స్వర్ణ పతకంతో పీవీ సింధు
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్: గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలిచింది.
2014 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు, 2018 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీని ఓడించి ఫైనల్ చేరి తుది పోరులో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలైంది. మూడోసారి మిషెల్లి లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచింది. చివరిసారి ఎనిమిదేళ్ల క్రితం సింధును ఓడించిన మిషెల్లి ఈసారి తన ప్రత్యర్థికి అంతగా పోటీనివ్వలేకపోయింది.
అవకాశం ఇవ్వకుండా..
అనుభవజ్ఞురాలైన మిషెల్లిని ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన సింధు అనుకున్న ఫలితం సంపాదించింది. తొలి గేమ్‌లో 14–8తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి అదే జోరులో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు విజృంభణ కొనసాగడంతో మిషెల్లికి తేరుకునే అవకాశం లేకుండాపోయింది.
లక్ష్యసేన్ సైతం..
అంచనాలకు అనుగుణంగా మెరిసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ముచ్చటగా మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా అవతరించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో కాంస్యం... 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో రజతం నెగ్గిన ఈ తెలుగుతేజం సోమవారం ముగిసిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.
పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా అదరగొట్టి పసిడి పతకం దక్కించుకోగా... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం బంగారు పతకాన్ని తమ మెడలో వేసుకుంది.
శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత
టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత రెండోసారి పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గగా... సత్యన్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. పురుషుల హాకీలో టీమిండియా మరోసారి రజత పతకంతో సంతృప్తి పడింది. మొత్తానికి ఈ గేమ్స్ చివరిరోజు భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించి చిరస్మరణీయ ప్రదర్శనతో ముగించింది. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరుగుతాయి.
అభిమానులకు ధన్యవాదాలు: సింధు
సుదీర్ఘ కాలంగా కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం కోసం నిరీక్షించాను. ఎట్టకేలకు పసిడి పతకాన్ని సాధించడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన వేలాది మంది ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. –పీవీ సింధు
PC: PV Sindhu Twitter
సింధు ఘనతలు:
►కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి సింధు. గతంలో సైనా నెహ్వాల్ (2010, 2018) రెండుసార్లు పసిడి పతకాలు సాధించింది.
►కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయ ప్లేయర్‌గా సింధు (3 పతకాలు) నిలిచింది. గతంలో అపర్ణా పోపట్ (1998లో రజతం; 2002లో కాంస్యం), సైనా రెండు పతకాల చొప్పున సాధించారు.
చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment