(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి. సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు.)
గణాధిపాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
పాశాంకుశధరాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
ఆఖువాహనాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
వినాయకాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
ఈశపుత్రాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
ఏకదంతాయనమః దుర్వారయుగ్మంపూజయామి!
ఇభవక్త్రాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
మూషికవాహనాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
కుమారగురవే నమః దూర్వారయుగ్మం పూజయామి!
కంపిలవర్ణాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
బ్రహ్మచారిణేనమః దూర్వారయుగ్మం పూజయామి!
మోధికహస్తాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
సురశ్రేష్టాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
గజనాసికాయ నమః దూర్వారయుగ్మం పూజయామి!
కపిత్తఫలిప్రియాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
గజముఖాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
సుప్రసన్నాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
సురాగ్రజాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
ఉమాపుత్రాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
స్కందప్రియాయనమః దూర్వారయుగ్మం పూజయామి!
శ్రీ వరసిద్ది వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి - దూర్వారయుగ్మం సమర్పయామి
శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబకర్ణాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మహోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళస్వరూపాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాటత్పయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రీతవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరక్షిప్తవారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపన్యాసాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థ పనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జ్యాయనే నమః
ఓం యక్షకిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యే నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వక్‌దృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.
ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు)
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం॥ఉమా సుత నమస్తుభ్యం గృహాణవరదో భవ॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.
దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) స్వాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి॥
నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి)
ఓమ్ భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయనః ప్రచోదయాత్ ॥
(పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి)
ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి॥
ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి॥(రాత్రి అయితే)
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవచణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)
ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి॥
(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా ఓమ్ అపానాయ స్వాహా ఓమ్ వ్యానాయ స్వాహా ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా॥(తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి॥
తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి॥సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః సువర్ణ పుష్పం సమర్పయామి॥
నీరాజనమ్ : (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ॥సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాస్ట్య్ర యాముఖే తయామా సగ్‌ం సృజామసి॥సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళానిభవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి॥నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి॥(అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)
మంత్రపుష్పమ్ : (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)
గణాధిప నమస్తేస్తు
ఉమాపుత్రా విఘ్ననాశన
వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక॥
ఏకదంతైక వదన తథా మూషికవాహన
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్॥
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నోదంతిః ప్రచోదయాత్॥
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః
మంత్రపుష్పాంజలిం సమర్పయామి.
ఆత్మప్రదక్షిణ నమస్కారమ్ : (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు)
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన॥
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప॥
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
ప్రార్థన
(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి
పాదాల వద్ద ఉంచాలి)
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం
మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్॥వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా॥అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక॥
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః
ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి॥
సాష్టాంగ నమస్కారమ్
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి॥
శ్లో॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితం
మయాదేవ పరిపూర్ణంతదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతి
సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు.
(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.
అపరాధ ప్రార్థన : (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి) అపరాధ సహస్రాణి క్రియంతేహం అహర్నిశా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక॥ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక॥శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి॥
(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)
అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.
శ్రీ గణేష ప్రార్థన
తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి
పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత
నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెద దైవగణాధిప లోకనాయకా!
తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని
తలచిన పనిగా దలచితినే హేరంబుని
దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్
అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము
నానుబ్రాలు చెరకు రసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు
పటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్
శ్రీ వినాయకుని దండకము
శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు
నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు
నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు
నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెలన్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటి పండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్‌జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ
యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోకరక్షామణి బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగనూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః
విఘ్నేశుని కథా ప్రారంభం
(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)
సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరో త్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, తన్నివారణ మును చెప్పదొడంగెను.
పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవెల్లప్పుడు నా యుదర మందు వసించియుండుమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండాతని కోర్కెదీర్చి గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుననుండెను.
కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసికొని రప్పించుకొను మార్గముగానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా నుపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపింప, శ్రీహరి యా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగి రెద్దుమేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాదిదేవతలందరిచేతను తలొక వాద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు, సన్నాయిలు దాల్చి గజాసురపురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించు చుండగా, గజాసురుండు విని వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప నియోగించెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర కరంబుగ గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానంద భరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుడొసంగెద’’ ననిన, హరి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది’’ శివుని కనుగొనుటకై వచ్చె కావున శివునొసంగు’’ మనెను.
ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని
‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’ మని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారము తెలుప నాతడు నందిని ప్రేరేపించెను. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాను వైకుంఠమున కేగెను. శివుడు నంది నెక్కి కైలాసమున కతివేగంబున జనియె.
వినాయకోత్పత్తి
కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగుబిండితో నొక బాలునిగ జేసి, ప్రాణం బొసగి, వాకిలి ద్వారమున కాపుగా నుంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొనుచు పత్యాగమునమును నిరీక్షించుచుండె. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంఠంబు దునిమిలోనికేగెను.
అంత పార్వతీదేవి భర్తనుగాంచి, ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చె. అంత నమ్మహేశ్వరుండు తానొనరించిన పనికి చింతించి, తాను తెచ్చిన గజాసుర శిరంబును బాలునికతికించి ప్రాణంబు నొసంగి ‘‘గజాననుడు’’ అని నామం బొసంగె. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించు చుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను.
కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను.
విఘ్నేశాధిపత్యము
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడు గనుక అయ్యాధిపత్యము తనకొసంగు మనియు, ‘‘గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తన కొసంగు’’ మని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి.
శివుండక్కుమారులను జూచి, ‘‘మీలో నెవ్వరు ముల్లోకము లందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికీయాధిపత్యం బొసంగుదు’’ నని మహేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంబు నెక్కి వాయు వేగంబున నేగె. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత తామెరింగియు నిట్లానతీయ దగునే!
నీ పాదసేవకుడును నాయందు కటాక్షముంచి తగు నుపాయంబుదెల్పి రక్షింపవే’’ యని ప్రార్థింప, మహేశ్వరుడు దయాళుడై, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రంబు పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించె.
‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’
అంత గజాననుడు సంతసించి, అత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబున నుండె.
అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తన కెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడు కోట్ల ఏబది లక్షల నదులలో కూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబున కేగి తండ్రి సమీపమందున్న గజాననుని గాంచి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు’’ మని ప్రార్థించెను.
అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయం వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయ్యే, బలవంతంబుగ చేతులానిన చరణంబులాకాశంబు జూచె, ఇట్లు దండ ప్రణామంబుసేయ గడు శ్రమనొందుచుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె, అంత ‘రాజదృష్టి’ సోకి నరాలుకూడ నుగ్గగు నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశంబెల్లెడల దొర్లెను. అతండును మృతుండయ్యె, పార్వతి శోకించుచు చంద్రుని జూచి,
బుషి పత్నులకు నీలాపనిందలు
‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు నొందుదురుగాక’’ అని శపించెను. ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించి శాప భయంబున అశక్తుడై క్షీణించు చుండగా, నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతీ రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు చేసె, ఋషులద్దానింగనుగొని అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.
ఋషిపత్నుల యాపద పరమేష్టికి దెల్ప నాతండు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషి పత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి సప్త ఋషులను సమాధానపరచె. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.
అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీ శాపంబున లోకంబులకెల్ల కీడు వాటిల్లుచున్నది. దాని నుపసంహరింపు’’ మని ప్రార్థింప, పార్వతి సంతసించి, ‘‘ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో నా దినంబున చంద్రుని జూడరాద’’ ని శాపోపశమనంబునొసంగె, అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబులకేగి, భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.
శ్యమంతకోపాఖ్యానము
యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రిజుత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్య భగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము ననుగ్రహించును. ఆ మణియున్ను దేశమున అనావృష్టి, ఈతిబాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచియై ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయ ములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు నివేదించిరి. శ్రీ కృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్దికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రశేనునికి ఇప్పింప సంకల్పించెను.
అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తనతమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై ఆరణ్యమునకు వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణముగ ప్రసేనుడు అశౌచమును పొందెను.
ఆ కారణముచే ప్రసేనుడు సింహము చేతిలో మరణించెను. ఆ సింహమును జాంబవంతుడను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలో నున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీ కృష్ణుడు కూడా వెంట వెళ్ళెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై వెదుకుచూ శ్రీ కృష్ణుడు తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీ కృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీ కృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణినపహరించెనని సత్రాజిత్తు, పౌరులు, భావించిరి. అంతట ఆ అపవాదును బాపుకొనుటకై, శ్రీకృష్ణుడు మరునాడు, అడవిలో శోధింపగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను, దానిని ప్రసేనుని గుర్రమును ఏదో కూృరమృగము చంపి ఉండునని కృష్ణుడు భావించెను. అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయి, ఒక సింహపు పాదముద్రలు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు. రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.
ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీ కృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను. కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యింతి ఊయలలో పరున్న బాలుని ఊపుచుండెను. ఊయల పై ఆట వస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ లలనయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీ కృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భీతిచెంది, పాటపాడుచున్న దాని వలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.
శ్లో॥ సింహః ప్రసేనమవధీః
సింహో జాంబవతాహతాః
సుకుమారక మారోధీః
తవ హ్యేష శ్యమంతకః
తా॥ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా!
ఈ మణి నీకే ఏడవకుము.
అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై శ్రీ కృష్ణుడు వచ్చెనని శంకించి, ద్వంద యుద్దమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబంవంతునకు రాముని ఆలింగనమొనర్చుక ొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్దమొనర్చెను.
క్రమముగా జాంబవంతుని బలము తగ్గి కృష్ణుడే రాముడని తెలిసికొని ఆయన పాదములపై పడి ప్రార్థించి శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను. ద్వారాకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొని శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన సత్యాభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.
కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే ఇచ్చివేసెను.ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ర్ణుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్యుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్ధానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహ మొనర్చెను.
దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్యుని ప్రేరెపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయేను, ఇది తెలిసి శ్రీ కృష్ణుడు హస్తినాపురమునుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్యుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రముపై పారిపోవుచున్న శతధన్యుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్యుని వెంబడించి, పట్టి ద్వంద యుద్దంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతుడు కృష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీ కృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వడలి పోయేను.
బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతః శౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికముగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనః శ్శాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశ్శాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగానుండెను.
ఇచ్చట శ్రీ కృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు
ఈ అపనిందలకు కారణమేమాయని ఆలోచించుచుండగా నారదుడేతెంచి భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి ప్రసేనునితో అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయే కారణమని, తద్విశేషమును ఇట్లు చెప్పెను.
శశివర్ణుడను పేరుగల మహహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోధరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యముర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను.
చంద్రకాంతిలేమిచే ఓషదులు పలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయేను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము నర్థించిరి. అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు,), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు, నివేదన మొనరింపవలెనని, సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిళిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను. అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రదర్శనముచే తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీ కృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీ కృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యలకది ఎట్లు సాద్యమగుననీ, కాన లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను.
భాద్రపద శుక్ల చవితినాడు తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మాహా భక్తుడైన అక్రూరుని రాక అవసమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచూండెను. కావున ఈ వ్రత సమయమందు. జాంబవతి ఊయల ఊపుచూ చెప్పిన శ్లోకము అందరు తప్పక పటింపవలెను.
సుకమారక మారోధీః అనగా ఆ సుకుమారుడు మనమే. తవః హ్యేషా శ్యమంతకః అనగా ఇప్పడు గోపాలరత్నము, గణేషరత్నము కూడా మనవై వారి అనుగ్రహముచే ఎల్లరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందెదరు.
‘‘మంగళం మహత్’’
చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.
- కథ సమాప్తం -
పునఃపూజ : ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికా నారోహయామి గజానారోహయామి అశ్వానారోహ యామి సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి॥
(స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)
విఘ్నేశ్వరుని మంగళహారతులు
శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాధునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం!
నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వారచెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ॥
సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు ॥జయ॥
పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ॥జయ॥
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ॥జయ ॥
వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ॥జయ ॥
పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ॥జయ ॥
ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ॥జయ ॥
మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ॥జయ ॥
సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ॥జయ ॥
కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మిదానపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక ॥జయ ॥
అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ॥జయ ॥
పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ॥జయ ॥
బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ॥జయ ॥
పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ॥జయ ॥
ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ॥జయ ॥
మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ॥జయ ॥
దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ॥జయ ॥
చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ॥జయ ॥
మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ॥జయ ॥
ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ॥జయ ॥
వాయనదానము
శో॥ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ
గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః
(ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను)
మంత్రము - దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం
పూషోహస్తాభ్యామా దదా!
(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)
ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్॥తేహనాకం మహిమానస్యచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి॥పూజా విధానం సంపూర్ణమ్.
(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం)
॥సర్వేజనాస్సుఖినో భవంతు ॥
చంద్రదర్శన దోషశాంతి శ్లోకం
వినాయక చతుర్థినాడు చంద్రుని చూడరాదు. పొర పాటున చూచినచో విష్ణుపురాణములోని ఈ క్రింది శ్లోకమును చదివినచో ఆ దోషము తొలగిపోవునని నిర్ణయ సింధువులో చెప్పబడినది.
సింహః ప్రసేన మవధీత్ సింహోజాంబవతా హతః
సుకుమారక మారోదీః తవ హ్యేషస్స్యఃమంతకః
వ్యాపార ప్రారంభంలో ఆరాధించవలసిన మూర్తులు
వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతిదేవి
వ్యాపారము ఆటంకం లేకుండా సక్రమంగా జరగడానికి ముందుగా గణపతిని, లావాదేవీలు సక్రమంగా జరగడానికి సరస్వతిని, లాభం రావడానికి మహాలక్ష్మిని, వ్యాపారము స్థిరంగా ఉండటానికి వెంకటేశ్వరస్వామిని వ్యాపారంలో తిరుగులేకుండా ఉండటానికి దుర్గాదేవిని ఆరాధించవలెను.
వాహనపూజా విశేషం
వినాయకుడు విఘ్నరాజు. ఆదిపరాశక్తి అంశం, అంగారకుడు వినాయకునికి పరమ భక్తుడు, అంగారకుడు నవగ్రహాలలో సైన్యాధిపతి, ఈ అంగారకుని అనుగ్రహంవల్ల వాహనంనకు అపాయము ఉండదు కాబట్టి వినాయకుడు దగ్గర వాహనపూజ విశేషము. అర్జునుడు రధసారధి కృష్ణుడు, రథ సంరక్షకుడు ఆంజనేయుడు, కాబట్టి ఆంజనేయస్వామి దగ్గర కూడా వాహనపూజ విశేషము.
ఏకవింశతి దూర్వాయుగ్మ (గరిక) పూజ
Published Fri, Aug 29 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement