world super series finals
-
పోరాడి ఓడిన సింధు
-
పోరాడి ఓడిన సింధు
దుబాయ్: వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో సింధు 21-15, 12-21, 19-21 తేడాతో యామగుచి(జపాన్) చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్‌ను పెద్దగా కష్టపడకుండా గెలిచిన సింధు.. ఆపై వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి టైటిల్ వేటలో నిరాశ పరిచింది. మొదటి గేమ్‌లో యామగుచి వరుస నాలుగు పాయింట్లు సాధించిన సమయంలో సింధు తిరిగి తేరుకుంది. సింధు 3-5తో వెనుకబడిన దశలో వరుసగా పాయింట్ల సాధించి స్కోరును 5-5తో సమం చేసింది.ఆపై అదే జోరును కొనసాగించి 11-8, 13-9 పాయింట్ల తేడాతో ముందుకు దూసుకుపోయింది. సింధు 15-13తో ఆధిక్యంలో ఉన్న దశలోవరుసగా నాలుగు పాయింట్లను సాధించి 19-13తో యామగుచిని మరింత వెనక్కినెట్టింది.. అటు తరువాత యామగుచికి రెండు పాయింట్లను మాత్రమే కోల్పోయిన సింధు 21-15తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు 5-0తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో యామగుచి సత్తాచాటింది. ప్రధానంగా రెండో గేమ్ సగం వరకూ సింధు ఆధిక్యం కొనసాగినప్పటికీ ఆపై యామగుచి విజృంభించింది. సుదీర్ఘమైన ర్యాలీలతో సింధుకు పరీక్ష పెట్టడంతో పాటు అద్బుతమైన స్మాష్‌లతో చెలరేగి ఆడింది. ఈ క్రమంలోనే యామగుచి 11-9, 13-11 తో ఆధిక్యాన్నిసాధించింది. అదే ఊపును కడవరకూ సాగించిన యామగుచి 21-12తో ఆ గేమ్‌ను దక్కించుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ నువ్వా-నేనా అన్నట్లు సాగింది. సింధు వరుసగా నాలుగు పాయింట్లు 4-0తో ఆధిక్యంలో నిలిచిన సమయంలో యామగుచి మూడు పాయింట్లు సాధించింది. ఫలితంగా సింధు ఆధిక్యం 4-3కు తగ్గింది. అటు తరువాత 5-5, 6-6తో ఇద్దరూ సమంగా నిలిచిన దశలో సింధు స్మాష్‌లతో ఆకట్టుకుంది. ఫలితంగా సింధు 11-8తో పైచేయి సాధించింది. కాగా, అప్పుడే అసలు సిసలైన సమరం మొదలైంది. ప్రతీ పాయింట్ కోసం ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. కాగా, చివరి వరకూ ఉత్కంఠ రేపిన ఆఖరి గేమ్‌లో యామగుచి 21-19తేడాతో గేమ్‌ను దక్కించుకోవడంతో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
సింధు సగర్వంగా...
ప్రత్యర్థితో గట్టి పోటీ ఎదురైనా... అలసట తన కదలికలపై ప్రభావం చూపిస్తున్నా... ఎక్కడా తగ్గకుండా ఆడిన పీవీ సింధు అనుకున్న ఫలితాన్ని సాధించింది. మధ్యలో రిఫరీ హెచ్చరికలు ఇబ్బంది పెట్టినా... అశేష అభిమానుల అండ, కోచ్ గోపీచంద్ ప్రోత్సాహం ఈ తెలుగు అమ్మాయిని మరింత ముందుకు దూసుకుపోయేలా చేశాయి. అద్భుతమైన ఆటతీరుతో చెలరేగిన ఆమె తొలిసారి వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా మహిళల సింగిల్స్‌లో ఒకే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్, బీడబ్ల్యూఎఫ్ ఫైనల్స్ తుది పోరుకు అర్హత సాధించిన మూడో షట్లర్‌గా నిలిచింది. అరుదైన ఘనత సాధించేందుకు మరో విజయం దూరంలో ఉన్న సింధు నేడు జరిగే అంతిమ సమరంలో అకానె యామగుచితో తలపడుతుంది. దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి : సూపర్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు తన అద్భుతమైన ఆటతో 2017కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్లోకి ఆమె దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో సింధు వరుస గేమ్‌లలో 21–15, 21–18 స్కోరుతో చెన్ యుఫె (చైనా)ను చిత్తు చేసింది. 59 నిమిషాలపాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఒక్కో పాయింట్ కోసం ఇద్దరూ తీవ్రంగా పోరాడారు. ఫలితంగా సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. చివరకు సింధుదే పైచేయి అయింది. గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా సింధు దూకుడుగా ఆటను ప్రారం భించింది. ప్రత్యర్థి పొరపాట్లు కూడా కలిసి రావడంతో 5–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ దశలో కోలు కున్న యుఫె చెలరేగింది. ఆమె కూడా ఐదు పాయింట్లు కొల్లగొట్టి స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత కూడా వరుసగా స్మాష్‌లతో చెలరేగి ఒక దశలో ప్రత్యర్థి 8–6తో ఆధిక్యంలో నిలిచింది. అయితే యుఫె తప్పులతో మళ్లీ 9–8తో ముందంజ వేసిన సింధు, అదే ఆధిక్యాన్ని 15–11 వరకు కొనసాగించింది. స్కోరు 16–14 వద్ద ఉన్నప్పుడు సింధు కొట్టిన అద్భుతమైన స్మాష్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. వరుసగా మూడు సార్లు షటిల్‌ను నెట్‌కు కొట్టిన యుఫె, సింధు రిటర్న్‌ను అందుకోలేక గేమ్‌ను అప్పగించింది. హోరాహోరీ.. రెండో గేమ్ మాత్రం పోటాపోటీగా సాగింది. ఈసారి యుఫె మెరుగ్గా ఆడటంతో సింధు శ్రమించక తప్పలేదు. అయితే ఏ దశలోనూ ప్రత్యర్థి తనను దాటిపోయే అవకాశం మాత్రం సింధు ఇవ్వలేదు. 6–3, 7–3, 9–4, 10–7... ఇలా సింధు తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. ప్రత్యర్థికి పొరపాటున పాయింట్ ఇచ్చినా, ఆ వెంటనే కోలుకోగలిగింది. చూడచక్కటి ఆటతో అలరించిన సింధు మధ్యలో తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది. పాయింట్లు సాధించాలనే పట్టుదలతో వరుసగా రెండు సార్లు అంపైర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసి రెండు సార్లూ ప్రతికూల ఫలితాన్ని పొందింది. అద్భుతమైన ర్యాలీ తర్వాత స్కోరు 15–15తో సమమైంది. సింధు అలసిపోవడాన్ని గుర్తించిన యుఫె వరుస స్మాష్‌లతో దాడి చేసింది. అయితే 16–16 వద్ద సింధు వరుసగా మూడు పాయింట్లు సాధించి దూసుకుపోయింది. ర్యాలీ సుదీర్ఘ సమయం పాటు సాగడంతో ఒక దశలో సింధు నిస్సత్తువగా కనిపించి గేమ్ కోల్పోతుందేమో అనిపించింది. అయితే ఆమె పట్టుదలగా నిలబడగా, యుఫె రెండు స్మాష్‌లు నెట్‌కు తగలడంతో గెలుపు సింధు వశమైంది. మరో సెమీఫైనల్లో యామగుచి 17–21, 21–12, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. మొత్తానికి ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులు బాగా మద్దతిచ్చారు. ముఖ్యంగా స్టేడియానికి వచ్చిన తెలుగువారంతా చప్పట్లతో నన్ను ప్రోత్సహించారు. ఆదివారం జరిగే ఫైనల్‌పై దృష్టిపెట్టాను. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతాను. యామగుచిపై విజయాల పైచేయి ఉన్నప్పటికీ... ఆమె అంత సులువైన ప్రత్యర్థి కాదు. హోరాహోరీ తప్పదు. – ‘సాక్షి’తో సింధు ఇది క్లిష్టమైన మ్యాచ్. ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. రెండో గేమ్‌లో ఒక దశలో సింధు తీవ్రంగా అలసిపోయింది. జలుబుతో ఇబ్బంది పడింది. కానీ ఏ దశలోనూ మ్యాచ్‌పై పట్టు సడలించలేదు. నిజానికి ఈ టోర్నీలో సింధు అద్భుతంగా ఆడుతోంది. ఫైనల్ చేరడం ఆనందంగా ఉంది. టైటిల్ పోరులో నిలిచిన యామగుచిపై ఇప్పటిదాకా సింధుదే ఆధిపత్యమైనప్పటికీ ఫైనల్... ఫైనలే! అక్కడ ఎవరినీ అంతా తేలిగ్గా తీసుకోలేం. – ‘సాక్షి’తో కోచ్ గోపీచంద్ ►నేటి ఫైనల్ సింధు(vs)యామగుచి మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
సింధును ఆపతరమా!
తొలి మ్యాచ్‌లో మూడు గేమ్‌ల పాటు పోరాడాల్సి వచ్చింది... రెండో మ్యాచ్‌లో రెండు గేమ్‌లలోనే సునాయాస విజయం... ఇక దీంతో పోలిస్తే మూడో మ్యాచ్‌లో అయితే ప్రత్యర్థికి మరో మూడు పాయింట్లు తక్కువగానే ఇచ్చి మ్యాచ్‌కు ముగింపు... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్లో రోజురోజుకూ సింధు ప్రదర్శిస్తున్న ఆట ఇది. ఈ టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మన సింధు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తన గ్రూప్‌లో దర్జాగా అగ్రస్థానాన్ని అందుకోగా... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ పరాజయం పరిపూర్ణమైంది. దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి : ఈ ఏడాదికి అద్భుతమైన ముగింపు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న తెలుగుతేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు మరోసారి తన సత్తాను చాటింది. ఇప్పటికే సెమీస్ చేరి ప్రాధాన్యత లేని మ్యాచ్ అయినా సరే... తన దూకుడు ఏమాత్రం తగ్గదని నిరూపించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో సింధు 21–9, 21–13 స్కోరుతో అకానె యామగుచి (జపాన్)ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా తన గ్రూప్‌లో అందరినీ ఓడించి మూడు విజయాలతో టాపర్‌గా నిలిచింది. ఈ లీగ్ మ్యాచ్ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది. టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన మరో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ చివరి మ్యాచ్‌లో కూడా ఓటమి పాలయ్యాడు. ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన శ్రీకాంత్ ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. షి యుకి (చైనా)తో జరిగిన పోరులో శ్రీకాంత్ 17–21, 21–19, 14–21 తేడాతో ఓటమి చవిచూశాడు. రెండో గేమ్ గెలుచుకొని కోలుకునే ప్రయత్నం చేసినా చివరకు శ్రీకాంత్‌కు ఫలితం దక్కలేదు. అతి అలవోకగా... యామగుచితో జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో ప్రత్యర్థిపై చెలరేగింది. సింధు చక్కటి ఆటకుతోడు యామగుచి వరుస పొరపాట్లు ఈ గేమ్‌ను ఏకపక్షంగా మార్చేశాయి. వరుస పాయింట్లతో ముందుగా సింధు 5–0తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. యామగుచి కొట్టిన షాట్‌ను సింధు రిటర్న్ చేయలేకపోవడంతో ప్రత్యర్థి ఖాతా తెరిచింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం ఇవ్వకుండా వరుసగా 6 పాయింట్లు సాధించి 11–1తో ఎదురు లేకుండా సాగింది. ఆ తర్వాత యామగూచి కోలుకునే ప్రయత్నం చేసినా సింధు జోరు తగ్గించకుండా ఆడి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధుకు కొంత పోటీ ఎదురైంది. ఆరంభంలో ఇద్దరూ చకచకా పాయింట్లు సాధించడంతో స్కోరు 4–4తో సమమైంది. ఈ సమయంలో చక్కటి డ్రాప్ షాట్‌తో పాయింట్ సాధించి ముందంజ వేసిన సింధు వెనుదిరిగి చూడలేదు. స్కోరు 9–8 వద్ద ఉన్నప్పుడు గేమ్ హోరాహోరీగా సాగుతున్నట్లు అనిపించింది. కానీ ఈ సమయంలో ఒక్కసారిగా చెలరేగిన సింధు వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత ఆమెను అందుకోవడం యామగుచి వల్ల కాలేదు. చక్కటి స్మాష్‌లు, డ్రాప్‌లతో వేగంగా పాయింట్లు సాధించిన సింధు చివరకు నెట్‌పై నుంచి స్లో స్మాష్‌తో ఆటను ముగించి లీగ్ దశలో అజేయంగా నిలిచింది. ఈ విజయం చాలా సంతృప్తినిచ్చింది. గురువారమే నేను సెమీస్‌కు అర్హత సాధించినా ఆఖరి మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోలేదు. కచ్చితంగా గెలవాలని అనుకున్నాను. అటాకింగ్ మాత్రమే అని కాకుండా అన్ని రకాల షాట్లతో సిద్ధమయ్యాను. ఆమె డిఫెన్స్ చాలా బాగుంది. నేను అటాక్ చేసే అవకాశం ఇవ్వకుండా ఎక్కువగా ర్యాలీలు ఆడించే ప్రయత్నం చేసింది. అందుకే ర్యాలీలతోనే సమాధానమిచ్చాను. మ్యాచ్ మ్యాచ్‌కు నా ఆట మెరుగైందనేది వాస్తవం. నిజానికి తొలి మ్యాచ్‌లో విజయంతో నా ఆత్మవిశ్వాసం చాలా పెరిగింది. చెన్ యుఫెతో నేడు జరిగే సెమీఫైనల్లో కూడా ఇదే తరహాలో ఆడగలనని నమ్ముతున్నా. –‘సాక్షి’తో పీవీ సింధు ►నేటి సెమీస్ సా.గం. 5:30 నుంచి స్టార్‌స్పోర్ట్స్–1లో ప్రత్యక్షప్రసారం -
'వరల్డ్ సూపర్ సిరీస్' పై సైనా దృష్టి
బెంగళూరు: మూడేళ్ల సుదీర్ఘ విరామం తరువాత గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ చేరిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. ఇప్పుడు వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ పై దృష్టి సారించారు. గతేడాది ఈ టోర్నీకి క్వాలిఫై కాలేకపోయిన సైనా.. ఈసారి మాత్రం కచ్చితంగా అర్హత సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 'నేను గతం గురించి మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో నా శిక్షణపైన మాత్రమే దృష్టి పెట్టా. రాబోవు టోర్నీల్లో సత్తా చాటుకుని ర్యాంకును మెరుగుపరుచుకోవడమే నా ముందున్న లక్ష్యం. నా శక్తి వంచన లేకుండా శిక్షణ తీసుకుని రాటుదేలతాననే నమ్ముతున్నా. ఈ సీజన్ ముగింపు బ్యాడ్మింటన్ టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు అర్హత సాధించడం కోసం తీవ్రంగా శ్రమిస్తా' అని సైనా పేర్కొన్నారు. గతేడాది తొమ్మిదో స్థానంలో నిలవడంతో దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు సైనా అర్హత సాధించలేకపోయారు. కాగా, అదే సమయంలో ఎనిమిదో స్థానంలో నిలిచిన పీవీ సింధు క్వాలిఫై అయ్యారు. ప్రస్తుతం కాలి నొప్పితో బాధపడుతున్న సైనా.. సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి హైదరాబాద్ లో పూర్తిస్థాయి శిక్షణకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. -
మనకు ‘గుడ్’మింటన్
అంతర్జాతీయ వేదికపై ఈ ఏడాది భారత్‌కు ఎక్కువ విజయాలు అందించిన క్రీడాంశం ఏది అని అడిగితే ‘బ్యాడ్మింటన్’ అని ఠక్కున సమాధానం వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మనోళ్లు విజయఢంకా మోగించారు. సీనియర్ విభాగంలో సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్, కశ్యప్ మొదలుకొని... జూనియర్స్‌లో రుత్విక శివాని వరకు పలు అంతర్జాతీయ టోర్నీల్లో భారతీయ ‘రాకెట్’ దూసుకుపోయింది. చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో భారత బ్యాడ్మింటన్ ఎన్నో మధురమైన విజయాలను సొంతం చేసుకొని ఈ ఏడాదిని ‘గుడ్మింటన్’గా మలుచుకుంది. తీపి జ్ఞాపకాలు మిగిల్చిన భారత బ్యాడ్మింటన్ ⇒ ఉబెర్ కప్‌లో తొలిసారి పతకం ⇒ ఒకే సూపర్ సిరీస్ టోర్నీలో రెండు టైటిల్స్ ⇒ రెండో ‘ప్రపంచ’ పతకంతో సింధు చరిత్ర ⇒ కామన్వెల్త్ గేమ్స్‌లో కశ్యప్ మెరుపులు ⇒ కోచ్‌గా తిరుగులేని గోపీచంద్ సాక్షి క్రీడావిభాగం: గతేడాది ఒక్క టైటిల్ నెగ్గలేకపోయిన సైనా నెహ్వాల్ ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. జనవరిలో ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గి శుభారంభం చేసిన సైనా జూన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నవంబరులో చైనా ఓపెన్ ప్రీమియర్ టైటిల్‌ను దక్కించుకొని పూర్వ వైభవాన్ని సాధించింది. అదే జోరులో సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత పొంది లీగ్ దశలో అజేయంగా నిలిచి సెమీఫైనల్ దశలో నిష్ర్కమించింది. అంతేకాకుండా ఉబెర్ కప్ టీమ్ ఈవెంట్లో, ఆసియా క్రీడల్లో భారత జట్లకు కాంస్య పతకాలు దక్కడంలోనూ సైనా కీలకపాత్ర పోషించింది. సైనా నీడను దాటి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న పీవీ సింధుకు కూడా ఈ ఏడాది తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. 19 ఏళ్ల ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్ నుంచి గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి ఈ మెగా ఈవెంట్లో సింధు కాంస్య పతకాన్ని నెగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, ఆసియా క్రీడల్లో, ఉబెర్ కప్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు నెగ్గడంతోపాటు... చివర్లో మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో టైటిల్‌ను నిలబెట్టుకుంది. పలుమార్లు చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించిన సింధు వచ్చే ఏడాది తన ఖాతాలో లోటుగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ‘కొడితే జాక్‌పాట్ కొట్టాలి’... దీనిని యువతార కిడాంబి శ్రీకాంత్ నిజం చేసి చూపించాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో శ్రీకాంత్ విజేతగా అవతరించి నివ్వెరపరిచాడు. ఈ టోర్నీ ఫైనల్లో బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి శ్రీకాంత్ పెను సంచలనం సృష్టించాడు. అదే జోరులో సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత పొందిన తొలి భారతీయ క్రీడాకారుడిగా కొత్త చరిత్రను లిఖించాడు. కీలక తరుణంలో తడబడే అలవాటును అధిగమించిన భారత అగ్రశ్రేణి ప్లేయర్ పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని నెగ్గి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. 1982లో సయ్యద్ మోదీ తర్వాత ఈ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గిన ప్లేయర్‌గా కశ్యప్ గుర్తింపు పొందాడు. ఇవే క్రీడల్లో గురుసాయిదత్ కాంస్య పతకాన్ని సాధించాడు. వీరితోపాటు అంతర్జాతీయ వేదికపై అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ కూడా మంచి విజయాలు సాధించారు. జయరామ్ ‘డచ్ ఓపెన్ గ్రాండ్పి’ టైటిల్ నెగ్గగా... ప్రణయ్ ‘ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్’ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫజార్ ఓపెన్‌లో, ఆస్ట్రియన్ ఓపెన్‌లో సౌరభ్ వర్మ విజేతగా నిలిచాడు. చివర్లో టాటా ఓపెన్‌లో రుత్విక శివాని మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గి సైనా, సింధు వారసుల రేసులో నేనున్నానంటూ తెరపైకి దూసుకొచ్చింది. పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ నుంచి టాప్-100లో 10 మంది క్రీడాకారులు ఉండటం భారత బ్యాడ్మింటన్ అభివృద్ధికి సూచికలా నిలుస్తోంది. చీఫ్ కోచ్‌గా పుల్లెల గోపీచంద్ తనదైన ముద్ర వేశారు. ఉబెర్ కప్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో, సూపర్ సిరీస్ టోర్నీలలో భారత క్రీడాకారుల విజయాల్లో తనవంతు పాత్రను పోషించారు. -
లీ చోంగ్ వీ రికార్డు
కౌలాలంపూర్: ఈ ఏడాది తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లీ చోంగ్ వీ 21-10, 21-12తో సుగియార్తో (ఇండోనేసియా)ను ఓడించాడు. ఈ క్రమం లో లీ చోంగ్ వీ ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను నాలుగుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ మలేసియా స్టార్ 2008 నుంచి 2010 వరకు వరుసగా మూడుసార్లు ఈ టైటిల్‌ను గెల్చుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో జురుయ్ లీ 21-8, 21-14తో తాయ్ జూ యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. సింగిల్స్ విజేతలు లీ చోంగ్ వీ, జురుయ్ లీలకు 40 వేల డాలర్ల (రూ. 24 లక్షల 87 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
పుంజుకున్న సైనా, మూడో మ్యాచ్‌లో గెలుపు
కౌలాలంపూర్: మలేసియాలో జరుగుతున్న వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ఈ హైదరాబాద్ క్రీడ్రాకారిణి చివరి లీగ్ మ్యాచ్‌లో పుంజుకుంది. శుక్రవారమిక్కడ జరిగిన గ్రూప్-బి చివరి లీగ్ మ్యాచ్‌లో యోన్ జూ బే (దక్షిణ కొరియా)పై గెలిచింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 21-11, 17-21, 21-13తో యోన్ జూ బేను ఓడించింది. గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా) చేతిలో సైనా పరాజయం చవిచూసింది. కేవలం 27 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగియడం విశేషం. -
ఆఖరి అవకాశం
కౌలాలంపూర్: ఈ ఏడాది ఏ ఒక్క అంతర్జాతీయ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ఈ లోటు తీర్చుకునేందుకు ఆఖరి అవకాశం లభించింది. బుధవారం మొదలయ్యే సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 5 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 5 లక్షలు)తో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 40 వేల డాలర్ల (రూ. 24 లక్షల 42 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఈ సంవత్సరం నిర్వహించిన 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా టాప్-8 ర్యాంకింగ్స్‌లో ఉన్న క్రీడాకారులకు ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే అవకాశం దక్కింది. మహిళల సింగిల్స్ విభాగంలో మొత్తం ఎనిమిది మందిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో షిజియాన్ వాంగ్ (చైనా), పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్), జీ హున్ సుంగ్ (దక్షిణ కొరియా), తాయ్ జూ యింగ్ (చైనీస్ తైపీ)... గ్రూప్ ‘బి’లో సైనా నెహ్వాల్ (భారత్), యోన్ జూ బే (దక్షిణ కొరియా), మితాని మినత్సు (జపాన్), జురుయ్ లీ (చైనా) ఉన్నారు. తొలి మూడు రోజులు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్‌ల తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. సెమీఫైనల్స్ 14న, ఫైనల్ 15న జరుగుతాయి. బుధవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో సైనా జపాన్‌కు చెందిన మితాని మినత్సుతో ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-1తో ముందంజలో ఉంది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీతో సైనా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 2-5తో వెనుకంజలో ఉంది. శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో యోన్ జూ బేతో సైనా పోటీపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 5-4తో ఆధిక్యంలో ఉంది. నాలుగోసారి వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఆడనున్న సైనాకు ఈ టోర్నీలో మంచి రికార్డే ఉంది. 2008, 2012లలో సెమీఫైనల్‌కు చేరిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి 2011లో మాత్రం రన్నరప్‌గా నిలిచింది.