
ఆఖరి అవకాశం
కౌలాలంపూర్: ఈ ఏడాది ఏ ఒక్క అంతర్జాతీయ టోర్నీలోనూ ఫైనల్‌కు చేరుకోలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ఈ లోటు తీర్చుకునేందుకు ఆఖరి అవకాశం లభించింది. బుధవారం మొదలయ్యే సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 5 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 5 లక్షలు)తో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 40 వేల డాలర్ల (రూ. 24 లక్షల 42 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది.
ఈ సంవత్సరం నిర్వహించిన 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా టాప్-8 ర్యాంకింగ్స్‌లో ఉన్న క్రీడాకారులకు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. మహిళల సింగిల్స్ విభాగంలో మొత్తం ఎనిమిది మందిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో షిజియాన్ వాంగ్ (చైనా), పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్), జీ హున్ సుంగ్ (దక్షిణ కొరియా), తాయ్ జూ యింగ్ (చైనీస్ తైపీ)... గ్రూప్ ‘బి’లో సైనా నెహ్వాల్ (భారత్), యోన్ జూ బే (దక్షిణ కొరియా), మితాని మినత్సు (జపాన్), జురుయ్ లీ (చైనా) ఉన్నారు. తొలి మూడు రోజులు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్‌ల తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. సెమీఫైనల్స్ 14న, ఫైనల్ 15న జరుగుతాయి.
బుధవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో సైనా జపాన్‌కు చెందిన మితాని మినత్సుతో ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-1తో ముందంజలో ఉంది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీతో సైనా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 2-5తో వెనుకంజలో ఉంది. శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో యోన్ జూ బేతో సైనా పోటీపడుతుంది. ముఖాముఖి రికార్డులో సైనా 5-4తో ఆధిక్యంలో ఉంది.
నాలుగోసారి వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఆడనున్న సైనాకు ఈ టోర్నీలో మంచి రికార్డే ఉంది. 2008, 2012లలో సెమీఫైనల్‌కు చేరిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి 2011లో మాత్రం రన్నరప్‌గా నిలిచింది.