మనకు ‘గుడ్’మింటన్
అంతర్జాతీయ వేదికపై ఈ ఏడాది భారత్‌కు ఎక్కువ విజయాలు అందించిన క్రీడాంశం ఏది అని అడిగితే ‘బ్యాడ్మింటన్’ అని ఠక్కున సమాధానం వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మనోళ్లు విజయఢంకా మోగించారు. సీనియర్ విభాగంలో సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్, కశ్యప్ మొదలుకొని... జూనియర్స్‌లో రుత్విక శివాని వరకు పలు అంతర్జాతీయ టోర్నీల్లో భారతీయ ‘రాకెట్’ దూసుకుపోయింది.
చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో భారత బ్యాడ్మింటన్ ఎన్నో మధురమైన విజయాలను సొంతం చేసుకొని ఈ ఏడాదిని ‘గుడ్‌మింటన్’గా మలుచుకుంది.
తీపి జ్ఞాపకాలు మిగిల్చిన భారత బ్యాడ్మింటన్
⇒ ఉబెర్ కప్‌లో తొలిసారి పతకం
⇒ ఒకే సూపర్ సిరీస్ టోర్నీలో రెండు టైటిల్స్
⇒ రెండో ‘ప్రపంచ’ పతకంతో సింధు చరిత్ర
⇒ కామన్వెల్త్ గేమ్స్‌లో కశ్యప్ మెరుపులు
⇒ కోచ్‌గా తిరుగులేని గోపీచంద్
సాక్షి క్రీడావిభాగం: గతేడాది ఒక్క టైటిల్ నెగ్గలేకపోయిన సైనా నెహ్వాల్ ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. జనవరిలో ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గి శుభారంభం చేసిన సైనా జూన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నవంబరులో చైనా ఓపెన్ ప్రీమియర్ టైటిల్‌ను దక్కించుకొని పూర్వ వైభవాన్ని సాధించింది. అదే జోరులో సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత పొంది లీగ్ దశలో అజేయంగా నిలిచి సెమీఫైనల్ దశలో నిష్ర్కమించింది. అంతేకాకుండా ఉబెర్ కప్ టీమ్ ఈవెంట్‌లో, ఆసియా క్రీడల్లో భారత జట్లకు కాంస్య పతకాలు దక్కడంలోనూ సైనా కీలకపాత్ర పోషించింది.
సైనా నీడను దాటి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న పీవీ సింధుకు కూడా ఈ ఏడాది తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. 19 ఏళ్ల ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్ నుంచి గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి ఈ మెగా ఈవెంట్‌లో సింధు కాంస్య పతకాన్ని నెగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, ఆసియా క్రీడల్లో, ఉబెర్ కప్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాలు నెగ్గడంతోపాటు... చివర్లో మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో టైటిల్‌ను నిలబెట్టుకుంది. పలుమార్లు చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించిన సింధు వచ్చే ఏడాది తన ఖాతాలో లోటుగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను అందుకోవాలనే పట్టుదలతో ఉంది.
‘కొడితే జాక్‌పాట్ కొట్టాలి’... దీనిని యువతార కిడాంబి శ్రీకాంత్ నిజం చేసి చూపించాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో శ్రీకాంత్ విజేతగా అవతరించి నివ్వెరపరిచాడు. ఈ టోర్నీ ఫైనల్లో బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి శ్రీకాంత్ పెను సంచలనం సృష్టించాడు. అదే జోరులో సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత పొందిన తొలి భారతీయ క్రీడాకారుడిగా కొత్త చరిత్రను లిఖించాడు.
కీలక తరుణంలో తడబడే అలవాటును అధిగమించిన భారత అగ్రశ్రేణి ప్లేయర్ పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని నెగ్గి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.
1982లో సయ్యద్ మోదీ తర్వాత ఈ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గిన ప్లేయర్‌గా కశ్యప్ గుర్తింపు పొందాడు. ఇవే క్రీడల్లో గురుసాయిదత్ కాంస్య పతకాన్ని సాధించాడు. వీరితోపాటు అంతర్జాతీయ వేదికపై అజయ్ జయరామ్, హెచ్‌ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ కూడా మంచి విజయాలు సాధించారు. జయరామ్ ‘డచ్ ఓపెన్ గ్రాండ్‌పి’ టైటిల్ నెగ్గగా... ప్రణయ్ ‘ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్’ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫజార్ ఓపెన్‌లో, ఆస్ట్రియన్ ఓపెన్‌లో సౌరభ్ వర్మ విజేతగా నిలిచాడు.
చివర్లో టాటా ఓపెన్‌లో రుత్విక శివాని మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గి సైనా, సింధు వారసుల రేసులో నేనున్నానంటూ తెరపైకి దూసుకొచ్చింది. పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ నుంచి టాప్-100లో 10 మంది క్రీడాకారులు ఉండటం భారత బ్యాడ్మింటన్ అభివృద్ధికి సూచికలా నిలుస్తోంది. చీఫ్ కోచ్‌గా పుల్లెల గోపీచంద్ తనదైన ముద్ర వేశారు. ఉబెర్ కప్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో, సూపర్ సిరీస్ టోర్నీలలో భారత క్రీడాకారుల విజయాల్లో తనవంతు పాత్రను పోషించారు.