మన తెలుగునాట ఎన్నో ప్రసిద్ధి గాంచిన గణిపతి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటి మహిమ అంతా ఇంతా కాదు. కోరిన కోరికలు తీర్చే మహా వినాయకుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ మహిమాన్వితమైన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా..!
బిక్కవోలు గణపతి ఆలయం
తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలులో నెలకొని ఉన్న గణపతి ఆలయం క్రీస్తుశకం 848 – 891 మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు మూడవ విజయాదిత్యుడు బిక్కవోలును రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ఇతనికి గణుగ మహారాజు, త్రిపురమర్త్య, మహేశ్వర, వల్లభ అనే బిరుదులతో పాటు బిరుదాకరామభీమ అనే బిరుదు కూడా ఉంది. ఈ బిరుదు ఆధారంగానే ఈ గ్రామానికి బిరుదాంకరాయపురం అని పేరు వచ్చింది. కాలక్రమంలో బిరుదాంకనవోలుగా మారి ప్రస్తుతం బిక్కవోలుగా వ్యవహారంలో స్థిరపడింది.
చారిత్రక ఆధారాలను బట్టి తూర్పుచాళుక్య రాజులలో రెండవ విజాదిత్యుడు జైనులైన రాష్ట్రకూటులతో 108 యుద్ధాలు చేశాడు. ఇతడు నరేంద్ర మృగరాజుగా పేరు పొందాడు. యుద్ధాలు చేసినందుకు పాప పరిహారంగా ఒకొక్క యుద్ధభూమిలో ఒక్కొక్కటిగా మొత్తం 108 శివాలయాలను నిర్మించాడు. మూడవ విజయాదిత్యుడు కూడా అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించి, విఘ్నేశ్వరాలయాలను కట్టించాడు. అందులో ఒకటి ఈ ప్రసిద్ధ బిక్కవోలు గణపతి ఆలయం. చాళుక్యుల తరువాత వివిధ రాజవంశీయులతో పాటు పెద్దాపురం సంస్థానాధీశులు ఈ ఆలయం కోసం అనేక దానధర్మాలు చేశారు. బిక్కవోలు గణపతిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన శ్రీవరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రం. పూర్వం దీనిని విహారపురిగా వ్యవహరించేవారు. 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం కట్టించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1336లో విజయనగర రాజులు దీనిని అభివృద్ధి చేశారు. బహుదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ సింహద్వారం వద్ద చోళరాజ శిలాప్రతిమ ఉంది. ఆలయానికి ఎదురుగా కోనేరు, మండపం ఉన్నాయి. ఈ ఆలయానికి వాయవ్యంలో మరకతాంబికా సమేతుడైన మణికంఠేశ్వరాలయం ఉంది. ఒకసారి బహుదా నదికి వరదలు రావటం వల్ల ఆ వరదల్లో ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరాలయలోని వినాయకుడు జరిగి దగ్గరలో ఉన్న బావిలో పడిపోయాడు.
ఆ వినాయకుడే మరల తన ఉనికి వరసిద్ధి వినాయకునిగా పూర్వం గుడ్డి, చెవిటి, మూగ అయిన ముగ్గురు వికలాంగులు తమ పొలంలోని బావిని లోతు చేయటం కోసం తవ్వుతుండగా స్వామివారు స్వయంభువుగా ప్రకటితమయ్యారు. ప్రతియేటా వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు ఈక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. చివరి రోజున తెప్పోత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాలలో కాణిపాకం గ్రామస్థులే కాకుండా, చుట్టుప్రక్కల గ్రామస్థులు రోజుకొక వాహనసేవలో పాల్గొనటం విశేషం.
కొలనుపాక గణపతి ఆలయం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక వీరశైవ మతానికి సంబంధించి గొప్ప చారిత్రక ప్రదేశం. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతం చాళుక్యుల వశం అయ్యింది. ఇక్కడ సోమేశ్వరాలయం ఉంది. వీరశైవ మతానికి చెందిన రేణుకాచార్య ఈ ప్రాంతంలోనే జన్మించినట్లు వివిధ ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ఆలయ ప్రాగణంలోనే వినాయక, కార్తికేయ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడి గణపతి విగ్రహం చాళుక్యుల శిల్పకళా చాతుర్యంతో కూడుకుని ఉంది.
పశ్చిమ చాళుక్యుల కాలమైన పదకొండవ శతాబ్దంలో చెక్కబడిన సర్వాభరణ భూషితుడైన వినాయకుడు చతుర్భుజాలతో పీఠంపై ఆసీనుడైనట్లుగా ఉంటాడు. రెండు చేతులలో అంకుశం ధరించి ఉంటాడు. ఎడమచేతిలో మోదకం ఉంటే, కుడిచేయి మోకాలుపై ఆధారంగా ఉంటుంది. ఈ వినాయకుడి ఉదరానికి ఉన్న సర్పబంధం అద్భుతంగా కనపడుతుంది. తొండం ఎడమవైపు వంగి ఉంటుది. ఇక్కడి గణపతికి ముడుపులు కట్టి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం
కోనసీమజిల్లా అమలాపురానికి చేరువలోని అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం అత్యంత పురాతనమైనది. పవిత్ర గోదావరి నదీపాయ ఒడ్డున ఉన్న ఈ వినాయక ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని ఇక్కడి స్థలపురాణం. వ్యాసమహర్షి దక్షిణ యాత్ర ప్రారంభించటానికి ముందు ఈ వినాయకుని ప్రతిష్ఠించాడని ప్రతీతి. అయినవిల్లి ఆలయాన్ని పెద్దాపురం సంస్థానాధీశులు పునర్నిర్మించి, పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయినవిల్లి వినాయకునికి శైవాగమం ప్రకారం విశేషార్చనలు, నారికేళఫలోదకాలతో అభిషేకాలు చేస్తారు.
భక్తులు 1,116 కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయంలో వినాయక చవితితోపాటు, ప్రతినెలా ఉభయ చవితి తిథులలో పూజ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దశమి, ఏకాదశి రోజుల్లోనూ విశేష పూజలు చేస్తారు.
చోడవరం స్వయంభూ వినాయక ఆలయం
అనకాపల్లి జిల్లా చోడవరంలోని గౌరీశ్వరాలయం, వినాయక ఆలయాలకు స్వయంభువులుగా అనేక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. చోడవరం గ్రామానికి తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయాన్ని సుమారు 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశ రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఆ ఆలయంలోని గర్భగుడి ద్వారంపై ఉన్న చేప చిహ్నాల వల్ల ఇక్కడి స్వామివారిని మత్స్య గణపతిగా పేర్కొంటారు.
శ్రీ గౌరీశ్వరుడు మత్స్యవంశ రాజుకు కలలో కనిపించి చోడవరం కోట తూర్పు దిక్కున తాను వెలుస్తున్నానని ఆ ప్రదేశం చెమ్మగా ఉంటుందని చెప్పటంతో ఆలయం ఉన్నచోట తవ్వకాలు జరపగా, చుట్టూ నీటితో కూడిన శివలింగం బయల్పడటంతో అక్కడే ఆలయ నిర్మాణం చేశారు.
తురుష్కుల దాడిలో ఆలయంలోని గౌరీశ్వరస్వామి లింగాకృతి ఛిన్నాభిన్నమైంది. అప్పటి నుంచి ఆ ఆలయంలో గౌరీశ్వరుడు పుట్ట ఆకృతిలో దర్శనమిస్తున్నాడు. చోళవంశ రాజులు ధ్వంసమైపోయిన శివలింగం స్థానంలో కాశీ నుంచి కొత్త లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించదలచారు. కాని, స్వయంభువుగా వెలసిన వినాయక విగ్రహానికి మాత్రమే పూజలు జరిపించాలని స్వామి కలలో కనిపించి చెప్పటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
చోడవరం స్వయంభూ వినాయకుడు చిన్నపాటి నీట ఊటలో నల్లని రాతివిగ్రహం మూడు అడుగులకు పైగా పొడవు, వెడల్పులతో ఛాతీభాగం వరకే స్వామివారు దర్శనమిస్తారు. మిగతా భాగం భూమి లోపలే ఉండటం విశేషం. తొండం చివరి భాగం కూడా కనిపించదు.
శ్రీశైల సాక్షిగణపతి
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో సాక్షిగణపతి ఆలయం పరమ పవిత్ర స్థలంగా అనాదిగా పూజలందుకుంటోంది. శ్రీశైల మల్లికార్జునుని దర్శించటానికి వచ్చిన భక్తుల వివరాలను గణపతి ఇక్కడ నమోదు చేస్తాడని ప్రతీతి. అందుకే ఈ గణపతిని సాక్షిగణపతి అని పేరు. సాక్షిగణపతి విగ్రహం వైవిధ్యంగా ఉంటుంది.
ఇక్కడి విగ్రహం ఎడమచేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని కుడిచేతిలో ఘంటంతో భక్తుల పేర్లు రాస్తున్నట్లుగా ఉంటుంది. శ్రీశైలాన్ని దర్శించి వెనక్కు వెళ్ళే భక్తులు మార్గమధ్యంలో ఉన్న ఈ సాక్షి గణపతి ఆలయాన్ని దర్శిస్తారు. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి స్వామివారికి గోత్రనామాలు విధిగా చెప్పుకోవాలని పెద్దలు చెబుతారు.
రాయదుర్గం దశభుజ శ్రీమహాగణపతి
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మూడు గణపతి ఆలయాలు ఉన్నాయి. అందులో రాయదుర్గం కొండపైకి వెళ్ళే మార్గంలో కోట మెట్ల కింద ఆత్మకూరు వీథిలో దశభుజ గణపతి ఆలయం ప్రముఖమైనది. నాలుగు మీటర్ల కొండరాయిపై మలచిన వినాయకుని రూపం ఎంతో ఆకర్షిస్తుంది. సుమారు పదిహేను అడుగుల ఎత్తుగల వినాయకుని రూపం చూడటానికి రెండుకళ్ళూ చాలవు. భారీశిలపై పదిచేతులు గల వినాయకుడిని ఎంతో నేర్పుగా మలచినట్లు కనిపిస్తుంది.
ఈ విగ్రహంలో వినాయకుని తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. కూర్చుని ఉన్న ఈ వినాయక విగ్రహం ఎడమ తొడపై ఒక స్త్రీరూపు చెక్కబడి ఉంది. విజయనగర సామ్రాజ్యకాలంలో విజయనగర రాజుల ఏలుబడిలో దశభుజ గణపతి ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
రాయదుర్గం దశభుజ వినాయకరూపం షోడశగణపతి రూపాలలో ఒకటి. ఇది శ్రీమహాగణపతి రూపం. ఈయన సమగ్రమూర్తి. కుడివైపు తిరిగిన తొండంతో ఎడమచేతితో తొడపై కూర్చున్న అమ్మవారిని ఆలింగనం చేసుకున్నట్లు ఉంటుంది. పదిబాహువులతో కుడిచేత చక్రం, ఓషధి, కలువపువ్వు, నిధి« ధరించి ఉంటాడు. ఎడమచేత పాశం, చెరకుగడ, పద్మం, గద ధరించి ఉంటాడు. కిరీటంపై అర్ధచంద్రుడి అలంకారం అలరారుతుంటుంది.
యానాం సిద్ధిగణపతి (పిళ్ళైయార్) ఆలయం
పుదుచ్చెరిలోని పూర్తి తెలుగు ప్రాంతమైన యానాంలో వెలసి పరమ భక్తుల సేవతో విరాజిల్లుతున్న సిద్ధిగణపతి పిళ్ళైయార్ స్వామి నమ్మిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తున్నాడు. పురాణరీత్యా గోహత్యా పాపవిమోచన కోసం గంగానది సహా ఇతర తీర్థాలలో స్నామాచరిస్తూ గౌతమ మహర్షి గోదావరి నదిని గోష్పాదక్షేత్రం (కొవ్వూరు) వరకు తీసుకురాగా సప్తమహర్షులు ఆ నదిని ఏడుపాయలుగా విభజించి సాగరాన సంగమం గావించారు. సప్తఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి గోదావరి శాఖను యానాంకు కొద్దిదూరంలో ఉన్న చొల్లంగి వద్ద సముద్రంలో సంగమింప చేశాడు.
ఈ ప్రదేశం కోరంగికి సమీపంలో ఉంది. కురంగి సంచరించిన ప్రదేశం కాలక్రమంలో కోరంగిగా మారింది. కురంగం అంటే కృష్ణ్ణజింక అని అర్థం. ఆ యానాం పావని వృద్ధగౌతమీనదీ తీరం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో చాళుక్య రాజుల కాలంలో ప్రతిష్ఠించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అప్పటి విగ్రహ శిల్పకళా సౌందర్యం దీనికి తార్కాణం. గజరాజుల మధ్య లక్ష్మీదేవిని ద్వారంపై చెక్కి ఉండటం చాళుక్యుల దేవాలయ నిర్మాణ చిహ్నం. ఈ సిద్ధి గణపతిని ఆనాడు విజయ గణపతిగా కొలిచేవారు. తీరప్రాంతం అవటంతో ఉప్పెనలు, వరదలు, తుపానుల కారణంగా, భౌగోళిక మార్పుల వల్ల ఈ స్వామి పుట్టలతో కప్పివేయబడ్డాడు.
1723 నాటికి మోటుపల్లి యానం ఫ్రెంచివారి పాలనలోకి చేరింది. కోరంగి కాలువ ద్వారా వారు వ్యాపారాలు నిర్వహించేవారు. పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాం, చంద్రనాగూరు ఫ్రెంచివారి అధీనంలో ఉండేవి. ఈ ప్రాంతాలకు 13 జూన్ 1954న స్వాతంత్రం లభించింది. సరిగా ఆ సమయలోనే తమిళుడైన రెడ్డియార్ పట్టిస్వామి అనే వైద్యుడు యానాం చేరాడు. ప్రస్తుతం ఉన్న ఆలయ సమీపంలోని రావిచెట్టు కింద వైద్యం చేసేవాడు. ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో కనిపించి రావిచెట్టు వద్ద ఉన్న పుట్టలో తానున్నట్లు చెప్పాడు. అప్పటి నుంచి స్వామివారి ఉనికి తిరిగి బహిర్గతమైంది. లభించిన పురాతన ప్రాకారాలతో, స్తంభాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడి స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయటం, 108 టెంకాయలు కొట్టడం, స్వామివారి ఎదుట భక్తులు గుంజిళ్లు తీయడం ఆచారంగా ఉంది.
రుద్రారం సంకష్టహర సిద్ధివిద్యాగణపతి ఆలయం
సంగారెడ్డిజిల్లా పటాన్‌చెరువుకు అతి చేరువలోని రుద్రారంలో స్వయంభువుగా వెలసిన శ్రీ సంకష్టహర సిద్ధివిద్యాగణపతి ఆలయం ఉంది. వందల ఏళ్ళనాటి ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారం. రుద్రారం గణపతిని శివరాంభట్ అనే ఆధ్యాత్మిక గురువు ప్రేరణతో నిర్మితమైంది. ఈయన రుద్రారం ప్రాంతం నుంచి రేజింతల వరకు గల ప్రాంతంలో ఐదు వినాయక ఆలయాలను నిర్మించారు. అవి చింతలగిరి, చీకుర్తి, మల్కల్–పాడు, మల్కల్–గుట్ట (రేజింతల్) కాగా, చివరిది ఈ రుద్రారం గణపతి ఆలయం.
రుద్రారం గణపతి చతుర్భుజాలతో ఉంటారు. ఉదరానికి నాగబంధం ఉంటుంది. ఈ వినాయకునిపై శ్రీచక్ర బీజాక్షరాలు ఉండటంచేత ఆ శక్తిని సామాన్యులు తట్టుకోవటానికి స్వామివారికి ప్రతిరోజూ సింధూర లేపనం పూస్తారు. ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న పంచ వినాయక ఆలయాలలో స్వామివారికి సింధూర లేపనం పూస్తారు. ఇక్కడి స్వామి విద్యాగణపతి కావటంతో విద్యార్థులు వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేసి, దర్శనం చేసుకుంటూ ఉంటారు. సంకష్టహర చతుర్థినాడు ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.
రేజింతల సిద్ధివినాయక ఆలయం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు పదమూడు కిలోమీటర్ల దూరంలోని రేజింతల గ్రామంలో నెలకొని ఉన్న స్వయంభూ సిద్ధివినాయక స్వామి రెండువందల సంవత్సరాలకు పైగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు అతి చేరువలో ఉంది. జహీరాబాద్‌కు ఉన్న పూర్వనామం పెద్దమొక్కహెల్లి. జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉండటంతో తెలుగు ప్రజలే కాకుండా, కన్నడ ప్రజలూ అధికసంఖ్యలో వచ్చి ఈíసిద్ధివినాయక స్వామివారిని దర్శించుకుంటారు.
శివరాంభట్ అనే ఆధ్యాత్మిక గురువు తన శిష్యగణంతో తిరుమలకు ప్రయాణమవుతూ రేజింతల గ్రామంలో ఆగారు. ఆయనకు రేజింతల కొండ వద్ద వినాయకుని రూపంలో ఒక శిల కనబడింది. అదే ఈ స్వయంభూ వినాయక విగ్రహం. కోరిన కోర్కెలు తీర్చడం వల్ల సిద్ధివినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు.
సికింద్రాబాద్ గణపతి ఆలయం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు అతి చేరువలో ఉన్న ఈ గణపతి ఆలయం బహు ప్రసిద్ధమైనది. పూర్వం ఈ ప్రాంతం సైనిక నివాస ప్రాంతంగా ఉండేది. 1824లో సైనికులు మంచినీటి కోసం బావి తవ్వగా ఈ వినాయక విగ్రహం బయట పడింది. అప్పుడు చిన్న గుడిగా ఉండేది. 1932లో ఈ ఆలయ ప్రాంగణంలోనే వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మన్యస్వామి ఆలయం, శివాలయం, అమ్మవారి ఆలయం, ఆంజనేయ ఆలయం నర్మించారు. 1960లో ఆలయ ప్రాంగణంలోని బావి పూడ్చి ఆలయానికి నూతన రూపం కల్పించారు. ఈ ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
విశాఖ సంపత్వినాయగర్ ఆలయం
విశాఖ నగరంలో శ్రీసబంధన్ అండ్ కంపెనీవారి కార్యాలయ ప్రాంగణంలో 1962లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ కార్యాలయ యాజమాన్యం మాత్రమే పూజలు చేస్తుండేది. ఆ తరువాతి కాలంలో భక్తజనానికి దర్శనం అనుమతించారు. ఈ ఆలయాన్ని 1967లో సందర్శించిన కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి ఇక్కడ గణపతి యంత్రాన్ని ప్రతిష్ఠించారు.
1971లో పాకిస్తాన్‌తో మనదేశానికి యుద్ధం వచ్చినప్పుడు అప్పటి తూర్పు నౌకాదళాధిపతి కృష్ణన్ ఈ వినాయక స్వామిని దర్శించుకురు. యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ సముద్రం మార్గంలో విశాఖ నగరాన్ని ముట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఘాజీ అనే జలాంతర్గామిని పంపింది. ఈ జలాంతర్గామిని మన దేశ నౌకాదళాలు ముంచేశాయి. ఆ వెంటనే మన నౌకాదళాధిపతి కృష్ణన్ ఈస్వామివారిని దర్శించుకుని, 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. విశాఖ సంపత్వినాయగర్ ఆలయాన్ని ప్రతిరోజూ వేలసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి వినాయకునికి ప్రతిరోజూ పంచామృతాభిషేకం చేస్తారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
కాజీపేట శ్వేతర్కమూల గణపతి ఆలయం
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేప్రాగణంలో శ్వేతార్కమూల గణపతి ఆలయం ఉంది. ఇక్కడి వినాయకమూర్తి తెల్ల జిల్లేడువేరు మొదలు నుంచి ఉద్భవించింది. ఈ విగ్రహన్ని చెక్కడంగాని, మలచటంగాని చేయలేదు. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనము, తల్పము, ఎలుక అన్నీ స్పష్టంగా కనపడతాయి.
నారద పురాణంలో తెల్ల జిల్లేడు చెట్టు వందేళ్ళు పెరిగితే ఆ చెట్టుమూలంలో గణపతి రూపం తయారవు తుందని చెప్పారు. వినాయకుడు ప్రకృతి స్వరూపుడు అని పురాణాలు చెబుతున్నాయి. శ్వేతార్కమూలాన్ని వెలికితీసి, మట్టిని కడిగివేసి, నీళ్ళల్లో నానబెట్టి, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ వేరు మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు.
1999లో నల్లగొండ ప్రాంతంలోని మాడా ప్రభాకరశర్మ ఇంటి పరిసరాల్లో ఈ శ్వేతార్క గణపతిని అయినవోలు అనంత మల్లయ్యశర్మ గుర్తించారు. ఈ శ్వేతార్కమూల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి, పూజలు మొదలు పెట్టారు. 2002లో దేవాలయాన్ని నిర్మించారు. 2008లో ఆలయాన్ని విస్తరించారు. ప్రతినెలా కృష్ణపక్షంలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.
- కప్పగంతు వెంకటరమణమూర్తి
(చదవండి: వినాయక విజయం: విచిత్ర వినాయకుడు..!)
Comments
Please login to add a commentAdd a comment