మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు? ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కధల్లో కనిపిస్తుంది. మట్టిగణపతిని పూజించడానికి పురాణప్రాశస్త్యం కూడా ఉంది. ఏదో వినాయకచవితి వల్లనే మొత్తం కాలుష్యం జరుగుతున్నట్టుకొన్ని సంస్థలు నానా హంగామా చేస్తున్నాయి. అసలు దాని గురించి పురాణం ఏమంటోందో చూద్దాం.
గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. ‘ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?‘ ‘మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వం కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు.
విశ్వవ్యాపకత్వం కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యాన్ని చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు (లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు.
సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది.సర్వజీవ సమాన త్వానికి ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ‘ అని చెప్పాడు సూతుడు.
వినాయక పూజ... కొన్ని ముఖ్య విశేషాలు
- వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం.
- మనం ఎంత పెద్ద విగ్రహం ప్రతిష్టించాము, ఎంత ఆర్భాటాలు చేశామన్నది ముఖ్యం కాదు. మనం ఎంత సేపు స్వామి మీద ధ్యాస పెట్టి నిలకడగా కూర్చున్నామన్నదే ముఖ్యం. కూర్చుని ఏమి చేయాలంటే? ..స్వామికి సంబంధించిన ఒక శ్లోకం, మంత్రం ఓం వినాయకాయ నమః లాంటి మంత్రాలు లేదా అష్టోత్తరం కాని చదవడం ఉత్తమం.
- ఏదీ రానివారు? ‘ఓం’ అని జపించండి. కేవలం చదవడమే కాదు, చదువుతున్నప్పుడు మనస్సు మొత్తం స్వామి మీద లగ్నం చేయండి. వేరే ఏ పని చేయకండి.
- మీకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి స్వీకరించండి. చిన్న బెల్లం ముక్క పెట్టినా ఫర్వాలేదు. ఇలా చేసి చూడండి, ఒక సంవత్సరకాలంలో మీలో అద్భుతమైన మార్పు కనపడుతుంది. మీరు కనుక రోజూ క్రమం తప్పకుండా స్నానం చేసిన తరువాత పైన చెప్పిన విధంగా చేయగలిగితే చాలు మీరే గమనిస్తారు మీలో కలిగిన మార్పు. మీరు నమ్మనంతగా మారతారు. చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేయగలుగుతారు. విద్యార్థులు చదువు మీద ఎప్పుడూ లేనంతగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏదైనా విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు.
- వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి ‘‘స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు’’ అని చదువుతారు. అందుకే గజాననుని ముందు, రోజూ కూర్చునే ప్రయత్నం చేయడం వల్ల అద్భుతమైన విద్యాబుద్ధులను, జ్ఞానాన్ని పొందవచ్చు. ఎంత పెద్ద విగ్రహం పెట్టి పూజించడమన్నది ముఖ్యం కాదు. స్వామి ముందు ఎంతసేపు కూర్చున్నామన్నది ముఖ్యం.
- అందరూ రోజూ కాసేపు గణపతికి కేటాయించండి. మీలో కలిగే మార్పులను గమనించండి. జీవితంలో అతి త్వరగా పైకి ఎదగండి.మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్దం అవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది కనుక గణపతి ఆరాధనను మీ నిత్యజీవితంలో భాగం చేసుకోవడం మంచిది. ఆసనం (చాప వంటివి) వేసుకోవడం మరవకండి.
– డి.వి.ఆర్. భాస్కర్
(చదవండి: వినాయకుడి పూజలోని ఏకవింశతి పత్రాల విశిష్టత ఏంటో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment