వినాయక చవితి వ్రతవిధానంలో దూర్వాయుగ్మపూజ విశేషమైనది. గరికతో వినాయకుని ప్రత్యేకంగా పూజించటమే దూర్వాయుగ్మపూజ. ఏకవింశతిపత్ర పూజలో భాగంగా, వినాయకచవితి వ్రతవిధానంలో దూర్వాయుగ్మంతో పూజ తప్పనిసరి. గణనాథుని దశనామాలను స్మరిస్తూ గరికను దేవునికి అర్పించటం ఈపూజలో భాగం.
వంద యజ్ఞాలు ఇవ్వలేని ఫలితాన్ని ఒక్క గరికపోచ ఇస్తుంది. గరికలేని వినాయక పూజ వ్యర్థమని సాక్షాత్తు ఆ గణపతే పేర్కొన్నాడు. అందుకే, వినాయక చవితినాడు గరికకు అంతటి ప్రాధాన్యం. గరిక మహిమను తెలిపే కథలు మనకు గణేశ పురాణంలో కనిపిస్తాయి.
పూర్వం సులభుడనే ఒక గంధర్వరాజు ఉండేవాడు. ఆయన భార్య సముద్ర. ఒకసారి ఆ దంపతులు పురాణశ్రవణంలో ఉండగా, అక్కడకు మధుసూదనుడనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతనిని చూడగానే సులభుడికి పేద, గొప్ప అనే తారతమ్యం గుర్తొచ్చి నవ్వాడు. పేదవాడైన మధుసూదనుడి అహం దెబ్బతినటంతో కోపగించిన అతను, గంధర్వరాజును చూసి ‘రాజా! గర్వాంధుడవైన నీవు పొలం దున్నే ఎద్దుగా జన్మిస్తావు’ అని శపించాడు. అతని శాపాన్ని విని కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర ‘దరిద్రుడా! నువ్వు చెత్తాచెదారం తినే గాడిదగా జన్మించు‘ అని మధుసూదనుడికి ప్రతిశాపం ఇచ్చింది. ఆమె శాపానికి ఆగ్రహోదగ్రుడైన మధుసూదనుడు ఆమెను ‘చండాలురాలివి కమ్ము’ అని శపించాడు.
ఆవిధంగా శాపగ్రస్తులైన ఆ ముగ్గురూ, శాపకారణాన శరీరాలను త్యజించారు. చండాలినిగా మారిన సముద్ర దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది. ఆరోజు చతుర్థి. గుడిలో గణేశారాధన జరుగుతోంది. బయట కుండపోతగా వర్షంకురుస్తోంది. వానకు తట్టుకోలేని చండాలిని ఇళ్ళవైపుకు పోగా, అక్కడివాళ్ళు ఆమెను తరిమారు. వేరే గత్యంతరంలేని ఆమె గణేశాలయ ప్రాకారం కిందకు వచ్చి, గడ్డీగాదం పోగుచేసి మంటవేసి చలి కాచుకోసాగింది. ఇంతలో శాపానికి గురైన ఎద్దు, గాడిదలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగుచేసిన గడ్డిని తినసాగాయి.
గడ్డి కోసం ఎద్దు, గాడిదలు కుమ్ములాడుకోగా, కొన్ని గడ్డిపరకలు గాలికి కొట్టుకెళ్ళి గుడిలోని వినాయకుని శిరస్సుపై పడ్డాయి. ఇంతలో చండాలిని తన చేతిలోని దుడ్డుకర్రతో వాటిని బాదసాగింది. అవి రెండూ పరుగెత్తుకుంటూ, గుడిలోకి ప్రవేశించి అక్కడున్న ఖాద్య వస్తువులన్నిటినీ తినసాగాయి. అక్కడున్న పూజారులు వాటిని తరమసాగారు. ఈ కలకలం చెవినబడ్డ చండాలిని ఏమిటన్నట్టుగా ఆలయంలోకి ప్రవేశించింది. అప్పుడామె చేతిలోని గడ్డిపోచలు వినాయకుని తలపై పడ్డాయి. అటుగా వచ్చిన భక్తులు ఆమెను అక్కడి నుంచి తరిమి, తలుపులు మూసేశారు. అలా బయటపడిన ఆ మూడు జీవుల పరిస్థితి దుర్భరంగా మారింది. అయితే, తెలియక వారు వినాయకునికి సమర్పించిన గడ్డిపోచలు తన శిరస్సును అలంకరించినందుకు సంతసించిన గణపతి వారిని కరుణించాడు.
వెంటనే గణపతి భృత్యులు విమానంలో దిగివచ్చి వారు ముగ్గురినీ ఉత్తమ లోకాలకు తీసుకువెళ్లసాగారు. ఆ వింతదృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి, ఓ దేవతలారా! వీరికి ఎలా శాశ్వత గతులు లభించాయి. ఈ జీవులు పూజలు పునస్కారాలు చేసినవారు కారే! ఇందుకు ఏదైనా సులభోపాయం ఉంటే సెలవివ్వగలరు’ అంటూ వినమ్రంగా ప్రశ్నించారు. వారి ప్రశ్నలను ఆలకించిన గణేశ దూతలు గరిక మహిమను తెలియచేసే ఇంద్ర–నారద సంవాదంలోని ఆసక్తికరమైన కథను ఇలా వివరించారు:
పూర్వం స్థావరం అనే పట్టణంలో కౌండిన్యుడు అనే ముని పరమ గణేశ భక్తుడు. ఆయన భార్య ఆశ్రమ. ఆమె ఒకరోజు తన భర్తను, ‘స్వామీ! మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరిక పెట్టి పూజించటంలో ఆంతర్యమేమిటి?’ అని ప్రశ్నించింది.అందుకు కౌండిన్యుడు ఈవిధంగా చెప్పాడు. పూర్వం ధర్మ అనే నగరంలో జరిగిన ఒక మహోత్సవానికి, సిద్ధులు, చారులు, యక్షులు, నాగులు, మునులు అంతా విచ్చేశారు. అక్కడ తిలోత్తమ నాట్యమాడుతుండగా, ఆమె ధరించిన పైవస్త్రం జారి కిందపడింది. అప్పుడు ఆ సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదన తాపానికి గురై ఆమెను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు.
ఆయన అలా ప్రవర్తించటం సభా గౌరవానికి భంగం అని అందరూ భావించటంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుంచి బయటకు వచ్చాడు. అలా వచ్చిన యముని రేతస్సు స్ఖలితమై భూమిపై పడింది. ఆ రేతస్సు నుంచి వికృతాకారుడైన రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడి జటలు ఖగోళాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నాయి. ఆ రాక్షసుడు పెద్దపెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు. అప్పుడు దేవతలు, ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడగా, ఆయన వారిని గణపతి వద్దకు వెళ్లమని సూచించాడు. దాంతో వారందరూ గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేశారు.
అప్పుడు పద్మంవంటి నేత్రాలతో కోటిసూర్యుల తేజస్సుతో మల్లెపువ్వుల కంటే తెల్లనైన పలువరుసతో, శంఖంవంటి కంఠంతో, నానాలంకారాలతో దివ్యాంబరాలను ధరించి రత్నసింహాసనంపై కూర్చొని దేవతలకు బాలగణపతిగా దర్శనమిచ్చాడు. దేవతల కోరిక మేరకు బాలగణపతి ఆ అనలాసురుడనే రాక్షసుడిని చంప నిశ్చయిస్తాడు. బాలగణపతిని చూసిన అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ ముందుకురాగా, తన యోగమాయా బలంతో అనలాసురుడిని మింగుతాడు. కాని అనలాసురుడు కడుపులోకి వెళితే, తన కడుపులో ఉన్న భువనాలు దగ్ధమవుతాయని తలచిన స్వామి, ఆ రాక్షసుడిని తన కంఠంలోనే నిలుపుకున్నాడు.
ఆ తాపాన్ని ఉపశమింప చేయటానికి ఇంద్రుడు చంద్రకళను గణపతికి ప్రసాదించాడు. అప్పటి నుంచి స్వామివారు ఫాలచంద్రుడయ్యాడు. బ్రహ్మదేవుడు సిద్ధి, బుద్ధి అనే మానవకన్యలను సృష్టించి స్వామికి ప్రసాదించాడు. వారిని ఆలింగనం చేసుకోవటం వల్ల స్వామివారి తాపం కొంతమేరకు శాంతించింది. విష్ణువు పద్మాలను ప్రసాదించటంతో స్వామి పద్మహస్తుడు అయ్యాడు. అప్పటికీ అగ్నిని శాంతింప చేయడానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించాడు.
పరమేశ్వరుడు ఆదిశేషుడిని ప్రసాదించాడు. దానితో స్వామివారి ఉదరం బంధింపబడటం వల్ల ఆయనకు వ్యాళబద్ధుడనే పేరు వచ్చింది. అప్పటికీ తాపం శాంతించలేదు. అప్పుడు ఎనభైవేలమంది ఋషులు వచ్చి ఒకొక్కరు, ఇరవై ఒక్క దుర్వాంకురాలు (గరికపోచలు) చొప్పున స్వామికి ప్రసాదించటంతో స్వామివారి తాపం పూర్తిగా ఉపశమించింది. అందుకే గణపతికి గరిక ప్రీతిపాత్రమైనది. అప్పటి నుంచి గణపతి పూజలో గరికకు విశిష్ట స్థానం దక్కింది.
– కప్పగంతు వెంకటరమణమూర్తి
(చదవండి: పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment