వాతాపి నగరానికి సాధువుల గుంపుతో కలసి ఒక పద్నాలుగేళ్ల కుర్రవాడు వచ్చాడు. ఆ కుర్రవాడు వాతాపి గణపతి ఆలయాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయాడు. అతడి ఊరేదో పేరేదో అతడికే తెలియదు. అతడి నుదుటి మీద గాయం మానిన మచ్చ చూసిన జనాలు, పాపం ఏదో దెబ్బ తగిలి గత స్మృతి అంతా పోగొట్టుకున్నాడని అనుకున్నారు. ఆ కుర్రవాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎంతసేపూ వాతాపి ఆలయ మంటపం రాతి పలకల మీద, గోడల మీద సుద్దతో బొమ్మలు గీస్తూ ఉండేవాడు. బొమ్మలు గీస్తున్నంత సేపూ అతడి ముఖం చిరునవ్వుతో వెలుగుతూ ఉండేది. బొమ్మలు గీస్తూ ఆనందం పొందుతుండే ఆ బాలుడిని వాతాపి వాసులు చిత్రానందుడు, చిత్రముఖుడు అని పిలవసాగారు. అతడు ఎక్కువగా వినాయకుడి బొమ్మలే గీస్తుండటంతో వినాయక చిత్రకారుడనే పేరును సంక్షిప్తంగా మార్చి విచిత్రుడు అని పిలవసాగారు. కాలక్రమంలో ఆ బాలుడికి విచిత్రుడు అనే పేరు స్థిరపడింది.
వాతాపి నగరంలో గణపతి భక్తుడైన గజానన పండితుడు రోజూ సాయంత్రం ఇంటి వద్ద పిల్లలకు వినాయక కథలు చెబుతుండేవాడు. మిగిలిన పిల్లలతో కలసి విచిత్రుడు కూడా గజానన పండితుడు చెప్పే కథలను అరుగు మీద కూర్చుని శ్రద్ధగా ఆలకించేవాడు. కథ విన్న మర్నాడు ఆ కథలోని సన్నివేశాలను గోడల మీద చిత్రించేవాడు. విచిత్రుడు చిత్రించే వినాయకుని బొమ్మలు చూసి గజానన పండితుడు మురిసిపోయేవాడు. విచిత్రుడికి ఎన్నో విఘ్నేశ్వరుడి కథలను ప్రత్యేకంగా చెబుతుండేవాడు.
విచిత్రుడి వెంట ఎప్పుడూ పిల్లలు గుంపులు గుంపులుగా ఉండేవారు. అతడు చిత్రించే బొమ్మలను వారు అబ్బురంగా చూస్తుండేవారు. కొందరు అతడిలాగా బొమ్మలు గీయడానికి ప్రయత్నిస్తూ చిత్రకళా సాధన చేస్తుండేవారు. విచిత్రుడి ప్రభావంతో వాతాపి నగరంలోని పిల్లలకు చిత్రకళ అబ్బింది.
విచిత్రుడు పగలంతా గోడల మీద బొమ్మలు వేస్తూ, వాతాపి గణపతి ఆలయంలో పంచే ప్రసాదంతో కడుపు నింపుకొనేవాడు. రాత్రిపూట ఆలయం మెట్ల మీద ఒక మూలనో, ఊరి చివరనున్న వాడలో ఏ ఇంటి అరుగు మీదనో నిద్రపోయేవాడు. వాడలోని కుమ్మరులు, చర్మకారులు విచిత్రుడంటే ప్రాణం పెట్టేవారు. అతడు ఏ రాత్రి వచ్చినా, అతడి కోసం దాచిపెట్టిన భోజనం తినిపించి, అతడి పడకకు ఏర్పాట్లు చేసి మరీ నిద్రపోయేవారు. అలా విచిత్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు.
కాలం ఇలా గడిచిపోతుండగా, వాతాపి నగరంలో వినాయక నవరాత్రుల కోలాహలం పండుగకు కొద్ది రోజుల ముందు నుంచే మొదలైంది. ఉత్సవాల సందర్భంగా ఒక శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు జరిగింది. ప్రదర్శనలో అత్యుత్తమంగా నిలిచిన విగ్రహాన్ని ఉత్సవ నిర్వాహకులు వెయ్యి బంగారు కాసులు ఇచ్చి కొంటారు. ఆ విగ్రహాన్ని మలచిన కళాకారుడిని నగరపాలకులు రత్నఖచిత స్వర్ణకంకణంతో ఘనంగా సత్కరిస్తారు.
ఆ పోటీ ప్రదర్శనలో చుట్టుపక్కల రాజ్యాల ఆస్థాన చిత్రకారులు సహా ఎందరో పేరుగాంచిన శిల్పులు, చిత్రకారులు తమ తమ విగ్రహాలను తీసుకొచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన రంగులు, బంగారు పూతలతో, రంగురాళ్లతో ఒకరిని మించి మరొకరు కళ్లు మిరుమిట్లు గొలిపేలాంటి వినాయక విగ్రహాలను రూపొందించి, ప్రదర్శనకు పెట్టారు.
తాను రూపొందించిన విగ్రహాన్ని కూడా ప్రదర్శనలో పెట్టాలని విచిత్రుడు ఉబలాటపడ్డాడు. అతడికి ఒక కుమ్మరి మిత్రుడు ఉన్నాడు. విచిత్రుడు తీర్చిదిద్దిన రూపురేఖలతో అతడు బంకమట్టిని ఉపయోగించి విగ్రహం తయారు చేశాడు. సున్నం, బొగ్గుమసి, జేగురు, పచ్చమట్టి, ఆకుపసర్లు ఉపయోగించి విచిత్రుడు ఆ విగ్రహానికి చక్కగా రంగులు వేశాడు. ప్రదర్శనలో పెట్టడానికి విచిత్రుడు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లాడు. అక్కడి పెద్దలందరూ విచిత్రుడి విగ్రహాన్ని ప్రదర్శనలో పెట్టనివ్వలేదు. తన విగ్రహాన్ని చిట్టచివరనైనా ఉంచాలని విచిత్రుడు ఎంతగా ప్రాధేయపడినా, వారు కనికరించలేదు. ‘కులగోత్రాలు లేనివాడివి, ఊరూ పేరూ లేనివాడివి, కడజాతుల వారితో కలసి తిరిగేవాడివి. అలాంటి నీ చేతుల్లో తయారైన విగ్రహానికి వంశప్రతిష్ఠలు గల సుప్రసిద్ధ చిత్రకారుల విగ్రహాల సరసన ప్రదర్శించే అర్హత లేదు’ అని నిర్దాక్షిణ్యంగా అతడి కోరికను తిరస్కరించారు.
విచిత్రుడు చాలా బాధపడ్డాడు. అతడి బాధను చూసిన కుమ్మరి మిత్రుడు ‘ప్రదర్శన పందిట్లో పెట్టకపోతే పోయారు. మనం వేరే చోట ఈ విగ్రహాన్ని అందరికీ కనిపించేలా పెడదాం, పద!’ అని నచ్చచెప్పాడు. ప్రదర్శన పందిరికి ఎదురుగా కొంత దూరంలో ఉన్న ఒక చెట్టు మొదట్లో విగ్రహాన్ని పెట్టి, విచిత్రుడిని తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. పెద్దలందరూ పందిరిలో ప్రదర్శించిన విగ్రహాలను తిలకిస్తుంటే, పిల్లలు మాత్రం గుంపులు గుంపులుగా విచిత్రుడు రంగులద్దిన విగ్రహం ముందు గుమిగూడారు.
ఒకవైపు పందిట్లోని ప్రదర్శనలో పెద్దల సందడి, మరోవైపు చెట్టుకింద విగ్రహం వద్ద పిల్లల కోలాహలం కొనసాగుతుండగా, ఎక్కడి నుంచో ఇద్దరు యువతులు వచ్చారు. మెరుపుతీగల్లాంటి వారిద్దరూ నిండుగా విలువైన నగలు ధరించి కళకళలాడుతూ ఉన్నారు. జనం వారిని ఆశ్చర్యంతో చూస్తుంటే, వారిలోని పెద్దామె ‘అయ్యలారా! మాది కళానంద నగరం. మాకు నచ్చిన వినాయక విగ్రహం కోసం పదివేల వరహాలు పట్టుకొచ్చాం’ అంటూ చేతిలోని బంగారు అల్లిక జలతారు సంచిని గలగలలాడించింది. ప్రదర్శనలో పిచ్చాపాటీ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్న చిత్రకారులందరూ ఆమె మాటలతో అప్రమత్తమయ్యారు. ఎవరి విగ్రహాల దగ్గరకు వారు చేరి, గంభీరంగా నిలుచున్నారు.
‘మా అక్క ప్రసన్నవదన గొప్ప గాయనీమణి. విగ్రహపుష్టి మాత్రమే కాదు, గొప్ప తిండిపుష్టి, గాత్రపుష్టి ఉన్నది. గొంతు విప్పిందంటే, ఆమె పాటకు ఎంతటి వారైనా మైమరచిపోవాల్సిందే!’ అంటూ ఇద్దరిలోనూ చిన్నది కాలి గజ్జెలను మోగిస్తూ, అక్కడున్న అందరి వంకా ఓరచూపులు విసిరింది.
‘మా చెల్లి మోహన గొప్ప వాగుడుకాయ. అంతకు మించి గొప్ప నర్తకీమణి. చూడటానికి నాజూకు చిన్నదిలా ఉన్నా, నాట్యమాడుతూ నన్నే ఎత్తి తిప్పేస్తుంది. నాట్యంలో దాని చురుకుదనం చూడటానికి రెండు కళ్లు చాలవు. మాతో ఆడించడం, పాడించడం సాక్షాత్తు ఇంద్రుడికి, కుబేరుడికే సాధ్యం కాదు. అయితే, ఇక్కడ మాకు నచ్చిన విగ్రహం ముందు ఆటపాటలను ప్రదర్శిస్తామని వినాయకుణ్ణి మొక్కుకున్నాం’ అని చెప్పింది ప్రసన్నవదన. వారి మాటలకు మంత్ర ముగ్ధులైన జనాలు, వారు విగ్రహాలు చూడటానికి వీలుగా పక్కకు తొలగి, దారి ఇచ్చారు.
అక్కా చెల్లెళ్లిద్దరూ ఒక్కొక్క విగ్రహం దగ్గర ఆగి, వాటిని పరిశీలనగా చూస్తూ ముందుకు సాగారు. అన్ని విగ్రహాలనూ చూసినా, ఏదీ నచ్చకపోవడంతో పెదవి విరిచి బయటకు మరలుతుండగా, ప్రదర్శన పందిరి ఎదురుగా పిల్లల కోలాహలం కనిపించింది.
‘అక్కడ పిల్ల వెధవలెవరో తయారు చేసిన తక్కువరకం విగ్రహం ఉంది లెండి’ అని గుంపులోంచి ఎవరో అనడం వాళ్లకు వినిపించింది.
అది విని మోహన, ‘పదవే అక్కా! అక్కడేదో విగ్రహం తక్కువలోనే దొరికేటట్లుంది’ అంటూ ప్రసన్నవదన చేయి పట్టుకుని అటువైపుగా దారితీసింది. ప్రదర్శనశాలలోని జనాలంతా వాళ్లనే అనుసరిస్తూ బయటకు వచ్చారు. ప్రదర్శనశాలలో ఒక్కరూ మిగల్లేదు.
ప్రసన్నవదన చెట్టు కిందనున్న విగ్రహం వద్దకు వెళ్లి, ఆ విగ్రహం ముందు వరహాల సంచి పెట్టింది. తన మెడలోని రత్నహారాన్ని తీసి, విచిత్రుడి చేతికి కంకణంలా తొడిగింది. అది చూసిన జనం ‘వీళ్లకేదో పిచ్చి ఉన్నట్లుంది! గొప్ప విగ్రహాలను కాదని వచ్చి, ఈ నాసిరకం విగ్రహం ముందు డబ్బు ధారపోస్తున్నారు’ అన్నారు.
వాళ్ల మాటలు విన్న ప్రసన్నవదన జనాల వైపు చూసి, ‘ఇక్కడున్న విగ్రహంలోని ఏ విశేషాన్ని చూసి పిల్లలందరూ మురిసి ముచ్చటపడుతున్నారో, ఆ విశేషమే మమ్మల్ని కూడా ఆకట్టుకుంది. బాల దీవెనలు బ్రహ్మ దీవెనలు.అందుకే ఈ పిల్లల ఎంపికను శిరసావహిస్తున్నాము’ అని చెప్పింది.
‘మట్టిశిల్పంలో లేని రూపసౌందర్యాన్ని సామాన్యమైన జేగురు వంటి రంగులతోనే తీర్చిదిద్దిన ఈ చిత్రకారుడి ప్రతిభ అమోఘం, అద్వితీయం. ఈ విగ్రహానికి మా బహుమానం అతిస్వల్పం’ అంది మోహన.
‘మా కోరిక నెరవేరింది. ఇక్కడే మా మొక్కు చెల్లించుకుంటాం’ చెప్పింది ప్రసన్నవదన.
వినాయక విగ్రహాన్ని అంటిపెట్టుకుని కూర్చుని, ప్రసన్నవదన తాళాలు మోగిస్తూ, ‘తాండవ నృత్యకరీ గజానన’ అంటూ కీర్తన మొదలుపెట్టింది. ఆ వెంటనే మోహన విద్యుల్లతలా నాట్యం ప్రారంభించింది. జనాలందరూ విస్మయచకితులై ఆ ప్రదర్శనను తిలకించసాగారు.
ప్రసన్నవదన గానం ఇంట్లో ఉన్న గజానన పండితుడి చెవిన పడింది. అప్పటికే శతాధిక వృద్ధుడైన ఆయన ఇల్లు కదల్లేని స్థితిలో ఉన్నాడు. అయితే, ప్రసన్నవదన గానానికి ఆయనకు ఎక్కడలేని జవసత్త్వాలూ వచ్చాయి. మంచం మీద నుంచి లేచి, ఒక్క పరుగున ప్రదర్శన జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. ప్రసన్నవదనను చూసి, చేతులెత్తి జోడించి, సాగిలబడి, ధ్యాన ముద్రలో అలాగే ఉండిపోయాడు.
నృత్యం చేస్తూ, చేస్తూ మోహన అంత పెద్ద వినాయక విగ్రహాన్నీ భుజం మీదకెత్తుకుంది. అది చూసిన జనం ‘అంత బరువు మోయలేవమ్మా! పడిపోతావు!’ అని కేకలు వేశారు.
‘నాకు అలవాటేగా!’ అని చెబుతూ ఆమె విగ్రహాన్ని భుజాన పెట్టుకునే నాట్యం చేస్తూనే పరుగులాంటి నడకతో బయలుదేరింది. జనం ఆమెను పరుగు పరుగున అనుసరించారు. ఈ సందడిలో ప్రసన్నవదన ఎప్పుడు అదృశ్యమైపోయిందో కూడా ఎవరూ గుర్తించలేదు.
మోహన ఆలయ తటాకం వద్దకు చేరుకుంది. నాట్యం చేస్తూ, ఒక్కొక్క మెట్టే దిగుతూ తటాకంలో మునిగి అదృశ్యమైంది. కొద్ది క్షణాల్లో ఒక చిట్టెలుక విగ్రహాన్ని వీపున మోసుకుంటూ, నీటిలోకి మాయమైంది. ఆ రోజే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే రోజు. జనాలు ఈ దృశ్యాన్ని చూసి, దిగ్భ్రాంతులయ్యారు.
గజాననుడు ధ్యానముద్ర నుంచి తేరుకునే సరికి చెట్టు కింద విచిత్రుడు, అతడి కుమ్మరి మిత్రుడు, బంగారు జలతారు వరహాల సంచి తప్ప మరేమీ కనిపించలేదు. గజాననుడు లేచి, విచిత్రుడి వద్దకు వెళ్లి, అతడి తలమీద చేయివేసి ‘వాతాపి గణపతి ఆలయాన్ని నీ కళతో చిత్రశోభితం చేయి. కావలసిన ధనాన్ని ఆ విఘ్ననాయకుడే అనుగ్రహించాడు కదా! నీ వల్ల వాతాపి నగరం పావనమైంది. ఇక నుంచి నువ్వు పావనమిశ్రుడిగా ప్రఖ్యాతి పొందుతావు’ అని ఆశీర్వదించాడు.
– సాంఖ్యాయన
(చదవండి: దూర్వాయుగ్మపూజ అనగా..? గరికతోనే ఎందుకంటే..?)
Comments
Please login to add a commentAdd a comment