తాను ఎలుకనెక్కి వెళ్ళి గెలవటం ఎంత కష్టం? కనుక బుద్ధిబలాన్ని ఉపయోగించాడు.
3. ఆకుపచ్చని ఆహారం తింటే తెలివితేటలు పెరుగుతాయి. ఆకుపచ్చరంగులో ఉన్న ఆహారం తింటే తెలివి తేటలు పెరుగుతాయి, చూపు మెరుగుగా ఉంటుంది. అందుకే గరిక తనకి పరమప్రీతి అని చెప్పాడు. బుద్ధి కావాలంటే ఆరాధించవలసింది గణపతినే. గణపతి నక్షత్రమైన హస్తకి అధిపతి బుధుడు. బుద్ధి కారకుడు బుధుడే కదా!
4. ఏక వింశతి 21 రకాల పత్రితో పూజ చేయటం ఒక్క గణపతి పూజలో మాత్రమే కనిపిస్తుంది. పిల్లలకి పత్రి సేకరణ పేరుతో చెట్లని, పర్యావరణాన్ని పరిచయం చేయటం జరుగుతుంది. అవన్నీ ఆ సమయంలో వచ్చే తరుణ వ్యాధులకి ఔషధాలు. ప్రత్యేకంగా గరిక పూజ ద్వారా గరికకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నాడు. గరిక పవిత్రమైనదే కాదు, భూమి ఆకృతిని పరిరక్షిస్తుంది.
5. రెండుసార్లు ఆవిరిమీద ఉడకబెట్టిన ఆహారం వానాకాలంలో మంచిది. బలం కలిగిస్తుంది. నూనెలో వేయించిన ఆహారం వానలు పడుతున్నప్పుడు అరగటం కూడా కష్టం.
6. మనలో సామర్థ్యం ఉండాలే కాని పరికరాలు ప్రధానం కాదు అని ఎలుక వంటి అతి చిన్న వాహనం ఎక్కి లోకాల నన్నిటిని జయించి చూపించాడు.
డా. ఎన్.అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment